భక్తి కథలు

భక్తజన రక్షకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ నరసింహస్వామి ఉత్తరాఖండ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల సమీపాన చమోలి జిల్లాలో అలకానంద నదీ తీరాన నరసింహస్వామి కొలువై యున్నాడు. బదరీనాధ్ క్షేత్రానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో నరసింహస్వామి ఆలయం వుంది. ఈ ఆలయానికి కొంచెం దూరంలో ఒక సరస్సు వుంది. దీనిని దండధార తీర్థం అంటారు. ఈ తీర్థానికి దగ్గరలో శంకరమఠం వుంది. ఈ మఠం ప్రాంగణంలో వున్న కల్పవృక్షం సుమారు 2400 సం.ల పూర్వం పెరిగిన వృక్షంగా చెపుతారు.
ఆదిశంకరాచార్యులు ఈ చెట్టు క్రింద కూర్చుని తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో వున్న నరసింహస్వామి చాలా మహిమ వున్నవాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. బధరీనాధ్‌లో వున్న శ్రీ మహావిష్ణువు ఆలయంలో నరసింహస్వామిగా వెలిసారని చరిత్ర చెపుతోంది.
బదరీనాథ్ క్షేత్రానికి జోషిమఠ్ సింహద్వారంగా చెప్తుంటారు. ఇక్కడ వున్న నరసింహస్వామిని దర్శించి భక్తితో పూజిస్తే మనసులో వున్న కోరిక తప్ప ఫలిస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ వున్న కల్పవృక్షం క్రింద ఆదిశంకరాచార్యులు తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందాడు. జ్యోతి రూపంలో స్వామి సాక్షాత్కారం లభించిందట. ఆ కారణంగా ఈ ప్రాంతానికి జ్యోతిర్మథం అనే పేరు వచ్చిందని పూర్వీకులు చెప్తున్నారు. ఈ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో చిన్న శివాలయం కూడా వుంది. ఇక్కడ వున్న శివలింగం కేదార్‌నాధ్‌లోని శివలింగాన్ని పోలి వుంటుంది. ఈ మందిరం ప్రక్కన రాజరాజేశ్వరి కొలువై యున్నారు. ఈ ప్రాంతంలోనే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా వున్నారు. హిమాలయ పర్వతాల సమీపంలో వుండటంవల్ల ఈ ప్రాంతం మంచుతో కప్పబడి వుంటుంది. అందువల్ల అనుకూల వాతావరణంలోనే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ప్రాంతంలోనే కుబేరుడు తపస్సు చేశాడని ప్రతీక.
సుమారుగా ఏడవ శతాబ్దంలో కాశ్మీరును పరిపాలిస్తున్న లలితాదిత్య అనే రాజు ఈ ప్రాంతాన్ని దండెత్తి తన రాజ్యంలో కలుపుకొని ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలోని నరసింహస్వామిని దర్శించడానికి ఎంతో పుణ్యం చేసుకొని వుండాలని, ఆ స్వామి అనుగ్రహం వుంటేనే ఆ ప్రాంతానికి చేరగలమని భక్తుల నమ్మకం. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి రుద్రప్రయాగ, కంద ప్రయాగ, దేవ ప్రయాగల మీదుగా రోడ్డు మార్గంలో ప్రయాణించాలి. జోషిమఠ్‌కు తొమ్మిది కిమీల దూరంలో లక్ష్మీవన్ అనే ప్రదేశం వుంది. ద్వాపర యుగంలో ద్రౌపది ప్రాణత్యాగం చేసిన స్థలంగా పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడికి దగ్గరలో సహస్రధారగా పిలిచే వేలాది జలపాతాలు కనిపిస్తాయి.
ఈ సుందర దృశ్యం మరెక్కడా కనిపించదు. ఈ ప్రాంతంలో వున్న కొండపై చక్రతీర్థం వుంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చక్ర ప్రయోగ విద్యను నేర్పిన స్థలంగా ఈ ప్రాంతాన్ని చెప్తుంటారు. ఇక్కడినుండి సుమారు ఐదు కి.మీల దూరంలో స్వర్గారోహణ ప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతంలోనే మహాభారతంలోని చివరిఘట్టం జరిగినట్లు స్థల పురాణం చెప్తోంది. జ్యోషిమఠ్‌కు దగ్గరలో మణిభద్రపురం ఉంది. ఇక్కడ వ్యాసమహాముని మహాభారతాన్ని విరామం లేకుండా చెప్తూ వుంటే గణపతి తన దంతంతో వ్రాసాడాని, ఈ ప్రాంతంలో వున్న కొండ గుహలో గణపతి కొలువై వున్నాడని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. జోషిమఠ్‌ను సందర్శిస్తే చుట్టుప్రక్కల వున్న అనేక మహితాత్మ పురాణ ప్రసిద్ద దేవాలయాలు, సుందర మనోహర దృశ్యాలు తిలకించవచ్చు. ఈ ప్రాంతాలను దర్శించడానికి దైవానుగ్రహం తోడైతే భక్తులు అదృష్టవంతులే. భక్తి ముక్తికి సన్మార్గం ఈ పుణ్యక్షేత్రాల దర్శనం.

-బ్రహ్మ శ్రీ కురువాడ మురళీధర్