రాష్ట్రీయం

రగులుతున్న యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబు వచ్చినా జాబుల్లేవు * లక్షకుపైగా ఖాళీలున్నా భర్తీ కావు

హైదరాబాద్, మార్చి 13: ఉద్యోగాల భర్తీ చేయడం లేదన్న అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్‌లోని యువత మండిపడుతోంది. 13 జిల్లాలతో కూడిన ఎపి ఏర్పాటై దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, ఉద్యోగాల ఖాళీల భర్తీ ప్రక్రియను చేపట్టపోవడం వల్ల విద్యావంతులైన నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో దాదాపు 4,80,000 వేల ఉద్యోగాలున్నాయి. వీటిలో దాదాపు 80 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు (పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్-పిఎస్‌యు) లలో మరో 60 వేల వరకు ఖాళీలు ఉన్నట్టు ఆర్థిక శాఖ వద్ద ఉన్న సమాచారం వల్ల తెలుస్తోంది. అంటే మొత్తం 1,40,000 వరకు ఉద్యోగాల ఖాళీలున్నట్టు తెలుస్తోంది.
‘బాబు వస్తే జాబు వస్తుం’దంటూ తెలుగుదేశం పార్టీ 2014 సాధారణ ఎన్నికల సమయంలో విపరీతంగా ప్రచారం చేయడంతో ఈ నినాదానికి యువత ఆకర్షితులయ్యారు. ఎన్నికల్లో టిడిపికి అండగా నిలిచారు. చంద్రబాబు అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తికావస్తోంది. అమరావతికి ఇస్తున్న ప్రాధాన్యత ఉద్యోగాల భర్తీకి ఇవ్వడం లేదన్న అసంతృప్తి యువతలో కనిపిస్తోంది. ప్రధానంగా విద్య, వైద్యం, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర ముఖ్యమైన శాఖల్లో ఖాళీల వల్ల ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నాయి. మండల స్థాయిలో విద్య, వైద్యం, వ్యవసాయం, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో 30 వేల పైగా ఖాళీలు ఉండటంతో క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. వీటి భర్తీ ఎప్పుడవుతుందో తెలియడం లేదు. ప్రస్తుతం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలోనే 50 వేలమందికి పైగా పనిచేస్తున్నారు. వీరిని రెగ్యులర్ చేస్తారా? లేదా? అన్న అంశంపై ఒక వైపు చర్చ జరుగుతున్నా, ప్రభుత్వం నుండి సానుకూల స్పందన మాత్రం రావడం లేదు.
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుండి 60 సంవత్సరాలకు పెంచడం పట్ల యువత తీవ్రమైన అసహనానికి గురవుతోంది. ప్రభుత్వం తాత్కాలికంగా ఆర్థిక ఇక్కట్ల నుండి బయటపడేందుకే పదవీ విరమణ వయస్సును పెంచారన్న అభిప్రాయం యువతలో గట్టిగా నాటుకుపోయింది.
కళ్లు కాయలు కాస్తున్నాయి
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ లెక్చరర్ల పోస్టుల భర్తీ ప్రక్రియకు నోటిఫికేషన్ ఇచ్చే అంశంపై ఎదురు చూస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న రాంబాబు అనే లెక్చరర్ తెలిపారు. ఆంధ్రభూమి ప్రతినిధితో శనివారం మాట్లాడుతూ, తనతో పాటు అనేక మంది యువతీయువకులు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) పరీక్షలు రాసి అర్హత సాధించినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాకపోవడంతో అసంతృప్తి నెలకొని ఉందన్నారు. దాదాపు వెయ్యిదాకా జూనియల్ లెక్చరర్ పోస్టులు, 500 వరకు డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో కొంత మందిని నియమించుకున్నప్పటికీ వారిలో అర్హులైన వారు ఎందరో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం శాస్ర్తియ విధానంలో నియామకాలు చేపట్టకపోవడం వల్ల అర్హులైన యువత నిరాశా, నిస్పృహలకు లోనవతున్నట్టు తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు గత కొనే్నళ్ల నుండి సిద్ధమవుతున్నానని పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కె. చంద్రమోహన్ తెలిపారు. నిరుద్యోగ యువతకు సంఘం అనేది లేకపోవడంతో తాము ఆందోళన చేయలేకపోతున్నామని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని టిడిపి ఎమ్మెల్యే, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కూడా అనేక పర్యాయాలు డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీల భర్తీకోసం ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఎపిపిఎస్‌సి వారికి పెద్దగా ఎలాంటి పనిలేదు.
సిగ్నల్స్ అందుతున్నాయి
ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్న సిగ్నిల్స్ అందుతున్నాయని ఎపిపిఎస్‌సి సభ్యుడు జిఎస్ సీతారామ రాజు తెలిపారు. శనివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వం నుండి వివరాలు అందిన వెంటనే పోస్టుల భర్తీ యుద్ధప్రాతిపదికపై పూర్తి చేస్తామన్నారు.