రాష్ట్రీయం

బినామీ ఆస్తుల్నీ అటాచ్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టుకు వెల్లడించిన ఆస్తులు కాకుండా బినామీ పేర్లతో ఉన్న ఆస్తులనూ వెంటనే అటాచ్ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను కోర్టుకు వెల్లడించకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం కోర్టును కూడా మోసం చేయాలని చూసిందని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కోర్టుకు వెల్లడించిన ఆస్తులు కాకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం మరో 70 స్థిరాస్తులు కలిగి ఉన్నట్టు తమ విచారణలో నిందితులు అంగీకరించినట్టు సిఐడి అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వాటినీ వెంటనే అటాచ్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇంకా ఏమైనా బినామీ ఆస్తులుంటే కోర్టుకు తెలియజేయాలని హైకోర్టు సూచించింది. కోర్టుకు తెలియకుండా బినామీ పేర్లపై ఒక్క ఆస్తి ఉండరాదని, ఇప్పటికైనా స్వచ్ఛందంగా ఇంకా ఏదైనా ఆస్తులు ఉంటే కోర్టుకు తెలియజేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసొసియేషన్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బొంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని అరెస్టు చేసి విచారించిన తర్వాత బినామీ పేర్లతో ఉన్న ఆస్తులను వెల్లడించినట్టు ఆంధ్రప్రదేశ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.10 కోట్ల డిపాజిట్లను ఇతరుల పేర్లపైకి బదలాయించినట్టు కూడా అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంత పెద్ద వ్యవహారంలో రూ. 10 కోట్ల రూపాయలు అనేది చిన్న మొత్తమని, అయితే ఇంకా పెద్ద మొత్తంలోనే డిపాజిట్లను ఇతరుల పేర్లపైకి బదలాయించి ఉండవచ్చని హైకోర్టు ఆనుమానం వెల్లిబుచ్చింది. ఈ కేసులో బినామీ పేర్లతో ఉన్న ఆస్తులపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిందిగా సిఐడి అధికారులను హైకోర్టు ఆదేశించింది. అటాచ్‌మెంట్ చేసే ఆస్తుల వివరాలతో రెండు, మూడు రోజులలో నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశిస్తూ, విచారణను రెండు వారాలా పాటు వాయిదా వేసింది.
అక్షయగోల్డ్ నిందితులను అరెస్టు చేయండి: హైకోర్టు
అక్షయ గోల్డ్ కేసులో ఈ సంస్థ డైరెక్టర్లను వెంటనే అరెస్టు చేయాల్సిందిగా తెలంగాణ సిఐడి అధికారులను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. అక్షయ గోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్స్ వెల్ఫేర్ అసొసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బొంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అగ్రిగోల్డ్ కేసు మాదిరిగా అక్షయగోల్డ్ కేసులో బాధితులకు డబ్బులు తిరిగి చెల్లంచడానికి కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా పిటిషన్‌దారు కోర్టును అభ్యర్థించారు. ఈ కేసును హైకోర్టు విచారణలో ఉండటంతో అక్షయ గోల్డ్ యాజమాన్యానికి కింద కోర్టులు బైయిల్ మంజురు చేయవద్దని కూడా హైకోర్టు సూచించింది. అక్షయ గోల్డ్ కేసులో మొత్తం 28 మంది నిందితులుగా గుర్తించగా, ఇందులో ఇప్పటికే 10 మందిని అరెస్టు చేయగా, మిగతా 18 మంది నిందితులు కింది కోర్టుల నుంచి బైయిల్ పొందినట్టు అదనపు అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు వివరించారు. అగ్రిగోల్డ్ కేసులో నిందితుల అరెస్టులో జాప్యం చేయడం వల్ల ఏమి జరిగిందో దృష్టిలో పెట్టుకోవాలని దర్యాప్తు అధికారులకు హైకోర్టు గుర్తు చేసింది.