రాష్ట్రీయం

జూన్‌లోగా వచ్చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సచివాలయం తరలింపు తథ్యం

ప్రగతి సాధనలో శాఖలు పోటీపడాలి
అర్హులకు 2నెలల్లో రేషన్ కార్డులు
సంక్రాంతికి ఊరూరా ఉత్సవాలు
వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు

విజయవాడ, డిసెంబర్ 26: జూన్‌లోపు 6 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణాలు పూర్తిచేసి మొత్తం సచివాలయాన్ని విజయవాడకు తరలించాలని నిర్ణయించినట్టు సిఎం చంద్రబాబు ప్రకటించారు. సాధ్యమైనంత వేగంగా పరిపాలనా యంత్రాంగాన్ని రాష్ట్రానికి తరలించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్టు చెప్పారు. కార్యదర్శులు, విభాగాధిపతులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించి గ్రామ, మండల, జిల్లాస్థాయి అధికారులకు మార్గదర్శనం చేయాలన్నారు. శనివారం ఉదయం సిఎంవోలో వివిధ శాఖల కార్యదర్శులు, అధిపతులు, జిల్లా అధికారులతో జనవరి 2నుంచి మొదలుకాబోయే ‘జన్మభూమి- మాఊరు’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పేదరికంపై గెలుపు, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి సంపూర్ణ ఫలితాలు సాధించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం తీసుకున్న 7 మిషన్ల ఉద్దేశం, స్ఫూర్తిని ప్రజలకు అర్ధమయ్యే రీతిలో చెప్పాలన్నారు. 12.43 లక్షల రేషన్ కార్డులను పరిశీలించి అర్హులైనవారికి అందివ్వాలని ఆదేశించారు. ‘పంట సంజీవని’ కింద జిల్లాకు లక్షచొప్పున దాదాపు 10 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మాణం చేయాలన్నారు. తొలివిడతగా మొత్తం 875,000 ఫామ్ పాండ్స్ నిర్మాణానికి ఏర్పాట్లు చేశామని అధికారులు ఆయనకు వివరించారు. ఎన్టీఆర్ జలసిరి కింద లక్ష బోరుబావులు మంజూరు చేసామని సిఎం తెలిపారు. ఎన్టీఆర్ జలసిరికి డాక్యుమెంట్లు తీసుకోవాల్సిన అవసరం లేదని, అన్నీ ఆన్‌లైన్‌లో ఉన్నందున అక్కడికక్కడే పరిశీలించి అనుమతులివ్వాలని ఆదేశించారు. రుతుపవనాలకు ముందు 8 మీటర్లు, రుతుపవనాల తరువాత 3 మీటర్లు భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం రోజువారీ భూగర్భ జలాల పరిశీలన జరపాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే వర్షాకాలం ముగిశాక రాష్ట్రంలో భూగర్భ జలమట్టం ఖచ్చితంగా 3 మీటర్లు ఉండాలని స్పష్టం చేశారు. రానున్న 90 రోజుల్లో రోజుకు 5 కిలోమీటర్లు చొప్పన రహదారుల నిర్మాణాలు పూర్తిచేస్తేకానీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమన్నారు. 12,42,000 రేషన్ కార్డులు త్వరలో అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు. రేషన్‌తోపాటు ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడే కార్డు, రేషన్ లేకుండా ప్రభుత్వ పథకాలకు ఉపయోగపడే కార్డుగా రెండు రకాలు సిద్ధం చేద్దామని, ఏది ఎంపిక చేసుకోవాలో ప్రజలే నిర్ణయించుకునేలా ‘జన్మభూమి- మాఊరు’లో విస్తృతంగా చర్చించాలని సూచించారు. రెండు నెలల్లోపు అందరికీ రేషన్ కార్డులు అందేలా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు ఈ సందర్భంగా సిఎంకు వివరించారు. రేషన్ షాపు డీలర్లు ఎక్కడైనా దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలని సిఎం వారిని ఆదేశించారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్కడక్కడ తలెత్తిన సాంకేతిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని కూడా చెప్పారు. పేదలకు అందుబాటులో అన్ని రకాల వైద్యసేవలు అందించడానికి వీలుగా వైద్య ఆరోగ్యశాఖలో సమూల సంస్కరణలు చేస్తున్నట్టు సిఎం తెలిపారు. అన్ని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో జనవరి 1నుంచి హెల్త్ చెకప్ ఉచిత సేవలు ప్రారంభిస్తున్నట్టు వైద్యశాఖ అధికారులు ఆయనకు చెప్పారు. జనవరి నెలాఖరులోగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెల్త్ చెకప్ ఉచిత సేవలు ఆరంభిస్తామని తెలిపారు. అలాగే, జనవరి రెండో వారంలో ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులు పంపిణీకి సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈసారి జన్మభూమి- మాఊరు కార్యక్రమంలో ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించాలని సిఎం వారిని కోరారు. అన్ని ఆస్పత్రుల్లో ఎక్విప్‌మెంట్ నిర్వహణ బాధ్యతల్ని అవుట్ సోర్సింగ్‌కు ఇస్తున్నామని సిఎం ప్రకటించారు.
రాష్ట్రంలో ఎక్కడా కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్టు సిఎం తెలిపారు. జనవరి తరువాత రాష్ట్రంలో రహదారులపై ఎక్కడా గుంతలుండటానికి వీల్లేదన్నారు. ఫ్లోరైడ్ సమస్య వున్న 329 ప్రాంతాల్లో జనవరి నాటికి మినరల్ వాటర్ సరఫరా చేయాలని సూచించారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు భాగస్వాములకు 20 అభివృద్ధి సూచికల్లో 5 ఇండికేటర్లపై బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈసారి కూడా సంక్రాంతి కానుక ఇస్తున్నట్టు ప్రకటించారు. ‘నవ్యాంధ నిర్మాణమే కర్తవ్యం’ అనే నినాదంతో ప్రజలందర్నీ మళ్లీ ఏకోన్ముఖుల్ని చేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతికి ఊరూరా ఉత్సవాలు నిర్వహించాలని, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.
** జన్మభూమిపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు **