ఈ వారం స్పెషల్

షార్... హుషార్ (కవర్ స్టోరీ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకోటి లింగాల శ్రీహరికోటగా చారిత్రక ప్రసిద్ధి చెందిన భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నేడు రాకెట్ ప్రయోగాలకు రాచబాటగా వర్ధిల్లుతోంది. నాలుగు దశాబ్దాల కిందట కీకారణ్యంగా ఉన్న ఈ షార్ ప్రాంతం నేడు అంతరిక్ష పరిశోధనలకు అనువైన స్థానంగా విరాజిల్లుతోంది. చిన్న చిన్న ఉపగ్రహాల నుంచి నేడు భారీ రాకెట్ ప్రయోగాలకు అనువుగా తీర్చిదిద్దారు. స్వయం సమృద్ధి , స్వావలంబన లక్ష్యంగా ఇస్రో గత నాలుగు దశాబ్దాలుగా విజయ పరంపరలో పురోగమిస్తోంది. వినువీధిలో విజయాలను ఎన్నింటినో సొంతం చేసుకొని ప్రపంచ పటంలో తనదైన ముద్ర వేసింది.
ఒక ఉపగ్రహంతో ప్రారంభమై రెండు... మూడు... నాలుగు... ఇలా బుడిబుడి అడుగులు వేస్తూ తొలిసారిగా 2008లో ఒకేసారి 10 ఉపగ్రహాలు పంపి విజయం సాధించింది. ఆ తర్వాత ఒకేసారి 20 ఉపగ్రహాలను కూడా పంపి ప్రపంచ దేశాలకు దీటుగా శాస్తస్రాంకేతిక రంగాల్లో మేటిగా నిలిచింది. అగ్ర దేశాలైన అమెరికా, రష్యా చేయని సాహసానికి మన శాస్తవ్రేత్తలు శ్రీకారం చుట్టారు. షార్ కేంద్రం నుండి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో పిఎస్‌ఎల్‌వి వాహక నౌక ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. అరుదైన ఈ ప్రయోగానికి షార్ కేంద్రమే వేదిక కావడం విశేషం. షార్ అంటే శ్రీహరికోట హై అల్టిట్యూడ్ రేంజ్ అని అర్థం.
గగన వీధిలో ఘనమైన విజయాలు సాధించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు దేశం నలుమూలల ఎన్నో కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది నెల్లూరు జిల్లాలోని షార్. యానాది తెగలకు పుట్టినిల్లు అయిన ఈ ప్రాంతాన్ని రాకెట్ పితామహుడు సతీష్ ధావన్ శ్రీహరికోటను రాకెట్ ప్రయోగాలకు వేదికగా గుర్తించాడు. వెంటనే భారత ప్రభుత్వం 1969లో ప్రయోగాలకు అనుకూలంగా షార్‌కు ఆమోదముద్ర వేసింది. భూమధ్య రేఖకు ఏటవాలుగా తూర్పుతీరంలో శ్రీహరికోట ఉండడం, ఓవైపు సువిశాలమైన సముద్రం, మరోవైపు నిర్జన పులికాట్ సరస్సు విస్తరించి ఉండి రాకెట్ ప్రయోగ దిశలో భూ భాగాలు ఏమీ లేకపోవడం తదితర కారణాల వల్ల శ్రీహరికోట ప్రముఖ రాకెట్ కేంద్రంగా ప్రపంచ దేశాల్లో సైతం ప్రాముఖ్యత సంతరించుకొంది. ఇక్కడ ఆధునిక వసతులతో పాటు ప్రకృతి పరంగా నైసర్గిక స్వరూపం అనుకూలంగా ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైన ప్రాంతంగా ప్రసిద్ధిపొందింది. గతంలో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి రాకెట్ ప్రయోగాలు జరుగుతుండగా ప్రస్తుతం ఏడాదికి పది ప్రయోగాలు చేపట్టే స్థాయికి షార్ ఎదిగింది. భవిష్యత్తులో ఒకేసారి రెండు రాకెట్లు ప్రయోగించే దిశగా షార్ అడుగులు వేస్తోంది. మరిన్ని భారీ ప్రయోగాలకు ప్రస్తుతం ఉన్న రెండు ప్రయోగ వేదికలే కాకుండా మూడో ప్రయోగ వేదిక, రాకెట్ గమనాన్ని తెలుసుకొనే ట్రాకింగ్ రాడార్ సెంటర్‌ను కూడా షార్‌లో నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు.
వాతావరణ పరిశోధనకు ఉపకరించే చిన్నచిన్న రాకెట్లను నిర్మించి ప్రయోగించడం వంటి సాధారణ లక్ష్యంతో ప్రారంభమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కాలక్రమేణ అనేక వాహక నౌకలను రూపొందించి భారీ ఉపగ్రహాలను షార్ నుండి అంతరిక్షంలోకి విజయవంతంగా పంపే స్థాయికి చేరింది. 1970-1980 మధ్యకాలంలో చిన్న రాకెట్ల ద్వారా ఆర్యభట్ట, భాస్కర, ఆపిల్ వంటి ఉపగ్రహాలను నింగిలోకి పంపుతూ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. అనంతరం ఎస్‌ఎల్‌వి, ఎఎస్‌ఎల్‌వి, పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి, ఎల్‌విఎమ్ 3, ఆర్‌ఎల్‌వి-టిడి, స్క్రామ్‌జెట్ ఇంజన్‌తోపాటు జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 వంటి భారీ రాకెట్లను నింగిలోకి పంపే స్థాయికి ఎదిగింది.
శ్రీహరికోట నుండి 59 ప్రయోగాలు
షార్ నుండి ఇప్పటివరకు వివిధ రకాల 59 రాకెట్లను నింగిలోకి పంపారు. వీటి ద్వారా మొత్తం 139 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇందులో స్వదేశానికి చెందినవి 60 ఉపగ్రహాలు కాగా విదేశానికి చెందిన 79 ఉపగ్రహాలు. ఇందులో అత్యధికంగా 2016లో ఇస్రో అత్యధికంగా 9 ప్రయోగాలు చేపట్టడం విశేషం.
1969 నుండి పనులు
1969లో షార్ ఏర్పాటైన 1979 వరకు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం పరిధిలోనే ఉండేది.
అప్పట్లో డాక్టర్ బ్రహ్మప్రకాష్ డైరెక్టర్‌గా కొనసాగారు. షార్‌లో పనులు చూసేందుకు తొలిసారిగా డాక్టర్ వై.జె.రావును ఇంజనీరుగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ పనులన్నీ జరిగేవి. అనంతరం 1979లో షార్‌ను ఇస్రో విభాగంగా గుర్తించి డైరెక్టర్లను నియమించారు.
తొలి ఉపగ్రహం ఆర్యభట్ట...
భారతదేశం మొట్టమొదట రూపొందించిన ఉపగ్రహం ఆర్యభట్ట కాగా దీనిని 1975 ఏప్రిల్ 19న రష్యా ఉపగ్రహ వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఆర్యభట్ట తరువాత భాస్కర ఉపగ్రహాన్ని రష్యాకు చెందిన వాహక నౌక ద్వారా, అనంతరం యాపిల్ ఉపగ్రహాన్ని యూరోపియున్ స్పేస్ ఏజన్సీకి చెందిన నౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. 1979లో మొదటిసారిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎస్‌ఎల్‌వి ద్వారా రోహిణి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. అయితే తొలి దశలోనే లోపం ఉండడంతో ఈ రాకెట్ ప్రయోగం సఫలం కాలేదు. అనంతరం 1980 జూలై 18న రోహిణి-1 ఉపగ్రహాన్ని ఎస్‌ఎల్‌వి-3 ద్వారా విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగలిగారు. ఆ తర్వాత అంచెలంచెలుగా రాకెట్ ప్రయోగాల విజయపరంపర మొదలైంది.
1993 నుంచి పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు మొదలయ్యాయి. ఇందులో 1993 సెప్టెంబర్ 20న జరిగిన మొదట పిఎస్‌ఎల్‌వి-డి1 ప్రయోగం విఫలం కాగా అనంతరం జరిగిన 37 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు వరుస విజయాలు సాధించాయి. 2001 నుంచి జిఎస్‌ఎల్‌వి మొదలు కాగా ఇప్పటి వరకు జరిగిన ప్రయోగాల్లో 6 ప్రయోగాలు విజయవంతం కాగా నాలుగు ప్రయోగాలు విఫలం చెందాయి. షార్ నుండి మొత్తం 59 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగాలు జరగగా ఇందులో 9 ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయ. మిగిలినవన్నీ విజయవంతమై భారత శాస్తజ్ఞ్రుల సామర్ధ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటాయి. ఇప్పటి వరకు షార్ నుండి 4 ఎస్‌ఎల్‌వి ప్రయోగాలు, 4 ఎఎస్‌ఎల్‌వి ప్రయోగాలు, 38 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు, 10 జిఎస్‌ఎల్‌వి ప్రయోగాలు, ఆర్‌ఎల్‌వి-టిడి ప్రయోగంతో పాటు ప్రయోగాత్మకంగా మరో రెండు జరిగాయి.
తొలి డైరెక్టర్ ఎన్.పంత్
షార్ కేంద్రం ఏర్పడిన తరువాత తొలి డైరెక్టర్‌గా ఎన్.పంత్ నియమితులయ్యారు. అనంతరం ఎం ఆర్.కురుప్, ఆర్.అర్వముధన్, డాక్టర్ ఎస్.శ్రీనివాసన్, డాక్టర్ ఎస్.వసంత, డాక్టర్ కె.నారాయణ, ఎం.అన్నామలై, ఎం.చంద్రదత్తన్, డాక్టర్ ఎంవైఎస్. ప్రసాద్ డైరెక్టర్లగా పనిచేశారు. ప్రస్తుతం 2015నుండి పి.కున్హికృష్ణన్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఒక్కొక్కరి పనికాలంలో షార్ అంచెలంచెలుగా ఎదిగింది. వీరిలో దత్తన్ హయాంలో చంద్రయాన్-1 ప్రయోగం చేపట్టగా, ఎంవైఎస్ ప్రసాద్ హయాంలో అంగారకుడి పైకి ఉపగ్రహాన్ని పంపించారు. కున్హికృష్ణన్ హయాంలో షార్ అర్ధశతక ప్రయోగాలు పూర్తవ్వడమే కాకుండా పునర్వినియోగ వాహక నౌక ప్రయోగం, ఎయిర్ బీత్ ప్రయోగాలు జరిగాయి.
తొలి రోజుల్లో...
తొలిరోజుల్లో రాకెట్ ప్రయోగం జరపాలంటే విడి భాగాలను బెంగుళూరు, తిరువనంతపురం ఇస్రో ప్రధాన కార్యాలయ నుండి అతి కష్టం మీద తెచ్చుకొని ఏడాది కాలం పాటు రూపొం దించి ప్రయోగించే వారు. అప్పట్లో షార్‌కు తారు రోడ్డు నిర్మాణం కూడా సరిగ్గా ఉండేది కాదు. రోడ్డు మార్గాన పక్కనే సూళ్లూరుపేటకు తెచ్చుకొని అక్కడ నుండి ఎడ్లబండ్లు, సైకిళ్లపై కూడా ఉపగ్రహాలు, తదితర రాకెట్ సామగ్రిని తీసుకెళ్లేవారు. ఒక రాకెట్‌ను రూపొందించేందుకు దాదాపు ఏడాదికి పైగా సమయం పట్టేది.
నేడు పరిస్ధితులు మారాయి. షార్‌లోనే అన్ని వసతులు సమకూర్చుకున్నారు. రెండు ప్రయోగాలు వేదికలు, ఒక వాహన అనుసంధాన భవనం, ఇంధన తయారీ విభాగం, ట్రాకింగ్ రాడార్ సెంటర్, అధునాతన మిషన్ కంట్రోల్ సెంటర్ నిర్మించుకొన్నారు. ఇప్పుడు ఒక రాకెట్‌ను కేవలం 50రోజుల్లో అనుసంధాన పనులు పూర్తిచేసి ప్రయోగిస్తున్నారు. ఒకప్పుడు విదేశీ ఉపగ్రహాలపై ఆధారపడే వారు. కానీ నేడు స్వదేశీ ఉపగ్రహాలను రూపొందించి విజయవంతంగా ప్రయోగిస్తున్నారు.
తిరుమలేశునికి, చెంగాళమ్మకు పూజలు...
ప్రతి రాకెట్ ప్రయోగానికి ముందు సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారికి, తిరుమల వెంకటేశ్వరస్వామి పాదాల చెంత రాకెట్, ఉపగ్రహ నమూనాలను పెట్టి ఇస్రో చైర్మన్లు ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోం ది. నేటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడా దేవుని చెంత నమూనాలను పెట్టి పూజలు చేయడం మన శాస్తవ్రేత్తల సాంప్రదాయానికి ప్రతీకగానే చెప్పవచ్చు. ఓసారి అమ్మవారికి పూజలు చేయకపోవడంతో ఆ ప్రయోగం విఫలం చెందింది. దీంతో అప్పటి నుండి ప్రయోగానికి ముందు పూజలు తప్పనిసరి చేశారు.
భవిష్యత్‌లో భారీ ప్రయోగాలు
ఒకప్పుడు చిన్నచిన్న ఉపగ్రహాలను పంపించే వారు నేడు భారీ ప్రయోగాల వైపుదృష్టి సారిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశమూ చేయని సాహసాన్ని ఇస్రో శాస్తవ్రేత్తలు చేస్తున్నారు. తొలిసారిగా 2008లో చంద్రయాన్ ప్రయోగం ద్వారా షార్ ఖ్యాతి ప్రపంచ దేశాలకు పాకింది. అంతేకాకుండా అంగారకుడి యాత్ర, అనంతరం ఒకే ఉపగ్రహాన్ని రెండు కక్ష్యల్లో ప్రవేశపెట్టడం, 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపడం, పునర్వినియోగ వాహన నౌక ప్రయోగాలు విజయవంతం చేయడంతో విదేశాలు సైతం మన రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పుడు ఇస్రో మందున్న ఒకే ఒక లక్ష్యం 104 ఉపగ్రహాల ప్రయోగం. ఇది విజయవంతమైతే ఇస్రో చరిత్ర పుటల్లో నిలవనుంది. ఇంతవరకు అమెరికా 23, రష్యా 29 ఉపగ్రహాలను మాత్రమే అంతరిక్షంలోకి పంపించి ఉన్నారు. ఇదే కాకుండా మార్చి, ఏప్రిల్ మాసాల్లో అత్యధిక బరువు మోసుకెళ్లె సామర్ధ్యం గల జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3 వంటి రాకెట్ ప్రయోగం చేపట్టేందుకు సర్వం సిద్ధం చేశారు. అనంతరం చంద్రయాన్-2, సూర్యుని మీదకు ఆదిత్య ఉపగ్రహ ప్రయోగం, తరువాత మానవ సహిత ప్రయోగాలకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.

తప్పటడుగులతో మొదలైన షార్ రోదసీ ప్రయాణం అప్రతిహతం. ఆర్యభట్టుతో అంకురార్పణ చేసి అచంచల విశ్వాసంతో అనంతమైన పటిమతో దిగ్దిగంతాలకు దూసుకుపోతోంది. మార్స్
ఆర్బిటర్ ప్రయోగ విజయం
మకుటాయమానమైన నేపథ్యంలో నాసా, ఈసా తదితర
అంతర్జాతీయ రోదసీ సంస్థలకు దీటుగా రాణిస్తూ ఇప్పుడు మరో మైలురాయిని అధిగమించబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు - ఏకంగా 104 ఉపగ్రహాలను రోదసీ కక్ష్యల్లోకి ప్రవేశింపజేసేందుకు సన్నద్ధమవుతోంది.
ఏవిధంగా చూసినా అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సాధించిన విజయాల్లో ఇది తలమానికమే. దేశ శాస్త్ర సాంకేతిక పటిమ
ఎప్పటికప్పుడు ఇనుమడిస్తోందనడానికి, అంతర్జాతీయంగానూ ఇస్రో పరుగులు పెడుతోందనడానికి ఈ ప్రయోగ విజయాలే
నిదర్శనం. చంద్రయాన్ ద్వారా గ్రహాంతర ప్రయోగాలకు నాందీ ప్రస్తావన చేసిన ఇస్రో మార్స్
ఆర్బిటర్‌తో తనకు తానే సాటి
అనిపించుకుంది. ఇప్పుడు ఈ 104 ఉపగ్రహాల ప్రయోగం దేశ
శాస్తవ్రేత్తల నిరుపమాన ప్రజ్ఞాపాటవాలకు నిలువెత్తు నిదర్శనం.
జయహో... ఇస్రో...!

రాకెట్ రూపకల్పన ఇలా...

కెట్ మొత్తం నాలుగు దశలు ఉంటుంది. రాకెట్‌ను వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో అన్ని దశలను పూర్తిచేసిన అనంతరం ప్రయోగ వేదికకు తరలిస్తారు. నాలుగో దశ చివరి భాగంలో ఉపగ్రహాన్ని అమర్చుతారు. ఒక రాకెట్‌ను అనుసంధానం చేసేందుకు దాదాపు 50రోజులు సమయం పడుతుంది. రాకెట్ మొదటి, మూడు దశలో ఘన ఇంధనాన్ని నింపుతారు. నాలుగు, రెండో దశలో ద్రవ ఇంధనం నింపుతారు. ఇందులో ఘన ఇంధనాన్ని శ్రీహరికోటలోనే తయారు చేస్తారు. ఉపగ్రహాన్ని మాత్రం బెంగుళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం రూపొందించి షార్‌కు తీసుకొచ్చి రాకెట్ చివరిభాగంలో అమర్చుతారు. రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేసి ముందుగా కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. కౌంట్‌డౌన్ అనగా ప్రయోగానికి ముందు రాకెట్‌లో అన్ని దశల పనితీరును శాస్తవ్రేత్తలు గమనించి గ్లోబల్ పరీక్షలు నిర్వహిస్తారు. అదే సమయంలో రాకెట్‌లోని నాలుగు, రెండో దశలో ద్రవ ఇంధనం, హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లను నింపుతారు. వాటి పనితీరు బాగుందని తెలియగానే ప్రయోగానికి 8 గంటల ముందు రాకెట్‌కు విద్యుత్తు సరఫరా ఇస్తారు. కౌంట్‌డౌన్ జీరోకు చేరగానే రాకెట్ నింగిలోకి ఎగురుతోంది.

ఘన ఇంధన కోట...

షార్‌లో రెండు రాకెట్ ప్రయోగ వేదికలతో పాటు అంతరిక్షంలోకి దూసుకుపోయేందుకు అవసరమైన ప్రచండ శక్తిని రాకెట్లకు అందించే ఘన ఇంధనాన్ని తయారు చేసే అత్యాధునిక కర్మాగారం కూడా శ్రీహరికోటలో ఉంది. రాకెట్ మోటార్ల శక్తి సామర్ధ్యాన్ని స్థిర పరీక్షల ద్వారా నిర్ధారించేందుకు అవసరమైన అనేక సాంకేతిక వసతులు షార్‌లో ఉన్నాయి.

రాకెట్ రూపకల్పనలో అగ్రగణ్యుడు... ధావన్

స్వాతంత్య్ర సముపార్జనానంతరం శాస్తస్రాంకేతిక రంగాలలో భారత్ త్వరితగతిన పురోభివృద్ధిని సాధించడానికి అనేక మంది మహామహుల అకుంఠిత కృషే కారణం. అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత్ అగ్రరాజ్యాలతో పోటీపడగలుతున్నదంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను చక్కని నాయకత్వంతో ముందుకు నడుపుతున్న బహుముఖ ప్రజ్ఞాశీలురైన నాయకులే కారణం. అలాంటి వారిలో అగ్రగణ్యులు ప్రొఫెసర్ సతీష్ ధావన్. వైమానిక శాస్తవ్రేత్తగా ప్రపంచఖ్యాతి గాంచిన ధావన్ అటు వైమానిక శాస్తర్రంగానికి, ఇటు అంతరిక్ష పరిశోధనా ప్రగతికి విశేష సేవలందించారు.
1920లో శ్రీనగర్‌లో జన్మించిన ధావన్ విద్యార్థిగా అత్యంత ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించినారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లో అధ్యాపకునిగా చేరి అనతి కాలంలోనే ఆచార్య పదోన్నతి పొందారు. 1962లో అతిపిన్న వయస్సులోనే ఆ సంస్థకు డైరెక్టర్ అయ్యి వైజ్ఞానిక పురోభివృద్ధికి తమ వంతు సేవలందించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తేగలిగారు. 1972లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ హఠాన్మరణానంతరం ఇస్రోను ముందుకు నడపగల నాయకుని కోసం అనే్వషిస్తున్న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ పదవికి ధావన్‌ను అర్హుడిగా గుర్తించి అధ్యక్షుడుగా నియమించారు. బెంగుళూరులో డైరెక్టర్‌గా కొనసాగుతూనే ఈ నూతన బాధ్యతలు చేపట్టారు. నెలకు ఒక రూపాయి మాత్రమే అంతరిక్ష విభాగం నుంచి తీసుకొనేవారు. ఈయన హయాంలో ఇస్రో కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పడి కాలక్రమేణా పురోగమించింది. కమ్యూనికేషన్, విద్యావ్యాప్తి, వాతావరణ పరిశోధన, భూమిలో దాగివున్న ఖనిజ సంపదల ఉనికిని తెలుసుకోవడం వంటి బహుళ ప్రయోజనాలకై సొంత ఉపగ్రహాలు నిర్మించి ప్రయోగించాలని డాక్టర్ సారాభాయ్ కలలు కన్నారు. ధావన్ వాటిని నిజం చేయగలిగారు. మన తొలి ఉపగ్రహం ఆర్యభట్ట ప్రయోగం, భాస్కర, యాపిల్ ఉపగ్రహాల నిర్మాణం, ప్రయోగం, ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్ తరహా ఉపగ్రహ నిర్మాణ ప్రణాళికలు, ఎస్‌ఎల్‌వి-3 విజయం, పిఎస్‌ఎల్‌వి, జిఎస్‌ఎల్‌వి రూపకల్పన మొదలైనవి ఆయన నాయకత్వంలో ముఖ్యమైన మైలురాళ్లు. ఎస్‌ఎల్‌వి-3కి మన దేశ మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయనతో కూడా పనిచేశారు. అప్పుడు తొలి ప్రయోగం విఫలం చెందినా ఆయన కృషితో మరో ప్రయోగం ఆఖండ విజయం సాధించింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో షార్‌తో పాటు పులికాట్ ప్రకృతి అందాలు ధావన్‌కు ఎంతో ఇష్టం. ఇక్కడ ఉండే చల్లాయానాదుల అభివృద్ధి కోసం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో మాట్లాడి ఎంతో కృషి చేశారు. ఆయన హయాంలో షార్ కీర్తి ప్రతిష్టలు ఇతర దేశాలకు పాకింది. 2002లో ధావన్ మరణానంతరం షార్ కేంద్రానికి చేసిన సేవలు చిరకాలం గుర్తుండేలా సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అపజయాలు ఎరుగని డైరెక్టర్లు...
ఇప్పటి వరకు 10మంది డైరెక్టర్లుగా పనిచేయగా వీరిలో ఎంవైఎస్.ప్రసాద్, కున్హికృష్ణన్ హయాంలో చేసిన ప్రయోగాలన్నీ విజయవంతమయ్యాయి. ఎంసి.దత్తన్ హయాంలో 11 ప్రయోగాలు జరగగా రెండు విఫలం చెందాయి. ఎంవైఎస్ హయాంలో ప్రయోగాలు, కున్హికృష్ణన్ సారధ్యంలో 13 ప్రయోగాలు చేపట్టగా అన్నీ విజయవంతయ్యాయి. అంతేకాకుండా ఈయన 14 పిఎస్‌ఎల్‌వి ప్రయోగాలకు మిషన్ డైరక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం 104 ఉపగ్రహాల ప్రయోగానికి కూడా కున్హికృష్ణన్ హయాంలోనే జరగనుంది. వీరిలో కె.నారాయణ, ఎంవైఎస్.ప్రసాద్ మన తెలుగువారు కావడం విశేషం.

షార్ పుట్టుక..
కీలక ఘట్టాలు...
* 1960వ దశకం వరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అణుశక్తి సంస్థకు అనుబంధంగా ఉండేది.
* 1962లో అణుశక్తి సంస్థ నుంచి అంతరిక్ష పరిశోధన సంస్థ విడిపోయింది.
* 1963లో తుంబాలో మొదటి ఈక్విటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ (పిఇఆర్‌ఎల్‌ఎస్) ఏర్పాటైంది.
* అంతరిక్ష సాంకేతిక విజ్ఞాన రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు అప్పటి నుంచి పరిశోధన మొదలైంది.
* అభివృద్ధి కేంద్రంగా తుంబాలో
అంతరిక్ష విజ్ఞాన కేంద్రాన్ని అప్పట్లోనే ఏర్పాటు చేశారు.
* మినీ రాకెట్లకే ఈ తుంబా రాకెట్ కేంద్రం పరిమితమైంది.
* రాకెట్ ప్రయోగాలకు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవడంతో మరో రాకెట్ ప్రయోగానికి వెతుకులాట అప్పట్లోనే ప్రారంభమైంది.
* డాక్టర్ విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో చెన్నై, నెల్లూరు, తిరుపతికి సమీపంలోని శ్రీహరికోటను రాకెట్ ప్రయోగ కేంద్రంగా ఎంపిక చేశారు.
* తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన పులికాట్ సరస్సు కలిగి కోస్తాతీరంలో రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైన ప్రాంతంగా షార్‌ను గుర్తించారు.
* 1968లో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఎంపిక చేయగా 1969లో కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించింది.
* శ్రీహరికోటలో నివాసం ఉంటున్న 14 గ్రామాల్లోని 1642 కుటుంబాలను ఖాళీ చేయించి ఈ రాకెట్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

- యడమణి భాస్కర్