ఐడియా

గగనసీమకు పతంగుల శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రికార్డులు ఎన్నో..
అతి చిన్న పతంగి ఎగిరే ఎత్తు 5 మిల్లీ మీటర్లేనట. ఒకే దారానికి అత్యధిక గాలిపటాలు (11,284) అమర్చి ఎగరేసిన ఘనత జపానీయుడికి దక్కింది.
ప్రపంచంలో అతి పొడవైన పతంగి 1034 మీటర్లు (3394 అడుగులు). ప్రపంచంలో అతి పెద్ద పతంగి మెగాబైట్ 55 మీటర్ల పొడవు, 22 మీటర్ల వెడల్పు (630 చ.మీ). పతంగి వేగం గంటకు 193 కి.మీ. పతంగి పయనించిన అత్యధిక దూరం (ఎత్తు) 3,801 మీటర్లు, వరుసగా గుచ్చిన పతంగుల పయనం 9,740 మీటర్లు (31,955 అడుగులు). థాయ్‌లాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే 78 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బెర్లిన్ గోడపై నుంచి అవతలికి వెళ్ళే అవకాశం వుండడంతో భారీ పతంగులను ఎగురవేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం విధించారు. ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగుపరుస్తుందని చైనీయుల విశ్వాసం. అలా తల బాగా పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని వారు నమ్ముతారు. ప్రపంచంలో ఏదో ఒకచోట ప్రతి వారం ఒక కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. జపాన్‌లో కొన్ని పతంగుల బరువు 200 కిలోలదాకా ఉంటుందిట.

సంక్రాంతి పండుగ వస్తోందంటే చాలు ఏటా జనవరి నెల ఆరంభంతోటే సర్వత్రా గాలిపటాల కోలాహలం మిన్నంటుతుంది. పాఠశాలలకు సంక్రాంతి సెలవులిచ్చేస్తే పిల్లలకు మొదట గుర్తుకొచ్చేది పతంగులే. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ వంటి దక్షిణాది నగరాల్లోనూ ఇప్పటికీ పతంగుల పోటీలు నిర్వహిస్తున్నారు. దేశం మొత్తమీద చూస్తే అహ్మదాబాద్ (గుజరాత్)లో గాలిపటాల తయారీదారులు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తారు. ఆకాశవీధిలో పతంగుల విన్యాసాలను తిలకించేందుకు పిల్లలే కాదు పెద్దలు సైతం ఉత్సాహం చూపుతుంటారు. గాలిపటాల చరిత్రను ఒకసారి అవలోకిస్తే దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం చైనాలో వీటిని తయారు చేశారని తెలుస్తుంది. మొదట్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారు. ఆ తర్వాత సిగ్నలింగ్, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. ఒకప్పటి గాలిపటాలు మందంగా, దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు. దుర్మార్గుడైన రాజును ఓడించటానికి హేన్ చక్రవర్తికివచ్చిన ఉపాయమే తొలి గాలిపటం. ఆ రాజు కోటలోకి సొరంగాన్ని తవ్వాలనేది ఆలోచన. కానీ, ఎంత దూరం తవ్వాలన్న విషయమై ఆలోచించి హేన్ చక్రవర్తి ఓ పట్టుగుట్టతో గాలిపటంలా చేసి దారం కట్టి ఎగరేశాడు. ఆ దారాన్ని కొలిచి సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడని కథ.
ఆసియా దేశాల్లో పతంగుల పండగ చాలా ప్రసిద్ధి చెందింది. అఫ్ఘనిస్తాన్ ప్రజలు గాలిపటాలను ఎగరవేయటం సంప్రదాయకమైన ఆటగా భావిస్తున్నారు.
మన దేశంలో ఎన్ని పండుగలున్నా సంక్రాంతి అతి పెద్ద పండుగ. ఈ సందర్భంగా గాలిపటాలను ఎగురవేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇటీవలి కాలంలో చైనా గాలిపటాలు మన మార్కెట్‌లో ప్రవేశిస్తున్నాయి. విభిన్న ఆకారాల్లో, వినూత్న రంగుల్లో లభించే పతంగులంటే పిల్లలకు ఎంతో ఆసక్తి. నీలాకాశంలో విభిన్న వర్ణాల గాలిపటాలు ఎగురుతుంటే అందమైన పూలతోటలా గోచరిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని పోటాపోటీగా ఎగురవేస్తూ ‘కైట్ ఫైటింగ్’లను నిర్వహిస్తుంటారు. బిహార్, జార్ఖండ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్ ‘కైట్ ఫైటింగ్’లో ఆరితేరిన రాష్ట్రాలు. చైనాలో గాలిపటాలు నింపిన అతి పెద్ద మ్యూజియమ్ ఉంది. జపాన్, యుకె, మలేషియా, ఇండోనేషియా, తైవాన్, థాయ్‌లాండ్, అమెరికా, సింగపూర్‌లో ఒకప్పుడు వీటిని చేపలు పట్టడానికి ఉపయోగించేవారు.
ప్రజలంతా వారి పనుల్ని మానేస్తున్నారని 1760లో జపాన్‌లో గాలిపటాలను ఎగరేయడాన్ని నిషేధించారు. ఒకప్పుడు యుద్ధాల్లో మనుషులని మోసుకుంటూ ఎగిరే గాలిపటాల్ని ఉపయోగించేవారట. గాలికంటే తేలికగా ఉండే పతంగులను కైటూన్‌లని అంటారు. హైడ్రోజన్, వేడిగాలి, మిథేన్, హీలియం వంటి వాయువులతో వీటిని నింపి ఎగురవేస్తారు. వివిధ ఆకారాల్లో, భారీ పరిమాణాల్లో వీటిని తయారుచేయడం ఇటీవలి కాలంలో ఊపందుకుంది. వినోదం కోసం, ఓ కళగా కాపాడుకోవడానికి వీటిని తయారు చేయడం ఆనవాయితీగా మారింది. పిల్లలు ముచ్చటపడేలా కీటకాలు, పక్షులు, జంతువులు మొదలైన రూపాల్లో వీటిని తయారుచేస్తుంటారు. చీల్చిన వెదురుబద్దల ఆధారాలతో పట్టువస్త్రం ఉపయోగించి హస్తకళా రూపాలతో వీటిని చైనాలో తయారు చేస్తుంటారు.
వినోదానికి మరోవైపు..
గాలిపటాలకు వాడే నైలాన్ దారం పక్షుల ప్రాణాలను హరిస్తున్న సంఘటనలు కోకొల్లలు. వీటిని ఎగరేసే సమయంలో చిన్నారులు గాయాలబారిన పడుతున్నారు. ప్రాణాంతకంగా మారుతున్న చైనా పతంగులను నిషేధించాలంటున్నారు పర్యావరణవేత్తలు. చెట్ల కొమ్మలు, కరెంట్ స్తంభాలకు చిక్కుకున్న గాలిపటాలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

-టివిఎల్లెన్ మూర్తి