భగత్‌సింగ్

భలే కిలాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగత్‌సింగ్ 10
ప్రతాప్‌గఢ్ ఊరి బయట కోలాహలంగా దసరా సమ్మేళనం జరుగుతోంది. ఎండలు తగ్గాయి. చలి ఇంకా మొదలవలేదు. వాతావరణం హాయిగా ఉంది. పంటలూ చేతికొచ్చాయి. ఊరి జనమంతా పిల్లాజెల్లాతో కొత్త బట్టలు ధరించి సంబరంగా తరలి వచ్చారు. దారిపొడవునా పెట్టిన అంగళ్లలో ఎవరికి కావలసిన వస్తువులు వారు కొనుక్కుంటున్నారు. మిఠాయిలు, తినుబండారాలు, షర్బత్‌లు... ఏ కొట్టును చూసినా మహా రద్దీగా ఉంది. ఆటలు, పందేలూ జోరుగా నడుస్తున్నాయి. రామ్‌లీలను పాడుతూ, భజనలు చేస్తున్న కళాకారుల చుట్టూ వందల సంఖ్యలో జనం మూగారు.
అంతా - భగత్‌సింగ్ జట్టు కోరుకున్నట్టే ఉంది. విప్లవ కరపత్రాలు పంచి పెట్టటానికి వాళ్లు కాన్పూరు నుంచి వచ్చారు. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా జనం ఉన్నారు కనుక వారిలో కలిసిపోయి, పనికానివ్వటం తేలిక.
దళ సభ్యులు అలవాటు ప్రకారం తలా ఒక దిక్కు వెళ్లి, పార్టీ కరపత్రాలను పోలీసుల కంటపడకుండా చకచకా పంచి పెట్టసాగారు. జాగో మేరే దేశ్‌కీ లోగో (నా దేశ ప్రజలారా, మేలుకోండి) అన్న శీర్షిక చూడగానే కరపత్రాన్ని అందుకున్నవారు కొందరు ఆసక్తిగా చదవసాగారు. మిగతా వారు చూసి జేబులో పెట్టుకున్నారు.
గుమికూడిన జనాల్లో ఇద్దరు మఫ్టీ పోలీసులూ ఉన్నారు. గుంపులో కదులుతూ హడావుడిగా పంచిపెట్టే తొందరలో ఇద్దరు కార్యకర్తలు వారి చేతికీ కరపత్రాలు ఇచ్చారు. చూడగానే వాళ్లకు విషయం అర్థమైంది. వెంటపడి ఇద్దరు కార్యకర్తలనూ ఒడిసిపట్టుకున్నారు.
భగత్‌సింగ్ అక్కడికి దగ్గర్లోనే ఉన్నాడు. అరుపులూ, కేకలూ వినబడగానే జరిగిందేమిటో అతడు గ్రహించాడు. ఇద్దరు సహచరులూ పెద్ద ప్రమాదంలో పడ్డారు. మరి కాసేపట్లో వారికి సంకెళ్లు వేసి పోలీసుస్టేషనుకు తీసుకుపోతారు. విప్లవకారుల ఆనుపానులు రాబట్టటానికి చిత్రహింసలు పెడతారు. తరవాత జైలుకు పంపిస్తారు.
అలా జరగటానికి వీల్లేదు. వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఎలా?
భగత్‌సింగ్ తన దగ్గరున్న కరపత్రాలన్నీ గాలిలోకి ఎగరేశాడు. ‘కాంగ్రెస్ పార్టీ వాళ్లు వచ్చారు. ఏవో కాగితాలు పంచుతున్నారు చూడండి’ అంటూ తానే పెద్దగా కేకలు పెట్టాడు. ఆ కాగితాలను అందుకోవటానికి జనం ఎగబడ్డారు. చుట్టుపక్కల ఉన్న పోలీసులు గుంపును కంట్రోలు చేయటానికి ముందుకురికారు. ఆ గందరగోళంలో భగత్‌సింగ్ తన సహచరులను పట్టుకుని నిలబడ్డ పోలీసుల మీద విరుచుకు పడ్డాడు. దగ్గర్లో ఉన్న జనమూ తలా ఓ చెయ్యి వేయగా వారిని బలవంతంగా విడిపించి, వారితోబాటు గుంపులో కలిసిపోయి మెరుపులా మాయమయ్యాడు.
[Shaheed-e Azam Bhagat Singh, Gurudev Singh Deol]

దటీజ్ భగత్‌సింగ్!
హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడిగా పార్టీ భావాలను, విధానాలను ప్రజల్లో ప్రచారం చేయటానికి భగత్ చురుకుగా పనిచేశాడు. యునైటెడ్ ప్రావిన్సెస్ (యు.పి.) రాష్ట్రంలోని అనేక గ్రామాలకు వెళ్లి, రైతులనూ కార్మికులనూ కలిసి పార్టీ సిద్ధాంతాలను తెలియపరిచాడు. స్కూళ్లు, కాలేజిల విద్యార్థులను కాంటాక్ట్ చేసి దేశ స్వాతంత్య్ర సిద్ధికి అంకితమవుదాం రమ్మని ఉద్బోధించేవాడు. గ్రామాల్లో సంతలు, తిరునాళ్లు, మేళాలు ఎక్కడ జరిగితే అక్కడికల్లా తన జట్టుతో వెళ్లి, దేశభక్తి గీతాలను, పద్యాలను పాడి, మేలుకొలుపు కరపత్రాలను పంచిపెట్టేవాడు. ఆ క్రమంలోనే ప్రతాప్‌గఢ్‌లో జరిగింది పైన చెప్పుకున్న ముచ్చట.
సాధారణంగా ఉడుకురక్తపు యువకులు అందరిలాగే భగత్‌సింగ్‌నూ పోలీసులు ఓ కంట కనిపెడుతున్నా, అతణ్ణి ప్రత్యేకంగా పట్టించుకోవలసిన అవసరం పోలీసులకు అంతదాకా కనిపించలేదు. ప్రతాప్‌గఢ్ ఘటనతో పరిస్థితి మారింది. ఊరూ పేరూ కచ్చితంగా తెలియకపోయినా అతడి చేతిలో దెబ్బతిన్న పోలీసులు అతడిని గుర్తు పెట్టుకున్నారు. వారిచ్చిన సమాచారాన్నిబట్టి పోలీసు బలగాలు అతడి కోసం గాలించసాగాయి.
ఆ సంగతి కర్ణాకర్ణిగా గణేశ్ శంకర్ విద్యార్థికీ తెలిసింది. కుర్రవాడు పట్టుబడితే ప్రమాదం కనుక అతడిని ఎలా తప్పించాలా అని ఆయన ఆలోచిస్తూండగా దానికీ ఒకదారి దొరికింది.
దృఢదీక్షతో ఇంటి నుంచి బయటికి వచ్చి తన మనసుకు నచ్చిన పనిలో పూర్తికాలం నిమగ్నమైనా, భగత్‌సింగ్ తన వాళ్లను మరచిపోలేదు. తనను గారాబం చేసే మామ్మ, తనకు మహా ఇష్టమైన అమ్మ, చెల్లి తన కోసం దిగులు పడుతున్నారేమోనన్న బెంగ అతడికి ఎప్పుడూ ఉండేది. బాగానే ఉన్నానని క్షేమ సమాచారాలతో ముద్దుల చెల్లి అమ్రోకి ఓసారి ఉత్తరం రాయడం మొదలు పెట్టి కూడా ఆగిపోయాడు. తనను వెంటనే ఇంటికి తిరిగి రమ్మంటూ ‘వందేమాతరం’ పత్రికలో తండ్రి కిషన్ సింగ్ వేయించిన ప్రకటన చూసి కూడా భగత్ బింకంగానే ఉన్నాడు. కాని మనసులో ఓ మూల తన వాళ్ల గురించి బెంగ పడుతూనే ఉన్నాడు. ఆ స్థితిలో తన ప్రియమిత్రుడు రామచంద్రకు ఉత్తరం రాశాడు -‘ఓసారి మా ఇంటికెళ్లిరా. మా నాయనమ్మ ఆరోగ్యం ఎలా ఉందో, మా వాళ్లు ఎలా ఉన్నారో కనుక్కొని నాకు వెంటనే తెలియపరచు. నేను నీకు ఉత్తరం రాసినట్టుగాని, నేను ఎక్కడున్నానన్న సంగతిగాని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. నా మీద ఒట్టు’ అని.
ఉత్తరం అందగానే స్నేహితుడు భగత్ వాళ్ల ఇంటికి వెళ్లాడు. తల్లితో మాట్లాడాడు. మంచానపడ్డ భగత్ నాయనమ్మ అతడిని చూడగానే కళ్లనీళ్లు పెట్టుకుంది.
‘మా వాడిని ఎక్కడున్నా వెతికి పట్టుకురా నాయనా. నా ప్రాణాలన్నీ వాడిమీదే పెట్టుకున్నాను. పత్రికలో ప్రకటన వేయించినా తిరిగి రాలేదు. మా మీద ఎంత కోపం పెట్టుకున్నాడో ఏమిటో’ అంటూ చాలా బాధపడింది. వాడికి ఇష్టంలేని పెళ్లికి బలవంతపెట్టం. వాడి ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చు. ఇంటికి తిరిగొస్తే చాలు’ అని మరీమరీ చెప్పింది.
వచ్చినవాడు ఆమె దైన్యాన్ని చూసి భగత్ ఉత్తరం ఆమెకు చూపిద్దామా అనుకున్నాడు. కాని భగత్ వేసిన ఒట్టు గుర్తుకొచ్చి ఆగిపోయాడు.
ముసలావిడ పరిస్థితి ఏమీ బాగాలేదు. బాగా జబ్బుపడింది. ఎవరెంత నచ్చచెప్పినా మందులు వేసుకోవడం లేదు. ఎంతసేపూ ముద్దుల మనవడినే తలచుకుని, వాడి పేరే కలవరిస్తున్నది. ఇలాగే ఉంటే ఎక్కువకాలం బతికేట్టు లేదు. ఎలాగైనా భగత్‌ని వెనక్కి తీసుకురావాలి. ఎప్పుడో ఉత్తరం ముట్టి జవాబు వచ్చేదాకా ఉండబట్టలేక మరో జతగాడు జయదేవ్ గుప్తాను వెంట తీసుకుని రామచంద్ర ఉన్నపళాన కాన్పూర్ వెళ్లాడు. ఉత్తరంలో భగత్ ఇచ్చిన చిరునామాను పట్టుకుని ‘ప్రతాప్’ ప్రెస్‌కి వెళ్లాడు.
ఆ సమయాన భగత్‌సింగ్ అక్కడ లేడు. ఎక్కడికి వెళ్లాడో, ఎప్పుడొస్తాడో ఎవరూ చెప్పలేక పోయారు. ఏమి చేయాలో పాలుపోక గణేశ్ శంకర్ విద్యార్థిని కలిసి అన్ని సంగతులూ వివరించారు.
విద్యార్థికి విషయం బోధపడింది. కిషన్‌సింగ్ కొడుకని తెలిశాక భగత్ మీద ఆయనకు ఇష్టం మరింత పెరిగింది. వాళ్ల ఇంటి దగ్గర పరిస్థితి తెలిసి జాలి కూడా వేసింది. కాని భగత్ అభిప్రాయం తెలుసుకోకుండా తానుగా వారికి ఏమీ చెప్పలేకపోయాడు. భగత్ ఎక్కడున్నాడో తెలియదు; ఒకవేళ నాకు కనపడితే మీరు చెప్పమన్న సంగతులు అతడికి తెలియపరుస్తాను అని హామీ ఇచ్చి వారిని పంపేశాడు.
ఇక చేసేదిలేక మిత్రులిద్దరూ వెనక్కి మరలారు. జయదేవ్ ద్వారా భగత్ ఉనికి అతడి తండ్రి కిషన్ సింగ్‌కి తెలిసింది. ఎలాగైనా మా వాడికి నచ్చచెప్పి మా దగ్గరికి పంపించమని కోరుతూ ఆయన వెంటనే గణేశ్ శంకర విద్యార్థికి ఉత్తరం రాశాడు. కాన్పూర్‌లో తాను బాగా ఎరిగిన కాంగ్రెసు నాయకుడు వౌలానా హస్రత్ మొహానీకి కూడా ఈ విషయంలో సహాయం చేయవలసిందంటూ జాబు పంపాడు.
పోలీసుల దృష్టి పడ్డాక భగత్‌సింగ్ కాన్పూర్‌లో ఉండటం మంచిది కాదని అనుకుంటూండగా ఇదంతా జరిగింది. ‘ఇదీ ఒకందుకు మంచిదే. నువ్వు వెంటనే ఇంటికెళ్లు’ అని విద్యార్థిగారు భగత్‌సింగ్‌కి చెప్పాడు. తీరా వెళ్లాక అందరూ కలిసి పెళ్లికి బలవంతపెడతారేమో అని సందేహించాడు భగత్. అలాంటిదేమీ జరగదని మీ నాన్న నాకు రాశాడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. మాట తప్పడు. మరేమీ ఆలోచించకుండా ముందు ఇంటికెళ్లు - అని విద్యార్థి నచ్చచెప్పి ఒప్పించాడు.
అలా - ఆర్నెల్ల తరవాత భగత్ మళ్లీ ఇంటిదారి పట్టాడు. కాన్పూరులో ఉన్న ఆరునెలలూ విప్లవకారుడిగా అతడి ఎదుగుదలకు బాగా ఉపయోగపడ్డాయి. కొత్త పార్టీలో చేరటం, గణేశ్ విద్యార్థి పరిచయం, కొత్త సహచరులను కూడగట్టుకోవటం భగత్‌సింగ్ భావి జీవన గమనానికి ఎంతో తోడ్పడ్డాయి.
పల్లెటూరి వాలకంతో కాన్పూర్‌కి వచ్చాడు. రాటుతేలిన విప్లవ యోధుడిగా తిరిగి వెళుతున్నాడు.
పోలీసుల కళ్లు తన మీద పడ్డాయని అర్థమయ్యాక వారి నుంచి తప్పించుకోవడానికి భగత్ కూడా తన జాగ్రత్తలో తానున్నాడు. అవసరాన్నిబట్టి ఎప్పటికప్పుడు వేషాలు మార్చేవాడు. కాలేజి రోజుల్లో ఆడిన నాటకాల అనుభవం నిజ జీవితంలో అతడికి బాగా పనికొచ్చింది.
ఇంటిదారి పట్టాక కూడా పోలీసుల బెడద భగత్‌సింగ్‌కి తప్పలేదు. నీడలా వెంటాడుతున్న పోలీసుల కళ్లుకప్పి ఎలాగో రైలెక్కాడు. ఫలానా ఆనవాళ్లు గల విద్రోహి కాన్పూర్ నుంచి బయలుదేరాడని దారిలోని స్టేషన్లకు వర్తమానం పోయింది. మధ్య స్టేషన్లలో పోలీసులు అప్రమత్తమై రైలు రాగానే ప్రయాణికుల తనిఖీ గాలింపు మొదలెట్టారు.
భగత్‌సింగ్ తెలివితేటల్లో వారిని మించినవాడు. ఢిల్లీ స్టేషనులో పోలీసులు తన దగ్గరికి వచ్చేసరికి అతడు పోలీసు కానిస్టేబుల్ వేషంలో ఉన్నాడు. తమవాడే కదా అని పోలీసులు మొదట అతడిని పట్టించుకోలేదు. అనుమానం తగిలి వారు వెనక్కి చూసేసరికి మనవాడు మాయమయ్యాడు.
ఇక పోలీసు వేషగాడి కోసం పోలీసులు వేట మొదలెట్టారు. దారిలో ఇంకో స్టేషనులో పోలీసులు వెతుకుకుంటూ తన వైపు వచ్చేసరికి భగత్ కాషాయం కట్టి భగవద్గీత చేతపట్టి కళ్లు మూసుకుని కూర్చున్నాడు. ఎవరో సాధువు; ధ్యానం చేసుకుంటున్నాడు కాబోలని తలచి పత్తేదారులు చక్కాపోయారు. మరో స్టేషనులో నిఘా వేసిన పోలీసులు అనుమానమొచ్చి భగత్‌ని సోదా చేశారు. కాని అతడు ఫలానా అని కాని, ఫలానా వ్యవహారాలతో సంబంధం ఉన్నవాడనిగాని వెల్లడించే ఏ ఆధారమూ అతడి దగ్గర దొరకలేదు.
ఇలా వేషాలు మార్చి, ఎత్తుకు పైఎత్తు వేసి ఢిల్లీ నుంచి భటిండా గుండా భగత్‌సింగ్ లాహోర్‌కు చేరుకున్నాడు.
తిరిగి రాడేమోనని ఆశలు వదులుకున్న తరవాత పూజలు ఫలించి భగత్ మళ్లీ తమ కంట పడేసరికి ఇంట్లోవాళ్ల సంతోషానికి అంతులేదు. మోడువారిన కుటుంబంలో అతడి రాకతో మళ్లీ వసంతం వచ్చింది. బంగాలో నాయనమ్మ జయాకౌర్‌కి మనవడిని చూడగానే రోగం పారిపోయింది. మామ్మని అంటిపెట్టుకునే ఉండి, వేళకు మందులు వేసి, తిండి తినిపించి, కడుపునిండా కబుర్లు చెబుతూ, నవ్వుతూ, నవ్విస్తూ భగత్ చేసిన సేవతో ఆమె కొద్ది రోజులకే మళ్లీ మామూలు మనిషైంది.
పట్నంలో, పల్లెలో సావాసగాళ్లూ, మీటింగులూ, సిద్ధాంత చర్చలూ, ఎక్కడెక్కడికో సంచారాలూ, సరదా కబుర్లూ మళ్లీ మామూలే. తిరిగి వచ్చాక భగత్‌ని తండ్రి మందలించలేదు. పెళ్లి మాటా మళ్లీ ఎవరూ ఎత్తలేదు. మామ్మ గారాబం, తాత మురిపెం, తమ్ముళ్లూ, చెల్లెళ్లూ, పినతండ్రుల భార్యలతో కులాసా కాలక్షేపం.. ఇలా అన్నీ షరా మామూలే.
అంత సంతోషంలోనూ తల్లి విద్యావతికి మాత్రం లోలోన చెప్పరాని దిగులు. కొడుకును ఎంతకాలం ఇలాగే కళ్ళారా చూసుకోగలమో, ఎన్నాళ్లు తమ దగ్గర ఉంటాడో అని తల్లి మనసులో తుమ్మ ముల్లు.
దానికీ ఒక కారణం లేకపోలేదు.
ఆర్నెల్ల కింద భగత్ చెప్పాపెట్టకుండా ఇల్లు వదిలి వెళ్లాక విద్యావతి పిచ్చిపట్టినట్టు తిరిగి అతడి కోసం ఎక్కడెక్కడో వెతికింది. ప్రయోజనం లేకపోయాక, చివరికి తనకు తెలిసిన ఒక జ్యోతిష్యుడిని ప్రశ్న అడిగింది.
తప్పిపోయిన వాడి ఆనవాలు ఏదైనా కావాలని జ్యోతిష్యుడు అడిగితే కొడుకు వాడిన తలపాగా చూపించింది. దాన్నిచూసి, కాసేపు కళ్లు మూసుకుని, సాముద్రికుడు గంభీరంగా అన్నాడు.
‘మీవాడు త్వరలో వస్తాడు. కాని...’
తల్లి గతుక్కుమంది. ‘కానీ అంటున్నారేమిటి పండిట్జీ’
‘వెనక్కి వచ్చినా ఎక్కువకాలం మీ దగ్గర ఉండడు. మళ్లీ వెళ్లిపోతాడు’
విద్యావతి గుండెలో రాయి పడింది. ‘మళ్లీ వెళ్లిపోకుండా చేయడానికి ఏదైనా ఉపాయముందా పండిట్జీ?’
జ్యోతిష్యుడు అడ్డంగా తల ఊపాడు. ‘మీ అబ్బాయిది చాలా విశేషమైన జీవితం. విధి అతడికి చిత్రమైన పరిస్థితి కల్పిస్తుంది. అతడిని ఎవరూ కట్టిపడెయ్యలేరు’
‘ఎలాంటి పరిస్థితి వస్తుందంటారు?’
‘వాడు అయితే దేశాన్ని ఏలుతాడు. లేదా...’
ఒణికే గొంతుతో తల్లి రెట్టించి అడిగింది. ‘లేదా..?’
‘ఉరికంబమెక్కుతాడు’
విద్యావతి దాదాపుగా సొమ్మసిల్లింది. అప్పటినుంచీ ఆమె మనసులో అంతులేని బాధ. కొడుకు గురించే ఎప్పుడూ చింత.
*

ఎం.వి.ఆర్. శాస్త్రి