డైలీ సీరియల్

బంగారుకల - 44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలరాయలు మరణవార్తతో విజయనగర సామ్రాజ్యం శోకసంద్రంలో మునిగిపోయింది. కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకున్నప్పటికీ, చికిత్స జరుగుతుండగానే యువరాజు రాజమందిరంలోనే జబ్బుపడి మరణించటం కృష్ణరాయల్ని అమితంగా కుంగదీసింది. తిమ్మరుసు మొదలు నరికిన అరటిచెట్టులా కూలబడిపోయాడు. అన్నపూర్ణాదేవి దుఃఖానికి అంతేలేదు.
‘‘నేను మొదట్నుంచీ అనుమానిస్తూనే వున్నా’’ వీరేంద్రుడు సమయం చూసి మరో పాచిక విసిరాడు.
శోకసముద్రంలో మునిగివున్న కృష్ణదేవరాయ దంపతులు ఏమిటన్నట్లు తలెత్తి చూశారు.
‘‘జగన్నాథ! ఇదంతా ఆ తిమ్మరుసు మంత్రి కుట్రే. అవును! మన యువరాజుకు పట్ట్భాషేకం చేయటం ఆయనకు సుతరామూ ఇష్టం లేదు. కానీ మెప్పుకోసం పైకి ఒప్పుకున్నట్లు నటించాడు. ఆపై ఆటంకం తొలగించుకోవటానికి ఇలా పసివాడని కూడా చూడకుండా రాజవైద్యులని లోబరచుకుని విషప్రయోగం చేయించాడు’’ తీవ్రంగా ఆరోపించాడు వీరేంద్రుడు.
‘‘ఎవరక్కడ?’’ కృష్ణరాయని కళ్ళు అగ్నికణికల్లా వున్నాయి.
‘‘రాజవైద్యుల్ని తక్షణం ప్రవేశపెట్టండి’’ నిప్పు కురుస్తున్నదా స్వరంలో.
రాజాజ్ఞ ప్రకారం రాజవైద్యులు వచ్చారు. వారు నివేదించిన ప్రకారం యువరాజు మరణం విషప్రయోగంవల్లనే జరిగిందని నిర్థారణ అయింది.
కృష్ణరాయని కోపానికి అంతులేదు. కోపంలో మనిషికి యుక్తాయుక్త విచక్షణాజ్ఞానం నశిస్తుంది. అదే జరిగింది.
‘‘సాళ్వ తిమ్మరుసు మంత్రిని బంధించండి’’ కృష్ణరాయని శోకతప్త హృదయం చీకట్లో కూరుకుపోయింది. విజయనగర జ్యోతిని చెరసాలలో బంధించి ఆర్పేసే ప్రయత్నం బలంగా ప్రారంభమయింది.
అన్నపూర్ణాదేవికేం పాలుపోవడంలేదు. వీరేంద్రుడెన్ని విధాలా చెప్పినా తమ కుమారుని మరణానికి తిమ్మరుసు కారకుడంటే ఆమె అంగీకరించలేకపోతున్నది.
తిరుమలాంబతో మొరపెట్టుకుంది. పట్టపురాణి కూడా రాయలవారికి ఎంతో చెప్పిచూసింది. కాల్చి ఎర్రబడిన ఇనుముమీద సమ్మెట దెబ్బల్లా పుత్రశోకంతో అడలుతున్న రాయల హృదయంపై వీరేంద్రుని మాటల ప్రభావం తీవ్రస్థాయిలో వుంది. ఎవరేం చెప్పినా వినే స్థితిలో రాయలు లేరు. పుత్రశోకంతోబాటు విజయనగర సామ్రాజ్య రక్షకుడు తిమ్మరుసుకు వాటిల్లిన ఆపద గురించి అన్నపూర్ణాదేవి పలు విధాల విలపించింది.
ఆమే కాదు, యావత్ సామ్రాజ్య ప్రజలు కంటతడి పెట్టారు. రాజరికంలో అనుగ్రహ ఆగ్రహాలు ఎంత తీవ్రంగా వుంటాయో అనుభవంలో చూస్తున్నారంతా. మంజరి, చంద్రప్పలతో సహా, రాజప్రముఖులంతా తిమ్మరుసును రక్షించే మార్గాల కోసం అనే్వషిస్తున్నారు.
***
శ్రీకృష్ణదేవరాయలు కొలువుతీరారు. కానీ అది మునుపటిలా రసవంతంగా లేదు. విషాద నిర్వేదంగా కఠిన శిలలు ఆసీనులై వంచనా వేదికగా ఉంది. రాయలకత్యంత సమీపంలో ఆసీనుడైన వీరేంద్రుని చూసి అంతా కోపంతో ఊగిపోతున్నారు. పైకి ఏమీ అనలేకున్నా అందరికీ తెలుసు, ఈ కుట్రలో ప్రధాన పాత్రధారి వీరేంద్రుడేనని.
తిమ్మరుసు మంత్రి ఇప్పుడు మంత్రి కాదు. ఆయన్ని బందీగా సభకు తీసుకొచ్చారు. సభ యావత్తూ తిమ్మరుసునా స్థితిలో చూసి విచారంతో తల దించుకుంది. తిమ్మరుసు రాయలు తనను శంకిస్తున్నాడన్న నిజాన్ని జీర్ణించుకోలేని వేదనతో కుంగిపోతూ కన్పిస్తున్నారు. కృష్ణరాయలు తిమ్మరుసు నేరాన్ని విచారించమని న్యాయపరిషత్తును ఆదేశించారు.
ప్రధాన న్యాయాధికారి రాజాజ్ఞను శిరసావహిస్తూ తిమ్మరుసు మంత్రి పట్ల గౌరవాభిమానాలను బయటికి కన్పరచకుండా కఠినత్వాన్ని కప్పుకుంటూ విచారణ చేశాడు.
‘‘మీ పేరు’’
‘‘సాళ్వ తిమ్మరుసు’’
‘‘శ్రీశ్రీశ్రీ మహారాజుగారి కుమారుడు తిరుమల రాయలకు విషప్రయోగం చేయించి చంపించారని మీమీద అభియోగం. దీనికి మీ సమాధానం?’’
తిమ్మరుసు నిర్వేదం నిండిన కళ్ళతో కృష్ణరాయలకేసి ఓసారి చూశారు. శ్రీకృష్ణదేవరాయలు అధోవదనుడై ఉన్నారు. దేవేరులంతా ఖిన్నులై ఉన్నారు. తాను జీవితమంతా శ్రమించి నిర్మించిన విజయనగర మహాసామ్రాజ్య సభా పరిషత్తును పరికించారు. చీమ చిటుకుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. తిమ్మరుసుల వారేం చెప్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు.
‘‘నాపై మోపబడిన అభియోగాన్ని ప్రభువు విశ్వసిస్తే నేను చెప్పవలసినదేమీ లేదు’’.
తిమ్మరుసు గొంతులో రాయలపైన ప్రేమాభిమానాలు చెక్కుచెదరలేదు. రాయలు తలెత్తి తిమ్మరుసుకేసి ఓసారి చూసి వుంటే విజయనగర సామ్రాజ్య భవిష్యత్తు మరోలా ఉండేది.
‘‘రాజవైద్యులను ప్రవేశపెట్టండి’’ న్యాయాధికారి ఆజ్ఞతో రాజవైద్యులు వచ్చారు. గడ గడ వణుకుతున్నారు. వీరేంద్రుని వైపు చూశారు, అతని బెదిరింపు కనుసైగతోనే!
‘‘ఏమీ భయం లేదు. జరిగింది చెప్పండి. ఈ సాళువ తిమ్మరుసు రాకుమారునికి విష ప్రయోగం చేయమని మీకు చెప్పాడా?’’ ప్రధాన న్యాయాధికారి ప్రశ్న.
‘‘అవును. వైద్యం పేరిట రాకుమారునికి విషప్రయోగం చేయమన్నారు’’.
‘‘ఎవరు?’’ గద్దించాడు న్యాయాధికారి.
‘‘మ.. మ.. మహామంత్రిగారే!’’ తిమ్మరుసు వైపు చూపించారు.
సభయావత్తూ శిలలా అయిపోయింది. తిమ్మరుసు మ్రాన్పడిపోయాడు. వీరేంద్రుడు పైకి ఆశ్చర్యం నటిస్తున్నా లోలోపల ఎంతో సంతోషిస్తున్నాడు.
అన్నపూర్ణాదేవి స్పృహ తప్పి పడిపోయింది.
- ఇంకా ఉంది

-చిల్లర భవానీదేవి