భక్తి కథలు

క్రీస్తు న్యాయము -- ప్రార్ధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకంలో ఎక్కడ చూసినా ‘మాకు అన్యాయం జరిగింది అంటే మాకు అన్యాయం జరిగింది. మమ్మల్ని మోసం చేశారు. మేం నష్టపోయాం. మేం మోసపోయాం. దేవుడు కూడా మాకు న్యాయం చేయలేదు. మాకు న్యాయం కావాలి’ అని న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. మా తమ్ముడు నన్ను మోసం చేశాడు. మా చెల్లెలు, అన్న, అత్త, కోడలు మోసం చేశారు. పనిచేసే స్థలంలో మోసపోయాం అని రకరకాల కేసులు వింటూ ఉంటాం. బాధ - దుఃఖం ఒకప్రక్క, పగ ప్రతీకారం ఇంకో ప్రక్క ఉండటంవల్ల - ‘వాళ్ల అంతు చూస్తాం. పోలీస్ కేసు పెడ్తాం. కోర్టు కెళ్తాం’ అని పగతో రగిలిపోతూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇల్లు ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. పోయింది పోగా పగతో కక్షలతో మరింత ఆస్తిని పోగొట్టుకుంటున్నారు. చివరికి మిగిలింది నష్టమే అన్న అనుభవ జ్ఞానం సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే అమూల్యమైన సమయం, వయసు వృథా అవుతోంది. అనుభవ జ్ఞానం వల్ల తెలిసేదేమంటే - పంతాలకు పోకుండా ఉండాల్సిందని. ఎందుకంటే అసలు మోసపోయిన దానికన్నా ఇలా పంతాలతో పోయిన డబ్బులే ఎక్కువని అర్థవౌతుంది.
పంతాలు, కోపం, ద్వేషం కొన్నిసార్లు మొదటికే మోసం తెస్తాయి. పాముకి కట్టెలు కోసే రంపం తగిలి తోక తెగిందిట. కోపంతో పాము రంపాన్ని కాటు వేసేసరికి దాని మూతి పగిలింది. ఇంకా కోపంతో రంపాన్ని మట్టి కరిపించాలని చుట్టుకొని మొదటికే మోసం తెచ్చుకుంది.
ఆలోచించండి - మనం తీసుకొనే ఆహారంలోని వ్యర్థ పదార్థం 24 గంటల్లో బయటకు రావాలి. తాగేనీరు 4 గంటలలో బయటకు రావాలి. పీల్చే గాలి నిమిషంలో బయటకు రావాలి. లేకుంటే జబ్బు పడి మరణించే పరిస్థితి ఏర్పడింది. అలానే మన క్రోధం, కక్షలు, అసూయా ద్వేషాలు మన లోపల నెలలు, సంవత్సరాల తరబడి ఉంటే ఎంత హానికరమో ఊహించండి. మానసిక వత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది.
బైబిల్ గ్రంథంలో -సుంకరియైన పొట్టి జక్కయ్య మనకందరికీ సుపరిచితుడే. ఆయన ‘యేసు ఎవరో చూడగోరి.. ఆ త్రోవన యేసు రానై యున్నాడని ముందుగానే పరుగెత్తి ఒక మేడిచెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి ‘జక్కయ్యా త్వరగా దిగుము. నేడు నేను నీ యింట ఉండవలసి ఉన్నద’ని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ప్రభువును చేర్చుకొనెను. అప్పటి వరకు జక్కయ్యకు ధనమే దేవుడు. తరతరాలకు సరిపడ సంపాదించాడు. వాస్తవానికి మనమీ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు. తిరిగి పోయేప్పుడు ఏమియు తీసుకొని వెళ్లలేము. కాగా అన్నవస్తమ్రులు కలిగియుండి తృప్తిగా ఉంటూ సమాధానంగా ఉంటే చాలు - అని తెలుసుకున్నాడు.
‘బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ప్రభువులో గుప్తమై యున్నవి’ గనుక ఆయనను చేర్చుకొంటే జ్ఞానోదయం కలుగుతుంది. ఈ దైవజ్ఞానం పొందుకున్న జక్కయ్య, పౌలు భక్తుడు చెప్పినట్లు ఈ లోకంలో ఏవేవి లాభకరములో వాటిని రక్షకుడైన యేసుక్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచి క్రీస్తును సంపాదించుకోవాల’ని చేసిన న్యాయపరమైన పని ఏమంటే - తన ఆస్తిలో సగము పేదలకు ఇస్తానన్నాడు. ఎవరి వద్ద అన్యాయముగా దేనినైన తీసుకొనిన యెడల అతనికి నాలుగంతలు చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అలా చేసి డబ్బుతో మణి మాణిక్యాలతో వజ్ర వైఢూర్యాలతో కొనలేని రక్షణను ఉచితంగా పొందుకున్నాడు. గమనించండి. జక్కయ్య సొమ్ము ప్రభువు తీసుకొని పంచలేదు. జక్కయ్యలా మారిన వారు చేయదలచిన పనిని వారినే చేయనిస్తే అది ఆశీర్వాదం. ఈ సంఘటనలో మనకు అర్థమవుతోందేమిటంటే - ప్రభువుని విశ్వసించిన వారు అన్యాయంగా దేనినైనా పోగొట్టుకుంటే దానిని తిరిగి నాలుగంతలు పొందుకోగలరని. కాబట్టి అన్యాయంగాని మోసంగాని జరిగినప్పుడు విశ్వాసంతో ప్రభువు వైపు చూస్తుంటే - తగిన సమయంలో నీకు నాలుగు రెట్లు తిరిగి వస్తాయి. అయితే ఈ మధ్యలో మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తొందరపడకూడదు. కొట్లాటలకు కోర్టులకు వెళ్లకూడదు. డబ్బుల విషయమే కాదు ఇంకా ఎటువంటి మోసాలైనా సరే. ప్రభువు న్యాయవంతుడు గనుక న్యాయం జరిగిస్తాడు. ప్రభువుని నమ్మినవారు జ్ఞానం కలిగి మెలకువతో ఉంటారు కనుక ఎటువంటి మోసాలలోనూ పడరు. మోసం చేయరు. మోసగాళ్లు జక్కయ్యలా ప్రభువును చేర్చుకుంటే అన్యాయంగా తీసుకొనిన వారికి తిరిగి నాలుగంతలు ఇచ్చి ప్రభువు ఇచ్చే దీవెనలు పొందుకుంటారు.
మత్తయి 19:29 - నా నామము నిమిత్తము భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు నూరు రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.
ప్రభువు న్యాయవంతుడు గనుక ఆయనను నమ్మిన వారికి అన్యాయం జరుగనివ్వడు. జరిగినా తిరిగి నాలుగురెట్లు న్యాయం చేకూరుస్తాడు. నూరు రెట్లు కూడా ఇస్తాడు.
పౌలు భక్తుడు చెప్పినట్లు - ఈ లోకంలో ఏవేవి లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచి క్రీస్తును సంపాదించుకొని ఆయనలో నీతిగా కనపడుటకు శాంతి సమాధానములతో సంతోషముగా జీవించుటకు - ఎటువంటి మోసాలలో నష్టాలలో పడకుండా ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడునుగాక.
*

--మద్దు పీటర్ 9490651256