భక్తి కథలు

యాజ్ఞసేని-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తదుపరి శ్రీకృష్ణ వాసుదేవుని మంత్రాంగం నిర్వహించే తన సమాలోచన మందిరానికి కొనిపోతాడు. శ్రీకృష్ణుని రెండు చేతులను తన చేతులలో గ్రహించి..
శ్రీకృష్ణవాసుదేవా! నా కోర్కెను మన్నించి వచ్చినందులకు ఎంతో సంతోషిస్తున్నాను. నీకు ఎంతో ఋణపడి వున్నాను.
కృష్ణా! బహుశా నీకు తెలిసే వుంటుంది. నేను ద్రోణుని చేతిలో అతి దారుణంగా అవమానింపబడిన సంగతి. ఆ తదుపరి నేను యాజోపయాజుల అనుగ్రహంతో ఒక యజ్ఞాన్ని నిర్వహించి దృష్టద్యుమ్నుడు అనే ఈ కుమారుని మరియు ‘కృష్ణ’ అనే ఒక కుమార్తెను పొందగలిగాను.
ధనుర్దారులందరిలో శ్రేష్ఠుడు, బలవంతుడు, అర్జునుడు నన్ను కూడా బంధించి గురుదక్షిణగా ద్రోణాచార్యునికి అప్పగించాడు. అలాంటి ఆ మహావీరునికి నా కుమార్తె ద్రౌపదిని భార్యగా ఇవ్వదలిచాను. కాని విధి వక్రించి పాండుసుతులు ఐదుగురూ తల్లి కుంతీదేవితో సహా దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడు అతడి కుమారుడు దుర్యోధనుడు తలపెట్టిన ద్రోహంతో వారు వారణావతంలోని లక్క ఇంటిలో అగ్నికి ఆహుతి అయినారని విని దుఃఖించాను. నా కోరిక కోరికగానే మిగిలిపోయింది.
నా ప్రయత్నాలన్నీ చేసి పాండుసుతల జాడ తెలియక నిరాశతో నా కుమార్తె ‘కృష్ణ’కు విధిలేక స్వయంవరాన్ని ప్రకటించాను. ఒకవేళ పాండు సుతులు బ్రతికియుంటే వారు తప్పక స్వయంవరానికి వస్తారని ఎక్కడో కొంచెం ఆశ నాలో మిగిలింది. వేగులచేత వారి ఉనికిని కనుగొన ప్రయత్నించాను. కానీ వారు నిజంగా అగ్నికి ఆహుతి అయినారా? లేక తప్పించుకొని ఎక్కడైనా ఒక చోట బ్రతికియున్నారా తెలియరావడంలేదు.
ఈ స్వయంవరానికి అందరు రాజులూ వస్తారు. ధార్తరాష్ట్రులూ తప్పక వస్తారు.
మగధ దేశ రాజైన జరాసంధుడు కూడా వస్తాడు. ఆ జరాసంధుడు స్వయంవరంలో ఎలాంటి విపత్తును సృష్టిస్తాడో అనే ఆవేదన నాలో గూడుకట్టుకుని వున్నది. కారణం ఎంతోమంది రాజులు అతడికి భయపడి దాసోహమన్నారు.
నేను కౌరవుల సహాయాన్ని కోరలేను. జరాసంధుని నిలువరించలేను. స్వయంవరంలో ఎలాంటి సమస్యలూ రాకుండా ఉండటానికై నేను నీ సహాయం కొరకు నిన్ను ఇక్కడికి రావలసిందిగా కోరుకున్నాను.
నీవు కారణజన్ముడవనీ, ధర్మపక్షపాతివనీ, రాజనీతిజ్ఞుడవనీ, ఎదుటివారి హృదయాలను తేలికగా జయించసమర్థుడవనీ విన్నాను. నీ గురించి ప్రజలు చెప్పుకొనగా విన్నాను. ఎలాంటి క్లిష్ట సమస్యనైనా నీవు అవలీలగా పరిష్కరించగల సమర్థుడవనే నమ్మకం అందరిలోనూ కలదు. గురుదేవులు సందిపాని నీ గురించి సవివరంగా తెలియపరచినారు.
రాబోయే స్వయంవరంలో జరాసంధుని నిలువరించి ఎలాంటి విపత్తులు కలుగకుండా కాపాడగలవని నమ్ముచున్నాను.
వాసుదేవా! ఈ కార్యక్రమం నీ చేతుల మీదుగా జరగాలని నేను వాంఛిస్తున్నాను.
నా మాటను మన్నించి స్వయంవరం నిర్విఘ్నంగా జరిగేటట్లుగా చూడగలవు అని వాసుదేవుని అర్ధించాడు. అంతా విన్న శ్రీకృష్ణవాసుదేవుడు ద్రుపునితో-
‘‘ద్రుపద మహారాజా! మీరు నాపైన చూపిన అభిమానానికి, నమ్మకానికి సదా కృతజ్ఞుడను. మీరు కోరిన విధంగా నా శక్తిమేరకు సహాయపడగలను. గురుదేవులు నాపైగల వాత్సల్యంతో అలా చెప్పియుండవచ్చును. అది వారికి నాపైగల నమ్మకం.
నేనూ, నావారూ అందరూ ఆ జరాసంధుని బాధితులమే. మాపై అనేకమారులు దండెత్తి వచ్చాడు. కానీ మమ్ములను జయింపలేకపోయాడు. తరచూ అతడు మాపై దండెత్తి రావటాన్ని నిలువరించటానికై ప్రజల రక్షణార్థమై మేము మధురానగరాన్ని వదలి కుశస్థలంలో చేరాము.
జరాసంధుడు కురురాజ్యంపై కనె్నత్తి చూడసమర్థుడు గాడు. ఒకసారి కర్ణుడిని యుద్ధానికి ఆహ్వానించి ద్వంద్వ యుద్ధంలో అతడి చేతిలో ఓడిపోయి కాలు విరగగొట్టుకున్నాడు. అతడి ధైర్యానికి మెచ్చి అతడికి ‘మాలిని’ అనే నగరాన్ని బహుమానంగా ఇచ్చాడు. అంతేగాక భీష్మ ద్రోణ కృపాచార్యాశ్వత్థామ దుర్యోధనులను ఎదిరించగలశక్తి అతడికి లేదు. ఆ కారణంగా జరాసంధుడెప్పుడూ కురురాజ్యంపై కనె్నత్తి చూడలేదు.
స్వయంవరానికి వచ్చి అతడు ఎలాంటి సాహసానికి పూనుకొనలేడు. దుర్యోధన శల్య కర్ణులతడి దుస్సాహసాన్ని సహించి వూరుకొనరు.
కావున ద్రౌపది స్వయంవరాన్ని వీలైనంత తొందరలో నిర్వహించండి.
- ఇంకా ఉంది

- త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము