మెయిన్ ఫీచర్

సంగీత సామ్రాజ్ఞి ( నేడు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి శత జయంతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌసల్యా సుప్రజారామా! పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం- అంటూ ఆ కలియుగ దైవాన్ని మేల్కొలిపే ఆ గాన మాధుర్యం నేటికీ ప్రతి ఇంటిలోనూ మారుమోగుతూనే వుంటుంది. ప్రాతఃకాలంలో మధుర మంజులంగా వినబడే స్వరం ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిది. కర్నాటక శాస్ర్తియ సంగీతం పేరు చెబితే తొలుత వినబడే పేరు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి.
తన గాన మాధుర్యాన్ని కోటానుకోట్లమందికి పంచి యిచ్చి ప్రపంచ స్థాయిలో ఎనలేని కీర్తిని సంపాదించుకున్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 1916 సెప్టెంబర్ 16న మధురైలో శ్రీమతి షణ్ముఖ వడివు, శ్రీ సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు జన్మించారు. తల్లి వీణావిద్వాంసురాలు కావడంతో సుబ్బులక్ష్మికి తల్లినుంచే ప్రేరణ పొందారు. ఆమె వద్ద వీణ నేర్చుకున్నారు. తరువాత ఆమె వద్దే గాత్రమూ నేర్చుకున్నారు. అక్క, అన్నదమ్ములతో అనుక్షణం ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కన్నతల్లి జరిపే సంగీత సాధనే తనను గాయనిగా తీర్చిదిద్దిందని ఆమె అనేవారు, అమ్మ అడుగుల చప్పుడు విన్పిస్తే చాలు సంగీత సాధన మొదలుపెట్టేసేవారమంటూ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకునేవారు. భగవంతుని కీర్తన ఆలపిస్తుంటే అచంచల భక్తితో కళ్లు మూసుకుని ఆలపించే ఆమెలో అంతటి భక్తివిశ్వాసాలకు బీజం వేసింది మాత్రం తండ్రిగారే. సంప్రదాయబద్ధ కుటుంబంలో జన్మించిన ఆమె చివరివరకూ అలాంటి జీవితానే్న ప్రేమించారు. ఆచరించారు.
తల్లిదండ్రులు ‘కుంజమ్మ’ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ సంగీత సరస్వతి చిన్నప్పటినుంచి రేడియో సంగీతం శ్రద్ధగా వినేది. గుడిలో పాటలు పాడడంతో సుబ్బులక్ష్మి సంగీత కెరీర్ మొదలైంది. చిన్న వయసులో గ్రామఫోన్ రికార్డులో పాటలు విన్న ఆమె కాగితాన్ని గుండ్రంగా చేసి దానిని నోటి దగ్గర పెట్టుకుని గంటల తరబడి సాధన చేసేవారట. సుబ్బులక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి మద్రాసుకు తీసుకెళ్లి ఆమె పదవ ఏట 78 ఆర్‌పిఎం రికార్డుతో రెండు కీర్తనల రికార్డింగ్ ఇప్పించారు.
13వ ఏట నుంచే కచేరీలు!
తరువాత తన 13వ ఏటనుంచి ఆమె కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు. ఆమె 17వ ఏట 1934లో మద్రాసు మ్యూజిక్ అకాడమీలో చేసిన కచ్చేరీ ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ కచేరీకి వచ్చిన సంగీత విద్వాంసులెందరో సుబ్బులక్ష్మి గాన మాధుర్యానికి పరవశులయ్యారు. చెంభై వైద్యనాథ భాగవతార్ వేదికపైకి స్వయంగా వచ్చి ఆమెను అభినందించారు. అలాగే టైగర్ వరదాచార్యులు ఆశీస్సులందించారు. ఆ తరువాత ఆమె త్యాగరాజకృతుల రికార్డు ఇచ్చారు.
ఎం.ఎస్.సుబ్బులక్ష్మి పాడుతుంటే అమ్మవారే పాడుతున్నట్లు భావిస్తారు. చేతిలో తంబూరు చేత పట్టుకుని తన్మయత్వంతో కనులు మూసుకుని సంగీతాలాపన మొదలెట్టగానే శ్రోతలు ఆమె గానామృతంలో మునిగిపోతారు. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలను, శాస్ర్తియ, లలితగీతాలను, జానపద గేయాలు, భజన్స్, మరాఠీలో అభ్యాంగ్స్, దేశభక్తి గేయాలు పాడారు. అన్నింటిలో ఏ భాషకాభాషనే అదే తన మాతృభాష అన్న రీతిలో స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా పలుకుతూ ఆలపించడం ఆమె ప్రత్యేకత. శృతి, లయ, ఆలాపనలతోపాటు భావోద్వేగాలు, భక్తిరసాన్ని ఒలికిస్తూ శ్రోతలను తనతోపాటు భక్తిమార్గంలోకి తీసుకెళ్ళిపోగలరు.
ప్రతి పదం, భావం ఆ పలుకులోని మాధుర్యం ఉద్వేగాలను పలికించడానికి నెలల తరబడి మననం చేసుకుంటుండేవారు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మిగారి విష్ణు సహస్రనామం విని అగ్నిహోత్రం తాతాచారియార్ అనే ఆయన మాలాంటి ఎందరో పండితులకు కూడా ఎన్నో జన్మలెత్తినా వంటబట్టని సంస్కృత ఉచ్ఛారణా ప్రతిభ ఆమె ఎలా పట్టుకోగలిగింది? అని ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు.
నిరాడంబరమే ఆభరణం..
ప్రపంచానికి ఆమె కర్నాటక సంగీత స్వరరాణి. ఎంతో ప్రతిభ వున్నా గొప్ప సంగీత కళాకారిణి అయినా, జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నా, వారందరూ కోరి పాడించుకునే అపూర్వ గాయని అయినా ఇసుమంత అహంభావం లేకుండా నమ్రతని కోల్పోని నిరాడంబరమైన గొప్ప వ్యక్తి.
ఈ సంగీత సామ్రాజ్ఞి గాన కచేరీని ఏర్పాటుచేయడం గౌరవంగా భావించే వారెందరో ఉండేవారు.ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అంతటివారు కూడా తను ఏ ప్రాజెక్టు చేపట్టబోతున్నా తప్పనిసరిగా ఎం.ఎస్.సుబ్బులక్ష్మి ప్రార్థనాగీతంతో మొదలుపెట్టాలని కోరుకునేవారు. ఆమె ప్రార్థనాగీతంతో ఆరంభిస్తే శుభం జరుగుతుందని ఇందిరమ్మ విశ్వాసం.
భర్త ప్రోత్సాహంతో సినిమాలలోనూ
భర్త సదాశివం ప్రోత్సాహంతో ఆమె కొన్ని సినిమాలలో కూడా నటించడం విశేషం. 1938లో ‘సేవసదన్’ సినిమాలోను, కాళిదాసు అనుపమ కృతి ‘శకుంతల’ సినిమాలో ప్రముఖ కర్నాటక సంగీత గాయకుడు జి.ఎన్.బాలసుబహ్మణ్యం దుష్యంతునిగా నటించగా ఆమె శకుంతలగా నటించారు. తరువాత ‘సావిత్రి’ సినిమాలో నారద పాత్ర ధరించారు. 1944లో తమిళ, హిందీ భాషలలో వచ్చిన ‘్భక్తమీరా’ చిత్రంలో కూడా నటించారు. ఈ చిత్రం అవుట్‌డోర్ షూటింగ్‌కోసం బృందమంతా ఉదయపూర్ వెళ్లినపుడు అక్కడ ఆమె ఒక కచ్చేరీ ఇచ్చారు. ఈ కచేరీకి వచ్చిన ఉదయపూర్ రాణాగారు ఆమె ఆలపించిన కళ్యాణి, కేదార, గౌళారాగాల కీర్తనలు రాణాను ఎంతగానో ఆకర్షించాయి.
ఉత్తర భారతంలో ఆమె చేసిన కర్నాటక సంగీత కచ్చేరీలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఢిల్లీ, భోపాల్, ముంబాయి, అలహాబాద్‌లలో తెలుగు, కన్నడ, తమిళం పాటలతో పాటు హిందీ భజనలు వినిపించి శ్రోతలను మైమరపించేవారు. మీరాభజన్‌లతోపాటు, త్యాగయ్య కృతులు తుకారం అభంగ్‌లు పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవారు సుబ్బులక్ష్మి.
పారితోషికాలన్నీ పరమాత్మునికే..
తన గానామృతంతో భగవంతుడిని సైతం తన్మయుడిని చేసే ఆమె తన సంగీత కచేరీలు ద్వారా ఆర్జించిన కోట్లాది రూపాయల పారితోషికాలను ఆ పరమాత్మునికి అందజేశారు. ఆ భగవంతుడే తనచేత పాడిస్తున్నాడంటూ ఆమె అనేక సేవా సంస్థలకు, దేవాలయాలకు విరాళాలను అందజేశారు. కస్తూరిబా స్మారక నిధికి దాదాపు మూడు కోట్ల రూపాయలను అందజేశారు. అలాగే టిటిడి దేవస్థానానికి, రామకృష్ణ మిషన్‌లాంటి సేవా సంస్థలకు కోట్లాది రూపాయలను రాయల్టీల రూపంలో అందజేశారు.
ఆమె యిచ్చిన బాలాజీ పంచరత్నమాలతో అన్నమాచార్యుల కీర్తనలకు అంతర్జాతీయంగా గొప్ప ప్రచారం లభించింది. ఆనాటికి అన్ని తాళ్ళపాక సంకీర్తనలు పాడినవారు మరొకరు లేరు. తిరుమల తిరుపతి దేవస్థానంవారు ‘సప్తగిరి సంగీత’ విద్వన్మణిగా నియమించారు. శ్రీవేంకటేశ్వర సుప్రభాతం, విష్ణుసహస్రనామ స్తోత్రమ్ గానం చేసిన క్యాసెట్‌లపై ప్రతిఫలాన్ని దేవస్థానానికే చెందినట్లు ప్రకటించిన గొప్ప త్యాగశీలి.
శ్రీత్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల గార్లను సంగీత మూర్తిత్రయమంటారు. అలాగే ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, ఎం.ఎల్.వసంతకుమారి, డి.కె.పట్టమ్మాళ్ గార్లను సంగీత సామ్రాజ్ఞులుగా గౌరవిస్తారు. సుబ్బులక్ష్మి అన్నమాచార్య కీర్తనలను, వసంతకుమారి పురందరదాసుల కీర్తనలను, పట్టమ్మాల్ ముత్తుస్వామి దీక్షితుల కృతులను బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొనివచ్చారు.
అరుదైన గౌరవం
లెజండరీ గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మికి అరుదైన గౌరవం ఇటీవలనే లభించింది. 50 ఏళ్ళ క్రితం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తన గానంతో ఓలలాడించిన ఈ గాన కోకిల శతజయంతి నేపథ్యంలో ఐరాస ఒక స్టాంపును విడుదల చేసింది. అంతేకాకుండా 70వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఐరాస తన ప్రధాన కార్యాలయంలో ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహమాన్‌తో సంగీత కచేరీ సైతం ఏర్పాటుచేసి ఆ కర్నాటక సంగీత విద్వాంసురాలు పట్ల తమకున్న గౌరవాభిమానాలను చాటుకుంది. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తరువాత ఐరాస జనరల్ అసెంబ్లీలో ఆలపించిన రెండవ భారతీయ గాయకుడు ఎ.ఆర్. రెహమాన్.
ఏడు దశాబ్దాలపాటు తన దేవతా గాత్రంతో ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసిన ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 2004 డిసెంబర్ 11న చెన్నైలో కన్నుమూశారు. శతజయంతి సందర్భంగా కోట్లాదిమంది ఆమె సంగీత అభిమానులు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ కళామతల్లి ఆశీస్సుల తీసుకునేందుకు నేడు సమాయత్తమవుతున్నారు.

అవార్డులెన్నో సొంతం..

‘‘ఆమె గళంలో వీణలే కాదు, కోయిలలు గూడుకట్టుకొని కాపురం చేస్తున్నాయన్నారు’’ రసజ్ఞులు. ఎం.ఎస్.సుబ్బులక్ష్మి రెండు గంటలకు పైగా నిర్విరామంగా కచేరీ చేసినా శ్రోతలు మంత్రముగ్ధులై వినేవారు.
సంగీత కళానిధి అవార్డును పొందిన తొలి మహిళ. అలాగే భారతరత్న అవార్డుని పొందిన తొలి కర్నాటక గాయకురాలు కూడా. ఒక సందర్భంలో ప్రముఖ భరతనాట్య కళాకారిణి రుక్మిణీ అరండేళ్, ‘కుంజమ్మా ఇతరులకు కనీసం కొన్ని అవార్డులైనా వదలాలి నువ్వు’ అన్నారట నవ్వుతూ. సంప్రదాయ శాస్ర్తియ కర్నాటక సంగీతాన్ని పాశ్చాత్య ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి కూడా ఎం.ఎస్.సుబ్బులక్ష్మినే. భారతరత్నానికి ప్రతీక ఆమె. బిరుదులు, సత్కారాల స్థాయిని ఆమె ఏనాడో అధిగమించారు. 1956లో రాష్టప్రతి అవార్డు, 1968లో మద్రాసు మ్యూజిక్ అకాడమీ వారి సంగీత కళానిధి అవార్డు, 1974లో రామన్ మెగ్సెసే అవార్డు, 1975 న పద్మభూషణ్ అవార్డు, 1998లో భారతరత్న అవార్డును.. ఇలా ఎన్నో అవార్డులను ఆమె అందుకున్నారు.

రాష్టప్రతి నారాయణ్‌ను నుంచి భారతరత్న అవార్డును స్వీకరిస్తున్న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి

త్యాగరాజన్ సదాశివంతో వివాహం
గాంధేయవాది త్యాగరాజన్ సదాశివంతో 1940లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి వివాహం జరిగింది. ఆనాటి రాజకీయ ప్రముఖులతో పరిచయంగల సదాశివం తన భార్య సుబ్బులక్ష్మిని గాంధీజీ, నెహ్రూ, రాజాజీ వంటి ప్రముఖులకు పరిచయం చేశారు.

జవహర్‌లాల్ నెహ్రూకి ఆమె పాటలు అంటే ఎంతో ఇష్టం. ఆమె పాడిన మీరాభజన్‌లు విని, ‘‘నాదేముంది నేను కేవలం ప్రధానమంత్రినే. సుబ్బులక్ష్మి సంగీత సామ్రాజ్యానికే సామ్రాజ్ఞి’’ అంటూ ప్రస్తుతించారు.

- ఎ.సి.పుల్లారెడ్డి