భక్తి కథలు

యాజ్ఞసేని-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుడిచేతితో నారి కొనను పట్టి వింటిని సంధించ ప్రయత్నించబోగా వంగియున్న విల్లు ఒక్కసారిగా చేతినుండి అదను తప్పి శిశుపాలుణ్ణి విసరివేయగా అతడు మోకాళ్ళు వంగి పడ్డాడు. అక్కడున్న వారంతా పెద్దగా నవ్వారు. శిశుపాలుడు మరలా వింటిని పట్టి నారిని సంధింప ప్రయత్నించక వెనుదిరిగిపోయి తన ఆసనంలో కూర్చున్నాడు.
శిశుపాలుని వంతు ముగిసింది.
తరువాత అక్కడ వున్నవారంతా మరొకరెవరు వస్తారో చూస్తున్నారు. ఇంతలో మగధ దేశాధిపతి అయిన ‘జరాసంధుడు’ లేచాడు. రాజుందరూ ఆశ్చర్యపోయారు.
ఇంత ముదుసలికి ఈ వయస్సులో వివాహ ప్రయత్నమా అని మనస్సులలో ఆరాటపడ్డారు. ఏవగించుకొన్నారు.
జరాసంధుడు నెమ్మదిగా ఆసనం వెడలి మత్స్య యంత్రం వద్దకు పోయి దాన్ని ఒక్కసారి పరికించాడు. అక్కడినుండి ద్రుపద మహారాజు వద్దకు వెళ్ళాడు.
‘‘ద్రుపదరాజా! నేను ఈ స్వయంవరంలో పాల్గొనదలచటంలేదు. ద్రౌపది నాకు మనుమరాలితో సమానం. ఇక నాకు శెలవు, వస్తాను’ అని అన్నాడు.
వెంటనే అక్కడినుండి వెడలి తన మనుమడితో, పరివారంతో, సేనా సమూహంతో వెనుదిరిగి మగధకు బయలుదేరాడు. అది చూచి రాజులందరూ ఆశ్చర్యచకితులయ్యారు.
సభాస్థలి ఒక్కసారి నిశ్శబ్దం ఆవరించింది.
రాజులు ఒకరిమొగం ఒకరు చూచుకున్నారు. తరువాత ఎవరి వంతోనని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
రాజులందరూ ఆసక్తితో చూస్తుండగా దుర్యోధనుడు ఆసనం నుండిలేచాడు. కలయచూశాడు. బలగర్వం ముందుకు సాగాడు.. వాద్యాలు, భేరీ మృదంగాల శబ్దాలు మారుమ్రోగాయి.. వందిమాగధులు గళాలు విప్పారు.
ఈతడు హస్తినాపుర ప్రభువైన ధృతరాష్ట్ర మహారాజు యొక్క జ్యేష్ఠపుత్రుడు. వందమంది కౌరవులలో పెద్దవాడు. శంతన మహారాజుకు, విచిత్రవీర్యునికి పౌత్రుడు. అస్తవ్రిద్యాసంపన్నుడు. గదాయుద్ధ కౌశల్యుడు. గాంధారి తనయుడు అని అన్నారు. ద్రుపదుడికంటే గొప్ప రాజుననే గర్వంతో దుర్యోధనుడు ద్రుపదుని వద్దకు పోలేదు.
మత్స్యయంత్రం ఉన్న చోటికి వచ్చాడు. ధనుస్సును చేతబట్టాడు. వింటి నారిని సంధించి ఎక్కుబెట్ట ప్రయత్నించగా వ్రేళ్ళమధ్య వింటి నారి దెబ్బ తగిలి పట్టుదప్పి క్రిందికి వాలిపోయాడు. దెబ్బతిని సిగ్గుతో తలవంచాడు. మెల్లగా అక్కడినుంచి వెనుదిరిగి ఆసనంపై ఆసీనుడయ్యాడు.
సభాస్థలిని మరలా నిశ్శబ్దం ఆవహించింది.
అంత అంగ దేశాధిపతి, దుర్యోధనునికి నమ్మిన మిత్రుడు అయిన కర్ణుడు ఆసనం నుండి లేచాడు. రాజులందరూ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అక్కడనే బ్రాహ్మణ వేషంలో వున్న పాండవులు కూడా చూచారు.
‘‘అగ్నికంటే, సూర్యచంద్రులకంటే మహాతేజస్వి అయిన ఈ కర్ణుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి నేల కూలుస్తాడు’’ అని మనస్సులో భావించారు.
సభను మరలా కొంతసేపు నిశ్శబ్దం ఆవరించింది.
వాద్యాలు మ్రోగాయి. వందిమాగధులు కర్ణుని మహారధిగా వర్ణించారు. అయితే అతడి వంశక్రమాన్ని మాత్రం వివరించలేదు.
ఆసనం దిగి మత్స్య యంత్రం వున్న చోటికి వచ్చాడు కర్ణుడు. ధనుస్సును చూచాడు. ఒక్కసారి ఆ ధనుస్సును చేతబట్టి నారిని అవలీలగా సంధించాడు. ధనుస్సును ఎక్కుబెట్టి బాణాన్ని సంధించాడు.
అంతవరకూ పరధ్యానంతో వచ్చేపోయేవారిని చూస్తున్న యాజ్ఞసేని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కర్ణుడిని చూచింది.
‘‘నేను ఈ సూత్రపుత్రుని వరించను’’ అని పెద్దగా అన్నది.
ఆ మాటలు విన్న కర్ణుడు కోపంతో నవ్వుతూ సూర్యునివైపు చూచి చేతిలోని ధనుస్సును క్రిందకు వదలి వెనుదిరిగాడు.
కర్ణుని మనస్సు దెబ్బతిన్నది. తాను మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలిచి తన మిత్రుడైన దుర్యోధనునికి ఆమెను కానుకగా ఇవ్వాలనే ఆశ అడుగంటింది.
అధర్మవర్తనులకు మిగిలేది అవమానం మాత్రమే. ఎప్పుడూ ధర్మమే విజయాన్ని వరిస్తుంది.
రాజులందరూ కర్ణుడికి జరిగిన అవమానాన్ని చూచి మనస్సులో బాధపడ్డారు. కానీ పైకి ఏమీ
అనలేకపోయారు. అతడు క్షత్రియుడు కాకపోవడంతో వూరకున్నారు.
సభాస్థలిని మరలా నిశ్శబ్దం ఆవహించింది.
కర్ణుడిలాంటి మహారథి వెళ్లిన తరువాత అంత సమర్థుడు ఒక్క అర్జునుడే. అతడు లేడు. మరెవరు ఈ యంత్రాన్ని ఛేదించగలరు. ఇది అసాధ్యమైన పని అంటూ తలపోశారు రాజులు.
రాజులలో ఆశ నశించింది. నిరుత్సాహం కొట్టవచ్చినట్లు కనపడుతున్నది. ఇంతలో మద్ర దేశాధీశుడైన శల్యుడు లేచాడు. మెల్లగా నడిచి మత్స్యయంత్రం ఉన్నచోటికి వచ్చాడు.
యధావిదిగా వాద్యాలు, భేరీ మృదంగాలు మ్రోగాయి. వందిమాగధులు శల్య మహారాజును పొగిడారు - ఇంకా ఉంది

-త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము