భక్తి కథలు

ఈర్ష్య, అసూయలకు దూరంగా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఎవరినయినా లేదా దేన్నయినా అమితంగా ఇష్టపడుతున్నప్పుడు, వారి చుట్టూ మన ఆలోచనలు అల్లుకుని దాని ప్రకారం మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నప్పుడు ఏ చిన్న అవాంతరం వచ్చి దాన్ని కదిలించి వేస్తుందో అనే అభద్రతాభావం నుంచే ఈర్ష్య పుడుతుంది.
అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిమీదైనా మనకు ఈర్ష్య ఇప్పటికే ఏర్పడిపోయిందేమో. మనలోకి మనమే తరచి చూసుకోవాలి. అలాంటిది ఉంటే శషభిషలు లేకుండా ఈర్ష్యకు లోనయ్యామనే విషయాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే దీనినుండి త్వరగా బయటపడేందుకు అవకాశం ఉంటుంది. ఈర్ష్య మనసులో ఏర్పడినప్పుడు మానసిక ప్రవర్తన విపరీత పోకడలు పోతూ ఉంటుంది. తమలోతామే కుమిలిపోతుంటారు. నిస్సహాయంగా ఉం టారు. కొంతమంది తమకు కలిగిన చిన్న అసౌకర్యానికి కూడా నెపం అవతలి వాళ్లపై నెట్టేస్తుంటారు.
ఈర్ష్య అసూయాలు మనకే కాదు దేవ దానవులకు కూడా ఉండేది అని మనం పురాణ ఇతిహాసాల ద్వారా తెలుసుకున్నాం. శ్రీనాథుడు రచించిన స్కాంద పురాణంలోని కాశీ ఖండంలోని వింధ్య పర్వతం విజృంభణను ఈ విధంగా వివరించాడు.
వింధ్య పర్వతం మేరు పర్వతాన్ని మించాలనే ఈర్ష్య అసూయలతో తన శక్తిసామర్థ్యాల గర్వంతో లింగాకారుడై శివుడు ఆకాశాన్ని అడ్డగించిన విధానాన్ని అనుకరిస్తూ బలి అనే రాక్షసున్ని ధ్వంసంచేయాలనే కాంక్షతో విష్ణువు ఆకాశాన్ని అడ్డగించిన విధంగా తన శిరస్సును బ్రహ్మాండ కర్పరం అంటేటట్లుగా సూర్యుని మార్గాన్ని అడ్డగించింది. ఆ విధంగా ఆకాశాన్నంటి వింధ్య పర్వతం నిట్టనిటారుగా నిల్చుండి ప్రాతఃకాలమందు తన అనుష్ఠాన సమయం అటుయిటు కాకుండా కర్మనిష్ఠుడైన బ్రాహ్మణుడు చూసినట్లుగా రెప్పవాల్చకుండా సూ ర్యోదయమైంది.
సూర్య రథానికున్న అశ్వాలు అతివేగంగా ఆకాశమార్గంలో పయనిస్తూ మధ్యభాగాన్ని చేరుకున్నాయి. సూర్యరథం సరిగ్గా ఆకాశ మధ్యకు చేరేసరికి ఒక పిడుగు పడని మోతతో బ్రహ్మాండ కటాహం బద్దలవుతున్నట్లు మిన్నంటి అడ్డగించి నిల్చున్న వింధ్య పర్వతం చరియలకు భగ్గుమని తాకింది. ఆ విధంగా వింధ్యం అడ్డు తగులగానే సూర్యుని రథం వేగం చెడి దోరగల్లు పడిపోయింది. సూర్యుని రథానికి ఒక చక్రమే ఉంటుంది. అవి ఒరిగిపోయి పడిపోయింది. సముద్రంలో పెద్ద అలలు తాకిన ఓడవలె సూర్యుడు నిలిచిపోయాడు. ఒక్క నిమిషం కూడా రాహువు పుక్కిలిలో చిక్కుకొనక తప్పుకుపోయేటటువంటి సూర్యుడు వింధ్య పర్వతం పక్కన పెక్కు సంవత్సరాలు చిక్కుపడి నిలిచిపోయాడు.
అతి వేగంగా వేల యోజనాలు అర్ధ నిమిష కాలంలో ప్రయాణం చేసే సూర్యుడు బహుకాలం ఆ విధంగా నిల్చుండిపోయాడు. సృష్టి స్థితి లయాలకు గతి సూర్యుడు. అటువంటి సూర్యుని గతికి ప్రతిబంధం కల్గడంతో మూడులోకాలకు విపత్తుల పరంపరలు పెరిగాయి. యజ్ఞ విధులేవి జరుగలేదు. ఎక్కడా స్వాహా స్వధాకార ధ్వనులు వినిపించలేదు. కాలపరిణామాలను లెక్కపెట్టలేక చిత్రగుప్తుడు మొదలైనవారు చిక్కుల్లో పడిపోయారు. సూర్యగతి ఆగిపోవడంతో ఇది సంధ్యాసమయం ఇది రాత్రి ఇది పగలు అనే సమయ ప్రమాణాలు తెలియకుండా పోయాయి. అదనుతో వర్షాలు పడక పంటలు లేకుండాపోయాయి. కొన్ని దేశాలు ఎండలో కొన్ని దేశాలు చలిలో బాధపడ్డాయి. కొన్ని దేశాలు చీకట్లతో గుడ్డివైపోయాయి.
సూర్యుని గతి నిలిచిపోవడంతో నక్షత్ర గమనం కూడా ఆగిపోయింది. పూచిన ఎర్ర గోరింట పూల పొదవలె కృత్తికా నక్షత్రం కదలకుండా ఉండిపోయింది. స్తంభంవలె రోహిణీ నక్షత్రం ఒక్కచోట నిరోధింపబడింది. చిక్కుపడిన ముత్యాల హారంవలె పునర్వసు నక్షత్రం ఒకచోట చెట్టు కొమ్మకు వేలాడబడింది. పత్తికాయ కోణంవలె శ్రవణ నక్షత్రం ఒకచోట శయనించింది. స్వాత నక్షత్రం రణ స్తంభాల జంటను అనుకరిస్తూ ఒకచోటనే ఒరిగివుంది. చిన్నబోయిన మూకుడు వలె విశాఖ నక్షత్రం ఒక్కచోట హత్తుకొని పోయింది. సూర్యుని గతి ఆగపోటంతో నక్షత్ర మండలమే కాదు జన సందోహం కూడా చిక్కులపాలయ్యింది. కన్నుల రెప్ప విప్పటానికి సాధ్యం కాలేదు. చెవులు శబ్దగ్రహణ శక్తిని కోల్పోయాయి. నాలుకకు రుచులను గ్రహించే శక్తి మందగించింది. మనస్సులో పెనుచీకటి అలముకొని పోయింది. పంచేంద్రియాలు ఈ విధంగా కాగా శరీరం చేష్టలుడిగిపోయింది. ప్రాణాలు శ్వాస మాత్రావశిష్టంగా నిలిచాయి. తల మీద వస్త్రం వుందో లేదో తెలియని స్థితి ఏర్పడింది. పాము కరచినప్పుడు పొందే మూర్చలాగా నిద్ర ఆవేశించి ఒడలు తెలియక పాశ్చత్య (పడమటి)దేశ ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు.
చింతా జ్వరం జ్వరం కంటే విలక్షణమైంది. జ్వరమైతే శరీరానికి సంబంధించింది. కాని చింతా జ్వరం మనస్సునకు సంబంధించింది. మొదటిది వ్యాధి ఇది ఆది. వ్యాధికి మందులుంటాయి. కాని ఆధికి మందులు లేవు. మనోవ్యాధికి మందు లేదని లోకంలో అంటారు. చింతా జ్వరం లంకణాలవల్ల నయమయ్యేది కాదు. చింతా జ్వరం బుద్ధిని నిద్రను ఉత్సాహాన్ని ఆకలిని ఆకారాన్ని తేజస్సును బలాన్ని క్రమక్రమంగా క్షీణింపజేస్తంది. అశ్వినీ దేవతల వంటి దేవతా వైద్యులు గాని చరక మహర్షిగాని ధన్వంతరి వంటి మహావైద్యుడు గాని దీన్ని పోగొట్టలేరు. ఎవరూ చికిత్స చేయలేని ఎవరికీ నయం చేయటానికి సాధ్యంకాని చింతా జ్వరం ఈ విధంగా పట్టి పీడిస్తుంది.
ఈర్ష్య, అసూయ, క్రోధం వల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో వాటివల్ల ఎంతటి విఘాతాలు జరుగుతాయో విధితవౌతుంది. కావున ఈర్ష్య అసూయలకు దూరంగా ఉండాలని అందువలన, కలిగే ప్రయోజనాలు ఎంతో ఉపకరంగా ఉంటాయని తెయవస్తుంది. బలవంతంగా అవతల వారి నుంచి ఏదీ లాక్కోలేమనే విషయాన్ని గ్రహించాలి. ఈ గ్రహింపు మనిషికి చాలా అవసరం. ప్రపంచంలో ఎవరూ ఎవరి ఆధీనంలోనూ ఉండరని గ్రహించాలి. భార్యభర్తలైనా సరే ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుందని ముందుగా గుర్తించాలి. ప్రేమించే వాళ్లనుంచి ఇంకా రెట్టింపు ప్రేమను గౌరవాన్ని పొందగలగాలంటే మనం ఈర్ష్యను జయించాలి. ఇదొక్కటే పరిష్కారం.

-ఉషశ్రీ తాల్క