భగత్‌సింగ్

1931 మార్చి 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్ - 2
=================
లాహోర్ సెంట్రల్ జైలు.
అక్కడ ఖైదీల దినచర్య రోజూ ఒకటే తీరు. వాళ్లని ఉదయం సెల్స్ నుంచి బయటికి వదులుతారు. సూర్యాస్తమయం దాకా బయట తిరగవచ్చు. ఆ తరవాత ఎవరి కొట్టుకు వారు తిరిగి రావాలి. కాని వాళ్ల వార్డెన్ చత్తార్‌సింగ్ మంచివాడు. ఖైదీలతో కలివిడిగా ఉంటాడు. సమయానికి మించి గంట రెండు గంటలపాటు బయటే ఉన్నా ఎవరినీ ఏమీ అనడు. కొనే్నళ్లుగా సాగుతున్న ఆనవాయితీ అది.
అలాంటిది 1931 మార్చి 23న పద్ధతి మారింది. మామూలుగా కలుపుగోలుగా ఉండే వార్డెన్ చత్తార్‌సింగ్ ఎందుకో గంభీరంగా ఉన్నాడు. సాయంత్రం 4 గంటలకల్లా ఎవరి సెల్లుకు వారు వెళ్లిపోవాలని ఉరిమాడు. తెల్లబోయిన ఖైదీలు మారుమాట్లాడక చెప్పినట్టు చేశారు.
ఏమైంది ఇవాళ? ఎవరైనా పెద్ద దొర ఆకస్మికంగా జైలు తనిఖీకి వస్తున్నాడా? అందుకే చత్తార్‌సింగ్ ఎన్నడూ లేనంత కఠినంగా ఉన్నాడా? లేక, ఖైదీలెవరైనా పారిపోయేందుకు ప్రయత్నించారా? ఆ సంగతి తెలిసే అధికారులు అందరినీ ముందుగా లోపలికి పంపి తాళాలు వేయమన్నారా?
ఇలా ఊహాగానాలు సాగుతుండగానే కాసేపటికి అసలు విషయం బయటికి వచ్చింది. జైలు క్షురకుడు బర్కత్ సెల్లు నుంచి సెల్లుకు తిరుగుతూ రహస్యంగా కబురు చేరవేశాడు:
భగత్‌సింగ్, సుఖదేవ్, రాజ్‌గురులను మొదట అనుకున్నట్టు రేపు ఉదయం కాక - ఈ రాత్రే ఉరితీయబోతున్నారు.
ఖైదీలు నిర్ఘాంతపోయారు. భగత్‌సింగ్‌కీ, అతడి సహచరులు ఇద్దరికీ ఉరి తప్పదని అందరికీ తెలుసు. ఆరు నెలల కిందటే బ్రిటిషు ట్రిబ్యునల్ వారికి మరణశిక్ష విధించింది. అయినా ఇంత హఠాత్తుగా మరి కాసేపట్లోనే అది అమలు జరుగుతుందనేసరికి ఎవరికీ నోట మాట రాలేదు. ఆ వీరుల గుర్తుగా వారికి సంబంధించిన ఏదైనా వస్తువు వారి సెల్లు నుంచి వీలైతే తెచ్చి ఇవ్వమని కొంత మంది ఖైదీలు బార్బరును కోరారు. ఉరికంబానికి అటుగుండానే తీసుకువెళతారు కనుక ముగ్గురు దేశభక్తుల అడుగుల చప్పుడు కోసం ఖైదీలు తమ గదుల తలుపు చువ్వల వెనక చేరి చెవులు రిక్కించి వింటున్నారు.
జైలు ప్రాంగణంలో భయంకరమైన నిశ్శబ్దం. వాతావరణంలో ఏదో తెలియని ఉద్రిక్తత. చెప్పరాని ఉత్కంఠ. ఏమిటి అన్నది తెలియకపోయినా హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు ఎందుకో ‘ఫంసీకీ కోఠీ’ (ఉరిశిక్ష పడిన ఖైదీలను ఉంచే ప్రత్యేక విభాగం)లోని గదిలో ఒంటరిగా ఉన్న భగత్‌సింగ్ చప్పున పోల్చుకున్నాడు. అతడు తొణకలేదు. మొగంలో ఎలాంటి ఉద్వేగం లేదు. కలవరపాటూ లేదు.
1930 అక్టోబర్ 7న మరణశిక్ష విధించబడినప్పటి నుంచీ ఈ రోజు కోసం భగత్ ఆర్నెల్లుగా ఎదురుచూస్తున్నాడు. మరణాన్ని ఏ క్షణమైనా వరించేందుకు శాంతంగా, నిర్వికారంగా అతడు సిద్ధపడి ఉన్నాడు. అతడే కాదు. అతనితోబాటు ఉరిశిక్ష పడ్డ ఇద్దరు సహచరులు సుఖదేవ్ థాపర్, శివరాం రాజగురు కూడా.
మరణభయం లేదు గానీ జైలు బతుకే వారికి దుర్భరంగా ఉంది. భగత్‌సింగ్ ఉన్నది సెల్ నెంబర్ 14. అది గది కాదు - మురికిగుంట. నేల మీద తేమకు గడ్డి మొలిచింది. ఓ మూల కంపుకొట్టే కన్నం. 5 అడుగుల 10 అంగుళాల పొడుగు ఉన్న భగత్‌కి పడుకుంటే కాళ్లు జాపుకోవటం కూడా కొంచెం కష్టమే. ఆ కొట్టానికి ఉన్నది ఒకటే కిటికీ. చాలా చిన్నది. అందులోంచి వెలుతురు వస్తే పగలు; చిమ్మచీకటి అలుముకుంటే రాత్రి అనుకోవలసిందే. గదిలో దీపమనేది ఉండదు. ఈగల్ని, దోమల్ని చేత్తో కొట్టుకుంటూ, చిరుగుల కంబళిలో మైనస్ 3 డిగ్రీల చలిని భరిస్తూ ఒంటరిగా అనుదినం నరకవాసం. మార్చి నెల వచ్చింది కాబట్టి చలి కాస్త తగ్గిందంతే. ఆ స్థితిలో ఇంకొకరుంటే పిచ్చెత్తేదే.
తెల్లవారితే ఉరి అన్న కబురు అంతకు ముందే బయటికి పొక్కింది. పెద్ద సంఖ్యలో గుమికూడిన జనంతో జైలు బయట కోలాహలంగా ఉంది. విషయం తెలియగానే డిఫెన్సు లాయరు ప్రాణ్‌నాథ్ మెహతా పరుగున జైలుకు చేరాడు. అధికారులను కలిసి తన క్లయింట్లను ఆఖరుసారి కలవటానికి అతికష్టం మీద అనుమతి సంపాదించాడు. వారి చివరి కోరిక ఏమిటో తెలుసుకోవాలన్న అతడి అభ్యర్థనను అంత కంగారులో కూడా అధికారులు కాదనలేకపోయారు.
సెల్ నెంబర్ 14 దగ్గరికి వార్డెన్ చత్తార్‌సింగ్‌తో కలిసి వెళ్లేటప్పటికి లాయర్ మెహతాకు గుండె గబగబ కొట్టుకుంది. కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. బోనులో సింహంలా భగత్ గంభీరంగా పచార్లు చేస్తున్నాడు. మూడు రౌండ్లు తిరిగాక గుమ్మం ముందు మెహతాను భగత్ గమనించాడు. చూడగానే మామూలుగా నవ్వి, హుషారుగా దగ్గరికి వచ్చి ‘నేనడిగిన పుస్తకం తెచ్చావా?’ అని అడిగాడు.
‘అది నేనెలా మరచిపోతాను?’ అన్నాడు మెహతా.
తన క్లయింటులాగే తానూ నిబ్బరంగా ఉండాలని అనుకుని, మెహతా తన్నుకొస్తున్న ఏడుపును ఆపుకున్నాడు. చత్తార్‌సింగ్ లాయరును సెల్‌లో వదిలి బయటికి వెళ్లి నిలబడ్డాడు.
మెహతా తాను తెచ్చిన పుస్తకం భగత్‌కి ఇచ్చాడు. అది లెనిన్ జీవిత గాథ. పేరు The Revolutionary Lenin. భగత్ దాని గురించి ఏదో పత్రికలో సమీక్ష చదివాడు. ఎలాగైనా దాన్ని సంపాదించమని మెహతాకు కబురు పంపాడు. చత్తార్‌సింగ్ పుణ్యమా అని అతడికి జైలులో పుస్తకాలకు, పత్రికలకు లోటు లేదు.
కొత్త పుస్తకం అందుకోగానే ఒకసారి పేజీలు తిరగేస్తూ తల ఎత్తకుండానే భగత్‌సింగ్ అన్నాడు: ‘ఊఁ! టైమ్ వచ్చిందన్నమాట’
అతడి గొంతులో దిగులు లేదు. కలవరం లేదు. వాతావరణం గురించి మాట్లాడుతున్నంత తేలిగ్గా ఆసన్నమైన చావును ప్రస్తావించాడు. ఆత్రంగా పుస్తకం చదవటానికి ఉపక్రమిస్తూ ఓసారి మెహతాకేసి చూశాడు.
‘ఔను. రేపు ఉదయమేనట’ అని తలతాటించాడు లాయరు. అతడికి దుఃఖం ఆగలేదు. మాట రాలేదు. కష్టం మీద గొంతు సవరించుకుని ‘మీ చివరి కోరిక ఏమిటో తెలుసుకోవడానికి నన్ను అనుమతించారు’ అన్నాడు గద్గద స్వరంతో.
భగత్ పుస్తకం నుంచి తల తిప్పకుండానే చిన్నగా నవ్వాడు. ‘మళ్లీ హిందుస్తాన్‌లో పుట్టాలి. నా దేశాన్ని సేవించడానికి ఇంకో అవకాశం రావాలి. అదే నా కోరిక’. ఈ మాట అనేసి చదువులో లీనమయ్యాడు.
మెహతా వౌనంగా నిలబడ్డాడు. అతడికి ఏమి చెయ్యాలో తోచలేదు. గాభరాలో కాళ్లూ చేతులూ ఆడటం లేదు. తాను ఎంతగానో అభిమానించి, ఆరాధించిన వీరుడికి కడపటి వీడ్కోలు ఇవ్వటానికి మాటల కోసం తడుముకున్నాడు. అతడికి గొంతు పెగలలేదు. అతడి క్లయింటూ మాట్లాడే మూడ్‌లో లేడు. ఉన్న కొద్దిసేపటిలో ఎంత వేగిరం పుస్తకాన్ని చదివేద్దామా అనే అతడి ధ్యాస.
‘ఎవరికైనా సందేశం ఇస్తారా’ అన్నాడు మెహతా - మాటలు కూడదీసుకుని మెల్లగా. భగత్ అతడన్నది విన్నట్టు లేదు. కాసేపు అక్కడే నిలబడి, మెహతా వెనుదిరిగి పోతూండగా భగత్‌సింగ్ చివాల్న తలెత్తి మెహతాను చూశాడు.
‘ఆఁ ఔను. బాబూ సుభాష్‌చంద్రబోస్‌కూ, పండిట్ నెహ్రూకీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలపండి. వాళ్లు నా విషయంలో ఎంతో శ్రద్ధ చూపారు. చాలా సాయం చేశారు’
భగత్‌సింగ్ మళ్లీ చదువులో పడ్డాడు. చివరిసారి అతణ్ని కళ్లారా చూసుకుని, మెహతా బయటికి వెళ్లాడు.
భగత్ స్థితప్రజ్ఞకు ఆశ్చర్యపడుతూ, మెహతా బరువెక్కిన గుండెతో మిగతా ఇద్దరు క్లయింట్ల దగ్గరికీ వెళ్లాడు. వారూ అంతే. ఎదురుచూసిన క్షణం వచ్చేస్తున్నదన్న ఆనందంతో ఉత్సాహంగా ఉన్నారు. తన గదికి మెహతా రాగానే రాజగురు ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. తనకు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలిపాడు. చివరిగా వీడ్కోలు ఇస్తూ ‘మరీ అంత దిగాలుపడకు. మనం త్వరలో మళ్లీ కలుస్తాం’ అన్నాడు నవ్వుతూ.
తరవాత సుఖదేవ్‌ను కలిసి నీ చివరి కోరిక ఏమిటి అని మెహతా అడిగాడు. ‘మరి కొద్దిగంటల్లో నా దేశ స్వాతంత్య్రం కోసం నేను ఉరికంబమెక్కుతాను. ఏ భారతీయుడివైనా అంతకంటే కోరదగింది ఏముంది?’ అని గంభీరంగా అన్నాక సుఖదేవ్ తమాషాగా నవ్వాడు. ‘అన్నట్టు - సమయానికి గుర్తు చేశావ్. నా చివరి కోరిక ఏమిటంటే నువ్వు నాకు ప్రేమగా తెచ్చి ఇచ్చిన కారమ్స్ సెట్టును జైలరు లాగేసుకున్నాడు. వెళ్లేటప్పుడు దాన్ని తీసుకుపో’ అన్నాడు.
మెహతాను బయటికి పంపించాక వార్డెన్ చత్తార్‌సింగ్‌కి తాను భయపడుతున్న క్షణం వచ్చింది. ముగ్గురు ఖైదీలకూ చావుకబురు చల్లగా చెప్పి ఉరికి సిద్ధం చేయడం అతడి డ్యూటీ. సిబ్బందిని వెంటబెట్టుకుని వెళ్లి యూనిఫాం జేబులోంచి గుత్తితీసి భగత్ సెల్లు తాళం చెవిని వెతుకుతూంటే అతడికి చేతులు వొణికాయి. ‘ముందు నిర్ణయించినట్టు రేపు ఉదయం 6 గంటలకు కాక ఈ సాయంత్రం 7 గంటలకే మిమ్మల్ని ఉరితీయమని ఆర్డరు వచ్చింది. మీరు ఇక బయలుదేరాలి’ అని తన ప్రియమైన ఖైదీకి అతడు చెప్పలేక చెప్పాడు.
భగత్‌సింగ్ మొహంలో ఆశ్చర్యం లేదు. ఆందోళనా లేదు.
‘ఇప్పుడే మొదలెట్టాను. కనీసం ఒక అధ్యాయమైనా చదవనివ్వరా మీరు?’ అన్నాడు ఒకింత చిరాకుగా.
వార్డెన్ తల ఊపాడు. భగత్ మళ్లీ చదువులో పడ్డాడు. కాసేపటికి చదువుతున్న పేజీ కొసను గుర్తుగా మడిచి, పుస్తకం మూసి ‘సరే. పదండి’ అన్నాడు - ఏదో పెళ్లికి బయలుదేరుతున్నంత కులాసాగా.
ముగ్గురు విప్లవకారులనీ వారివారి సెల్స్ నుంచి బయటికి తీసుకొచ్చారు - ఉరికి సన్నాహాలు చేయడానికి! భగత్‌సింగ్, సుఖదేవ్, రాజగురులు ఒకరి చేయి ఒకరు పట్టుకుని సెంట్రీల వెనక స్థిరంగా అడుగులు వేస్తూ తమకు ఇష్టమైన స్వాతంత్య్ర గీతాన్ని అందుకున్నారు.
కభీ వో దిన్‌భీ ఆయేగా
కే జబ్ ఆజాద్ హమ్ హోంగే
యే అప్నేహీ జమీన్ హోగీ
యే అప్నా ఆస్మాన్ హోగా.. ...
(ఆ రోజూ ఎప్పుడో వస్తుంది. మనం స్వతంత్రులమవుతాం. ఈ నేల, ఆకాశం మనవే అవుతాయి.. ...)
సూర్యాస్తమయ సమయం. ఖైదీలందరూ ఊపిరి ఉగ్గబట్టి తమ సెల్స్ బయట నడవాను చూస్తూ చెవులు రిక్కించారు. జైలు గడియారం 6 కొట్టింది.
దూరాన ఏవో మాటలు. రక్షక భటుల బూట్ల చప్పుడు. అందరికీ పరిచయమైన దేశభక్తి పాట.
దాని వెనకే ‘ఇంక్విలాబ్ జిందాబాద్. హిందుస్తాన్ ఆజాద్‌హో’ అని బిగ్గరగా నినాదాలు. వాటిని వింటూనే ఖైదీలందరూ ‘రంగ్‌దే మేరా బసంతీ చోలా’ అని పాట ఎత్తుకున్నారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ ‘సామ్రాజ్యవాదం నశించాలి’ అన్న సామూహిక నినాదాలతో దిక్కులు దద్దరిల్లాయి. ఇరుకు నడవాలో చేతులు పట్టుకుని సింహాల్లా నడచి వెళుతున్న ముగ్గురు విప్లవ మూర్తులను చూసేందుకు ఖైదీలు తమ సెల్సు తలుపుల దగ్గర ఎగబడ్డారు. ‘్భగత్‌సింగ్ ఉరికంబం ఎక్కడానికి వెళుతుండగా మా తాత చూశాడు తెలుసా?’ అని వాళ్ల వారసులు బతికినంత కాలం గర్వంగా చెప్పుకుంటారు.
ముగ్గురినీ బరువు తూచారు. చివరిసారిగా స్నానం చేయమన్నారు. దాని తరవాత నల్ల దుస్తులు వేశారు. భగత్ చెవిలో చత్తార్‌సింగ్ గొణిగాడు... ఒక్కసారి వాహేగురుకు ప్రార్థన చెయ్యమని.
‘‘ఇప్పటిదాకా నేను ప్రార్థన చెయ్యలేదు. పేదలపాట్లకు దేవుడిని చాలాసార్లు తిట్టాను కూడా. ఇప్పుడు నేను క్షమించమని అడిగితే ‘వీడు పిరికివాడు. చస్తాడనేసరికి నేను గుర్తొచ్చాను’ అంటాడు. వద్దులే’’ అన్నాడు భగత్ నవ్వుతూ.
మరణించే ముందు మొగంలో ప్రాణభయం ఇతరులకు కనపడకుండా మొగానికి నల్ల ముసుగు తొడగటం రివాజు. కాని ముగ్గురూ అందుకు నిరాకరించారు. మాకెవరికీ భయంలేదు. ముసుగు అక్కర్లేదు - అన్నాడు భగత్.
అక్కడి నుంచి ఉరికంబానికి కాస్తే దూరం. ‘సర్ఫరోషి కీ తమన్నా అబ్ హమారే దిల్‌మే హై’ అని బిగ్గరగా పాడుతూ ముగ్గురు వీరులూ ముందుకు నడిచారు.
ఉరికంబం బాగా పాతది. ఉరితీసేవాడు మాత్రం బలిష్ఠంగా ఉన్నాడు. ముగ్గురూ పీఠం మీద చెక్కబల్ల పైకి ఎక్కి వేలాడుతున్న ఉచ్చులను ముద్దు పెట్టుకున్నారు. ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అని బిగ్గరగా అరుస్తూ తామే ఉరితాడును మెడకు తగిలించుకున్నారు. భగత్‌సింగ్ మధ్యన; సుఖదేవ్, రాజగురులు చెరోవైపు.
తాడును మెడలకు గట్టిగా బిగించి కాళ్లకింద చెక్క పలకలను మీటనొక్కి తలారి లాగేశాడు. శరీరాలు ఉరికంబానికి నిర్ణీత సమయం వేలాడాక కిందికి దించి పరీక్ష చేయించారు. ముగ్గురూ మరణించినట్టు డాక్టర్ ధ్రువీకరించాడు. ఇక జైలు అధికారి మృతదేహాలను గుర్తించి మరణశిక్ష అమలు జరిగినట్టు సర్ట్ఫికెటు సంతకం చేయాలి. విప్లవవీరుల అద్భుత స్థైర్యాన్ని, ధైర్యాన్ని కళ్లారా చూసి చలించిపోయిన అధికారి ఆ పని చేయడానికి నిరాకరించాడు. అతణ్ణి అక్కడికక్కడే సస్పెండ్ చేసి, వేరొక అధికారి చేత తతంగం పూర్తి చేయించారు.
భగత్‌సింగ్ జీవితాశయం నెరవేరింది. తన జాతి జనులకు కలకాలం స్ఫూర్తినిస్తూ అతడు అమరుడయ్యాడు. ప్రజల గుండెల్లో చిరంజీవిగా నిలిచాడు.

ఆధారం: Without Fear, Kuldip Nayar
Shaheed Bhagat Singh, Harish Dhillon]

*