బాల భూమి

అసలు విషయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ రోజంతా రాము చాలా దిగులుగా ఉండటం గమనించారు వాళ్ల తాతయ్య. దిగులెందుకని అతను రెండు మూడు సార్లు అడిగినా ఏం జవాబు చెప్పలేదు రాము. అసలు ఓ పదిరోజులైంది రాము అలా దిగులుగా ఉండి. ఎప్పుడూ గలగల మాట్లాడే రాము అలా విచారంగా మొహం పెట్టి వౌనంగా చదువుకోవడం నచ్చలేదు తాతయ్యకి. ఈరోజు ఎలాగైనా రాము నుండి అసలు విషయం తెలుసుకోవాలి అనుకున్నారాయన. నిరాశక్తంగా బడికి బయలుదేరిన రాము వైపే చూస్తూ ఆలోచనలో పడిపోయారు ఆయన.
అప్పుడే ట్యూషన్ నుండి వచ్చిన రాము తమ్ముడు శ్యాము కూడా రాము వెంట బడికి బయలుదేరాడు. రాము, శ్యామూ ఇద్దరూ అన్నదమ్ములు. పెద్దవాడు రాము ఐదవ తరగతి చదువుతూంటే, చిన్నవాడు శ్యాము నాల్గవ తరగతిలో అదే బడిలో చదువుతున్నాడు.
సాయంకాలం బడి వదిలాక తిరిగి వచ్చిన తర్వాత కొద్దిసేపు ఆడుకున్నాక శ్యాముని వాళ్ల నాన్న సైకిల్ మీద ట్యూషన్‌కి తీసుకెళ్తే రాము ఒంటరిగా ఇంట్లో కూర్చుని బుద్ధిగా పుస్తకాలు ముందేసుకొని హోంవర్క్ చేసుకోసాగాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన తాతయ్య రాము తల నిమిరి వాడి చేతుల్లోంచి పుస్తకం తీసుకొని ఓ పాఠం చదివించి ప్రశ్నలడగసాగారు. రాము అన్నింటికి సరైన సమాధానాలు చెప్పడంతో తాతయ్య వాణ్ని మెచ్చుకొని, ‘‘శభాష్! అన్నింటికి సరైన జవాబులు చెప్పావు. ఈసారి నువ్వే మీ తరగతిలో అందరి కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటావు’’ అన్నాడు సంతోషంగా.
తాతయ్య అలా పొగుడుతుంటే చాలా సంతోషించాడు రాము. అయితే అంతలోనే వాడి మొహం వాడిపోవటం గమనించిన తాతయ్య ‘‘ఏమిటి రాము!... నిన్ను కొద్ది రోజులుగా నేను గమనిస్తున్నాను. ఈమధ్య ఎందుకో చాలా దిగులుగా ఉన్నావు. ఏమైంది? మీ బడిలో నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా? లేక మీ మాస్టర్లు నిన్ను గానీ ఏమైనా అన్నారా? లేక అమ్మా, నాన్న గానీ ఏమైనా అన్నారా? చెప్పు!’’ అనడిగారు తాతయ్య లాలనగా.
తాతయ్య ఇలా అడిగేసరికి రాము కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి. వాణ్ని సముదాయించి ఆఖరికి అసలు విషయం రాబట్టారు తాతయ్య. రాము మనస్తాపానికి కారణం ఏమిటంటే తను పెద్దవాడైనా తనని తండ్రి ట్యూషన్‌కి పంపకుండా తమ్ముడు శ్యాముని మాత్రమే ట్యూషన్‌కి పంపించడం. విషయం గ్రహించిన తాతయ్య బిత్తరపోయారు. అతను రాము తల నిమిరి ఇలా చెప్పారు. ‘‘చూడు రామూ!... నువ్వు బుద్ధిమంతుడివి. అంతేకాకుండా నువ్వు కష్టపడి చదువుతావు. పైగా తెలివైన వాడివి. బడిలో మాస్టర్ల మాట, ఇంట్లో తల్లితండ్రులు మాటా వింటావు. అందుకే నీ గురించి మీ నాన్నకి గానీ, మీ అమ్మకి గానీ ఎలాంటి బెంగా లేదు. నీ చదువు మీద అసలు బెంగలేదు. కాకపోతే, శ్యాము అలా కాదు. వాడూ తెలివైన వాడే అయినా ఇంట్లో అసలు చదవడు. పైగా అల్లరి బాగా నేర్చాడు. చదువు మీద కన్నా ఆటపాటల మీద ఎప్పుడూ వాడి శ్రద్ధ, ధ్యాస. ఆటపాటలు కావాలి గానీ, అవి హద్దులలోనే ఉండాలి. కానీ వాడలా కాదు. ఎప్పుడూ ఏదో తగువు ఇంటిమీదకు తెచ్చి అమ్మానాన్నలకి తలనొప్పి తెప్పిస్తుంటాడు. అందుకే వాణ్ని హద్దుల్లో ఉంచాలనీ ఉదయం, సాయంకాలం మీ నాన్న ట్యూషన్‌లో చేర్పించాడు. వాడికి ఆ వ్యాపకంలో పెట్టమని నేనే మీ నాన్నకి చెప్పాను. అంతేకానీ నీ మీద మీ నాన్నకి అశ్రద్ధ ఎంతమాత్రమూ కాదు. నీ మీద ఎలాంటి ద్వేషం కానీ, కోపం గానీ లేవు. ఇప్పటికైనా తెలిసిందా?’’
తాతయ్య మాటలు విన్న రాము ఆలోచనలో పడ్డాడు. అల్లరివాడైన తమ్ముడ్ని సరైన దారిలో పెట్టడానికి తండ్రి వాణ్ని ట్యూషన్‌కి పంపిస్తున్నారన్న మాట. ఆ అవసరం తనకి లేదు కదా మనసులో అనుకున్నాడు రాము.
వాడి ముఖంలోకి కళ తిరిగి రావడం చూసిన తాతయ్య, ‘‘చూడు రామూ! మన పొలంలోనే ఏదైనా పైరుకి చీడ సోకిందంటే వాటికి క్రిమినాశక మందులు వాడతాం. అయితే ఒకవేళ అదే పైరుకి పురుగు గానీ, చీడ గానీ పట్టలేదంటే మందులు వాడతామా! నువ్వే చెప్పు?’’ అని వివరించేసరికి రాముకి పూర్తిగా అర్థమైంది.
ఆ తర్వాత రాము కూడా తన వంతు బాధ్యత తీసుకొని తమ్ముడు మంచి మార్గంలో నడవడానికి, బాగా చదవడానికి సహాయపడ్డాడు. ఆ ఏడాది రాములాగే శ్యాము కూడా బాగా చదివి తన తరగతిలో మొదటివాడిగా వచ్చాడు. అప్పుడు తాతయ్య శ్యాముని, వాణ్ని సరైన దారిలో పెట్టినందుకు రాముని కూడా అభినందించారు. వాళ్ల అమ్మా, నాన్నా కూడా ఇద్దర్నీ మెచ్చుకున్నారు.

-పద్మావతి దివాకర్ల