బాల భూమి

ఎవరు సోమరి? ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహపురిని పరిపాలించే విక్రమసేన మహారాజుకి ఒక వింత ఆలోచన మనసులో తట్టింది. తన రాజ్యంలో అత్యంత సోమరియైన వ్యక్తిని తెలుసుకొని అతనికి జీవితాంతం సరిపోయే కానుకలిచ్చి సత్కరించాలని అనుకొన్నాడు. అనుకొన్నదే తడవుగా మంత్రి సుబుద్ధిని పిలిచి మనసులో తనకు తట్టిన ఆలోచనను చెప్పాడు.
మంత్రి సుబుద్ధికి విక్రమసేన మహారాజుగారి మూర్ఖపు ఆలోచన తన మనసుకు చాలా బాధ కలిగించింది. కానీ అతనికి ఎదురుచెప్పే ధైర్యం లేక ప్రభువుల ఆలోచన తీర్చడం తన కర్తవ్యం అనుకొంటూ రాజ్యంలోనున్న అత్యంత సోమరికి విక్రమసేన మహారాజుగారిచ్చే కానుకల గురించి దండోరా వేయించాడు.
అంతే! మంత్రి సుబుద్ధి దండోరా వేయించడమే తరువాయి రాజుగారి ముంగిట ఎంతోమంది వరుస కట్టారు. వారి నందరినీ చూస్తూన్న విక్రమసేన మహారాజుకి తన రాజ్యంలో ఇంతమంది సోమరులున్నారా అనిపించింది. మరి తను ప్రకటించిన కానుకలను అందుకోవడానికి అర్హుడెవరో గుర్తించమని మంత్రి సుబుద్ధికి అప్పజెప్పారు.
అందుకు మంత్రి సుబుద్ధి ‘మహారాజా! ఇక్కడ మీ ముందు వరుస కట్టిన వారందరూ సోమరులని నేననలేను. ఎందుకంటే ఇంతమంది సోమరులే మన రాజ్యంలో ఉంటే మన రాజ్యం ఎందుకు సుభిక్షంగా ఉంటుంది. అత్యంత సోమరికి మీరిస్తామన్న కానుకలకు ఆశపడి తమకు అదృష్టం వరిస్తుందేమోనని వీరంతా వచ్చారు. అయినా వీరిలో అత్యంత సోమరి ఎవరో మీరే గుర్తించి వాడిని కానుకలతో సత్కరించండి’ అని అకడ నుండి వెళ్లిపోయాడు.
మంత్రి సుబుద్ధి సలహా ప్రకారం విక్రమసేన మహారాజు గారు సోమరులని వచ్చిన వాళ్లను ఒక్కొక్కరిని పరీక్షించడం ప్రారంభించారు. వాళ్లిచ్చే సమాధానాలు ఏ ఒక్కటీ అతన్ని సంతృప్తిపరచలేదు. వీళ్లెవరూ కూడా అసలైన సోమరులు కాదని నిర్ణయించుకొన్నారు. చివరిగా ఒక వ్యక్తి మిగిలాడు. అతన్ని కూడా పరీక్షించాలని పిలిచారు మహారాజుగారు. వాడు రాజుగారి దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడలేదు. పైగా వాడి చేతిలో బంగారు నాణేల సంచొకటి ఉంది. ఆ సంచిని రాజుగారికి చూపిస్తూ ‘మహారాజా! ఇవి నా కష్టార్జితం. రాజ్యంలో అత్యంత సోమరికి ఈ నాణేలను ఇవ్వాలని నేను ఏనాటి నుంచో అనుకొంటున్నాను. రాజ్యంలో అత్యంత సోమరికి కానుకలిస్తామని మీరు దండోరా వేయించినప్పుడు నా కోరిక తీరబోతోందని సంతోషించి ఇక్కడకు వచ్చాను. అత్యంత సోమరి రాజ్యంలో మీరే?’
ఆ వ్యక్తి అంటున్న మాటలకు విక్రమసేన మహారాజు గారికి కోపం రాలేదు. పైగా తను ఏ విధంగా అత్యంత సోమరో నిరూపించమన్నాడు.
అందుకు సమాధానంగా ఆ వ్యక్తి ‘మన్నించండి మహారాజా! రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్న మీలాంటి ధర్మ ప్రభువులకి సోమరులన్న ఆలోచనే రాకూడదు. కానీ మీకా ఆలోచన వచ్చిందంటే రాజ్య పరిపాలన మీద శ్రద్ధ పోతున్నట్లే లెక్క. రాజ్య పాలన మీద శ్రద్ధ ఎప్పుడు పోయిందో మంచి సలహానిచ్చే మంత్రిగారి మీద గౌరవం పోయినట్టే! అందుకే మీరే అసలైన సోమరి. అదుకే నేను కష్టపడి సంపాదించిన ఈ బంగారు నాణేలు మీకే దక్కుతాయి. స్వీకరించండి ప్రభూ!’ అన్నాడు.
ఆ వ్యక్తి మాటలు విక్రమసేన మహారాజుకి చెంప ఛెళ్లుమన్పించాయి. రాజు ఇక ఏనాడూ ఇటువంటి ఆలోచనలను మనసులోకి రానివ్వలేదు.
మంచి సలహాలనిచ్చే మంత్రి సుబుద్ధి కోసం వెతికాడు. కానీ మంత్రి ఎక్కడా కన్పించలేదు. తనకు కనువిప్పు కలిగించే సోమరిలా వచ్చినవాడు మంత్రి సుబుద్ధని కనిపెట్టలేక పోయాడు మహారాజు.

-బెలగాం కేశవరావు 99893 68430