భక్తి కథలు

చిరంజీవి హన్మంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైందవ సంస్కృతిలో పెక్కు పండగలున్నాయి. అవి రుతుపర, మత ప్రమేయ, పురాణేతిహాస సంబంధమైనవి. అందు అసమాన భక్తాగ్రేసరుడు, ఆదర్శ పురుషుడు, నమ్మిన బంటు, సంస్కృతాద్యనేక భాషలు, వ్యాకరణాది శాస్త్రాలు, సంగీతాది కళలలో నిష్ణాతుడు, ఒక కల్పం అంటే నాలుగు వందల ముప్పయి రెండు మిలియన్ల సంవత్సరాలు జీవించే ఎనిమిది మంది చిరంజీవులలో ఒకరైన హనుమంతుని జయంతి ప్రత్యేకత కలిగి ఉంది. భారతావనిలో వివిధ ప్రాంతాలలో హన్మాన్ జయంతిని వివిధ మాసాలలో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో వారణాసిలో సంకట మోచన దేవాలయం, అయోధ్యలో హన్మాన్ గార్హి దేవాలయాలలో ఈ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ‘‘మార్గళి’’ మాసం అనగా డిసెంబర్ లేదా జనవరిలలో జరుపుకుంటారు. ఒరియా క్యాలెండర్ ప్రకారం విషుభ సంక్రాంతి మొదటి రోజున వైశాఖంలో పాటించే ఆచారం ఉంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో వైశాఖ కృష్ణపక్షమందు పెద్ద హన్మాన్ జయంతిగా జరుపుకునే సాంప్రదాయం ఉంది. చైత్ర పౌర్ణమి (చిన్న హన్మాన్ జయంతి)తో ప్రారంభించి, హన్మాన్ దీక్షలను వైశాఖ కృష్ణ పక్ష దశమి (పెద్ద హన్మాన్ జయంతి)కి ముగిసేలా 41రోజుల మండల దీక్షలను చేపట్టడం అనవాయితీగా, సాంప్రదాయ సిద్దంగా వస్తున్నది. ప్రధానంగా రామాయణంలో హనుమంతిని పాత్ర అద్వితీయం. రామాయణంలోని ఆరుకాండల్లోని చివరి మూడు కాండల్లో కథ నడిచిన మహనీయుడు హనుమంతుడు. హనుమంతుని స్తుతించే హనుమత్కవచాన్ని ఆంజనేయాలయంలో లక్ష ఇరవై అయిదు సార్లు పఠించిన వారికి గాలిలో ఎగిరే శక్తి, ఆణిమాద్యష్టసిద్దులు లన్యమవుతాయని నమ్మకం. ప్రేతపతి అయిన శివునికి ఎంత భూతాలమీద ఆధిపత్యం ఉందో హనుమంతునికి అట్టిది కలదని భావిస్తారు. గ్రహ పీడకు ఆంజనేయుని కొలుస్తారు. ఉన్మాద రోగాలకు ఆంజనేయ ప్రదక్షిణలు చేస్తారు. చిన్న పిల్లలకు ఆంజనేయ బొమ్మ చెక్కిన యంత్రపు బిళ్ళలను మెడలో కడుతారు. పిల్లలు, పెద్దలు ఆపత్సమయాలలో, భయం కలిగే వేళలలో ఆంజనేయ దండకం చదువడం చిరకాలంగా అనుసరిస్తున్న సంప్రదాయం. శివాజీ గురువైన సమర్థ రామదాసు హనుమంతుని భక్తుడు కాగా, మహారాష్ట్రుల జెండా మీద గదాపాణియైన హనుమంతుడు ఉంటారు. పాండవ మధ్యముడైన అర్జునుని జెండాపై ఉపవిష్టుడై హనుమంతుడు మహా భారత యుద్ధంలో అర్జునునికి రక్షణగా ఉన్న గాధ అందరికీ తెలిసిందే. భగవద్దాసులలో సాటిలేని ఆంజనేయుని పూజకు ఉద్దిష్టమైన చైత్ర పూర్ణిమతోపాటు వైశాఖ బహుళ దశమి నాడు కూడా ప్రత్యేక అర్చనలు, పూజాదులు నిర్వహించడం సదాచార సాంప్రదాయంగా వస్తున్నది.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494