అవీ .. ఇవీ..

సరదాలూ.. సంతోషాలూ...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగ వచ్చిందంటే పిల్లలకు నిజంగా పండుగే. సంక్రాంతి పండుగ వస్తే ఇల్లంతా పండుగే. ఊరంతా పండుగే. ఈ మూడు రోజుల పండుగలో ఆనందం ఉంది. అల్లరి ఉంది. ఆరోగ్యం ఉంది. సరదా ఉంది. సంతోషం ఉంది. కలుపుగోలుతనం ఉంది. కలివిడితనం ఉంది. ప్రకృతి అందాలున్నాయి. పర్యావరణ హితం ఉంది. కళ ఉంది. నమ్మకం ఉంది. ఆరాధన ఉంది. ఆధ్యాత్మికత ఉంది. ఎన్ని విశేషాలు.. ఎంత విశిష్టత.. మూడు రోజుల పండుగలో ఎన్నో పరమార్థాలున్నాయి. ఇచ్చిపుచ్చుకోవడం ఉంది. ఆశీస్సులున్నాయి. పంటలు పండి పల్లెలు లక్ష్మీకళతో ఉట్టిపడుతుంటాయి. కళ్లాల్లో ధాన్యపు రాసులు. కొట్టాల్లో కొత్త్ధాన్యం ఇంటికి కొత్త కళను తెచ్చిపెడుతుంది. చుట్టుపక్కల అమ్మలక్కలు కలసి చేసే పిండి వంటల ఘుమఘుమలు పండుగకన్నా ముందే మనసు కట్టిపడేస్తుంటాయి. ఇప్పుడైతే వ్యసనమైంది కానీ... ఒకప్పుడు కోడిపందాలు పౌరుషానికి, పోరాటపటిమకు నిదర్శనాలే. బరిలో దిగితే చిన్న ప్రాణియైనా కడదాకా పోరాడాల్సిందేనన్నది ఆ పోటీ చెప్పే పాఠం. ఒరిగితే ఏమి నష్టం... వెరపులేని పోరుకు దిగడంలోనే మజా ఉంటుంది. గోదాకల్యాణం నాడు వేడివేడి నేయి కలిసిన పొంగలిని బాదం ఆకుల్లో ఆబగా తింటే దక్కే తృప్తి భోగినాడు కాక మరెప్పుడు దొరుకుతుంది. ఆవుపేడతో తయారైన చిన్నపిడకల దండలను భోగి మంటల్లో వేయడం పర్యావరణ హితానికే అయినా ఆ పిడకల కోసం గోవుల వెంట పడటం, పిడకలు చేయడం, దండలు గుచ్చడం, వాటిని దాచుకోవడంలో ఉన్న జాగ్రత్త ఇప్పటి పిల్లలకు తెలియని ఆనందం. పాతకాలపు చెత్తాచెదారం, కలపావంటచెరకు అర్ధరాత్రిపూట ఎవరికీ దొరకకుండా ఎత్తుకొచ్చి భోగి మంటల్లో వేస్తే ఎగసే మంటలకన్నా ఎత్తున పొంగే ఆనందానికి కొలమానం ఏముంటుంది. ఇది ఒకలాంటి దొంగతనమే అయినా అందులో ఓ ఆనందం ఉండేది. ముందు తిట్టినా, కనిపెట్టుకుని ఉండాల్సిందిలేనని ఆ తరువాత ఆ భోగి పండుగలో ఇలాంటి అనుభవాలు మామూలేలే అని తీసిపారేయడమే అప్పట్లో అలవాటు. అందులో పెద్దల పెద్దమనసు ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడంటే మందూమాకూ దొరుకుతోందికానీ, అప్పట్లో బొజ్జమీద వాతలే ముందుజాగ్రత్తలు!. శీతకాలపు చలికి భయపడి దుప్పట్లో ఆదమరచి నిద్రపోతున్న పిల్లలను ఎత్తుకొచ్చి పొట్టపై వాతలు పెట్టేయడం, పిల్లలు గొల్లుమనడం, పెద్దలు ఏదో ఘనకార్యం సాధించినట్లు పెద్దపెట్టున నవ్వడం, ఆ ఏడుస్తున్న పిల్లల చేతుల్లో బెల్లం పెట్టి మభ్యపెట్టడం ఒకనాటి పండుగ సరదాల్లో ఒకటి. ఇక ఇంటికివచ్చిన కొత్త అల్లుడి హొయలు, అతగాడిని చక్కగా చూసుకునే అత్తమామలు, ఆటపట్టించే మరదళ్లు పల్లెసొగసుకు సొబగులద్దే సంబరమే ఈ సంక్రాంతి విశేషం. మూడు రోజుల పండుగ కనుక మూన్నాళ్లూ కొత్త దంపతుల ముచ్చట్లు, దోబూచులాటలు చూడవారికి చూడముచ్చటే. ఇక అలకలు, అలుపులూ మామూలే. కొసరికొసరి వడ్డించి ప్రేమను ఒలకబోయడంలో చమత్కారాలు, చిన్నపాటి వేళాకోళాలు కుటుంబ వ్యవస్థలోని విలువలను చాటిచెప్పే సందర్భం ఇది. బాగా తింటే భోజనప్రియుడని, అరకొరగా తింటే జాగ్రత్తపరుడని, బొత్తిగా తినకపోతే మొహమాటస్తుడని అల్లుడికి కీర్తికిరీటాలు ఇవ్వడం ఓ మురిపెం. భోగి మంటలు తగ్గినా సెగలు తగ్గని చోట వేడినీళ్లు కాచుకుని, వాటిని ఎవరూ తీసుకుపోకుండా అక్కడే ‘కాచుకుని’ ఉండటంలో విసుగు బదులు వినోదం కనిపిస్తుంది. ఇక సంక్రాంతి నాడు లక్ష్మీకటాక్షం కోసం పూజలు, చక్కటి విందుభోజనం ప్రత్యేకం. తమతోపాటు అన్నింటా చేదోడుగా నిలిచే పశువులను దేవతల్లా పూజించే కనుమ...ప్రాణికోటి విలువేమిటో, వాటిని ఎలా చూసుకోవాలో మన పూర్వీకులు నేర్పిన సంప్రదాయానికి ప్రతీక. గంగిరెద్దులవారి అభ్యర్థనల్లోను, ఆటపాటల్లోనూ సమాజ సంక్షేమమే సాక్షాత్కరిస్తుంది. అయ్యగారికి దణ్ణం పెట్టమనడంలో ఓ సంస్కారం ఉంది. ఓ అభ్యర్థన ఉంది. సాయమడగటంలో ఓ గౌరవం ఉంది. పశువులు, మనుషులు కలిసి జీవించడంలో ఓ అర్థం ఉందని చాటే వృత్తికి ఇతివృత్తం ఈ పండుగ. ఇక పిల్లాపాపలకు గాలిపటాల సందడి సంక్రాంతి సంబరానికి పరాకాష్ట. గాలిలో ఎగిరే గాలిపటం మనకు చెప్పే పాఠాలు చాలా ఉన్నాయి. ఎంత ఎత్తుకు వెళ్లినా స్థిరంగా ఉండాలంటే దారం లాంటి ఆధారం ఉండాల్సిందేనన్నది అందులోని అంతరార్థం. జీవితాన్ని ‘పట్టుకోవడం’ చేతకాకపోయినా, గాలిపటాన్ని నియంత్రించడం చేతకాకపోయినా జీవితం తెగిన గాలిపటంలాగానే అయిపోతుందన్నది అందులోని పాఠం. సరే, పిల్లవాళ్లకు ఇవేం తెలుస్తాయి. పక్కవాడి గాలిపటాన్ని తెగ్గొట్టేయాలన్న ఉబలాటం వాళ్ల మొహాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ల అరుపుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. పడిపోయిన గాలిపటాన్ని చేజిక్కించుకోవడంలో కిక్కు వాళ్లని చూస్తేగానీ మనకు బోధపడదు. అలాంటప్పుడు పిల్లవాళ్లు ఏం ప్రమాదం కొనితెచ్చుకుంటారోనన్న ఆందోళన పెద్దల్లో లీలగా కనిపిస్తూ ప్రేమచిహ్నంగా అలరిస్తుంది. గొబ్బెమ్మల పూజ ప్రకృతి పూజేగా. అందులో ఆరోగ్యసూత్రమూ దాగి వుంది. ఇంటిముందు ముగ్గులు ఆరోగ్యసూత్రాలకు మచ్చుతునకలు. జీవరాశికి అది ఆహారం.. మన ఇళ్ల సొబగుకు అవి ఆహార్యం. ముగ్గులు వేయడమే కాదు... ఈ సమయంలో అల్లరి యువతులు ఇష్టులను ‘ముగ్గులోకి దించడమూ’ చూడొచ్చు. రంగవల్లికలు వేయడం అంత సులువు కాదు. అందులో చుక్కలూ, లెక్కలూ పక్కా. చుక్కలను కలుపుతూ సుందర రూపం ఇవ్వడంలో కిటుకులూ ఉన్నాయి. ఈ కిటుకు తెలిసినవారికి దక్కే గౌరవం తక్కువేం కాదు. ఇక సంక్రాంతికి వేసే ముగ్గుల్లో రథాల ముగ్గుకే ప్రాధాన్యం. ధనుర్మాసం నెల్లాళ్లూ ఎన్ని ముగ్గులు వేసినా భోగికి రథం ముగ్గువేయకపోతే మనోరథం తీరద్దూ. అంచేత ఆ రథంలో మహాలక్ష్మి వచ్చేయాలని, మనసులో కోరిక తీర్చేయాలని పడతులు పలవరించడం, ముగ్గుగినె్న చేతపట్టి వాకిళ్లలో ముందురోజు సాయంత్రం ముగ్గులేయడం ఓ అద్భుతమైన సన్నివేశమే. కాదనగలమా చెప్పండి. హరిదాసుల నెత్తిన మోసే అక్షయపాత్ర సాక్షాత్తు భూగోళస్వరూపమేగా. హరినామ సంకీర్తనలో మర్మం, ఆ అక్షయపాత్రలో ధర్మం మానవసేవ, మాధవసేవకు సంకేతం. ఆధునిక సమాజంలో పట్నం బతుకులు ఎలా సాగినా ఈ పెద్దపండుగ తెచ్చే ఆనందాలను దూరం చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. అందుకే పల్లెపట్టులు ఇప్పుడు పట్టరాని ఆనందంతో ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్లూ తమతమ పుట్టిన ఊళ్లకు, కన్నవారి చెంతకు చేరి కళ్లు చెమరుస్తారు. మనసులతో మాట్లాడుకుంటారు. మూడురోజులూ కలసిమెలసి పండుగ చేసుకుంటారు. ముక్కనుమ బడలిక తీరాక.. బద్ధకంగా మళ్లీ బండెక్కుతారు. బతుకుజీవనం ముందుకు సాగాలిగా మరి.

-ఎస్.కె.రామానుజం