భగత్‌సింగ్

బెంగాలీ బాబు (భగత్‌సింగ్ - 22)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీ హయాంలో కోల్‌కతా హిందూ దేశానికి రాజధాని. రాజకీయ కేంద్రం న్యూఢిల్లీకి మారాక కూడా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక జీవనానికి ఆ నగరమే జీవనాడిగా ఉండేది. మహా ప్రాసాదాలాంటి భవనాలు, అందమైన తోటలు, కళకూ సృజనకూ ఆలవాలమైన సాంస్కృతిక విభావరులు, మేధోమథనాలకు పెట్టింది పేరైన నవచైతన్య కేంద్రాలు కోల్‌కతాకు సహజాభరణాలు.
భగత్‌సింగ్ ఎంత ఇష్టుడైనా భగవతీచరణ్ అతణ్ని తనతోబాటు ఉంచుకోలేదు. ఎందుకంటే అది ప్రమాదం. సాండర్స్ వధ తరవాత తెల్లదొరతనం కళ్లన్నీ విప్లవకారుల మీద ఉన్నాయి. భగత్‌సింగ్ లాహోర్‌లో లేడన్న సంగతి ఇవాళ కాకుంటే రేపు పోలీసులకు తెలియకపోదు. అతడి జాడలు ఆరాతీస్తూ ఏదో ఒకరోజు కోల్‌కతాను వాసన పట్టక మానరు. భగత్ వస్తున్నట్టు కచ్చితంగా తెలియకపోయినా, తన భార్య వెంటబెట్టుకు వస్తున్నది ఎవరో విప్లవకారుడినని ముందే పోల్చుకుని ఆగంతకుడి బసకు భగవతీ చరణ్ ముందే ఏర్పాటు చేసి ఉంచాడు. హౌరా స్టేషనులో దిగాక అటు నుంచి అటే భగత్‌ను విడిదికి పంపించాడు.
అది వోరాకు స్నేహితుడైన మార్వాడీ ప్రముఖుడు చజ్జూరామ్ ఇల్లు. శ్రీమంతులు, ఘరానా పెద్దలు కాపురముండే పోష్ లొకాలిటీ అలీపూర్‌లో ఉంటుందది. అటుకేసి తేరిపార చూసేందుకు పోలీసులు సాహసించరు. ఇంటాయనకు, ఆయన భార్యకు బ్రిటిషు మహా సామ్రాజ్యాన్ని గడగడలాడిస్తున్న విప్లవకారులంటే గొప్ప ఆరాధనాభావం. భగత్‌సింగ్ గురించి అంతకు ముందే విని ఉన్నారు కనుక అలాంటి యోధుడికి తమ ఇంట ఆతిథ్యం ఇవ్వగలగటం అదృష్టంగా భావించారు. చాలా బాగా చూసుకున్నారు.
భగత్‌సింగ్ వేషాలు మార్చటంలో బాగా ఆరితేరాడు. కోల్‌కతాలో ఉన్నన్నాళ్లూ అచ్చు బెంగాలీల్లాగే ధోతి, కుర్తా ధరించి భుజాన అలవోకగా శాలువా వేసుకుని తిరిగాడు. ‘హరి’ అన్న పేరు పెట్టుకున్నాడు. బెంగాలీ భాషనూ చప్పున నేర్చుకున్నాడు.
భగత్‌సింగ్ వెళ్లేసరికి కోల్‌కతాలో అందరూ అక్కడ జరగనున్న కాంగ్రెసు మహాసభల గురించి మాట్లాడుకుంటున్నారు. దేశం అన్ని ప్రాంతాల రాజకీయ ప్రముఖులూ అక్కడికి చేరుకుంటున్నారు. కిందటి మద్రాసు కాంగ్రెసులో సుభాష్ చంద్రబోస్, జవాహర్‌లాల్ నెహ్రు వంటి వామపక్ష భావాలుగల యువ నాయకులు పూనుకుని సంపూర్ణ స్వాతంత్య్రం కోరే తీర్మానాన్ని తేగలిగినా గాంధీ మహాత్ముడు పట్టుబట్టి దాన్ని పక్కన పడవేయించాడు. విప్లవ కార్యకలాపాలు ముమ్మరమై, సోషలిస్టు భావాలతో యువతరం ఉరకలేస్తున్న సమయం కాబట్టి ఈసారి అలా జరగదని అందరూ ఆశిస్తున్నారు. అందునా నవతరానికి ఆరాధ్యుడైన సుభాష్‌బాబు స్వస్థలం అయిన కోల్‌కతాలో వార్షిక మహాసభ జరగబోతున్నది. ఈమారు సంపూర్ణ స్వాతంత్య్రం మినహా మరేదీ ఆమోదించేది లేదంటూ జాతీయ కాంగ్రెసు ఎలుగెత్తి చాటటం తథ్యమని ప్రతి దేశభక్తుడూ విశ్వసిస్తున్నాడు.
అలా జరగాలని కోరుకునేవారిలో భగత్‌సింగ్ ఒకడు. ఎలాగూ ఇక్కడే ఉన్నందున అదేదో కళ్ళారా తిలకిద్దామని అతడూ ఉత్సాహపడ్డాడు. తీరా పోయి కాంగ్రెసు సభల తీరు చూస్తే అతడికి రోత వేసింది. మళ్లీ పాతపాటే. ఎవరు ఎంత తహతహలాడి, ఎన్ని ప్రయత్నాలు చేస్తేనేమి చివరికి చెల్లుబాటయ్యేది గాంధీగారి మాటే. ప్రజల గుండెలు ఎంతలా మండుతూంటేనేమి, స్వాతంత్య్ర కాంక్షతో జాతి ఎంతగా రగిలిపోతూంటేనేమి జాతీయ కాంగ్రెసు మాత్రం ఇంకా డొమీనియన్ స్టేటసు చుట్టూనే గిరికీలు కొడుతున్నది. కాసిని వెసులుబాట్లు కల్పించి, కాస్త పవరు మొగాన పడవేస్తే చాలు బ్రిటిషు మహా సామ్రాజ్య ఛత్రఛాయలో తాబేదారులా బతుకు ఈడ్చటానికి అభ్యంతరం ఉండదని పిల్లికూతలు కూస్తున్నది. తెల్లవాళ్ల పెత్తనమే కొనసాగేటప్పుడు స్వాతంత్య్రానికి అర్థం ఏమిటి? ఇక వీళ్లు మారరు; సంపన్నుల వర్గ ప్రయోజనాలే తప్ప పేదల పాట్లు, కర్షకులూ కార్మికుల బాగోగులు వీరికి పట్టవు. కాంగ్రెసు జన్మలో బాగుపడదు అని భగత్‌సింగ్‌కి మరోసారి రూఢి అయింది. ఇంకో క్షణం అక్కడ ఉండబుద్ధి కాలేదు. అటునుంచి ఎకాఎకి ఒక థియేటరుకు వెళ్లి, అమెరికాలో బానిసల బాధలపై తీసిన ‘అంకుల్ టామ్స్ కేబిన్’ సినిమా చూశాకగానీ అతడికి చిరాకు తగ్గలేదు.
కోల్‌కతాకు భగత్‌సింగ్ వెళ్లింది పోలీసుల వేటను తప్పించుకుని, తలదాచుకోవడానికి మాత్రమే కాదు. అక్కడ అతడు చాలా పనులు పెట్టుకున్నాడు. చిరకాలంగా విప్లవ భావాలకు, విప్లవకారులకు నెలవు కాబట్టి అక్కడి ప్రముఖులను కలవాలి. వారి ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలి. కొద్ది నెలల కింద ఢిల్లీలో తాము జరిపిన విప్లవకారుల కలయికకు బెంగాలీ విప్లవకారులెవరూ ఎందుకు రాలేదో కనుక్కోవాలి. సాండర్స్ హత్యకు తరువాయిగా తాము చేయబోయే విప్లవ కార్యక్రమాలకు కావలసిన బాంబులు, ఆయుధాలు సమకూర్చుకోవడానికి అక్కడి వాళ్లేమన్నా సాయం చేయగలరేమో చూడాలి. ముఖ్యంగా బాంబు తయారీ తమకు నేర్పమని అడగాలి.
భగత్‌కు ఆతిథ్యం ఇచ్చిన గృహస్థే విప్లవకారులను అభిమానించే వాడు, పలుకుబడి గలిగినవాడు. భగవతీ చరణ్‌కీ బాగా పరిచయాలున్నాయి. పైగా భగత్‌ని విప్లవ మార్గంలోకి మరలించిన మాస్టారు ప్రొఫెసర్ జయచంద్ర విద్యాలంకార్ అప్పుడు కోల్‌కతాలో ఉన్నాడు. కాబట్టి త్రైలోక్యనాథ్ చక్రవర్తి, ప్రఫుల్ల గంగూలి, జ్యోతిష్ ఘోష్, ఫణీంద్రనాథ్ ఘోష్, జతీంద్రనాథ్ దాస్ లాంటి ప్రముఖ విప్లవకారులను భగత్‌సింగ్ తేలిగ్గానే కలవగలిగాడు. వారిని ఆకట్టుకోవటమే పెద్ద కష్టమైంది. భగత్ మాట్లాడిన వారిలో ఎవరూ భగత్ సహచరులు అనుసరిస్తున్న పంథాను సమర్థించడానికి సిద్ధంగా లేరు. మనుషుల్ని చంపటంవల్ల, హింసా చర్యల వల్ల ప్రయోజనం లేదని నిశ్చయించి వారు అరాచకవాదాన్ని వదిలేశారు. ప్రజలను సమీకరించి, శ్రామిక పోరాటాలు జరపటం ద్వారానే విప్లవ లక్ష్యం నెరవేరుతుందని వారు విశ్వసిస్తున్నారు. యు.పి., బీహార్, పంజాబ్ కామ్రేడ్లు ఢిల్లీలో జరిపిన రహస్య సమావేశంలో వారు పాల్గొనకపోవడానికి కారణం అదే.
ప్రజా పోరాటాల ద్వారానే నిజమైన స్వాతంత్య్రం సిద్ధిస్తుందని భగత్‌సింగ్ కూడా నమ్ముతాడు. కాని అత్యధిక సంఖ్యాక ప్రజలను మేలుకొలిపి, విప్లవ సమరానికి ఆయత్తం చేయటానికి, అంతిమ పోరాటానికి అనువైన వాతావరణం ఏర్పరచడానికి టెర్రర్ కూడా అవసరమని అతడంటాడు. కాకోరీ రైలు దోపిడి, సాండర్స్ హత్య వంటి పనులవల్ల చెడే తప్ప మంచి ఏమీ జరగదని బెంగాలీ విప్లవకారులు కొట్టిపారేస్తే అతడికి బాధ వేసింది. వారికి నచ్చచెప్పి, తన వాదానికి ఒప్పించటానికి చాలా ప్రయత్నించాడు. అతడి నిజాయతీని, మేధాశక్తిని, అతడికున్న అపార పరిజ్ఞానాన్ని, అద్భుత వాగ్ధాటిని చూసి త్రైలోక్యనాథ్ చక్రవర్తి అంతటివాడు ముగ్ధుడయ్యాడు. మొదట్లో ససేమిరా కుదరదు పొమ్మన్నవాడే క్రమంగా మెత్తపడి రివాల్వర్లను, కాట్రిడ్జ్‌లను భగత్‌కి అందజేయటానికి ఒప్పుకున్నాడు. అప్పటికప్పుడే రెండు రివాల్వర్లు ఇచ్చాడు కూడా.
పెద్దఎత్తున విప్లవ కార్యక్రమాలకు రివాల్వర్లు సరిపోవు. బాంబులూ కావాలి. మార్కెట్లో దొరికే వస్తువులు కావు కాబట్టి వాటిని సొంతంగానే తయారుచేసుకోవాలి. ముందు వాటిని తయారుచేయటం ఎలాగో నేర్చుకోవాలి. కోల్‌కతా విప్లవకారుల నెలవు. అక్కడి అనుశీలన సమితి బాంబులను చాలాసార్లు ప్రయోగించి తెల్లవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఎలాగూ వెళుతున్నావు కాబట్టి బెంగాలీ కామ్రేడ్ల దగ్గర బాంబు తయారీ విద్యను నేర్చుకుని రమ్మని చంద్రశేఖర్ భగత్‌కి చెప్పాడు. వెనుక నుంచి విజయకుమార్ సిన్హా, ఫణీంద్రనాథ్, కమలనాథ్ తివారీలనూ అదే పని మీద కోల్‌కతా పంపించాడు.
శిక్షణకొచ్చిన తొలిజట్టు రడీగా ఉంది. శిక్షకుడిని పట్టుకోవటమే కష్టమైంది. కోల్‌కతాలో యతీంద్రనాథ్ దాస్ పేరు మోసిన బాంబు స్పెషలిస్టు. ఆ రోజుల్లోనే గృహ నిర్బంధం నుండి బయటపడ్డాడు. భగత్‌సింగ్ అతడి ఆచూకీ కష్టపడి కనుక్కొని, ఫణీంద్రతో కలిసి వెళ్లి ఒక పార్కులో రహస్యంగా కలిశాడు.
‘ఔను. బాంబులు చేయటం నాకు తెలుసు. మీకు నేర్పగలను. కాని నేర్పను’ అన్నాడు యతీన్ దాస్. ఎందుకు అంటే ‘నేను వంగ విప్లవ సంస్థ సభ్యుణ్ని. దాని నియమాలకు బద్ధుణ్ని. మా సంస్థ ఇప్పుడు టెర్రరిజాన్ని వదిలివేసింది. బాంబులను తయారుచేయటానికి ఒప్పుకోదు. ఇక ఆ విద్యను నేను మీకెలా నేర్పగలను?’ అని వివరించాడు.
కాని - భగత్‌సింగ్ అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదు.
బెంగాల్ పరిస్థితి వేరు; ఉత్తర భారతంలో పరిస్థితులు వేరు. మా దగ్గర విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లటానికి ఇప్పుడు బాంబుల అవసరం చాలా ఉంది. సాండర్స్‌ని పట్టపగలు కాల్చి చంపటం ద్వారా మేము ప్రజల్లో తెల్లదొరతనమంటే ఉన్న భయం పోగొట్టగలిగాము. ఎక్కడెక్కడి బ్రిటిషు వాళ్లనీ బెంబేలెత్తించగలిగాము. ఇలాంటి అనుకూల స్థితిలో బాంబులు కనుక మా దగ్గర ఉంటే చాలా చేయగలము. అది మళ్లీ చివరికి మీరు ఎంచుకున్న ప్రజా పోరాటం మార్గానికే వచ్చి చేరుతుంది. మీకు తెలిసినదాన్ని మాకు నేర్పటం వల్ల మీ క్రమశిక్షణ నియమాలకేమీ భంగం కలగదులే - అంటూ నానావిధాల నచ్చచెప్పాడు.
‘సరే, నువ్వు అంతలా చెప్పావు కాబట్టి నీ మాట కాదనలేక ఒప్పుకుంటున్నా’ అన్నాడు యతిన్.
బాంబులు చేయటానికి బోలెడు సరంజామా కావాలి. చేశాక ఒకసారి పరిక్ష చేసుకోవాలి. అది జనావాసాల మధ్య కుదరదు. దగ్గర్లో ఏదైనా అడవి లాంటిది ఉంటే నయం.
‘అయితే ఆగ్రా బాగుంటుంది. దాని దగ్గరలో దట్టమైన అడవి ఉంటుంది. ఎలాగూ మా హెడ్‌క్వార్టర్సును ఆగ్రాకే మార్చాలని అనుకుంటున్నాం కూడా’ అన్నాడు భగత్.
అది నిజమే. చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పటికే ఆ పనిలో ఉన్నాడు.
‘మంచిది. కానీ బాంబు చేయడానికి గన్‌కాటన్ కావాలి. దాన్ని తయారుచేసుకోవడానికి ఐసు బాగా అవసరమవుతుంది. ఇది చలికాలం. కొత్తచోటు కనుక ఆగ్రాలో దాన్ని సేకరించడం కష్టం కావచ్చు. ఇక్కడయితే తేలిగ్గా సంపాదించవచ్చు’ అన్నాడు యతిన్.
‘ఇంకేం? అలాగే చేద్దాం. దాన్ని ఇక్కడే తయారుచేసి ఆగ్రాకి పట్టుకెళదాం. అది ఎలా చేయాలో మాకు నేర్పించు’ అన్నాడు భగత్.
స్థలం కోసం వెతుక్కోనక్కరలేదు. కారన్‌వాలిస్ రోడ్డులోని ఆర్యసమాజ్ మందిరం పైఅంతస్థులో కమలనాథ్ తివారి అద్దెకు తీసుకున్న గది ఉండనే ఉంది. కావలసిన సామగ్రి జాబితా యతీంద్రనాథ్ రాసిచ్చాడు. వాటిని కొనమని భగత్‌సింగ్ 50 రూపాయలు ఇచ్చాడు. ఫణింద్ర, తివారి వెళ్లి కెమిస్ట్ షాపుల్లో (అన్నీ ఒకచోట కాకుండా వేరువేరు దుకాణాల్లో) వాటిని కొని తివారి గదిలో చేర్చారు. యతీంద్ర ఎక్కడి నుంచో పెద్ద ఐసుగడ్డను పట్టుకొచ్చాడు. చడీచప్పుడు కాకుండా గన్‌కాటన్ (నైట్రో సెల్యులోజ్)ని అతడి పర్యవేక్షణలో భగత్ బృందం కావలసినంత తయారుచేసింది.
ఓ రోజు పని మధ్యలో ఉండగా ఉన్నట్టుండి ఆర్య సమాజం కాపలాదారు ఆ గదిలోకి వచ్చాడు. అలికిడి కాగానే గదిలోని ఐదుగురూ రసాయనాలను జేబుల్లో దాచేసి, వేయించిన శనగలు నములుతూ కూర్చున్నారు. ఐసుగడ్డ జేబుల్లోకి వెళ్లదు కనుక అలాగే ఉంచేశారు.
రోజూ నలుగురు కొత్తవాళ్లు ఆ గదికి వచ్చి గంటల తరబడి ఉండటం కాపలావాడు గమనిస్తూనే ఉన్నాడు. అనుమానంతోచే గబుక్కున లోపలికి వచ్చాడు. కాని అంతా మామూలుగానే ఉంది.. గదిలో ఐసుగడ్డ తప్ప.
‘ఇంత చలికాలం దాన్ని తెచ్చారేమిటి? ఎందుకోసం’ అని అడిగాడు కాపలావాడు.
‘నాకు కాస్త జబ్బుగా ఉందిలే. ఉపశమనానికి దాన్ని వాడమని డాక్టరు చెప్పాడు’ అన్నాడు తివారీ తడుముకోకుండా.
అప్పటికి గండం గడిచింది. అనంతరకాలాన బాంబు కేసు పోలీసులు కూపీలు లాగినప్పుడు ఈ సంగతి బయటపడింది.
శిక్షణ జోరుగా నడిచింది. శిష్యులంతా సిద్ధహస్తులయ్యారు. బోలెడు బాంబులకు సరిపడా గన్‌కాటన్ సిద్ధమైంది. అంతలో ఆగ్రా నుంచి నెలవు దొరికిందని ఆజాద్ నుంచి కబురందింది. కోల్‌కతాలో భగత్‌సింగ్ వచ్చిన పనీ పూర్తయింది. ఇద్దరిద్దరు ఒక జట్టుగా గన్‌కాటన్ పెట్టెల్లో పెట్టుకుని జాగ్రత్తగా ఆగ్రా చేరారు.
అక్కడ హింగ్ కీ మండీ బస్తీలో భరోసీలాల్ అనే ఆయన ఇంటి పై పోర్షనును పార్టీ సభ్యుడొకరు నెలకు పది రూపాయల బాడుగకు తీసేసుకున్నారు. ఇంకో పార్టీ మెంబరు అక్కడికి దగ్గర్లోనే నరుూకి మండి ఏరియాలో నారాయణ ప్రసాద్ అనే ఆసామీ ఇంటిని నెలకు పదమూడు రూపాయల అద్దెకు తీసుకున్నాడు. మొదటి ఇల్లు ఊరి చివర ఉంటుంది. కాబట్టి బాంబుల తయారీకి దాన్ని వాడుకోదలిచారు. రెండోదాన్ని పార్టీవారి విడిదికి ఉద్దేశించారు. 1929 మార్చి 31న ఖాళీ చేసేదాకా అదే హెచ్.ఎస్.ఆర్.ఎ. విప్లవ పార్టీ రహస్య కేంద్ర స్థానం.
కోల్‌కతా నుంచి వచ్చేటప్పుడు భగత్‌సింగ్ యతీంద్రనాథ్, ఫణీంద్రలకు రైలు ఖర్చుల పైకం ఇచ్చి వచ్చాడు. ఒకరోజు తేడాలో ఇద్దరూ ఆగ్రా బయలుదేరారు. ఫిబ్రవరి 14న భగత్‌సింగ్ ఆగ్రా స్టేషనుకు వెళ్లి యతీంద్రనాథ్ దాస్‌ని రిసీవ్ చేసుకున్నాడు. అతడికి ‘మాస్టర్‌జీ’ అని కోడ్‌నేమ్ పెట్టాడు. సుఖ్‌దేవ్, రాజ్‌గురు, బి.కె.సిన్హా, శివవర్మ, సదాశివ్, ఎల్.కె.ముఖర్జీ, బటుకేశ్వర్‌దత్, భగవాన్‌దాస్ మహోరేలూ ఎవరి దారిన వారు అంతకు ముందే ఆగ్రా చేరుకున్నారు.
‘మాస్టర్‌జీ’ వచ్చీరాగానే హింగ్ కీ మండీ ఇంట్లో అందరూ సమావేశమయ్యారు. బాంబులకు కావలసిన సాధన సామగ్రి అంతా అప్పటికే రడీ అయింది. యతిన్ శిక్షణలో వెంటనే రసాయనాలను కలిపే పని మొదలెట్టారు. పేలుడు మందు మిశ్రమం చకచకా తయారైంది. సుఖ్‌దేవ్ అంతకు ముందు లాహోర్ వెళ్లి కోల్‌కతా నుంచి భగత్‌సింగ్ పట్టుకొచ్చిన ఖాళీ బాంబ్‌షెల్ మూసలో లోహపు తొడుగులను చేయించే పనిని అక్కడి కమ్మరికి పురమాయించి వచ్చాడు.
యతీన్ వచ్చేసరికే తొలివిడతగా ఐదు తొడుగులు తయారై వచ్చాయి. అంతా కలిసి వాటిని చకచక రసాయన మిశ్రమంతో నింపారు.
బాంబులు రడీ. వాటిని పరీక్ష చేయటమే తరువాయి. ఆ రాత్రే ఒక బాంబు తీసుకుని భగత్‌సింగ్, ఆజాద్, ఫణీంద్రలు ఝాన్సీ వెళ్లారు. మర్నాడు ఉదయం అక్కడ సదాశివ్‌ను కలుపుకొని అద్దె కారులో బయలుదేరారు. ఊరుదాటి 20 మైళ్లు వెళ్లాక రోడ్డు పక్క కారు ఆపారు. టాక్సీ డ్రయివర్ని ఆక్కడే ఉండమని, బాంబు ఉన్న తోలుపెట్టెను తీసుకుని నలుగురూ అడవిలోపలికి వెళ్లారు. దట్టమైన అరణ్యంలో ఒక రాళ్లగుట్ట ఎక్కారు. భగత్‌సింగ్ మూతలాగి బాంబును దూరానికి విసిరేశాడు. అది ఢామ్మని పేలింది. ఆ చప్పుడు రోడ్డు మీద టాక్సీలో వేచి ఉన్న డ్రయివరుకు వినిపించింది. (ఈ సంగతులన్నీ తరవాత పోలీసు దర్యాప్తులో బయటపడ్డాయి.)
ప్రయోగం సక్సెస్! ఇక ఫరవాలేదు; లాహోర్ నుంచి రాశులుగా వచ్చి పడనున్న లోహపు తొడుగుల్లో చకచక మందు నింపి వందల బాంబుల తయారీకి ఉపక్రమించవచ్చు అనుకుంటూ ఆగ్రా చేరారో లేదో - చేతిలోని బాంబులకు పనిపడింది.
**************************************

భగత్‌సింగ్

ఈ వారం భగత్‌సింగ్ సీరియల్‌లో ‘సాండర్స్ వధ’ చాలా ఉద్విగ్నభరితంగా సాగింది. తమ గురువు, దేశభక్తులలో అగ్రగణ్యుడు లాలా లాజపతిరాయ్‌పై అమానుషంగా దౌర్జన్యం సాగించి, ఆయన మరణానికి కారణమైన బ్రిటీషు పోలీసు గూండాలపై పగ తీర్చుకునేందుకు భగత్‌సింగ్ వేసిన ప్లానులు, చివరకు సాండర్స్‌ను కాల్చి పారేసిన ఉదంతాన్ని దేశభక్తి మేళవించి చక్కగా వర్ణించారు. నిష్కల్మషమైన దేశభక్తి, దూకుడు, ధైర్యసాహసాలు, అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు అలుపెరగక శ్రమించే వ్యక్తిత్వం, నిజాయితీ మొదలగు ఉన్నతమైన లక్షణాలు భగత్‌సింగ్ నుండి నేటి యువత అలవరచుకోవాల్సిన అవసరం ఉంది.
-సి.పి. (శ్రీకాకుళం)

ఎం.వి.ఆర్.శాస్ర్తీ