క్రైమ్ కథ

మతలబు (విలన్స్, స్కౌన్‌డ్రల్స్ అండ్ రాస్కెల్స్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్టర్ తన ఇంటికి ఎంత ఆలస్యంగా వచ్చినా అతని కోసం ఎదురుచూస్తూ కుర్చీలో కూర్చున్న హెలెన్ కనిపిస్తూంటుంది. అది వాల్టర్ ఇల్లు. అతనికి అక్క మాత్రమే ఉంది. వాళ్లకి టివి కూడా లేదు. అందుకే ఆమె ఎప్పుడూ బైబిల్‌ని చదువుతూంటుంది.
ఆమె చేతిలో ఎప్పటిలానే బైబిల్ ఉంది. ఆ పుస్తకంలోంచి తలెత్తి చూస్తూ హెలెన్ చెప్పింది.
‘ఇప్పుడు అర్ధరాత్రయింది’
‘నాకు అది తెలుసు. నా వయసు నలభై రెండు’ వాల్టర్ కోపంగా చెప్పాడు.
అతను వేగంగా వంట గదిలోకి వెళ్లి గ్లాస్‌లో విస్కీని వంచుకుని గుటుక్కున తాగాడు. మరి కొంత పోసుకుని హెలెన్ దగ్గరికి వచ్చి వణుకుతూ చెప్పాడు.
‘పెద్ద ఘోరం జరిగిపోయింది’
ఆమె ‘ఏమిటది?’ అని అడక్కుండా అతనే చెప్తాడని తెలుసు కాబట్టి వేచి చూడసాగింది.
‘నా కారుకి ప్రమాదం జరిగింది. అది ఎవరూ చూడలేదు’ కొంత తాగి చెప్పాడు.
‘ఒకరు చూశారు వాల్టర్’ హెలెన్ నెమ్మదిగా చెప్పింది.
‘ఎవరూ చూడలేదు. అది ఊరి బయట జరిగింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆమె చిన్న కారు అకస్మాత్తుగా నా కారుకి అడ్డొచ్చింది. నేను బ్రేక్ వేశా కాని అప్పటికే.. ఆమె ఎవరో నాకు తెలీదు. ఆ డబల్ సీట్ మినీ కార్ పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. దిగి వెళ్లి చూస్తే ఆమె పోయింది. ఇక నేను ఆమెకి ఏం చేయలేనని వదిలేసి వచ్చాను’
‘కారులో ఇంకెవరూ లేరా?’ హెలెన్ అడిగింది.
‘లేరు. నేను సరాసరి ఇంటికి వచ్చేశాను. కారుని గేరేజ్‌లో పెట్టాను. దాన్ని పరిశీలిస్తే ప్రమాదం జరిగిన గుర్తులేమీ లేవు’
‘ఒకరు చూశారు’
‘ఆ మాటలు ఆపు. అది ప్రమాదం మాత్రమే. గంటకి డెబ్బై మైళ్ళ వేగంతో వెళ్లే కారుని అకస్మాత్తుగా ఆపడం కుదరదుగా. ఎవరూ చూడలేదు. నీకు తప్ప ఎవరికీ తెలీదు. నువ్వు కూడా ఎవరికీ చెప్పకూడదు’ వాల్టర్ విసుగ్గా చెప్పాడు.
‘ఏదీ దాయలేం’ ఆమె నిర్లిప్తంగా చెప్పింది.
‘నిన్ను ఎవరైనా అడిగితే తప్ప నోరు విప్పకు’ దైవభక్తురాలైన అక్కకి చెప్పాడు.
‘నన్ను ఎవరు అడుగుతారు? కాని ఆ ప్రమాదాన్ని చూసిన లార్డ్ ఎవరికైనా చెప్పదలచుకుంటే ఎవరి ద్వారానైనా చెప్పించవచ్చు. ఏదీ దాయలేం’
‘అలా మాట్లాడకు. నేను ఇప్పటికే షాక్‌లో ఉన్నాను’
‘ఐతే ఇక దాని గురించి మనం మాట్లాడద్దు’ హెలెన్ చెప్పి బైబిల్ చదవడం కొనసాగించింది.
ఆ రాత్రి నిద్ర పట్టని వాల్టర్ చివరికి రెండు నిద్ర మాత్రలు వేసుకుని పడుకున్నాడు.
* * *
‘నువ్వు ఆలస్యంగా వచ్చావు’ మర్నాడు రాత్రి ఆఫీస్ నించి వచ్చిన తమ్ముడితో హెలెన్ చెప్పింది.
‘ఆఫీస్‌కి బస్‌లో వెళ్లి, బస్‌లో వచ్చాను కాబట్టి లేటైంది. ఎవరైనా మనింటికి వచ్చారా? గేరేజ్‌లోని కారుని చూడలేదుగా?’
‘లేదు’
‘ఇవాళ ఈవినింగ్ పేపర్లో వచ్చింది. ఆమె పేరు మేరి లవ్‌లేస్. ఎవరో రైతు తెల్లవారుజామున ఆమెని చూశాడు. పోలీసులు దాన్ని హిట్ అండ్ రన్ (్ఢకొట్టి పారిపోవడం) కేసుగా నమోదు చేశారట’ అతను కుర్చీలో కూర్చుని చెప్పాడు.
‘సరే. భోజనం సిద్ధం’
‘ఆమె కారు అకస్మాత్తుగా అడ్డం వస్తే నేనేం చేయను? ఆపలేకపోయాను. నేను కావాలని చేయలేదు. ఇలాంటివి ప్రతీరోజు జరుగుతూంటాయి కాబట్టి మర్చిపో’
వాల్టర్ చేతులు కడుక్కొచ్చి కూర్చున్నాక భోజనం చేస్తూ మళ్లీ ఆ విషయమే మాట్లాడసాగాడు.
‘ఇవాళ ఉదయం గేరేజ్‌లోకి వెళ్లి నా కారుని చూశాను. ఆశ్చర్యంగా ఎక్కడా సొట్టలు లేవు. పెయింట్ కూడా పోలేదు. అద్దాలు పగల్లేదు కూడా’
‘ఐతే రేపటి నించి కార్లో వెళ్తావా?’ హెలెన్ అడిగింది.
‘వెళ్లను. పోలీసు లేబొరేటరీలో ఇలాంటివి తేలిగ్గా కనుక్కోగలరు. ఒకోసారి చిన్న దుమ్ము కణమో, గడ్డి పరకో పట్టిచ్చేస్తాయి. అదీకాక ఓ మనిషిని చంపిన కార్లో ఎలా ఎక్కగలను? ఈ కారుని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను’
‘ఏం చేయక్కర్లేదు. అలా ఉండనీ’
‘నీకు పిచ్చా? అది మనింట్లో ఉన్నంత కాలం నాకు ప్రమాదమే. నువ్వు ఈ విషయం మాత్రం ఎవరితో చెప్పకూడదు. నీకు ఉన్నది నేనే. నేను జైలుకి వెళ్తే నువ్వు ఒంటరి దానివి అవుతావు’
‘నీ కోసం ఇవాళంతా ప్రార్థించాను’
‘ఈ కారుని ఎలా వదిలించుకోవాలో ఆలోచించి చెప్పు. దాన్ని తెలివిగా వదిలించుకోవాలి’
ఆమె జవాబు చెప్పలేదు. ఆమె అలాంటి వాటిలో సలహాలు ఇవ్వలేదని వాల్టర్‌కి తెలుసు.
‘కాని ఈ కారుని త్వరగా వదిలించుకోవాలి’
‘నీ పాపాన్ని ఎలా వదిలించుకుంటావు?’ హెలెన్ ప్రశ్నించింది.
‘ఏం పాపం? నిజమే. చట్టాన్ని అతిక్రమించానని నాకు తెలుసు. ప్రమాదం జరిగాక పోలీసులకి ఫిర్యాదు చేయాలనే చట్టం చెప్తోంది. ఐనా ఫిర్యాదు చేయలేదు. లేదా వాళ్లు చాలా తిప్పలు పడతారు. ఎవరూ చూడలేదు. ఎవరికీ తెలీదు. ఎవరూ తెలుసుకోలేరు. ఇప్పుడు నా సమస్యల్లా కారుని ఎలా వదిలించుకోవడం అని’
‘దాన్ని అమ్మచ్చుగా?’ కొద్దిసేపాగి హెలెన్ సూచించింది.
‘నేను అమ్ముతానని పోలీసులకి తెలుసు. వాళ్లు ఈపాటికే సెకండ్ హాండ్ డీలర్ల దగ్గర ఉన్న కార్లు అన్నిటినీ పరిశీలించి ఉంటారు. ఏ కారు ఎవరు అమ్మారో డీలర్ల దగ్గర వివరాలు ఉంటాయి’
ఆమె చిన్నగా నిట్టూర్చింది.
‘దీన్ని వదిలించుకోవడానికి ఏదైనా ఓ దారి కచ్చితంగా ఉంటుంది. అది జరిగే దాకా నేను సరిగ్గా తినలేను. ఇంక ఆకలి లేదు’ బల్ల ముందు నించి లేస్తూ చెప్పాడు.
హెలెన్ కూడా తినడం మానేసింది.
‘బైబిల్‌లో ఏదో సూక్తిలో చెప్పారని నువ్వు పోలీసులకి ఫిర్యాదు చేయకు’ కోరాడు.
‘ఆ అవసరం నాకు లేదు’
‘వచ్చే శనివారం ఏదో విధంగా దీన్ని వదిలించుకుంటాను. దీన్ని ఎడారిలో వదిలేయచ్చు కాని ఎప్పటికైనా అది ఎవరి కంటైనా పడుతుంది. పోలీసులు దీన్ని ఎందుకు అక్కడ వదిలావని నన్ను అడిగితే సరైన జవాబు ఉండదు’
తన పడక గదిలోకి వెళ్లిన వాల్టర్ చాలాసేపు ఏదో గొణుగుతూనే ఉన్నాడు.
* * *
శనివారం వాల్టర్ దినపత్రికల్లోని ప్రకటనలని చదివి, మొక్కలకి నీళ్లు పోస్తున్న హెలెన్ దగ్గరికి వెళ్లి ఉత్సాహంగా చెప్పాడు.
‘ఈ ప్రకటన విను. ఎక్కువ దూరం ప్రయాణించడానికి సరిపడే కండిషన్‌లో ఉన్న ఏ కారునైనా నివాస స్థలంతో మార్చుకోడానికి ఇష్టపడేవారు ఆలస్యం చేయకుండా ఈ నంబర్‌కి ఫోన్ చేయండి’ అందువల్ల ఇది సెకండ్ హేండ్ కార్లు కొని అమ్మేవారి పార్కింగ్ లాట్‌లోకి వెళ్లదు. నివేశన స్థలం మనకు వద్దనుకుంటే తర్వాత అమ్మేయచ్చు. ఈ కార్లో అతను మన ఊరి పోలీసులకి చాలా దూరం వెళ్లిపోతాడు’
‘నివేశన స్థలమా? ఈ అమ్మకం రికార్డ్ అవుతుంది’
‘అవును. ఐతే ఏమిటి? కార్ లైసెన్స్ నంబర్, ఇంజన్ నంబర్, మేక్, మోడల్ అన్నీ రికార్డ్ చేస్తారు. కాని అవి కారు ప్రమాదాన్ని చెప్పలేవు. నివేశన స్థలం అమ్ముతున్నాడంటే శాశ్వతంగా వెళ్లిపోతున్నాడని అర్థం. కారు ఈ ఊరు వదిలి వెళ్లిపోతుంది కాబట్టి అది పోలీసులకి అందుబాటులో ఉండదు. ఇది మంచి దారి’ ఉత్సాహంగా చెప్పాడు.
‘ఇంకో మంచి దారి ఉంది’ హెలెన్ చెప్పింది.
‘ఏమిటది?’
‘తప్పు ఒప్పుకోవడం’
‘ఆ పని చేస్తే నేను జైలుకి వెళ్తాను. అది నాకు ఇష్టం లేదు’
వాల్టర్ ఆ ప్రకటనలోని నంబర్‌కి ఫోన్ చేశాడు. మాట్లాడాక రిసీవర్ పెట్టేసి హెలెన్‌తో చెప్పాడు.
‘నా ఊహ నిజమే. ఊరు వదిలి శాశ్వతంగా వెళ్లిపోతున్నాడు. వెంటనే ఎవరు కారు ఇస్తే వారికి ఆ స్థలం ఇస్తాట్ట. పర్వతాల్లో ఉన్న అక్కడ ఇల్లు ఎవరు కట్టుకుంటారు? దాన్ని నెమ్మదిగా అమ్మి టివి కొంటాను. నాలుగు రోజులైనా పోలీసులు మనింటికి రాలేదు కాబట్టి ఎవరూ కారు గురించి ఫిర్యాదు చేయలేదు. తన ఎడ్రస్ చెప్పి రమ్మన్నాడు. అతని ఇల్లు మూడు మైళ్ల దూరమే’
హెలెన్ బదులు మాట్లాడకపోవడంతో కోపంగా అరిచాడు.
‘ఏం హాని జరుగుతుంది? ఏదీ జరగదు. ఇది నీకు మాత్రమే తెలుసు. నువ్వు నోరు విప్పకపోతే చాలు’
‘నాకు మాత్రమే తెలుసు అనుకోకు’
‘దేవుడికీ తెలుసు. నువ్వు మూఢ భక్తురాలివి. నోరు విప్పి దేవుడు ఎవరికీ చెప్పడు. నీకు ప్రపంచ జ్ఞానం తక్కువ. ఇవాళే ఈ కారుని వదిలించుకుంటాను’
‘దేవుడు నీతో ఉండు గాక!’ ఆమె చెప్పింది.
‘ఆయన నాతో ఉన్నా, లేకపోయినా వెళ్తున్నాను’ మళ్లీ అరిచాడు.
* * *
ప్రమాదం జరిగిన నాలుగో రోజు కారుని గేరేజ్ లోంచి బయటకి తీస్తూంటే వాల్టర్‌కి కొద్దిగా భయం కలిగింది. కారుని ఆపి దాని చుట్టూ తిరిగి చూశాడు. ఎక్కడా డేమేజైన గుర్తులు కనపడలేదు. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెళ్తూంటే దారిలో రెండు పోలీసు కార్లు కనిపించాయి. అతనికి భయంతో చెమట పట్టింది. కాని వాళ్లు అతని కారుని చూసి కూడా ఆపలేదు.
ఇంటి నంబర్లని చూస్తూ కారుని నెమ్మదిగా పోనిస్తూంటే ఓ ఇంటి బయట అసహనంగా నిలబడ్డ ఓ యువకుడు వాల్టర్ వంక చూసి చేతులు ఊపాడు. అతను కారు ఆపాక అడిగాడు.
‘మిస్టర్ వాల్టర్?’
‘అవును’
‘నా పేరు ఏండర్సన్’
అతను కారు చుట్టూ తిరిగి పెయింట్ పోయిందా, సొట్టలు ఉన్నాయా అని సెకండ్ హేండ్ కార్లు కొనేవారు చూసే లాంటివి చూస్తాడని ఆశించాడు కాని అతను వాల్టర్ కారుని చూడకుండా చెప్పాడు.
‘పక్కకి జరగండి’
వాల్టర్ పక్క సీట్లోకి జరిగాక అతను డ్రైవింగ్ సీట్లో కూర్చుని నాలుగైదు వందల గజాలు నడిపాక చెప్పాడు.
‘నేనీ కారుని తీసుకుంటాను’
దిగి బానెట్ ఎత్తి ఇంజన్‌ని చూసి సంతృప్తిగా తలాడించాడు.
‘నేను కారుని జాగ్రత్తగా చూసుకుంటాను’ వాల్టర్ చెప్పాడు.
‘అది నిజమే. కారు విలువైన ఆస్థి. మీరు నివేశన స్థలాన్ని చూస్తారా? అది ఇక్కడికి పదిహేడు మైళ్లు’
‘చూద్దాం’ వాల్టర్ చెప్పాడు.
మలుపులు తిరిగే రోడ్లలో ఇద్దరూ నిశ్శబ్దంగా ప్రయాణించాక ఓ స్థలం ముందు కారాపి ఏండర్సన్ చెప్పాడు.
‘అదే’
చుట్టూ కంచె కట్టిన ఆ స్థలంలో దాని యజమాని ఏండర్సన్ అని, అతని ఫోన్ నెంబర్ రాసి ఉన్న ఓ బోర్డ్‌ని వాల్టర్ చూశాడు.
‘మీకు ఈ స్థలం నచ్చితే దీని బదులుగా కారు తీసుకుంటాను’
‘టైటిల్ డీడ్ సరిగ్గా ఉందా?’
‘అది నా జేబులో ఉంది. పవర్ ఆఫ్ అటార్నీ కూడా. నా లాయర్ ఆ వ్యవహారాలు చూస్తాడు. మనం వెంటనే ఆయన్ని కలుద్దాం’
‘మీరు సోమవారం దాకా ఉండటం లేదా?’
‘లేదు’ ఏండర్సన్ దృడంగా చెప్పాడు.
వాల్టర్ మరోసారి ఆ స్థలం వంక చూసి అడిగాడు.
‘దీన్ని ఎంతకి కొన్నారు?’
‘మీ కారు ధర కన్నా ఎక్కువకే. కాని నేను మళ్లీ ఈ ఊరికి తిరిగి రాను. నాకు కారు లేదు. వెళ్లడానికి అది అవసరం’
‘దీంట్లో ఏదైనా మతలబు ఉందా మిస్టర్ ఏండర్సన్?’ వాల్టర్ సూటిగా ప్రశ్నించాడు.
‘మీకా అనుమానం ఉండి వద్దనుకుంటే సరే’
‘టైటిల్ క్లియర్‌గా ఉందా అని నా ఉద్దేశం. దీని మీద అప్పేమీ తీసుకోలేదుగా?’
‘లేదు. గత పాతికేళ్లలో ఈ స్థలం మీద ఎలాంటి అప్పూ తీసుకోలేదన్న కాగితాలు సిద్ధంగా ఉన్నాయి. మీకు అనుమానంగా ఉంటే ఫర్వాలేదు. ఇంకా చాలామంది కారు యజమానులు ఆసక్తిగా ఉన్నారు. నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి’
‘ఈ ఒప్పందం నాకు అంగీకారమే. డబ్బుతో ఎలాంటి ప్రమేయం లేకుండా కారు మీది, స్థలం నాది. అంతేగా?’
‘అంతే’
ఆ పర్వతాల మధ్య ఎండలో గాలి వీస్తూంటే వారు ఇద్దరూ ఒకరితో మరొకరు అంగీకారంగా కరచాలనం చేసుకున్నాక వాల్టర్ చెప్పాడు.
‘మా ఇంటికి వెళ్లి పేపర్ వర్క్‌ని పూర్తి చేద్దాం. ఇక్కడ నించి మా ఇంటికి దగ్గర దారి ఉంది. మీ లాయర్ని కూడ ఆమా ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్పండి’
‘ఐతే మీరు డ్రైవ్ చేయండి. ఎంత త్వరగా ఐతే అంత మంచిది’ ఏండర్సన్ చెప్పాడు.
దారిలో వౌనంగా ఉన్న అతన్ని వాల్టర్ ప్రశ్నించాడు.
‘మీరీ రాత్రే వెళ్లిపోతున్నారా?’
‘కాదు. మీ ఇంటి నుంచే’
‘ఎక్కడికి?’
‘వెళ్లగలిగినంత దూరం’
అతనికి తన భవిష్యత్ గురించి తనకి చెప్పడం ఇష్టం లేదని గ్రహించి వాల్టర్ ఇక ప్రశ్నించలేదు. కారుని ఇంటి బయట ఆపి లోపలికి వెళ్లారు. ఎప్పటిలాగే హెలెన్ బైబిల్ చదువుతూ కనిపించింది. ఏండర్సన్‌ని పరిచయం చేశాక చెప్పాడు.
‘హెలెన్! మాకు కాఫీ తెస్తావా?’
ఆమె వెనకే వంట గదిలోకి వెళ్లి గొంతు తగ్గించి చెప్పాడు.
‘నువ్వు అనవసరంగా మాట్లాడకు’
హెలెన్ వాళ్లకి కాఫీ ఇచ్చి బైబిల్‌తో పక్కగదిలోకి వెళ్లిపోయింది. లాయర్ వచ్చేలోగా ఏండర్సన్ అసహనంగా చేతి గడియారం వంక చూడసాగాడు.
‘మీరు ఎందుకు ఆదుర్దాగా ఉన్నారు?’
‘వెళ్లాలని’
‘మీకు కారు ఎందుకు లేదు?’
‘ఉంది. అది పనికి రాదు’
‘దాన్ని అమ్మేశారా?’
అతను జవాబు చెప్పలేదు.
‘ఈ స్థలం కొని ఎంత కాలమైందని చెప్పారు?’
‘నేనేం చెప్పలేదు. ఏడాది పైనే’ అతను కరకుగా జవాబు చెప్పాడు.
‘ఇంకాస్త కాఫీ కావాలా?’
‘నో. థాంక్స్’
తమ మధ్య నిశ్శబ్దానికి అసౌకర్యంగా ఫీలైన వాల్టర్ తన అక్క హెలెన్ వచ్చి అవీ, ఇవీ మాట్లాడితే బావుండును అనుకున్నాడు. కాని ఆమె ఆడవారిలా మాట్లాడదు.
‘మా అక్కకి దైవభక్తి ఎక్కువ’ చెప్పాడు.
ఏదో ఆలోచనలో ఉన్న అతను ఆ మాటలు విన్నట్లుగా కనిపించలేదు.
‘మీరు ఆరు నెలలు ఆగితే ఆ స్థలాన్ని లాభానికి అమ్మచ్చు అని మీకు తెలుసా? నా సెకండ్ హేండ్ కార్ కన్నా ఎక్కువే వస్తుంది’ వాల్టర్ అడిగాడు.
‘కాని మనం ఓ ఒప్పందానికి వచ్చేశాం’
‘నిజమే. నా ఆసక్తిని చంపుకోలేక అడుగుతున్నాను. ఇందులోని మతలబు ఏమిటో చెప్తారా?’
వెంటనే ఏండర్సన్ వెళ్లడానికి లేచి నిలబడ్డాడు.
‘లేదులేదు. నేను వెనక్కి వెళ్లడం లేదు. మీరు నష్టపోతున్నారని మాత్రమే చెప్తున్నాను’ వాల్టర్ గట్టిగా చెప్పాడు.
ఏండర్సన్ అతని వంక కఠినంగా చూశాడు.
‘నా అనుభవం ఓ మనిషి ఇంకో మనిషికి ఏదీ ఉచితంగా ఇవ్వడు’ వాల్టర్ చెప్పాడు.
అతను ఏదో చెప్పబోతూంటే డోర్ బెల్ మోగింది. వాల్టర్ వెళ్లి తలుపు తెరవగానే ఎదురుగా నిలబడ్డ వ్యక్తి మర్యాదగా చెప్పాడు.
‘రాబర్ట్ ఏండర్సన్ కోసం వచ్చాను’
‘లోపలకి రండి’
లాయర్ వెంట సాక్షిగా వచ్చిన నలభై ఏళ్ల పైబడ్డ వ్యక్తి సాక్షి సంతకం చేశాక వాల్టర్ కారు తాళం చెవులని ఏండర్సన్‌కి ఇచ్చాడు. సాక్షి నెమ్మదిగా లాయర్ని అడగడం వాల్టర్ విన్నాడు.
‘శవం ఎక్కడ పాతిపెట్టబడిందో వాల్టర్‌కి తెలుసా?’
ఏండర్సన్ వేగంగా, దాదాపు పారిపోతున్నట్లుగా బయటకి వెళ్లాడు.
‘గుడ్‌బై జెంటిల్‌మెన్’ గదిలోంచి బయటకి వచ్చిన హెలెన్ గట్టిగా చెప్పింది.
లాయర్ వాల్టర్‌తో కరచాలనం చేస్తూ చెప్పాడు.
‘ఆ స్థలం అమ్మితే ఐదారు వేల డాలర్ల కన్నా ఎక్కువే వస్తుంది’
‘వ్యవహారం ముగిసింది కాబట్టి చెప్పండి. ఇందులోని మతలబు ఏమిటి?’
‘మతలబు ఏమీ లేదు’ లాయర్ విసుగ్గా చెప్పాడు.
‘కాని ఏదో ఉండి ఉండాలి’
‘ఉన్నా మీకు తెలియాలా?’ సాక్షి అడిగాడు.
‘పద బాబ్! మన పని ఇక్కడ ముగిసింది’ లాయర్ అతన్ని చెయ్యి పట్టుకుని బయటకి తీసుకెళ్తూ చెప్పాడు.
‘నేను వెనక్కి వెళ్లను. అదేవిటో చెప్పి వెళ్లచ్చుగా?’ వాల్టర్ రెట్టిస్తూ అడిగాడు.
మళ్లీ వెనక్కి వచ్చి ఆ మాటలు విన్న ఏండర్సన్ చెప్పాడు.
‘నేను అక్కడ నా వధువు కోసం ఓ డ్రీమ్ హౌస్‌ని కట్టాలని అనుకున్నాను. కాని వధువు లేదు. ఆ జ్ఞాపకాల్లోంచి సాధ్యమైనంత త్వరగా వెళ్లిపోతున్నాను’
‘అలాగా? ఐయాం సారీ. ఇది వ్యక్తిగతం అని అనుకోలేదు’
‘క్రితం మంగళవారం రాత్రి ఆమె ఆ స్పోర్ట్స్ కార్‌ని డ్రైవ్ చేస్తూంటే ఇంకో కారు దాన్ని గోతిలోకి పడేసింది. దాంతో డ్రీమ్ హౌస్ ఇక లేదు. ఇంక నేనా స్థలాన్ని చూడదలచుకోక అమ్మేశాను’
వెంటనే వాల్టర్ తల నించి పాదాల దాకా వణకడం లాయర్ గమనించాడు.
‘పద బాబ్!’ ఏండర్సన్ చెప్పాడు.
వాళ్లని అనుసరిస్తున్న లాయర్ అకస్మాత్తుగా ఆగి, వెనక్కి తిరిగి వాల్టర్ వంక చూస్తూ అడిగాడు.
‘మీరు ఎందుకు అంతగా వణికిపోతున్నారు?’
‘ఏం లేదు’
‘ఏదో ఉంది’
‘నిజంగా ఏం లేదు’
‘కచ్చితంగా ఏదో ఉంది. ఇంకో కారు లేకుండా దాన్ని అమ్ముతున్నారంటే ఆ కారుకి గల మతలబు ఏమిటి? మీరైనా చెప్పండి’ లాయర్ హెలెన్‌ని అడిగాడు.
‘మా అక్కయ్యకి పిచ్చి. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలీదు. నోరు మూసుకో హెలెన్!’ వాల్టర్ భయంతో వణుకుతూ అరిచాడు.
‘చేతిలో బైబిల్ ఉంచుకుని మీరు అబద్ధం చెప్పకూడదు. ఆ కారుతో సమస్య ఏమిటి? గేరేజ్ ఖాళీగా ఉంది. ఇంకో కారు కొనకుండా దాన్ని ఎందుకు అమ్ముతున్నారు?’ లాయర్ అడిగాడు.
హెలెన్ తమ్ముడి వైపు ఓసారి చూసి జవాబు చెప్పింది. హెలెన్ చేతిలో బైబిల్ ఉండగా అబద్ధం ఆడలేదు.
*

షార్లెట్ ఆర్మ్‌స్ట్రాంగ్ కథకి
స్వేచ్ఛానువాదం

మల్లాది వెంకట కృష్ణమూర్తి