డైలీ సీరియల్

బంగారు కల 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిల్పాచార్యులవారి దగ్గరికి వెళ్లి శిల్పిగా ఉద్యోగం అర్థిస్తే పాటలు పాడే శిల్పి మా కక్కర్లేదన్నాడు.
సంగీతాచార్యుడుగా మారుదామంటే రాళ్ళ మధ్య బతికేవాడు సంగీతానికి పనికిరాడన్నారు.
ఎందుకిలా? ఎన్నాళ్లిలా? నేనెవరిని? నా జీవితం ఎందుకిలా.. నా జీవితమే ఎందుకిలా? స్ర్తి పురుషులమధ్య ఆకర్షణ ఇంత బలమైనదా!
విజయనగర సామ్రాజ్యంలో స్ర్తిలకి ఎంత మర్యాద ఈయాలో తెలుసు. అందుకే మంజరితో ఏనాడు పల్లెత్తి మాట్లాడలేకపోయాడు. కనెత్తి పూర్తిగా చూడలేకపోయాడు. ఆమె అప్పుడప్పుడు ఆ చంద్రప్పతో కల్సి కన్పిస్తుంటుంది. అతడు సంగీతకారుడే కాదు రాజుగారి వేగు అని అనుమానం. వారిద్దరూ అనురాగబద్ధులైతే..
అతని మనసు చిగురుటాకులా కంపించింది.
‘ఎవరు నాయనా నీవు? ఏమిటీ ధ్యానం’
ఎవరో కాయాషాంబరధారి అపర శివునిలా ఎదుట నిలిచి ప్రశ్నిస్తున్నాడు.
‘‘నేనెవర్ని స్వామీ? నా మనసులో ఈ అశాంతి ఏమిటి?’’ శాస్ర్తీ ప్రశ్నించాడు.
స్వాములవారు శ్రద్ధగా అతన్ని చూశారు. దగ్గరకు రమ్మని పిలిచి తనతో మఠానికి తీసుకెళ్లరు. శాస్ర్తీ నమస్కరించి స్వాములవారి ఎదుట కూర్చున్నాడు.
స్వాములవారి సైగతో శిష్యులొక రుద్రాక్షమాలనూ, శాలువాను స్వాములవారికి అందించారు. స్వాములవారు స్వయంగా శాలువాను శాస్ర్తీకి కప్పి, మెడలో రుద్రాక్షమాల వేశారు. తలపైన అక్షింతలు వేసి ఆశీర్వదించారు.
‘‘నాయనా! నీది సన్యసించే జాతకం కాదు. అందుకే కాషాయ వస్త్రాలందించలేదు. కానీ నీకు ఎటువంటి భవబంధాలు వద్దు. నీకు మరుజన్మ లేదు. అంటే పూర్వజన్మ పరిహారం చేసుకో. నువ్వు కావాలనుకుంటున్న వ్యక్తి నిన్ను కోరుకోదు. నీ మీద గౌరవం మాత్రమే వుంది.
‘‘నామీద ఎవ్వరికీ ప్రేమ ఉండదా’’ రామేశ్వర శాస్ర్తీ గొంతులో బాధ ధ్వనించింది.
‘‘నిస్సంగుల్ని లోకం గౌరవిస్తుంది. పూజిస్తుంది. కానీ ప్రేమించదు. నీ విషయంలో కూడా అదే జరుగుతుంది. నిన్ను గౌరవించినవాళ్ళు ప్రేమించాలని కోరుకుంటే మిగిలేది దుఃఖమే గదా’’ స్వాములవారు అంతరార్థం చెప్పారు.
రామేశ్వర శాస్ర్తీ మనసు తేలికపడింది. అతని దుఃఖం దూరమైంది. మనస్సులో చిత్రించుకున్న మంజరి బొమ్మను మనస్సే చెరిపేసుకుంది. ఇపుడు అపరిమితమైన ఆనందమంటే ఏమిటో తెలుస్తుంది.
‘‘స్వామీ! నా జీవిత పరమార్థం ఏమిటి? ఇలా గమ్యంలేని ప్రయాణం ఎటు వెళ్తుంది?’’ అడిగాడు.
స్వాములవారు అతని శిరస్సున హస్తముంచారు. రెండు నిముషాలు కళ్ళు మూసుకుని తీవ్రంగా ధ్యానం చేశారు.
‘‘నీకు విముక్తి మార్గం లభిస్తుంది నాయనా! అశాశ్వతమైన బంధాల నుంచి శాశ్వతమైనదానిని సాధించు. నీలోని శక్తిని మేల్కొలుపు. నీవు చేసిన సృష్టి శాశ్వతంగా ఉంటుంది. ముందు తరాలవారు నిన్ను చిరయశస్విగా గుర్తిస్తారు. నీకు ఆత్మ సంతృప్తి కూడా అందులోనే కలుగుతుంది. నువ్వు చిన్నతనంలో దీక్ష పొందిన మంత్రం గుర్తుందా కుమారా!’’ ప్రశ్నించారు స్వాములవారు.
రామేశ్వర శాస్ర్తీకి వెంటనే స్ఫురించలేదు. రెండు క్షణాలు ఆలోచించాక ఓ మెరుపు మెరిసిందది. చిన్నతనంలో తండ్రి వెంట ఓ యోగిని దర్శించినపుడు ‘రూప ధ్యాన గానావళీ మంత్రాన్ని’ ఉపదేశం పొందాడు. కానీ దానిని ఇంతదాకా ఉపాసన చేయలేదు.
‘‘అవును స్వామీ ఓ మంత్రం నాతో ఉంది’’ వినయంగా చెప్పాడు.
‘‘ఆ రూప ధ్యాన గానావళీ మంత్రాన్ని సాధన చేయి. అది నిన్ను కటాక్షిస్తుంది. నువ్వు శిల్ప గాయకుడివి. నువ్వు చెక్కిన దేవతామూర్తుల్ని చూస్తుంటే ఆ మూర్తులే మైమరచిపోయేంతగా గానం విన్పిస్తుంది. నువ్వు ఆలపించే గానంతో దేవతామూర్తుల దివ్యరూపం కనిపిస్తుంది. ఇలా శిల్పంలో గానాన్ని, గానంలో శిల్పాన్ని సృష్టించు నాయనా!’’ స్వాములవారు ఆదేశించారు.
‘‘నేను విశ్వకర్మని కాను సాధారణ మానవుణ్ణి. స్వామీ నాకీ పని సాధ్యమవుతుందా!’’
‘‘నీ శక్తి తెలీక అలా మాట్లాడుతున్నావు. నువ్వు మామూలు మనిషివి కావు’’.
‘‘అయితే నేను ఎవరిని స్వామీ?’’
‘‘తత్త్వమసి’’ అన్నారు స్వాములవారు నీలిగగనంలోకి చూస్తూ చేతులు జోడిస్తూ.
ఇపుడు రామేశ్వరశాస్ర్తీ మనసులో ఎటువంటి అనుమానాలు, భయాలు లేవు. అతని హృదయంలో వేయి రాగాలు వీణ మీటుతున్నాయి. కళ్ళముందు అనేక శిల్పకళామూర్తులు, కళారూపాలు ప్రత్యక్షవౌతున్నాయి.
అప్పటిదాకా ఈ సంఘటనకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న ప్రధాన శిల్పాచార్యుడు ముందుకు వచ్చి స్వాములవారికి నమస్కరించాడు. రామేశ్వర శాస్ర్తీ చేయి పట్టుకున్నాడు.
‘‘పద నాయనా! విజయవిఠల దేవాలయ సప్తస్వర మండప వైభవం కోసమే నువ్వు పుట్టావు. ఎంత ప్రయత్నిస్తున్నా ఆ శిల్ప స్వర స్థానాలు పూర్తి స్థాయిలో కుదరటంలేదు నాతో రా! నీవల్ల నా జన్మ కూడా తరిస్తుంది’’ ప్రేమగా అన్నాడు ప్రధాన శిల్పాచార్యుడు.
‘‘సెలవు స్వామీ’’ రామేశ్వర శాస్ర్తీ సంతోషంగా స్వాములవార్కి నమస్కరించి సెలవు తీసుకున్నాడు.
ప్రధాన శిల్పాచార్యులతో బాటు వెళ్తున్న రామేశ్వర శాస్ర్తీని చూసి స్వాములవారి గుబురు మీసాల మాటున తెల్లని చిరునవ్వు తొణికిసలాడింది. విఠల మండపం తుది రూపురేఖలు పూర్తవుతాయనే విశ్వాసం కలిగింది. పైనుండి దేవతలు కూడా ‘తథాస్తు’ అని ఉంటారు. అందుకే రాయల విజయయాత్ర విహారం తర్వాత విజయనగరంలో శిల్ప కళాశక్తి ఆత్మశక్తితో రూపుదిద్దుకున్నది.
***
‘‘శ్రీవేంకటేశ్వర పాద పద్మావేశిత సదయ హృదయ! తిరుమలదేవీ వల్లభా! రాజకంఠీరవా! ఈశ్వర నరసింహ భూపురంధర! చిన్నమ దేవీ జీవిత నాయకా! కవితా సామ్రాజ్య ఫణీశ! శ్రీకృష్ణదేవరాయ బహుపరాక్! బహుపరాక్!’’ వంధి మాగధుల కైవారాలు మిన్నుముట్టాయి.
శ్రీకృష్ణదేవరాయలు, అప్పాజీ వచ్చారు. సభలోని కవిగాయక సేనానులు, పండితులు అందరూ లేచి అభివాదం చేశారు.

- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి