మెయిన్ ఫీచర్

కాలం విలువ తెలిస్తే నిత్యం.. ‘నవ వసంతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం నిరంతర ప్రవాహం లాంటిది. ఒక్క నిమిషం కూడా ఎవరి కోసం ఆగకుండా అది సాగిపోతూనే ఉంటుంది. పాతనీరు పోయి కొత్తనీరు వచ్చి చేరినట్లు పాత రోజులు గడిచిపోయి.. కొత్త రోజులు వస్తూ వుంటాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు మాత్రమే కాదు.. యుగాలకు యుగాలే కాలప్రవాహంలో కలిసిపోతూ వుంటాయి. గడిచిపోయిన క్షణం కూడా మళ్లీ తిరిగి రావటం అసంభవం. అందుకే కాలం విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకుని- ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ, అర్థవంతం చేసుకుంటూ తనకు, తనతోపాటు ఇతరులకూ కాలం ఉపయోగపడేలా చూసుకోవాలి. కాలం లాగే మనిషి జీవితం కూడా ప్రవాహం లాంటిదే. బా ల్యం, కౌమార, యవ్వన, వృద్ధాప్యాలు చూస్తూండగానే గడిచిపోతూ ఉంటాయి. ప్రవాహ ఉధృతిలో మనిషి జీవితం ఎన్నో ఆటుపోట్లకు గురవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు చూస్తుంది. ఒక్కోసారి అనుకోని దుర్ఘటనల కారణంగా ఉన్నచోట ఉన్నట్లే కాలం స్తంభించినట్లు అనిపిస్తుంది. అందుకే అంటారు తత్త్వవేత్తలు ‘ఇది జీవితం..’ అని! జీవితం తనంతట తాను నడిచేదే అయినా- కొన్ని విషయాలకు సంబంధించి దాని పగ్గాలు మన చేతుల్లోనే ఉంటాయి. మన జీవితాన్ని మనం హాయిగా, సుఖంగా.. ఓ పాటలా, ఆటలా గడపాలంటే అందుకు మనవంతు ప్రయత్నం చేయాల్సిందే. జీవితాన్ని మంచిదారిలో నడిపించగల చోదక శక్తి, సామర్థ్యాల కోసం అభ్యాసం చేస్తే మన జీవితం మన సొంతం అవుతుంది. మంచి మనసు, ఆరోగ్యకరమైన అలవాట్లు, చక్కటి వ్యక్తిత్వం అలవరచుకోగలిగిన వాళ్లకి మాత్రమే ఇవి సాధ్యమయ్యేవి. జీవితంలో ఏదో సాధించాలని తపనపడే వాళ్లకు ప్రతి ఉదయం శుభోదయమే. ప్రతిరోజూ జీవన గమనంలో ఒక ముందడుగే. గమ్యం కోసం కృషిచేసేవారికి ప్రతిదినం ఒక వరం లాగే ఉంటుంది. అలాంటిది- సంవత్సరం అంటే ఎన్ని రోజులు..? ఎన్ని వరాలు..? 365 వరాలు. సద్వినియోగం చేసుకున్నవాళ్లకి బతుకంతా పండుగే. ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు అందరి జీవితాల్లోనూ పెద్దవి, గొప్పవి అయి వుండాలన్న నిబంధన ఏమీ లేదు. ఎవరి అభిరుచి,స్థాయిని బట్టి దొరికిన అవకాశాలను ఎంతవరకు సార్థకం చేసుకోగలిగారన్నదే ప్రధానం. నది వద్దకు మనం నీళ్ల కోసం చెంబు తీసుకువెళితే.. చెంబుడు నీళ్లే మనకు దక్కుతాయి. కుండ పట్టుకెళ్ళఓగలిగితే కుండెడు నీళ్లు దొరుకుతాయి. పాత్ర ఎంతటిదైనా ‘దాహం తీరింది కదా’ అన్నదే మనిషికి ఆనందాన్ని కలిగించే విషయం. సంతృప్తిని మించి ఆనందం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ‘ఎంత చెట్టుకు అంత గాలి’ అన్న జీవన సూత్రం అందరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అనుభవమే. మనం ఏటా పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటాం. అలాగే, మనకు ఇంతలా ఉపకారం చేస్తున్న కాలానికీ (అది ఎప్పుడు పుట్టిందో కచ్చితంగా తెలియకపోయినా) కూడా ఒక పుట్టిన రోజు, ఆ సందర్భంగా వేడుక ఉండాలి కదా! అది తెలుగువాళ్ళు చేసుకునే ఉగాది కావచ్చు.. మళయాళీలు చేసుకునే ఓనమ్ కావచ్చు.. బెంగాళీలు చేసుకునే పొహెలా బైశాఖీ కావచ్చు.. ఎవరి లెక్కలను బట్టి వారు ఏటా ఒకసారి ‘కొత్త సంవత్సరం’ సంబరాలు చేసుకుంటారు. ఇంగ్లీషు లెక్కల ప్రకారం జనవరి ఫస్ట్‌న జరిగే న్యూ ఇయర్ వేడుకలను మాత్రం ప్రపంచమంతా పండగలా జరుపుకుంటుంది. కుటుంబ సభ్యులతోనో, బయట ఫ్రెండ్స్‌తోనో, పబ్బుల్లోనో, క్లబ్బుల్లోనో, ఫామ్‌హౌసుల్లోనో ఆటపాటలతో సరదాగా గడపడం ఆనవాయితీగా మారింది. ఈ కొత్త సంవత్సరం అడుగిడిన సమయంలో కూడా సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. శుభాకాంక్షలు చెప్పుకోవడంలోనూ కొత్త పోకడలు చోటుచేసుకున్నాయి. పలు కార్పొరేట్ సంస్థలు, ప్రయివేట్ కంపెనీలు, వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు, కస్టమర్స్‌కి గ్రీటింగ్స్, మెసేజీల ద్వారా శుభాకాంక్షలు అందజేశాయి. ఇలాంటి ప్రయత్నాలు ఆయా సంస్థ వ్యాపారాభివృద్ధికి కూడా దోహదం చేస్తాయి. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆలయాలకు వెళ్లి పూజలు చేసిన వారూ ఉన్నారు. ఎవరు ఏ పద్ధతిలో న్యూ ఇయర్ వేడుకలను జరుపుకున్నా- దాని వెనుక అంతరార్థం, అందరి అభిలాష ఒక్కటే. అంతా సుఖసంతోషాలతో బాగుండాలని. అయితే, ఇలా కోరుకోవడంతోనే వేడుక ముగిసిందనుకుంటే- అది అసంపూర్ణమే అవుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ- ప్రతి ఒక్కరూ తమ ఆకాంక్షలను గుర్తు చేసుకోవడమే కాదు, కొన్ని నిర్ణయాలూ తీసుకోవలసి ఉంటుంది. మనలోని లోపాలను, బలహీనతలను మనమే తెలుసుకుని వాటిని అధిగమించేందుకు కొత్త సంవత్సరంలోనైనా సంకల్ప బలంతో ప్రయత్నించాలి. ఎవరికివారు మేలు చేసుకునేందుకు, ఇతరులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తు గురించి సరికొత్త కలకు మనసులోనే నాంది పలుకుతూ, మన ఆశయాలకు, ఆకాంక్షలకు మరింత పుష్టిని కలిగించేలా మరింత సంకల్పానికి మనసులో చోటు కల్పించగలగాలి. మంచి మనిషిగా, గొప్ప వ్యక్తిగా తనను తాను తీర్చిదిద్దుకోవటానికి న్యూ ఇయర్ వేడుకలు స్ఫూర్తిని కలిగిస్తాయ. కలలు సాకారమైనపుడే కాలానికి సార్థకత సాధ్యమవుతుంది.
-కొఠారి వాణీచలపతిరావు