డైలీ సీరియల్

బంగారు కల 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గండమనాయకుడి నాయకత్వంలో రాయచూర్ ముట్టడికి ఏర్పాట్లు తీవ్ర స్థాయిలో మొదలైనాయి.
****
చంద్రప్ప కారాగారం నుండి విముక్తుడైనాడన్న వార్త తెలిసి మంజరి సంతోషంతో ఆంజనేయుని గుడికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పింది. రామాయణ కాలంలో సీతారాముల్ని కలిపిన ఆంజనేయుడే తమని కలిపాడని ఆమె విశ్వాసం. చంద్రప్ప ఆమె చెంత వాలాడు సంతోషంగా.
‘‘మంజూ! నీ తెలివితేటలవల్ల బతికి బయటపడ్డాను’’ ఆమెను హృదయానికి హత్తుకున్నాడు.
‘‘మన అదృష్టంతోబాటు తిమ్మరుసుగారి ఔదార్యం’’ మంజరి ప్రశంసగా అంది.
‘‘ఈరోజు కృష్ణరాయలవారు తిరుమలనుంచి విచ్చేస్తారు. వెంటనే రాయచూర్ ముట్టడికి బయలుదేరుతారట’’ చంద్రప్ప చెప్పాడు.
‘‘నువ్వు కూడానా’’ దిగులుగా అంది.
‘‘రాయచూర్‌లో ఇస్మాయిల్ ఆదిల్‌ఖాన్ కార్యకలాపాలు కనిపెట్టి రమ్మని మంత్రివర్యుల ఆజ్ఞ’’
‘‘బాగుంది. ఇక మన పెళ్ళెప్పుడు?’’ మంజరి అలిగినట్లు అంది.
‘‘ఈ యుద్ధం పూర్తికానీ! చేసుకొందాం సరేనా!’’ బతిమాలాడు.
చంద్రప్ప మాటలకు మంజరి మొహం వికసించింది.
ఇద్దరూ యోగనరసింహస్వామికి కూడా వందనాలు సమర్పించి తిమ్మరసు భవనం వైపు సాగిపోయారు.
ఆస్తమిస్తున్న సూర్యకిరణాలు తిమ్మరసు సౌధం మీద రుధిర వర్ణంతో ప్రతిఫలిస్తున్నాయి.
హిందూ సామ్రాజ్య శత్రువులపై తిమ్మరుసు ఆగ్రహాన్ని ప్రకటిస్తున్నట్లుందా సౌధం.
‘‘చంద్రప్పా! నువ్వు కారాగారంనుండి బయటికి వచ్చిన వార్త రహస్యం సుమా! మన మధ్యనే వుండాలి. ఇకపై మారువేషంలో సంచరించి శత్రురాజుల వ్యూహాలను తెలుసుకోవాలి’’.
‘‘అలాగే మంత్రివర్యా!’’
‘‘మంజరీ! ఈ రాయచూర్ ముట్టడి అయ్యేదాకా నువ్వు కూడా జాగ్రత్త. మనం పోగొట్టుకున్న రహస్య పత్రాలు రాయచూర్‌వారికి అందాయి. అయినా మరేం భయంలేదు. ఎత్తుకు పైఎత్తు మన దగ్గర సిద్ధంగానే ఉంది. మీరిక వెళ్లిరండి’’ తిమ్మరుసు అనుజ్ఞ ఇచ్చాడు.
ఇద్దరూ సంతృప్తిగా ఆ భవనం నుండి బయటకు వచ్చారు.
****

5
‘‘మంజరీ! ఏమిటీ చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నావు?’’
‘‘ఏమీ లేదు చిన్నాజీ’’
‘‘ఏదో నాకు చెప్పవే! వేయి చంద్రికలు విరబూస్తున్న నీ మొహంలోని ఆనందం చెప్పకనే చెప్తున్నది. చంద్రప్పను కలిశావా?’’
‘‘అవును చిన్నాజీ! ప్రభువు దయవల్ల మనకి మంచిరోజులే!’’
‘‘మన కల్యాణయోగమేనేమో!’’ చిన్నాదేవి ఆమెను ఆట పట్టించింది.
‘‘పోండి చిన్నాజీ! ఆ... నేను మా అమ్మని చూసి చాలాకాలమైంది. ఇంటికి వెళ్లివస్తాను’’.
‘‘నా అనుమతి ఎందుకు మంజరీ! నీవు నా చెలికత్తెవు కావు. చిన్ననాటి నేస్తానివి. నీకీ భవనంలో రాకపోకలకు పూర్తి స్వాతంత్య్రం వుంది’’.
సంతోషంతో చిన్నాదేవి మందిరం నుండి బయలుదేరింది మంజరి.
విరూపాక్షస్వామి దేవాలయ వాణిజ్య వీధిలోంచి వస్తుండగా ఎవోరివో గుసగుసలు చెవినబడ్డాయి.
‘‘ఇస్మాయిల్ ఆదిల్‌ఖాన్ పంపారు’’
‘‘ఏంటి ఖబర్?’’
ఒకడు పరదేశి అని తెలుస్తోంది. ముఖాలను పూర్తిగా వస్త్రంతో కప్పుకున్నాడు. మరొకుడు విజయనగర పౌరుడే!
మంజరి వాళ్ళకి కనబడకుండా అటువైపు తిరిగి వస్త్రాలు, గాజులు కొనుగోలు చేస్తున్నట్లు నటిస్తూ ఆ సంభాషణ వింటున్నది.
‘‘రాయచూర్ ముట్టడికి రాయలు వస్తాడు కదా’’ పరదేశి చెప్తున్నాడు.
‘‘అయితే?’’
‘‘ముట్టడి జరుగుతుండగా రాయల సైన్యం రాయచూర్‌కి తూర్పు వైపు గుడారాలు వేస్తారు’’ పరదేశి వివరిస్తున్నాడు.
‘‘అవును. సరిగ్గానే ఉందీ విషయం’’.
‘‘ఇక విను. మా ఇస్మాయిల్ ఆదిల్‌ఖాన్ అశ్వదళాలు పదాతి దళాలతో విజయనగరానికి తొమ్మిది కోసుల దూరాన నిలుస్తాడు. కందకాలు తవ్వి ఫిరంగులను పేలుస్తాడు’’ పరదేశి మాట్లాడాడు.
‘‘ఇక విజయనగరం కోట మట్టిదిబ్బేనంటారా’’ విజయనగర వాసి ప్రశ్నించాడు.
‘‘ష్! జనం వింటారు. ఈ సమాచారం ఎక్కడా పొక్కరాదు. ఆదిల్‌ఖాన్ కోట ముట్టడించే సమయానికి మీరు కోటలోపల నుంచి సహకరించాలి.
‘‘మాకు లాభం’’ ఆశపడ్డాడు విజయనగర ద్రోహి.
‘‘ఎంత కోరితే అంత’’ శత్రువు ఆశ చూపించాడు.
‘‘సువర్ణరాజ్యం ఇది. దీనిని స్వాధీనపరచటమంటే మాటలు కాదు. సరే, మీ ఖాన్ సాబ్‌కి చెప్పు. అంతా సవ్యంగా జరుగుతుందని’’ మాట ఇచ్చాడతను.
వాళ్ళిద్దరూ త్వరత్వరగా అక్కడినుంచి వెళ్లిపోయారు.
మంజరి తమ ఇంటికి పోలేదు. నేరుగా తిమ్మరుసు భవనానికి బయలుదేరింది. విజయనగర ద్రోహి గుర్తించి ఆమెని వెంబడించాడు. తన అనుమానం నిజమే. ఆమె విజయనగరంలో వేగు. ఈ వార్త తిమ్మరసుకు చేరవేస్తుంది. సందేహం లేదు. దారి కాచి ఆపాడు.
‘‘ఆగు! నీ గొంతులోంచి మా రహస్యం పొక్కనీయకు’’ బొంగురుగా అన్నాడు.
‘‘ద్రోహి! విజయనగరానికే ఎగ్గు తలపెట్టిన నిన్ను వదిలిపెట్టను’’ సివంగిలా అతని జుట్టు పట్టుకుంది మంజరి.
ఒక సామాన్య నర్తకి అని భావించిన మంజరిలో ఇంతటి శక్తి అతడూహించలేకపోయాడు. తడబడి కైజారు దూయబోయాడు.
మెరుపులా ఒక అశ్వికుడొచ్చాడు. ఒక్క వుదుటన మంజరిని తన గుర్రంపైన కూర్చుండబెట్టుకొని క్షణంలో మాయమయ్యాడు. మైదానంలోకి వచ్చాక అశ్వం ఆగింది. అతని మొహం చూసి ఆమె నివ్వరపోయింది. ఆనందించింది కూడా.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి