భగత్‌సింగ్

నౌజవాన్ భారత్ సభ ( భగత్‌సింగ్- 16)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-ఎం.వి.ఆర్. శాస్త్రి
21 ఫిబ్రవరి 2016
---------------------
భగత్‌సింగ్ హింసావాది. కాల్చి చంపటం, బాంబులేయడమే తప్ప ఉద్యమాన్ని నిర్మించి, ప్రజలను కూడగట్టి, ప్రజాస్వామిక పద్ధతిలో దీర్ఘకాలం పోరాడటం అతడి పద్ధతి కాదు. గాంధీ మహాత్ముడి సారథ్యంలో కాంగ్రెసు మహా సంస్థలాగా శాంతి, అహింసల పట్టాలపై ప్రజా ఉద్యమాన్ని నడపటం అతడి విప్లవ తత్వానికి సరిపడదు.
-అని అనుకునేవాళ్లు భగత్‌సింగ్‌ను అభిమానించి, ఆరాధించే వారిలోనూ ఎందరో ఉన్నారు. అది వాస్తవం కాదు; తెలియనితనం. ప్రజల మధ్య ఉండి, వారిని చైతన్యపరచి, నిర్మాణాత్మకంగా రాజకీయ కార్యకలాపాలు సాగించటం భగత్‌సింగ్‌కి చేతకానిది కాదు. నిజానికి ఆ రంగంలో అతడు చూపినది అద్భుత ప్రతిభ.
నౌజవాన్ భారత్ సభే అందుకు చక్కని ఉదాహరణ.
భగత్‌సింగ్ జీవించిందే కొద్దికాలం. అందులోనే అతడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఒకే సమయాన వివిధ రంగాల్లో బహుముఖ పోరాటాలు సాగించాడు. వాటిలోకెల్లా మకుటాయమానమనదగ్గది నౌజవాన్ సభ. ప్రజల మనసుల్లో ముద్ర పడిందీ... భగత్‌సింగ్‌ని తలచుకుంటే అందరికీ గుర్తొచ్చేదీ ఒక హత్య, ఒక బాంబుపేలుడు. వాటికి ముందు నౌజవాన్ సభను స్థాపించి అతడు చేసిన మహత్తర రాజకీయ కృషి చాలామందికి తెలియదు.
తెలియకపోవడానికీ ఒక కారణం ఉంది. భగత్‌సింగ్ కార్యవాది. కారణజన్ముడు. ఉన్న అతితక్కువ వ్యవధిలో అనుకున్నది ఏకదీక్షగా చేస్తూపోవడమే తప్ప తన ప్రయోజకత్వాన్ని ప్రచారం చేసుకోవాలని అతడు ఎప్పుడూ తలచలేదు. ప్రతిదీ వెయ్యి కళ్లతో కనిపెట్టే తెల్లవాళ్ల నిఘాలో పని చేయవలసి రావటంవల్ల ఎవరి పాత్ర ఎంతన్నది గోప్యంగా ఉండటమే క్షేమం. కాబట్టి భగత్ జీవితకాలంలో అతడి గురించి వివరాలు సహజంగానే వెలికిరాలేదు. బాంబు పేలుడుకు ముందు భగత్‌సింగ్ పేరే దేశానికి తెలియదు.
ధీరోదాత్తంగా ఉరికంబమెక్కి జాతి జనులకు ఆరాధ్యుడయ్యాక భగత్‌కి విపరీతమైన పాప్యులారిటీ వచ్చింది. ఆ కీర్తి ధగధగలో తాము సైతం వెలిగిపోవాలని చాలామందికి బుద్ధి పుట్టింది. భగత్‌సింగ్‌తో పరిచయం ఉన్నవాళ్లు, కలిసి పనిచేసిన వాళ్లు, బాదరాయణ సంబంధం లాంటిదేదో ఉన్నవాళ్లు తమ ప్రాముఖ్యాన్ని పెంచుకుంటూ అతడి గురించి అడిగినవారికల్లా చెప్పడంవల్ల ఎవరు చెప్పేది నిజమో పోల్చుకోవటం కష్టమైంది. ఆ కాలాన జరిగిన విషయాలను కొన్ని దశాబ్దాల తరవాత గుర్తు చేసుకునే సందర్భంలో సంవత్సరాలు, తేదీలు, ఘటనల ముందు వెనుకల గురించి తలా ఒకరకంగా చెప్పడమూ అయింది. పర్యవసానంగా భగత్ జీవితంలో ముఖ్య ఘట్టాలకు సంబంధించి ఏదీ ఇదమిత్థంగా తేల్చలేని పరిస్థితి.
భగత్‌సింగ్ పుట్టిన తేదీలాగే నౌజవాన్ భారత్ సభ ఎప్పుడు పుట్టిందన్నదీ సందిగ్ధమే. 1924 నుంచి 1926 వరకూ చరిత్రకారులు రకరకాల తేదీలు పేర్కొంటారు. దాన్ని స్థాపించిందెవరు, ‘నౌజవాన్ సభ’ పేరు ఎవరు పెట్టారు, తొలి అధ్యక్షుడెవరు అన్నదీ అంతే. ఆ కాలపు సిఐడి రిపోర్టుల్లో, అనంతరకాలపు గ్రంథాల్లో, ఇతర రచనల్లో పేర్కొన్న అంశాలను హేతుబద్ధంగా పరిశీలిస్తే స్థూలంగా కొన్ని విషయాలు తేటపడతాయ.
డాక్టర్ సత్యపాలో, రామచంద్రో మరొకరో చొరవ తీసుకుని నౌజవాన్ భారత్ సభను పెట్టించారని ఎవరు ఏమి చెప్పినా ఆ సభకు మూలస్తంభం భగత్‌సింగ్. The Sabha owes its existence to Bhagat Singh అని అఫ్పటి హోం డిపార్టుమెంటు 130 నెంబరు ఫైలులో సిఐడి రిపోర్టు చేసిన దానిని బట్టి నౌజవాన్ సభ ఆవిర్భావానికి కారకుడు భగత్‌సింగ్.
దానికీ ఒక చారిత్రక నేపథ్యం ఉంది.
1925 ఆగస్టులో కాకోరీ వద్ద రైలుదోపిడీ తరవాత మూకుమ్మడి అరెస్టులతో విప్లవోద్యమం కకావికలైంది. హెచ్.ఆర్.ఎ. పార్టీ ముఖ్య నాయకులందరూ ఆ కేసులో అరెస్టయ్యారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్, సుఖదేవ్, విజయకుమార్ సిన్హాల వంటి ద్వితీయ శ్రేణి నాయకుల మీద పార్టీని నడిపించే బాధ్యత పడింది. ఆజాద్ నేతృత్వంలో పని చేయడం మిగతా అందరికీ ఇష్టమే. ఆయన సమర్థుడే. ఎటొచ్చీ పరిస్థితులే బాగాలేవు. అప్పటిదాకా సానుభూతి చూపిన ప్రజలు కూడా ప్రభుత్వపు అణచివేత చర్యలకు హడలిపోయి మొగం చాటేశారు. విప్లవకారులను దరిదాపుల్లోకి రానివ్వడానికే జనం భయపడ్డారు. ప్రజలకు దూరమైతే విప్లవ పోరాటం ముందుకు పోలేదన్న సంగతి మెల్లిమెల్లిగా అందరికీ బోధపడింది. కాకోరీ కేసులో ఉరికంబమెక్కిన అగ్రనాయకుడు రాంప్రసాద్ బిస్మిల్ కూడా మరణించడానికి రెండు రోజుల ముందు రాసిన ఆత్మకథలో ప్రజల్లో అధిక సంఖ్యాకులు విద్యావంతులై తమ హక్కులను, విధులను గుర్తెరిగేంతవరకూ విప్లవకారులు ఎన్ని త్యాగాలు చేసినా వ్యర్థమని అభిప్రాయపడ్డాడు. భగత్‌సింగ్ మొదట్లో ప్రభుత్వ దమనకాండ పట్ల కసితో రగిలి, బిస్మిల్ వంటి ఖైదీలను జైలు నుంచి విడిపించటానికి శాయశక్తులా పాటుపడ్డా, ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక దౌర్జన్య పంథాకు ఉన్న బలహీనతలను నెమ్మదిగా గ్రహించాడు. ఆనాటి తన మనఃస్థితిని అతడే ఇలా వర్ణించాడు:

‘అప్పటిదాకా నేను ఒక భావుకుడైన విప్లవకారుడిని. నాయకుల వెంట నడిచేవాడిని. అంతలో మొత్తం బాధ్యతను భుజాల మీద వేసుకోవలసిన సమయం వచ్చింది. తీవ్రమైన వ్యతిరేకత వల్ల పార్టీ ఉనికే కొంతకాలం ప్రమాదంలో పడింది. చాలామంది నాయకులు, ఉత్సాహవంతులైన కామ్రేడ్లు కూడా పార్టీని ఆక్షేపించి మమ్మల్ని హేళన చేయసాగారు. ఏదో ఒకరోజు నేను కూడా వారిలాగే మారి, విప్లవకార్యం నిరర్థకమని తలిచి ఆశలొదులుకుంటానా అని నాకు అనిపించింది.
అది నా విప్లవ జీవితంలో మలుపు. నాలో పొడసూపిన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి అధ్యయనం చేయాలి. ఇంకా ఇంకా చదవాలి. నన్ను తప్పుబడుతున్నవారు వేస్తున్న ప్రశ్నలకు జవాబులు కనుక్కోవాలి. నా దృక్పథాన్ని సమర్థించడానికి తిరుగులేని ఆధారాలు కనిపెట్టాలి - అని నిశ్చయించి దీక్షగా అధ్యయనం చేశాను. నా వెనుకటి విశ్వాసాలు, నమ్మకాలు వౌలికంగా మారాయి. మాకు పూర్వపు విప్లవకారుల్లో హింసాత్మక పద్ధతుల పట్ల ఆకర్షణ మెండుగా ఉండేది. దాని స్థానంలో గహనమైన భావాలు పొటమరిచాయి. ఇక మార్మికత లేదు. అంధవిశ్వాసమూ లేదు. ఇప్పుడు వాస్తవికత మా ఆలోచనారీతి. భయానక అవసరం వచ్చినప్పుడు తీవ్రమైన పద్ధతులను అనుసరించవచ్చు. కాని ప్రజా ఉద్యమాల్లో హింస వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే ఏ ఆదర్శం కోసం, సిద్ధాంతం కోసం దీర్ఘపోరాటం సాగిస్తున్నామన్న విషయంలో స్పష్టత ఉండాలి.
[Bhagat Singh in "Why I am an athiest]

ఫూర్వం లాగే ఈసారీ ప్రభుత్వ బీభత్సం విప్లవ పార్టీ వెన్నువిరవడం చూశాక హింసా విథానానికి ఉన్న పరిమితులను, ఇప్పటిదాకా అనుసరిస్తున్న విధానాలను, వ్యూహాలను సవరించుకోవలసిన అవసరాన్ని భగత్‌సింగ్ ఆకళింపు చేసుకున్నాడు. సంపన్నుల ఇళ్లను, ప్రభుత్వ ట్రెజరీలను దోచుకోవటంవల్ల జనం మద్దతు దొరకదు. విప్లవకారులకు అండగా జనం వీధుల్లోకి రారు. రహస్య కరపత్రాలు, మేనిఫెస్టోలు జనాన్ని ఆకట్టుకోవటం లేదు. మరి రక్తం ధారపోసి, అహోరాత్రులు కష్టపడి బ్రిటిష్ సామ్రాజ్యంపై సాగిస్తున్న పోరు నీరుకారిపోకుండా ఏమి చేయాలా అని భగత్‌సింగ్ అక్షరాలా తపస్సే చేశాడు. లాహోర్‌లోని ద్వారకాదాస్ గ్రంథాలయంలో లైబ్రేరియన్‌గా ఉన్న ప్రియమిత్రుడు రాజారామ్ శాస్ర్తీ పుణ్యమా అని ఎన్నో గ్రంథాలను చదివాడు. బకునిన్, మార్క్స్, లెనిన్, ట్రాట్‌స్కీ వంటి ఎందరో దిగ్దంతుల గ్రంథాలను మధించాడు. లాహోర్ నేషనల్ కాలేజి ప్రిన్సిపాల్ చబీల్‌దాస్, భగవతీచరణ్ వోహ్రా, రామచంద్ర, విజయకుమార్ సిన్హా, యశ్‌పాల్ వంటి సహచరులతో క్షుణ్నంగా చర్చించాడు. మారిన పరిస్థితుల్లో పోరాటాన్ని కొనసాగేందుకు కొత్త సంస్థనూ, సరికొత్త వ్యూహాన్నీ ఆవిష్కరించాడు.
అదే నౌజవాన్ భారత్ సభ.
ఐర్లండ్, ఇటలీ, టర్కీల్లో నడుస్తున్న యువజనోద్యమాల తరహాలో కొత్త సంస్థకు ‘యంగ్ ఇండియా అసోసియేషన్’ అని పేరు పెట్టాలని భగత్‌సింగ్ మొదట అనుకున్నాడు. సమావేశాలు, కార్యకలాపాలు అన్నీ హిందుస్తానీలో జరపాలని నిశ్చయించాక సంస్థ పేరు మాత్రం ఇంగ్లిషులో ఉంటే ఏమి బావుంటుందని రామచంద్ర లాంటి సహచరులు అభ్యంతరం లేవదీశారు. దీంతో నిరక్షరాస్యులకు సైతం అర్థమయ్యేలా ‘నౌజవాన్ భారత్ సభ’ పేరును ఖరారు చేశారు. 1926 ఏప్రిల్‌లో ఒకరోజు లాహోర్‌లోని పరిమహల్ ఖద్దర్ భండార్‌లోని చిన్న గదిలో కొద్దిమంది సన్నిహిత సహచరులతో కలిసి భగత్‌సింగ్ కొత్త సంస్థను ప్రారంభించాడు.
నౌజవాన్ భారత్ సభకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
ఆ కాలాన జాతీయోద్యమం కాడి మోస్తున్నదనబడే కాంగ్రెసు మహాసంస్థే సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని అనేందుకు సాహసించలేక పోతున్నది. బ్రిటిషు సామ్రాజ్యంలో భాగంగా కొనసాగడానికి సిద్ధపడి, ‘అధినివేశ ప్రతిపత్తి’ (డొమీనియన్ స్టేటసు)ని మాత్రం ప్రసాదిస్తే చాలునని అది నీళ్లు నములుతున్నది. అలాంటి సమయంలో నౌజవాన్ సభ సర్వస్వతంత్రమైన భారత రిపబ్లిక్ తన లక్ష్యమని ధైర్యంగా ప్రకటించింది. అది కూడా తెల్లదొరల స్థానంలో నల్లదొరలు వచ్చి పాత పాలక వ్యవస్థే కొనసాగే బూటకపు స్వాతంత్య్రం కాదు. నూటికి 99 మంది ప్రజలు పరిపూర్ణ స్వేచ్ఛను, సమానత్వాన్ని అనుభవించగల నిజమైన ప్రజారాజ్యం. దానిని సాధించేందుకు భారత యువతలో దేశభక్తిని, విప్లవ స్ఫూర్తిని నింపాలని నౌజవాన్ సభ ధ్యేయం.
1922 సహాయ నిరాకరణోద్యమం అర్థాంతరంగా ఆగిపోయాక సర్వత్రా నైరాశ్యం నెలకొని, మతోన్మాదం పెనుభూతంలా పెట్రేగుతున్న కాలమది. ఢిల్లీ, గుల్బర్గా, నాగపూర్, లక్నో, షాజహాన్‌పూర్, అలహాబాద్, జబల్పూర్‌లలో మతకల్లోలాలు ప్రచండంగా పెచ్చరిల్లాయి. కోర్హత్‌లో ముస్లిం మతోన్మాదుల రాక్షసకృత్యాలు యావద్దేశాన్ని దిగ్భ్రాంతపరిచాయి. మతం మారతావా చస్తావా అని వెంటపడ్డ రాకాసి మూకల నుంచి తప్పించుకోవడానికి వేల మంది హిందువులు కట్టుబట్టలతో ఊరు విడిచి పారిపోయారు. జాతి సమైక్యతకు మతం అడ్డుగోడగా నిలిచిన దురదృష్టకర పరిస్థితుల్లో నౌజవాన్ సభ కాంగ్రెసు వారిలా ముస్లింల కొమ్ముగాసి హిందువులను మతవ్ఢ్యౌనికి బలి ఇవ్వటం కాకుండా జన జీవితానికి కమ్మిన మతోన్మాద విషాన్ని విరుగుడు చేసేందుకు ధైర్యంగా అడుగువేసింది. మొత్తం సమాజం మతాల వారీగా చీలి, ద్వేషాలూ కక్షలూ సెగలు కక్కుతున్న సమయంలో హిందూ, ముస్లింలు సహా అన్ని మతాల వారినీ ఒక దగ్గర చేర్చి అనేక రాష్ట్రాల్లో, అనేక పట్నాల్లో సహపంక్తి భోజనాలు పెద్దఎత్తున చేయించిన ఘనత నౌజవాన్ సభది.
సెక్యులరిజం అనగా మెజారిటీ మతాన్ని కుళ్లబొడిచి మైనారిటీ మతాల మెహర్బానీకి అంగలార్చడంగా ఆచరణలో రూఢి అయిన మనకాలపు వైకల్యానికి భిన్నంగా ఏ మతంలోని లోపాలను, పాపాలను ఆ మతానికి చెందినవారిచేతే తూర్పార పట్టించటం భగత్‌సింగ్ సభ విశిష్ట లక్షణం.

ఆనాటి భారతదేశంలో రహస్యంగా వ్యవహరించే మిలిటెంటు సంస్థలున్నాయి. బహిరంగంగా పనిచేసే రాజకీయ సంస్థలూ ఉన్నాయి. నౌజవాన్ సభ సాధారణ రాజకీయ సంస్థలా బాహాటంగా పనిచేస్తూనే మిలిటెంటు పోరాటాన్ని ఒడుపుగా కొనసాగించటం విశేషం. యువజనుల, విద్యార్థుల సమావేశాలు, సామాజిక, నైతిక, రాజకీయ అంశాలపై డిబేట్లు, విదేశీ వస్తు బహిష్కారం, స్వదేశీ ఉత్పత్తుల ప్రచారం, భారతీయ భాషలకు ప్రోత్సాహం, జాతి సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, వ్యాయామం వంటి అనేక అంశాల మీద దృష్టి సారించి ప్రజలను చైతన్యపరిచేందుకు రకరకాల కార్యక్రమాలను ‘సభ’ చేపట్టింది.
అదే సమయంలో సాయుధ విప్లవానికి రహస్య సన్నాహాలూ చప్పుడు కాకుండా సాగాయి. మిలిటెంటు యాక్టివిటీలకు రహస్యంగా నిధులు సేకరించేవారు. సరైన వ్యక్తులను ఎంపిక చేసి మిలిటరీ, సైంటిఫిక్ శిక్షణ నిమిత్తం విదేశాలకు పంపించేవారు. బాంబుల తయారీ నేర్పించేవారు. భారీఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని దిగుమతి చేసుకునేవారు. వేర్వేరుచోట్ల బాంబుల ఫ్యాక్టరీలు, ఆయుధాల గిడ్డంగులు నడిపించేవారు. విదేశాల్లోని విప్లవకారులను కూడగట్టి సమన్వయపరిచేవారు. బ్రిటిషు సైన్యంలోకీ చొరబడి వీలైనంత మందిని తమవైపు తిప్పుకునేవారు. కేంద్ర, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కమిటీలను వేసి క్రమశిక్షణతో, పకడ్బందీగా పనిచేస్తూ జాతి విముక్తి పోరాటానికి సామాన్య జనాన్ని అనేక రాష్ట్రాల్లో సమాయత్తం చేస్తూనే ఈ కార్యక్రమమూ చాపకింద నీరులా సాగింది. నౌజవాన్ సభ వెనుక దృఢ దీక్షాబద్ధులైన వందల, వేల కార్యకర్తలు, కనీసం పదుల సంఖ్యలో ఉన్నారు. కాని ఈ సంక్లిష్టమైన కార్యాచరణ పథకమంతటికీ చోదక శక్తి అనదగ్గవాడు, అద్భుత ప్రతిభతో బహిరంగ, రహస్య కార్యకలాపాలను సవ్యసాచిలా వెనక ఉండి సమన్వయం చేసినవాడు ఒకే ఒక్కడు:
భగత్‌సింగ్!
*
--------------------------------
కాకోరీ కుట్ర కేసు...
భగత్‌సింగ్ చరిత్ర ప్రతి ఆదివారం ఇస్తున్నారు. నేను చాలా పర్యాయాలు భగత్‌సింగ్ చరిత్ర చదివాను. మీరు చాలా వివరాలతో చక్కగా ఇస్తున్నారు. ఉదాహరణకు ‘కాకోరీ కుట్ర కేసు’. కాకోరి ఎక్కడ ఉన్నదో చాలామందికి తెలియదు. ఈసారి మీరు దాని ఉనికి కూడా తెలియజేశారు. ఇలా ఎన్నో వివరాలు ఇస్తున్నారు. విప్లవం, స్వాతంత్య్ర పోరాటం అంటే తెలియని ఈనాటి యువతకు మీరు అ,ఆలు నేర్పినట్లు వివరిస్తున్నందుకు ధన్యవాదాలు.
-డి.పి.రామచంద్రరావు (కనుమూరు)
----------------------------------