పశ్చిమగోదావరి

ఏలూరులో నిరాశ్రయుల వసతిగృహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలెక్టరు భాస్కర్
ఏలూరు, నవంబర్ 20: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో ప్రప్రధమంగా నిరాశ్రయులకు ప్రత్యేక షెల్టర్ హోంను ఏర్పాటుచేయటం జరిగిందని జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ చెప్పారు. స్ధానిక 31వ డివిజన్ పత్తేబాద రైతుబజారు వద్ద ఏలూరు కార్పోరేషన్ ఆధ్వర్యంలో ప్లాష్ టీమ్ నిర్వాహణలో ఏర్పాటుచేసిన నిరాశ్రయులకు వసతిగృహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బడేటి కోట రామారావు(బుజ్జి) ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టరు భాస్కర్ మాట్లాడుతూ రోడ్లపై తిరిగే నిరాశ్రయులను చేరదీసి వారికి సౌకర్యాలు కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఈమేరకు జిల్లాలో ప్రప్రధమంగా ఏలూరు నగరంలో 50మందికి పైగా ఆశ్రయం కల్పించే ఈ షెల్టర్ హోమ్‌లో నిరాశ్రయులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామన్నారు. రోడ్లపై అనాధలు కన్పిస్తే వారిని ఈవసతిగృహంలో చేర్పించి ఆశ్రయం కల్పించాలని, ఈవిషయంలో కార్పోరేషన్ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ దిక్కుమొక్కులేని ఎంతోమంది నిరాశ్రయులు రోడ్లపై భిక్షాటన చేస్తూ కన్పిస్తున్నారని వారందరికి ఈ వసతిగృహంలో ఉచిత భోజన సౌకర్యంతోపాటు రాత్రివేళ హాయిగా నిద్రించేలా పలు సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. సమాజంలో సాటిమనిషిని ఆదుకోవడానికి ఇది ఒక పుణ్యకార్యంగా భావించి ఈవసతిగృహం నిరంతరం కొనసాగించడానికి దాతల సహకారం కూడా అందించాలన్నారు. నగర కమిషనర్ వై సాయిశ్రీకాంత్ మాట్లాడుతూ నిరాశ్రయులు స్వేచ్చగా ఇక్కడ ఆశ్రయం పొందడానికి నిశ్చింత అనే నామకరణతో ఈ వసతిగృహాన్ని ఏర్పాటుచేశామని, ప్లాష్ సంస్ధ నిర్వాహణ బాధ్యతలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు, కార్పోరేషన్ పిఓ భాస్కర్, ఇంజనీరు ప్రదీప్‌కుమార్, ఎలక్ట్రికల్ ఎఇ సాయిప్రసాద్ పాల్గొన్నారు.

108 గ్రామాల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ
జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి
తాళ్లపూడి, నవంబర్ 20: జిల్లాలోని 108 గ్రామాలలో రూ.134కోట్లతో ప్రయోగాత్మకంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టం ఏర్పాటుచేయనున్నట్టు జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం మలకపల్లి ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఏర్పాటుచేసిన నియోజకవర్గ గ్రామ వికాస యాత్ర ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఎం చంద్రబాబు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రజా సంక్షేమం, అభివృద్ధిని ఏ మాత్రం విడనాడక గత ప్రభుత్వాల కంటే మిన్నగా పరిపాలన అందిస్తున్నారన్నారు. సన్నచిన్నకారు రైతాంగానికి రూ.50వేలు చొప్పున రుణమాఫీ చేసిన ఘనత టిడిపిదేనన్నారు. వృద్ధులకు, వితంతువులకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏటా రూ.12వేలు అందజేసే ఏకైక ప్రభుత్వం టిడిపియేనన్నారు. కొవ్వూరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం ఎప్పుడూ అందజేస్తానని, దీనిలో భాగంగా మలకపల్లి గ్రామానికి రూ.1.3కోట్లతో భూగర్భడ్రెయినేజీ మంజూరు చేసినట్టు తెలిపారు. ఉపాధి హామీ పథకం పనులను గ్రామంలో అవసరమైన వౌలిక వసతులతో క్రోడీకరించి రూ.250 కోట్లతో ప్రణాళిక రూపొందించామన్నారు. రూ.10లక్షలు పంచాయతీ భరిస్తే మరో పది లక్షలను జడ్పీ మంజూరు చేస్తుందన్నారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో 50 శాతం దాతల విరాళాలతో రూ.24లక్షలు విలువైన రాత బల్లలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మలకపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న సొసైటీ అధ్యక్షుడు జొన్నలగడ్డ చౌదరి సహకారంతో పంచాయతీకి అందజేసిన ట్రాక్టర్‌ను, వాటర్ ట్యాంకును జడ్పీ ఛైర్మన్ బాపిరాజు, చాగల్లు జడ్పీటీసీ విక్రమాదిత్య ప్రారంభించారు. తిరుగుడుమెట్ట రైతులకు మంజూరైన రూ.24లక్షలు విలువైన వరికోత యంత్రాన్ని టిడిపి నేతలు పెండ్యాల అచ్చిబాబు ప్రారంభించారు. గ్రామస్థులు చెత్త వేసుకునేందుకు ప్లాస్టిక్ బుట్టలను మహిళలకు అందజేశారు. సమావేశానికి ముందు కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ చేపట్టిన వికాస యాత్ర మలకపల్లి ఆసుపత్రి వీధిలో మొక్కలు నాటడంతో పూర్తయింది. స్థానిక నేతలు మద్దిపాటి ప్రకాశం, మద్దుకూరి విష్ణురావు, టిడిపి మండల శాఖ అధ్యక్షుడు ఆత్కూరి రాంబాబు, సర్పంచ్ గెడ్డం మునికుమారి, ఎంపిపి కె అనంతలక్ష్మి, జడ్పీటీసీ కైగాల మంగాభవాని, ఎఎంసి ఛైర్మన్ ఆళ్ల హరిబాబు, ఎం వెంకటేశ్వరరావు, వైస్ ఛైర్మన్ మైనం అనిత తదితరులు ఎమ్మెల్యే జవహర్‌తోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర చివరిలో రహదారికి ఇరువైపులా జడ్పీ ఛైర్మన్ బాపిరాజు, నాయకులు అచ్చిబాబు తదితరులు మొక్కలు నాటారు.
వ్యవసాయ అనుబంధ పారిశ్రామిక సంస్థ ఏర్పాటుతో మహిళలకు ఉపాధి
ఉండి, నవంబర్ 20: వ్యవసాయ రంగంతోపాటు వ్యవసాయ అనుబంధ పారిశ్రామిక సంస్థ ఏర్పాటు చేస్తే మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని రాష్ట్ర గనులు శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. మండలంలోని ఆరేడు గ్రామంలో పొలాల పరిశీలనకు వచ్చిన ఆమె శుక్రవారం విలేఖరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. తుందుర్రులో ఆక్వా ఫుడ్ పరిశ్రమ వలన సుమారు మూడు వేల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. అక్కడ కొన్ని గ్రామాలలో సమస్యలు ఉంటే వాటిని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. చిన్నచిన్న సమస్యలు వలన ప్రగతిని అడ్డుకోవడం తగదని ఆమె పేర్కొన్నారు.
22 వరకు సరుకుల పంపిణీ
ఏలూరు, నవంబర్ 20: అకాల వర్షాల కారణంగా చౌకధరల దుకాణాల నుంచి పంపిణి చేసే సరుకులను వినియోగదారులు తీసుకునే గడువును ఈనెల 22వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు తెలిపారు. వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు ఇంకా సరుకులు తీసుకోలేదని తెలిసిందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఈనెల 22వ తేదీ వరకు చౌకడిపోల్లో వీటిని పొందేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. డీలర్లు అందరూ 22వరకు వినియోగదారులకు పంపిణి చేయాల్సిన సరుకులను అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.