రాష్ట్రీయం

నీటిపై శ్వేతపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రగతి విధానాలపైనా ప్రజాభిప్రాయం కోరతాం
సోమశిల నుంచి కండలేరుకు జలాలు విడుదల
కృష్ణా, పెన్నా అనుసంధానానికి కసరత్తు
పర్యాటక ప్రాంతంగా సోమశిల అభివృద్ధి
ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ

నెల్లూరు/ ఆత్మకూరు, నవంబర్ 22: సమస్త మానవాళికి ఉపయోగపడే జీవజలాన్ని బాధ్యతతో పొదుపుగా వినియోగించుకునే విధానాలపై ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నీటి నిర్వహణలో మేలైన మార్గాల్ని అనుసరించడంతో ప్రజల్లో భద్రతాభావం పెంపొందుతుందని, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆదివారం నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం వద్ద పూజలు నిర్వహించి తెలుగుగంగ (కండలేరు) బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు జలాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జలం కూడా ధనం మాదిరి విలువైనదిగా భావించాలన్నారు. డబ్బు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తే, లేనిరోజున ఖర్చుల కోసం అప్పులపాలవుతారన్నారు. అదేమాదిరి వర్షం వచ్చినప్పుడు కురిసే ప్రతి నీటి చుక్కను నిల్వ చేసుకుంటే భవిష్యత్‌లో కరవు ఎదురైనప్పుడు ప్రజావసరాలు తీరుతాయన్నారు. డబ్బు బ్యాంక్‌లో ఎలా భద్రంగా ఉంటుందో నీరు రిజర్వాయర్లలో భవిష్యత్ అవసరాలు తీర్చుకునేందుకు నిల్వ ఉండాలన్నారు. నీటి వినియోగంలో ఆదామార్గాల్ని అనుసరించవచ్చని, ఈ ఏడాది పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జరిగిన ఉదాహరణల్ని వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 130 టిఎంసిల నీటి వినియోగంతో కేవలం తొమ్మిదిన్నర లక్షల ఎకరాల్లో పంట సాగైందన్నారు. అదే కృష్ణా జిల్లా పరిధిలో కేవలం 33 టిఎంసిలతోనే ఎనిమిదిన్నర లక్షల ఎకరాల్లో సాగునీటి అవసరాలన్నీ తీరకపోతే పట్టిసీమ నుంచి మరో నాలుగైదు టిఎంసిల వరకు తరలించడంతో పంట రైతుల చేతికొచ్చిందన్నారు. ఈ రెండు జిల్లాల్లోనే నీటి వినియోగం, సాగైన విస్తీరణాలను పరిశీలిస్తే ఎంతో వ్యత్యాసం స్పష్టమవుతుందన్నారు. తక్కువ నీటితోనే ఎక్కువ అవసరాలను తీర్చుకునేలా ప్రజల్లో అవగాహన పెంపొందాల్సి ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో ఒక టిఎంసి నీటితో 13నుంచి 14 వేల ఎకరాల పంట సాగు చేసేలా అధికార యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది సోమశిలకు నీటి నిల్వ చేకూరినా పంటల సాగుకు పొదుపుగా వినియోగించుకుంటే వచ్చే ఏడాది కరవు తాండవిచ్చినా తాగు అవసరాలు తీరుతాయన్నారు. ఇంకా అనుకూలిస్తే సాగు అవసరాలకు కూడా ఇదే నిల్వ ఉపయోగపడుతుందన్నారు. సోమశిల జలాశయంలో 54.5 టిఎంసిల నీరుందన్నారు. నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది 16 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లాలో 20 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా వర్షాలు కురవడంతో జలకళ సంతరించుకుందన్నారు. సోమశిల జలాశయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. సోమశిల జలాశయం పర్యాటక అభివృద్ధి అనుకూలంగా ఉందన్నారు. సోమశిల, పెంచలకోన, మైపాడు బీచ్, కండలేరును అనుసంధానం చేసి పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. కాగా, నదుల అనుసంధాన ప్రక్రియను తొలివిడతలో విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. తొలిదశగా గోదావరి జలాలను కృష్ణానదిలోకి తీసుకురావడానికి చేపట్టాల్సిన నిర్మాణ పనులు ఐదున్నర మాసాల్లోగానే పూర్తి చేశామన్నారు. మలివిడతగా కృష్ణా, పెన్నానదుల అనుసంధానికి కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగా నాలుగైదు విధానాలపై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. దీనిపై తుది నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. నదుల అనుసంధానంలో భాగంగా వీలైనంత వరకు గ్రావిటీ ద్వారానే నీరు ముందుకెళ్లేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన సందర్భంలో మాత్రమే ఎత్తిపోతలను అనుసరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. జలాశయాలు, కాలువల నిర్మాణాల్లో భాగంగా అవసరమైన అటవీ అనుమతులు సాధించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని తెలిపారు. నీరు- చెట్టు కార్యక్రమంతో భూగర్భ జలాలు వృద్ధి చెందేలా కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. వర్షాధారంగా సాగుచేసే వివిధ ఆరుతడి పంటల్ని తుదివిడతగా నీటి ఆవశ్యకతకు ఇక్కట్లు ఎదురయ్యే సందర్భాల్లో రైతన్నను గట్టెక్కించేందుకు రెయిన్‌గన్స్ వంటి అత్యాధునిక సాంకేతిక విధానాల్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే రైతుల్లో కూడా సాగునీటిని సమర్ధవంతంగా ఉపయోగించడంలో పొదుపు భావన పెంపొందేందుకు బిందు, తుంపర్ల సేద్యాలను విస్తృతం చేస్తున్నట్లు వివరించారు. అంతిమంగా కరవురహిత రాష్ట్రం చేయాలనేదే తమ అభిమతమన్నారు. ఇదిలావుండగా ఆదివారం ఆయన పొదలకూరు, గూడూరు, చిల్లకూరు, నాయుడుపేటలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం అక్కడ నుండి చంద్రబాబు చిత్తూరు జిల్లాకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు వెంట రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంఎల్‌సిలు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) సోమశిల రిజర్వాయర్ వద్ద పూజలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు