ప్రకాశం

దీక్ష విరమించిన డిసిసి బ్యాంకు చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు మంగళవారం డిసిసి బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్ ఆమరణ దీక్షను విరమించారు. రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ (ఆర్‌సిఎస్) శేషగిరిబాబు, పిడిసిసి బ్యాంకు డిసిఓ వెంకటస్వామిల చర్యలను నిరసిస్తూ చైర్మన్ మోహన్ స్థానిక పిడిసిసి బ్యాంకు కార్యాలయం ఎదుట ఆమరణ దీక్ష చేపట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈదర మోహన్ ఆమరణ దీక్ష చేస్తున్న విషయాన్ని సోమవారం విజయవాడలో జరిగిన పార్టీ లెజిస్లేటీవ్ సమావేశంలో మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు పలువురు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకపోగా స్పందించిన సిఎం చంద్రబాబు అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఏదైనా విషయం ఉంటే త్వరలో మీరు ఆర్‌సిఎస్‌తో సమావేశమై పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఆమేరకు వెంటనే ఈదర మోహన్ నిరాహార దీక్ష విరమించే విధంగా చూడాలని మంత్రి శిద్దా రాఘవరావు తోపాటు పలువురు నాయకులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మంగళవారం ఒంగోలులోని పిడిసిసి కార్యాయం వద్ద చైర్మన్ మోహన్ చేపట్టిన దీక్ష వద్దకు వచ్చి మంత్రి శిద్దా రాఘవరావుతో ఫోన్‌లో మాట్లాడించారు. ఆమేరకు మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ సిఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లామని, త్వరలో ఆర్‌సిఎస్ తదితర అధికారులతో పాలక వర్గం సమావేశమై సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారని, ఏదైనా సమస్య ఉంటే తాను కలుగజేసుకొని పరిష్కస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, తక్షణమే ఆమరణ దీక్షను విరమించాలని మోహన్‌కు మంత్రి శిద్దా రాఘవరావు సూచించారు. దీంతో మోహన్ దీక్ష విరమించారు.

క్రీస్తు మార్గం అందరికీ అనుసరణీయం
* డిఆర్‌డిఏ పిడి మురళి పిలుపు
ఒంగోలు , డిసెంబర్ 22: ఏసుక్రీస్తు చూపిన సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక భాగ్యనగర్‌లోని డిఆర్‌డిఎ, వెలుగు శిక్షణా కేంద్రంలో డిఆర్‌డిఏ, వెలుగు సిబ్బంది సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా అభివృద్ధి కోసం ఎన్నో ప్రభుత్వ పథకాలు డిఆర్‌డిఎ సంస్థ ద్వారా అమలు చేయడం జరుగుతుందన్నారు. డిఆర్‌డిఏ , వెలుగు సంస్థ మీద నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారన్నారు. డిఆర్‌డిఏ, వెలుగు సంస్థ ద్వారా నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించడానికి ఎన్నో అకవకాశాలు ఉన్నాయన్నారు. ఈ సంస్థ ద్వారా అమలు జరుగుతున్న పధకాలను సమర్థవంతంగా ప్రజలకు చేరువ చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎంఎస్ మురళి , జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నిర్మల , డిఆర్‌డిఏ, అడిషినల్ ప్రాజెక్టు డైరెక్టర్స్ టి రవికుమార్, రాజేంద్రన్, డిఆర్‌డిఏ, వెలుగు సంస్థ అసోసియేషన్ సభ్యులు, సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొని క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. ఈకార్యక్రమంలో డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ సతీమణి అరుణ, మహిళా సమాఖ్య సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

లాడ్జిలో పోలీసుల సోదాలు
* 4 జంటల అరెస్టు
చీరాల, డిసెంబర్ 22: స్థానిక స్టేషన్ రోడ్డులోని ఓ లాడ్జిపై వన్‌టౌన్ పోలీసులు మంగళవారం దాడి చేసి సోదాలు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పైన తెలిపిన లాడ్జిలో వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం మేరకు అందులో సోదాలు జరిపారు. లాడ్జి గదుల్లో ఉన్న నలుగురు వ్యక్తులతో పాటు మరో నలుగురు మహిళలను వారు అదుపులోకి తీసుకున్నారు. వారు గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వారిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం
* మాజీఎమ్మెల్యే అన్నా రాంబాబు
కంభం, డిసెంబర్ 22 : రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని గిద్దలూరు టిడిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్‌కోట, లింగోజిపల్లి, ఔరంగబాద్, రావిపాడు, కందులాపురం, సైదాపురం, జంగంగుంట్ల గ్రామాల్లో జనచైతన్య యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రవేశపెడుతున్నారని, అవి అర్హులకు అందేలా కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని కోరారు. వృద్ధులకు ఇస్తున్న సామాజిక పింఛన్ ఐదురెట్లు పెంచి వారి మన్ననలు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ ఎన్ చెన్నారెడ్డి, మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఎంపిపి కొత్తపల్లి జ్యోతి, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
మార్కాపురం, డిసెంబర్ 22 : స్థానిక ఎవన్‌గ్లోబల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న పి యశ్వంత్‌చౌదరి (20) మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఉదయం కాలేజీకి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా స్థానిక మార్కెట్‌యార్డు వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో యశ్వంత్‌చౌదరి మృతి చెందాడు. ఈ విద్యార్థి చిత్తూరు జిల్లాకు చెందిన వాడు. అయితే యువకుడిని ఢీకొన్న కారు తప్పించుకునే ప్రయత్నం చేయగా పట్టణ పోలీసులు వివిధ పోలీసుస్టేషన్లకు సమాచారం అందించి కారును స్వాధీనం చేసుకొని మార్కాపురం పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ రహదారి సర్వేపై రైతుల అభ్యంతరం
వేటపాలెం, డిసెంబర్ 22: ఒంగోలు నుంచి విజయనగరం జిల్లా కత్తిపూడి వరకు నిర్మించ తలపెట్టిన జాతీయ రహదారి భూ సేకరణ సర్వే అధికారుల వద్ద స్థానిక రైతులు తమ నిరసన వెలిబుచ్చారు. 216 జాతీయ రహదారిని నాలుగు లైన్ల రహదారిగా విస్తరించేందుకు ప్రభుత్వం పూనుకుంది. దీనికి సంబంధించిన భూ సర్వేను మంగళవారం రైతులు అడ్డుకున్నారు. అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వేటపాలెం స్ట్రయిట్ కట్ నుంచి కడవకుదురు వరకు మలుపులు లేని విధంగా రహదారి విస్తరణ చేపట్టాలని అధికారులను కోరారు.

సమావేశాల తీరుపై నేతల పెదవి విరుపు
* సీనియర్ మాజీ శాసనసభ్యుని ఆవేదన
మార్కాపురం, డిసెంబర్ 22 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన అసెంబ్లీ సమావేశాల్లో వాగ్వివాదాలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ముగిసిపోవడంతో నేతల తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సీనియర్ మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై స్పందిస్తూ తాము నాలుగుపర్యాయాలు శాసనసభ్యునిగా ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ దాపురించలేదన్నారు. ఒకరికొకరు పరస్పర గౌరవమర్యాదలతో మెలిగేవారమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై చర్చ జరగడంలో తప్పులేదని, జరిగిన చర్చ కూడా కేవలం ఒక గంట మాత్రమే ఉండి ప్రజాసమస్యల ప్రస్తావన సమావేశం దృష్టికి రావాలని అన్నారు. ఎంతో విలువైన సమావేశాన్ని వాగ్వివాదాలతో, ప్రత్యారోపణలతో ముగియడం సాంప్రదాయం కాదన్నారు. గతంలో ఏదైనా సమస్యపై వాకౌట్‌చేసినా ఒకటి రెండు పర్యాయాలకే పరిమితం అవుతుండేదని, ప్రస్తుతం రోజుల పర్యంతం వాకౌట్‌చేస్తూ సమావేశాల తీరును మార్చివేస్తున్నారని అన్నారు. శాసనసభలో స్పీకర్ సుప్రీం అని, ఆయన ఏది చెబితే అదే శాసనమని, అయితే ప్రభుత్వం ప్రవేశపెడితే దానిని అమలు చేయాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంటుందని, అలాగే తీర్మానానికి మెజారిటీ సభ్యుల ఆమోదం ఉండాలని అన్నారు. రాష్ట్ర విభజన తరువాత నెలకొన్న పరిస్థితుల కారణంగా అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని, వాటినన్నింటిని పక్కనపెట్టి కేవలం కాల్‌మనీపై దుమారం రేపుకోవడం, సభను జరగకుండా అడ్డుకోవడం సరైనచర్య కాదన్నారు. కాల్‌మనీ వ్యవహారం ఈనాటిది కాదని, వాటిని అంత సీరియస్‌గా తీసుకొని రోజుల తరబడి వాగ్వివాదాలు, ప్రత్యారోపణలు చేసుకోవడం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంలో ఆ సీనియర్‌నేత టిడిపిలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నించగా తనపై ఒత్తిడి ఉన్నమాట వాస్తవమేనని, ప్రస్తుతం తానేమి నిర్ణయం తీసుకోలేదని చిరునవ్వుతో సమాధానం చెప్పారు.