ఈ వారం కథ

వరలక్ష్మీ ఆంటీ ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వే స్టేషన్... ప్రతిరోజూ సాయంత్రం అయిదున్నరకల్లా అక్కడుంటాను. పావు తక్కువ ఆరుకు లోకల్ ట్రెయిన్ వుంది. బస్సులోనూ వెళ్ళొచ్చు. కానీ, ట్రాఫిక్ జాముల్లోంచి ఇల్లు చేరేసరికి చాలా ఆలస్యమైపోతుంది. ఆ రోజు సాయంత్రం అయిదున్నరకు కాస్త ముందుగానే ప్లాట్‌ఫాం మీదున్నాను. అక్కడ చాలా తక్కువమంది వున్నారు. అటూ, ఇటూ పచార్లు చేస్తుండగా నా దృష్టి ఓ సిమెంట్ బెంచ్‌మీద కూర్చున్న వరలక్ష్మి ఆంటీ మీద పడింది.
సుమారు నాలుగేళ్ళ క్రితం వరలక్ష్మిగారి ఫ్యామిలీ మా ఇంటి పక్కనే వుండేది. నేను ఆఫీసుకు వెళ్ళేటప్పుడు నవ్వుతూ పలకరించేది.. ‘ఆఫీసుకా నీలిమా..?’ అంటూ. ఆమె భర్త బ్యాంక్ మేనేజర్‌గా పనిచేసి రిటైరయ్యారు. వాళ్ళకు శరత్ ఒక్కడే కొడుకు. శరత్, మా అన్నయ్య అభిరామ్ ఒకే వయసు వాళ్ళు. స్నేహితులు కూడా. కలిసి సినిమాలకు, క్రికెట్ మ్యాచ్‌లకు వెళ్ళేవారు. ఆ తరువాత వాళ్ళు ఇల్లు మారడంతో క్రమక్రమంగా మా మధ్య సంబంధాలు తగ్గిపోయాయి.
వరలక్ష్మి ఆంటీ బాగా చిక్కిపోయారు. జుట్టు కూడా తెల్లబడింది. ముఖంపై ముడతలు కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఒకలాంటి మెరుపు, పెదాలపై తొణికిసలాడే నవ్వు ఇపుడు లేవు.. ఆ కళే వేరు.. దగ్గరగా నడిచాను.
‘నమస్తే ఆంటీ.. ఎలా ఉన్నారు.. గుర్తుపట్టారా..?’
ఉన్నట్టుండి నేను కనిపించేసరికి గుర్తుపట్టడానికి ఆమెకి ఓ రెండు క్షణాలు పట్టింది.
‘ఓ నువ్వా.. నీలిమా.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి..?’ కూర్చున్నావిడ లేచి నిలబడింది. ఆప్యాయంగా నా రెండు చేతుల్నీ దగ్గరకు తీసుకుంది.
‘ఎన్నాళ్ళయింది చూసి.. ఎలా వున్నారు అమ్మా, నాన్న.. అంతా..’
‘బావున్నాం ఆంటీ’
‘ఇలా వచ్చావేమిటి?’
‘ఆ జాబ్ మారిపోయాను. మా ఆఫీసు ఈ స్టేషన్‌కు దగ్గర్లోనే వుంది. అందుకే లోకల్ ట్రెయిన్‌లో వెళ్ళడమే వీలు.. పావు తక్కువ ఆరుకుండే లోకల్‌లో వెళుతుంటాను..’
‘అలాగా.. బావుందమ్మా.. ఏమీ తోచక నేను అప్పుడప్పుడూ వచ్చి ఇక్కడ కూర్చుంటాను.. ఇక్కడికి దగ్గర్లోని కాలనీలోనే మేం వుండేది.. నినె్నప్పుడూ చూడలేదే..? ఎలా మిస్సయ్యాను..?’
‘ఇవేళ అంతగా జనం లేరు. కానీ మామూలుగా ఈ సమయానికి ఎక్కువే వుంటారు కదా ఆంటీ..?’
‘అవును.. మీ అభీ ఎప్పుడూ గుర్తొస్తుంటాడు.. ఏం చేస్తున్నాడు..? మీరు అక్కడే వుంటున్నారా ఇంకా..?’
‘అవునాంటీ.. ఆ కాలనీ బాగా అలవాటైపోయింది. పైగా అభీ పనిచేసే ఆఫీసు బాగా దగ్గర..’
మేం మాట్లాడుతుండగానే పావు తక్కువ ఆరుకు లోకల్ ట్రెయిన్ వచ్చేసింది.
‘నా ట్రైను వచ్చేసింది ఆంటీ.. అంకుల్‌కు నా నమస్కారాలు తెలియజేయండి. శరత్ ఎలా ఉన్నాడు..? పెళ్ళయిందా..? ఒంటరిగానే వున్నాడా..?’’
ఆ మాటకు వెంటనే ఆంటీ ముఖం పాలిపోయినట్లయింది.. పెదవుల్లో ఒక వణుకు. ‘వాడేం పాపం చేశాడని.. ఎక్కడున్నాడో..’ చెబుతుంటే ఆమె గొంతులో జీర.
‘వాడు ఈ లోకంలో లేడమ్మా’ ఏడుస్తూ చెప్పింది.
నిర్ఘాంతపోయాను. ‘సారీ ఆంటీ.. నాకు తెలియదు..’
రెండు నిముషాలు మాత్రమే ఆగిన ట్రైను వెంటనే కదిలింది. కంగారుగా పరుగులతో ఎక్కే జనం. వాళ్ళతోబాటు నేనూ. కళ్ళల్లో నీళ్ళు పైట కొంగుతో వత్తుకుంటూ భారంగా వెనక్కి అడుగులు వేస్తూ ఆంటీ కదిలింది. నా కళ్ళలో ఒక్కసారి శరత్ మెదిలాడు.. అతని గురించి ఏమీ అడగలేదు. ఏం జరిగిందసలు..? ఎలా పోయాడు? యాక్సిడెంటా...?
రైలు వేగంగా ముందుకు... ఆలోచనలు వెనక్కి...
ఆంటీతో సరిగా మాట్లాడనందుకు బాధేసింది. అంత బాధపడుతూ ఆమె చెబుతూ వుంటే- ట్రైను కదిలిపోతోందని హడావుడిగా ఏమీ తెలుసుకోకుండా వచ్చేయడం నాకే నచ్చలేదు. సంస్కారం కాదనిపించింది.. ‘ఈసారి కలవాలి’ అని గట్టిగా అనుకున్నాను. ట్రైను దిగేదాకా ఆంటీ, శరత్ గుర్తొస్తూనే వున్నారు. ఆంటీకి అరవై ఏళ్ళుంటాయి. ఈ వయసులో అంత షాకా..?
ఇంటికెళ్ళిన తరువాత అభీతో అన్నాను- ‘శరత్ తెలుసుగా..? ఈవేళ వరలక్ష్మీ ఆంటీ కలిసింది. ఆమె ఎంత యంగ్‌గా కనిపించేదో కదా.. ఇపుడు ఏజ్డ్ లుక్ వచ్చేసింది. పరిస్థితులు...’’
అభీ చేతిలో ‘గాన్ విత్ ది విండ్’ ఇంగ్లీషు నవల.. పూర్తిగా అందులో మునిగిపోయి వున్నాడు. ఓసారి పైకి చూశాడు.. వాడికి ఫ్రెండ్స్ చాలా తక్కువ. పెళ్ళయ్యాక ఆ కొద్దిమందీ కూడా లేరు.
‘శరత్ చనిపోయాడు..’
‘ఏమిటి..? ఎలా..?’
‘ఏమో నాకూ తెలియదు. నా ట్రైను వచ్చేయడంతో కంగారుగా వచ్చేశాను. ఈసారి కలుసుకుని ఆంటీని అడుగుతాను.. చాలా దారుణం కదా.. అంత చిన్న వయసులో. నీకు మంచి ఫ్రెండ్ కదా..’
‘అవును..’ అంటూ మళ్లీ కళ్ళు నవల్లోకి దూర్చేశాడు.
పెద్దగా ఆసక్తి చూపించలేదు ఈ విషయం పట్ల అనిపించింది. బబ్లూ వచ్చాడు.. వాడు రెండేళ్ళవాడు. అభీ కొడుకు. ఇంట్లో వాడంటే ఎంత ముద్దో.. వాడు చాలా చురుకు.. మంచి తెలివైనవాడు. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాడు.. వాడిని ఎత్తుకోవాలని దగ్గరికి వెళ్ళాను. వాడు నన్ను పరుగులు పెట్టించాడు. వాడితో ఆటల్లో పడి శరత్ విషయమే మరచిపోయాను.
మరునాడు కాస్త ముందుగానే బయలుదేరి ప్లాట్‌ఫారమ్ చేరుకున్నాను. అక్కడ ఆంటీ.. నా కోసమే ఎదురుచూస్తున్నట్లుగా వుంది. నేను ఆమె కోసం సమయం కేటాయించలేనా? ఆవిడ కళ్ళల్లో ఏదో చెప్పాలనే ఆతృత కనిపించింది. పోతే పోనీ పావు తక్కువ ఆరు ట్రైను. మిస్సయితే ఏమవుతుంది? ఏం కొంపలంటుకుపోతాయి? మరో గంట ఆలస్యమవుతుంది. అంతేగా..? అయితే అయింది. ఆమె చెప్పేది వినాలని, ఆమె గుండె బరువు దించాలని అనుకున్నా. నా భుజంమీద ఎంతో ఆప్యాయంగా ఆంటీ చేయి వేసింది.
‘శరత్ గురించి తెలుసా?’
ఆమె భుజంమీద చేయి వేశాను. ‘చెప్పండి ఆంటీ.. అసలేం జరిగింది..?’.
ఇద్దరం ఆ బెంచీ మీద కూర్చున్నాం. వరలక్ష్మిగారు ఏం మాట్లాడకుండా వుండిపోయారు. నెమ్మదిగా పెదవి విప్పింది.
‘మీకు తెలియదేమో.. వాడికి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చిన విషయం. మేం భువనేశ్వర్ షిఫ్ట్ అయ్యాం. వాడికి సంబల్‌పూర్‌లో పోస్టింగిచ్చారు.. పిచ్చితండ్రి అక్కడికి వెళ్ళాడు.. ఆ ప్రాంతం పేరు చెప్పగానే ముందు భయం వేసింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య నిత్యం ఎదురుకాల్పులు.. పేపర్లలో, టీవీల్లో వార్తలు.. ఓ రోజు భువనేశ్వర్ స్టేషన్‌లో ప్లాట్‌ఫారం మీద నిలబడి వాడిని ట్రైన్ ఎక్కించాం.. చేతులు ఊపుతూ సాగనంపాం..’ ఆంటీ దుఃఖం ఆపుకోలేకపోయింది. కట్టలు తెంచుకుంది.
‘ఊరుకోండి ఆంటీ.. నిన్న అభీతో చెప్పాను. వాడు చాలా బాధపడ్డాడు’ ఓదారుస్తూ అబద్ధం ఆడాను.
‘అవునమ్మా.. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వాడెప్పుడూ అభీ గురించే అడిగేవాడు. హైదరాబాద్ వెళ్ళి చూడాలనుకున్నాడు. ట్రైన్ టిక్కెట్ బుక్ చేసుకున్నాక క్యాంపుకెళ్ళాల్సి రావడంతో కేన్సిల్ చేసుకున్నాడు. అంతా ఆ దేవుడి నిర్ణయం.. మనం నిమిత్తమాత్రులం.. మన చేతుల్లో ఏముంటుంది..?’ అని చెబుతున్నపుడు ఆ గొంతులో ఓదార్పుకు లొంగని బాధ, నిస్సహాయత.
‘‘.....’’
‘నీకు తెలుసుగా.. మీ అంకుల్ ఆరోగ్యం అంతంత మాత్రమేనని. శరత్ చనిపోయాడన్న వార్త ముందుగా ఆయనకు తెలిసింది. వౌనంగా వుండిపోయారు. నాకు తెలుసు- ఆయన ధైర్యం నటిస్తున్నారని. ఆయన భోరున ఏడిస్తే బావుండేదని అనిపించింది. అప్పుడొచ్చిన హార్ట్‌స్ట్రోక్‌తో ఆయనకి నడవలేని పరిస్థితి ఏర్పడింది. నేను మొండిదాన్ని, నిలబడగలిగాను. నేను ఎన్నాళ్ళుంటానో.. అయినా వుండాలి.. లేకపోతే ఆయనె్నవరు చూస్తారు..?’ బాధ తన్నుకుంటూ బయటికొచ్చింది.
‘ఊరుకోండి.. ఆంటీ’
‘్ఫనులో వాడి గొంతు విన్నది మల్కాన్‌గిరి నుంచి. అంతే.. వాడేదో కూంబింగ్ ఆపరేషన్ వుంది మర్నాడు అని అన్నాడు. ఆ కాల్పుల్లో శరత్...’ అంటూ భోరుమంది. ప్రత్యేక హెలికాప్టర్‌లో భువనేశ్వర్‌కు తీసుకొచ్చారు ప్రాణం లేని వాడి శరీరాన్ని.. ఇంకా బతికున్న ఈ ఆంటీని స్నేహితులు, బంధువులు అంతా వచ్చి పలకరించారు. మా బాధ మాత్రం అలాగే వుండిపోయింది. భువనేశ్వర్‌లో వుండలేకపోయాం. హైదరాబాద్ వచ్చేశాం. అయినా వాడి జ్ఞాపకాలు మమ్మల్ని వదల్లేదు. అందరికీ ఇదంతా గతం. మేం మాత్రం ఆ గతంలోనే వుండిపోయి బతుకులీడుస్తున్నాం..’ అంది.
నాకు వెంటనే అంకుల్‌ను చూడాలనిపించింది. ఆయన ఒకప్పుడు బైక్ స్టార్ట్ చేసుకుని హుషారుగా ఆఫీసుకు వెళ్ళిపోతుండేవారు. ఇపుడు నడవలేని పరిస్థితి..! ప్చ్..! వీలు చూసుకుని ఓసారి ఇంటికెళ్ళాలి. శరత్ గురించి ఎన్నో విషయాలు ఆంటీ చెప్పింది. వాడికిష్టమైన బట్టలు.. వంటలు.. ఒకటా.. రెండా.. ఎన్నో తలుచుకుని చెబుతూ కన్నీరు పెట్టుకుంది..
‘వాడికి పెళ్లి చేయాలని అమ్మాయిని కూడా చూశాం. వాడూ ఎంతో ఇష్టపడ్డాడు.. పిచ్చితండ్రి.. డ్యూటీమీద వెళ్ళినవాడు వచ్చాక ముహూర్తాలు పెట్టుకుందామనుకున్నాం. కానీ- వాడు తిరిగి రానే లేదు.. వాడి శవం వచ్చింది..’
‘ఆంటీ.. మీరే ధైర్యం తెచ్చుకోవాలి..’
‘కర్తవ్యం, ధైర్యసాహసాల విషయంలో వాడిని అభినందిస్తూ వచ్చిన మెడల్స్, ప్రశంసాపత్రాలు ఎన్నో వున్నాయి. రేపు తీసుకొచ్చి చూపిస్తాను నీకు. ఆ యూనిఫాంలో ఎంత బావున్నాడో... వాడి కళ్ళల్లో దేశభక్తి..’
‘రేపు ఆదివారం ఆంటీ.. సెలవురోజు కదా.. మేం సినిమా కెళదామనుకున్నాం.. నేను.. అభీ, వదిన, బబ్లూ..’
‘మరచేపోయాను.. సెలవు రోజుగా.. అవును మంచి సినిమాహాళ్ళు అవీ ఇటు పక్కే ఎక్కువగా..’
‘అవును ఆంటీ.. అదేదో యానిమేషన్ మూవీ అట.. బావుందంటున్నారు. బబ్లూ బాగా లైక్ చేస్తాడని..’
మరునాడు ఆదివారం.. మధ్యాహ్నం రెండవుతోంది.. రైలు దిగాం. అలవాటుగా నాకళ్ళు ఆ సిమెంట్ బెంచ్‌మీదకెళ్ళాయి. ఆంటీ అక్కడే వుంది. పక్కనే బుట్టలో బొమ్మలు... చాక్లెట్లు.. ఫొటో ఆల్బం..
‘ఆంటీ మీరు..’
‘అవును.. బబ్లూతో సినిమాకెళ్ళాలనుకున్నారు కదా..’
‘కానీ.. ఇంత ఎండలో మీరు రాకుండా వుండాల్సింది ఆంటీ’
ఆమె నవ్వింది. అందరినీ పలకరించింది. అన్నావదినల ప్రవర్తన పొడిపొడిగా అనిపించింది. ఆంటీ బబ్లూ దగ్గరగా వచ్చింది- ‘చూడు బబ్లూ.. నేను నీకోసం ఏం తెచ్చానో..’ అంటూ. నావైపు తిరిగి అంది- ‘మీ తోటీ, పిల్లాడితోటీ కొన్ని క్షణాలైనా గడపొచ్చుకదా.. అభీ.. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా వుంది. శరత్ వుండి వుంటే ఎంత సంతోషించేవాడో... నీ గురించే ఎప్పుడూ మాట్లాడేవాడు..’
ఆంటీ చెప్పలేకపోయిన మాటలేమిటో అర్థమయ్యాయి. శరత్‌కి పెళ్ళయివుంటే, పిల్లవాడుండివుంటే వాడికి కూడా బబ్లూ వయసే వుండేది.
‘మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి..’ అంటూ బబ్లూను ముద్దుపెట్టుకుంది. చాక్లెట్లతో వున్న బాక్స్‌ను వదినకు అందించింది. ఆంటీని అలాగే చూస్తున్నాను. బబ్లూ సందడి చేస్తున్నాడు. కొత్త అనేదే లేదు వాడికి. చక్కగా కలిసిపోతాడు. బొమ్మలు చేతిలో పడిన ఉత్సాహంలో వున్నాడు. ఆంటీతోనే వున్నాడు. ముద్దు ముద్దు చేష్టలతో ఆంటీని ఆకట్టుకున్నాడు. ఆమె కోరిక కోరికగానే వుండిపోయింది. ఆమె తన మనుమడిని చూసుకుంటూ, వాడితో ఆడుకునే అవకాశం దేవుడివ్వలేదు. ఆమెకు ఏదైతే దూరమైందో దానిని ఆమె మా దగ్గర పొందుతున్నట్లు అనిపించింది. ఆంటీ బబ్లూను తన సొంత మనుమడిగా భావించుకుంది. ఆ మధుర క్షణాల్లో తన కొడుకును కబళించిన క్రూరమైన మృత్యువు, అది కలిగించిన మానసిక వేదన ఆమెకు గుర్తుకురాలేదు.
‘రా రా..’ అని పిలుస్తుంటే బబ్లూ ఆమె చుట్టూ అల్లరిగా ప్రదక్షిణాలు చేస్తున్నాడు. స్తంభం చాటుకు వెళ్లి దొంగ చూపులు చూస్తున్నాడు. ఆంటీ కూడా చిన్నపిల్లైపోయింది ఆ క్షణంలో. అది చూసి ముచ్చటేసింది. అభీ,వదిన కొద్ది దూరంలో ఫ్యాను కింద బెంచీమీద కూర్చున్నారు. ఫ్లాట్‌ఫాం ఖాళీగా వుంది. ఏ ట్రైనూ లేదు ఆ సమయంలో. స్తంభం చుట్టూ కట్టిన అరుగులపై అక్కడక్కడా కొందరు నిద్రపోతున్నారు. అభీ నాకేసి చూశాడు. వదిన వాచీ చూసుకుంటోంది. ఇద్దరి ముఖాల్లోనూ అదోలాంటి విసుగు. అర్థం అయింది నాకు. ‘సినిమాకు ఆలస్యమైపోతోంది’ అన్నది వారి సూచన. నేను వాళ్ళ ముఖాల్లో అసహనం గమనించకపోలేదు. నిజమే వెళ్ళాలి. బబ్లూ, ఆంటీ ఎంతో సంతోషంతో ఆడుకుంటున్నారు. మధ్యమధ్య ఆమె ముద్దులు పెడుతోంది. బబ్లూ కేరింతలు.. నేను ఆమె నుంచి బబ్లూను ఎలా లాగేయగలను..? ఆమె పొందుతున్న మధుర క్షణాల్ని ఎలా తెగ్గొట్టగలను? అందుకే అన్నావదినల సూచనలను పట్టించుకోలేదు. ఆలస్యమవుతుంది.. అంతేగా..? ‘మరేం ఫరవాలేదు’ అనిపించింది. ఆ క్షణంలో ఆంటీ ముఖంలో ఆనందమే నాకు ముఖ్యంగా తోచింది. *

-మంత్రవాది మహేశ్వర్- రచయిత సెల్ నెం: 94414 20962