ఈ వారం కథ

మనసెరిగిన మనిషి ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శైలజా.. సాయంత్రం ఆఫీసు నుండి తొందరగా వస్తా.. రెడీగా వుండు! షాపింగ్‌కెళదాం..’ బైకు తాళాలు తీసి బయల్దేరుతూ అన్నాడు శ్రీకాంత్.
‘ఇప్పుడెందుకండీ ? అక్కడ ఏం కొనాలి?’ అన్యమనస్కంగా అందామె.
‘ఏం కొంటాం? గోంగూర, కొత్తిమీర..!’ అని పకపకా నవ్వి, ‘నీకోసం చీర!’అని అన్నాడు.
‘ఇప్పుడెందుకండీ చీర? పెళ్లిలో బోలెడన్ని చీరలు బహుమతిగా వచ్చాయి. అమ్మగారు పెట్టినవీ, అత్తవారు కొన్నవీ బోలెడు వున్నాయి, మళ్లీ ఎందుకులెండి’ ముక్తసరిగా అంది.
‘అది వేరే సంగతి. పెళ్లి జరిగాక నీ మొదటి పుట్టినరోజు కదా? నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నా.. ప్లీజ్ కాదనకు!’ అతని మాటలో ఆప్యాయత మూట కట్టుకుని వుంది. ఆమె మరేం తర్కించలేదు. బైక్ వెళ్లిపోయిన చప్పుడు కూడా ఆమె వినలేదు. ఇంత అభిమానంగా చూసుకునే భర్తతో- తను ఎందుకు చనువుగా వుండలేకపోతోంది? తన ప్రవర్తన అతనిలో ఏ మాత్రం అనుమానం, విముఖత, విసుగు కలిగించకపోవడమేమిటి? అతని ఆదరణను తనెందుకు దూరం చేసుకుంటోంది? ... ఈ ఆలోచనలు ఆమె మనసుని అతలాకుతలం చేస్తున్నాయి. తన గతమే తనకి శత్రువా? దీనికి పరిష్కారం ఏమిటి? అనే ఆలోచనలతో ఆమె మస్తిష్కం వేడెక్కిపోయింది.
***
శైలజ, రాంబాబు ఒకే కాలేజీలో చదువుకునేవారు. చదువులో తనకి తెలియని విషయాలు ఏమైనా రాంబాబుని అడిగి తెలుసుకునేది. వారి స్నేహం నానాటికీ బలపడసాగింది. తండ్రికి తాను ఒక్కతే కూతురు. చదువుపట్ల శైలజకు శ్రద్ధ వుండడంతో తండ్రి అభ్యంతర పెట్టలేదు. శైలజ, రాంబాబు కలుసుకోలేని సమయంలో వారి అవసరాలను ‘చరవాణి’ తీర్చేది. ఇద్దరూ చాలా సన్నిహితంగా తిరిగేవారు. శైలజ క్లాస్‌మేటు నీరజ వీరు ఇలా కలిసి తిరగడాన్ని చూసి అప్పుడప్పుడు స్నేహితురాలిని హెచ్చరిస్తూ వుండేది.
‘నేను హద్దులు దాటనులేవే! పరీక్షలు అయిపోయాక రాంబాబు ఉద్దేశం ఏంటో కనుక్కుంటాను, మా యింట్లో కూడా నాకు పెళ్లి చెయ్యాలని తొందరపడుతున్నారు. ఇక ఈ దాగుడుమూతల వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టెయ్యాలి!’ స్థిరంగా అంది శైలజ.
‘అదీ! అలా కచ్చితంగా వాడిని అడిగెయ్యి! ‘ప్రేమిస్తున్నానంటే పొంగిపోతారు, పెళ్లి చేసుకుంటానంటే లొంగిపోతారు ఆడపిల్లలు’- అనే ఉద్దేశం సాధారణంగా ప్రతి అబ్బాయికీ వుంటుంది. వీడిదీ అదే పంథా ఏమో కాస్త ఆలోచించు! నేను మా అమ్మమ్మగారి ఊరెళ్లిపోతున్నాను. మళ్లీ నిన్ను కలవడం కుదరదు! ఏ సంగతీ నాకు తెలియజెయ్యి’ అంది నీరజ.
‘అలాగేలేవే! నీ సలహాకి థ్యాంక్స్.. రాంబాబు ఉద్దేశమేమిటో కచ్చితంగా అడిగి తెలుసుకుంటాను.. బై!’ అంటూ నీరజకి శైలజ వీడ్కోలు చెప్పింది.
అనుకున్నట్టుగానే రాంబాబుని కలిసి పెళ్లి సంగతి కదిపింది శైలజ. ‘అలాగే..! ఈ విషయం అడగడానికి ఇంట్లో వీలు చిక్కడం లేదు, అయినా అమ్మాయిగారికి అప్పుడే పెళ్లిమీద అంత మోజెందుకో?’వెటకారంగా అన్నాడు.
‘ఇలా కప్పదాట్లు వెయ్యడం కాదు రాంబాబూ! నీ ఆలోచన ఏమిటో చెప్పు’ అంది.
కొద్దిరోజులకు రాంబాబు నిజస్వరూపం బయటపడింది. ‘ఏం చెయ్యను శైలూ! మామయ్య కూతుర్ని చేసుకోమని అమ్మ ఒకటే గోల! పేరుకే అది భార్య.. నీమీద ప్రేమ ఎక్కడికి పోతుంది చెప్పు? నా మనసంతా నువ్వే!’అన్నాడు పురుష స్వభావమైన ఆకలి చూపులతో.
‘‘్ఛ.. ఛీ.. ఇదా నీ నిజస్వరూపం? నిన్ను ఎంతగా నమ్మాను! యింకా నయం.. నేను హద్దులు మీరి నీతో ప్రవర్తించలేదు. మరెప్పుడూ నీ ముఖం నాకు చూపించకు..’ అంటూ చివాలున లేచింది.
‘నువ్వు ఛీ అన్నా, ఛా అన్నా ఫర్వాలేదు డియర్! ‘చరవాణి’లో మన బాగోతం అంతా పదిలంగా వుందమ్మా! అది నాకో మంచి కాలక్షేపం!’ వెలికిగా నవ్వేడు. ఆ నవ్వు ఆమెకు జుగుప్స కలిగించింది.
***
కాలం ఎవ్వరి కోసం ఆగదు. రాంబాబు వల్ల మానసికంగా ఆమె కుంగిపోయింది. స్వభావం తెలుసుకోకుండా తొందరపాటుగా అతనితో స్నేహం చేసినందుకు తనను తనే నిందించుకుంది. ఆ ప్రేమ అతను ఆమెను తిరస్కరించినప్పుడే చచ్చిపోయింది. కానీ, అతను చేసిన గాయం యింకా మానలేదు. శైలజ అదృష్టం బాగుండి ఓ పెళ్లిళ్ల పేరయ్య ద్వారా సంపన్నుడు, మంచి ఉద్యోగస్థుడు అయిన శ్రీకాంత్‌తో పెళ్లి సంబంధం కుదిరింది. తండ్రి మాటకు ఎదురు చెప్పక వెంటనే పెళ్లికి ఒప్పుకుంది. శ్రీకాంత్‌ను వివాహం చేసుకున్నాక, తన మనసులో రాంబాబు జ్ఞాపకాలను తుడిచివెయ్యగలిగింది. రాంబాబుతో స్నేహం వల్ల తన మనసు అపవిత్రం అయిపోయినా, తనువు మాత్రం పవిత్రమే.
భర్త నీడలో, అతని లాలనలో ఆమె జీవితం ప్రశాంతమే! కానీ, రాంబాబు చేసిన ద్రోహం నుండి యింకా తేరుకోలేకపోతోంది. శ్రీకాంత్ ఎంత ప్రేమగా చూసినా అతనికి దగ్గర కాలేకపోతోంది. ఎందుకు? ఇంత మంచి మనసున్న మనిషికి ఎందుకు దగ్గర కాలేకపోతున్నాను? మనసు విప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నానన్న ఆవేదన నిత్యం ఆమె మనసును వేధించసాగింది. దీంతో ఆమె నిలకడగా ఏ పనీ చెయ్యలేకపోతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ మధ్య రాంబాబు తరచూ ఫోన్ చేసి ఆమెను వేధించసాగాడు. రకరకాల ఆలోచనలతో కొట్టుమిట్టాడుతుండగా సెల్‌ఫోన్ రింగయ్యింది. అదిరే గుండెల్తో ఫోన్ అందుకుంది.
‘హాయ్.. నెక్ట్స్ వీక్ నీ బర్త్‌డే డియర్!’ రాంబాబు గొంతు.
‘అయితే ఏంటి?’ ఆందోళనగా అందామె.
‘అయితే ఏంటని మెల్లగా అడుగుతున్నావా? నాకేం గిఫ్టు ఇవ్వవా? ’ అన్నాడు అల్లరిగా.
‘షటప్! గిఫ్టు ఇవ్వడానికి నువ్వేమవుతావ్ నాకు?’ ఆమె అధరాలు వణుకుతున్నాయి.
‘అదేంటి బుజ్జీ అలాగంటావ్? ఒకనాటి ప్రియుడ్ని. నువ్వు కనికరిస్తే నీ...!’’
‘్ఛ! నోర్ముయ్.. పెళ్లయిన ఆడదానితో మాట్లాడే తీరు ఇదేనా? నీకసలు బుద్ధుందా?’అందామె.
‘నే చెప్పింది విని, అలా ఫాలో అయ్యావనుకో! అపుడు బుద్ధొస్తుంది’.
‘అసలు నీతో నాకు మాటలేంటి?’’
‘ఆ.. ఆ.. ఫోన్ కట్ చెయ్యకు! నీ పుట్టినరోజు గిఫ్టుగా నా ‘చరవాణి’ని మీ ఆయనకు పంపుతా. మన చరిత్రంతా అందులో దాచుకుంది బుజ్జిముండ! ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు మీ శ్రీవారు!’ హెచ్చరిస్తున్నట్లు ఉన్నాయి రాంబాబు మాటలు.
ఆ మాటలకి ఆమె చిగురుటాకులా వణికిపోయింది.
‘ప్లీజ్ రాంబాబూ! ననె్నందుకిలా వేధిస్తావ్? నీకేం అపకారం చేశాను?’ ‘అపకారం కాదు కానీ.. నాకో ఉపకారం చెయ్యి!’
‘ఏం కావాలి ? డబ్బా? ఎంత కావాలి?’
‘డబ్బెందుకమ్మా..? నాకు నువ్వు కావాలి! స్నేహం చేసినన్నాళ్లూ దూరం నుండి నన్నూరించేవు. కనీసం నీ శరీరాన్ని తాకనివ్వలేదు. యిప్పుడెలాగూ నీకు ‘లైసెన్సు’ వుందిగా? నాతో ఒక్క రాత్రి గడుపు. అంతే! ఈ సెల్‌ఫోన్‌ను.. అదే.. మన చరిత్ర తెలిసిన ‘చరవాణి’ని నీకిచ్చేస్తాను! నీ జోలికి మళ్లీ రాను!నీ మీద మోజు తీరిపోతుంది!’ అంటూ వికటాట్టహాసం చేశాడు.
‘్ఛ.. నీచుడా! ఆడదాని శీలం నీకంత చవగ్గా వుందిరా? యూ స్కౌండ్రల్! నువ్వు రమ్మనగానే రాడానికి నీ పెంపుడు కుక్క పిల్లను కాదురా! నువ్వుసలు మనిషివేనా? ఏం చేసుకుంటావో చేసుకో!’ ఫోన్ కట్ చేసింది.
శైలజ మనసు కుతకుతలాడిపోతోంది. ఈ రొంపిలోనుండి ఎలా బైటపడడం? భగవాన్! నాకు తోవ చూపించు.. అంటూ రెండు చేతులతో కణతలు నొక్కుకుంది. తల పగిలిపోయే ఆలోచనలు. సాయంత్రం షాపింగ్‌కు వెళదామని భర్త ఉదయమే చెప్పాడు. ఏం చెయ్యడానికీ ఆమె మనసు నిలకడగా లేదు. ఆలోచిస్తూ అలాగే సోఫాలో వాలిపోయింది భోజనం చెయ్యకుండానే. కాసేపటికే ఆమె కళ్లు మూతపడ్డాయి. కాలింగ్ బెల్ అదేపనిగా మోగడంతో ఉలిక్కిపడి లేచింది శైలజ. వాచీ చూసుకుంది. శ్రీకాంత్ అప్పుడే రాడు. రాంబాబు గానీ దిగబడ్డాడా? అదిరే గుండెలతో తలుపు తెరిచింది. ఎదురుగా చిన్ననాటి స్నేహితురాలు నీరజ.
‘నీరూ..!’ అంటూ గట్టిగా వాటేసుకుంది శైలజ. ఆమె కళ్లు వర్షిస్తున్నాయి. నీరజను చూసి ఆమె మనసు సేదతీరింది.
‘ఏంటే.. గుమ్మంలోనే నిలబెట్టేస్తావా?’ అంది నీరజ. అంతలోనే ఆందోళనగా ఉన్న ఆమె ముఖం చూసి- ‘ఏమే శైలూ! ఒంట్లో బాగోలేదా? కళ్లు వాచి ముఖం పీక్కుపోయింది!’ అంది.
‘అంతా చెబుతా.. నీ రాక నాకు ఎంతో ఓదార్పునిచ్చింది. పద.. గదిలో మాట్లాడుకుందాం!’ అంటూ నీరజని బెడ్‌రూములోకి తీసికెళ్లింది శైలజ.
‘మీ ఆయన నిన్ను సరిగ్గా చూసుకోవడం లేదా?’ ఆరా తీసింది నీరజ.
‘అబ్బే! అలాంటి సమస్యలేం లేవే! అలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం!’
‘అయితే నీకొచ్చిన సమస్య ఏంటి?’
రాంబాబుకి, తనకి జరిగిన విషయం అంతా చెప్పి, ‘నాకేం దిక్కుతోచడం లేదే.. ఆయన ప్రేమకి నేను అర్హురాలిని కాను..ప్రాణం తీసుకుందామంటే ఆ నేరం ఆయన మీద పడొచ్చు. ఇంతలా ప్రేమిస్తున్న మనిషికి అంతలా ఎలా ద్రోహం చెయ్యను? ఏం చెయ్యాలే ఇప్పడు?’ బేలగా అంది శైలజ.
‘్ఛ..్ఛ! ప్రాణం తీసుకోవడం సరైన మార్గం కాదు. అయినా ఆ రాంబాబు మూలంగా ముచ్చటైన నీ జీవితం ఎందుకు అంతం చేసుకోవాలి? ఈ సెల్‌ఫోన్లు ఎన్ని అనర్థాలు తెచ్చిపెడుతున్నాయి? అదే నా బాధ’
‘నన్నిప్పుడేం చెయ్యమంటావ్? ఆ ఒంటితల రావణుడు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు!’
‘ఓ పని చెయ్!’ అంది నీరజ.
‘ఏంటది?’ ఆత్రంగా అడిగింది శైలజ.
‘మీ ఆయనకి అన్నీ విడమర్చి చెప్పెయ్యి! ఆయన మనసున్న మనిషని, నీ మనసెరిగిన మనిషని తెలుస్తోంది నీ మాటల వల్ల.’ అని నీరజ అనగానే-
‘నాకూ అలాగే అనిపిస్తోంది. నీ మాటలతో కాస్త ధైర్యం వచ్చింది! అలాగే చెయ్యమంటావా?’ అని అడిగింది శైలజ.
‘అలాగే చెయ్యి! రావణుడున్న కాలంలో రాముడు, కీచకుడున్న కాలంలో భీముడు, దుశ్శాసనుడున్న కాలంలో శ్రీకృష్ణుడు వున్నారు కదే! అలాంటప్పుడు ఈ రావణుడు.. అదే.. రాంబాబు చేసే దుర్మార్గాన్ని నీ రాముడు సహిస్తాడేమో! చూద్దాం!’అంది ధీమాగా.
‘అదే చెయ్యాలి! ఈ టెన్షన్ భరించలేనే! ఆదరించి, అభిమానిస్తే సరే సరి! లేదా ఏదైనా ఉద్యోగం చేసుకుని హాయిగా బతుకుతాను! ఈ నరకయాతనకి ఇక ఫుల్‌స్ట్ఫా పెట్టెయ్యాలి! ఆ నీచుడికి లొంగను!’ దృఢనిశ్చయంతో అంది శైలజ.
‘అదీ.. అలా స్పోర్టివ్‌గా ఆలోచించు.. ఆల్ ద బెస్ట్!’ అంటూ లేచింది నీరజ.
‘సారీనే నీరూ.. నా గొడవే కానీ, నీ సంగతి అడగలేదు! ఈ ఊరు ఎప్పుడొచ్చావ్? ఎలా వున్నావ్?’ అంది శైలజ.
‘మా ఆయనకి ఇక్కడికి బదిలీ అయిందే! ఈసారి మా ఆయనతో కల్సి వస్తాను. ఇక్కడ ఏం జరిగినా నాకు మెసేజ్ ఇవ్వు!’ అంటూ తన ఫోన్ నెంబరు ఇచ్చి బయల్దేరింది. వీధివరకూ ఆమెను సాగనంపి ఇంట్లోకొచ్చిన శైలజ- అప్పటికే పక్కగదిలో ఉన్న భర్తను చూసి విస్తుబోయింది.
‘మీరెప్పుడొచ్చారు?’తడబడుతూ అంది.
‘ఆ.. అయిదు నిమిషాలైంది.. ’
‘హమ్మయ్య.. మా సంభాషణ వినలేదేన్నమాట’ అని మనసులో అనుకుని-
‘సారీ అండీ! మీరు రావడం నే చూడలేదు.. కాఫీ తెస్తానుండండి!’ అంటూ కిచెన్‌లోకి వెళ్లింది.
***
శ్రీకాంత్ ఆఫీసు పనేదో చేసుకుంటున్నాడు. శైలజ వంట చేస్తూ ఆలోచిస్తోంది.
‘నేను, నీరజ చెప్పుకున్న మాటలు ఇతను విన్నట్టు లేదు. ఈ రాత్రి భర్తకి అన్ని విషయాలు విడమర్చి చెప్పాలి! అర్థం చేసకుని ఆదరిస్తే సరి! లేకపోతే మరో మార్గం ఆలోచిస్తాను! అంతేకానీ పుట్టింటికి చేరను! వాళ్లకి భారం కాకూడదు..’ అనుకుంటూ భర్తకి భోజనం పెట్టి తను కూడా భోజనం చేసింది. శ్రీకాంత్ మంచంమీద పడుకుని ఆలోచిస్తూ, భార్య రాక కోసం ఎదురుచూస్తున్నాడు. వంటగదిలో పనులు ముగించుకుని బెడ్‌రూమ్‌లోకొచ్చిన ఆమె భర్త పక్కన కూర్చుని ‘ఏమండీ’ అంది నెమ్మదిగా.
‘ఆ.. శైలజా! ఏంటి?’అన్నాడతను లేచి కూర్చొని.
‘మీతో.. ఓ విషయం చెప్పాలండీ?’ అంది మాటలను నెమ్మదిగా కూడదీసుకుని.
‘ఒక్క మాటేనా? ఎన్నో మాటలు చెపుతావనుకున్నాను!’
‘అది కాదండీ.. అదీ..!’ అంటూ ఎలా మొదలుపెట్టాలో తెలియక తికమక పడుతోంది.
‘శైలజా! మొదటి రాత్రి కట్టుకున్న చీర కట్టుకుని అలాగే ముస్తాబయిరా! నేనూ నీకో మాట చెప్పాలి!’ అన్నాడు ప్రేమగా.
‘సరే! ఈ రోజుతో ఏదో ఒకటి తేలిపోతుందిగా! ఆయన చెప్పినట్లు నడుచుకుంటే సరి!’అనుకుని భర్త చెప్పినట్లే ముస్తాబై అతడిని చేరుకుంది.
ఆమెను చూస్తూనే ‘అదీ! ఇలా చెప్పినట్లు వినాలి?’’ అన్నాడు చిరునవ్వుతో.
‘ఏం చెప్తాడో.. ఏమో..?’ అని ఎదురుచూడసాగింది.
‘మన ప్రేమ సామ్రాజ్యానికి ఇన్ని సాక్ష్యాలుండాలా?’ గదంతా కలయజూస్తూ అన్నాడు.
‘ఏమిటీ ఇతని ధోరణి’ అనుకుంటూ కిటికీ తెరలు సరిచేసి, లైటు తీసేసి, నీలం రంగు బెడ్‌లైటు వేసింది. అప్సరసలా మెరసిపోతోంది శైలజ. శ్రీకాంత్ మంచం దిగి వచ్చి మేజామీదున్న మల్లెలు ఆమె జడలో తురిమి- ‘నే చెప్పదల్చుకున్న మాటకి ఇది నాంది!’ అంటూ ఆమెను మంచం దగ్గరకు తీసుకెళ్లాడు.
‘నే చెప్పదల్చుకున్నది చెప్పనియ్యకుండా ఏమిటి ఈయన ధోరణి?’ అనుకున్నదామె.
మంచమీద ఆమె పక్కనే కూర్చొని- ‘రావణుడున్న కాలంలో రాముడు, దుశ్శాసనుడున్న కాలంలో కృష్ణుడు వున్నారు కదా? అంతటి మహానుభావుడిని కాకపోయినా నేనూ మనసున్న మనిషినే! సాటి మనిషి స్వభావం తెలుసుకోదగిన సామాన్య మానవుణ్ణి!నీ మనసెరిగిన మనిషిని!’ అంటూ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు.
‘ఏమండీ.. మీరు నిజంగా..!’ ఆమెకు నోట మాటలు పెగల్లేదు.
‘వద్దు శైలూ! అంతంత పెద్ద మాటలు వద్దు.. నమ్మకమనే పునాదులపైనే దాంపత్యమనే సౌధం నిలుస్తుంది. మన మధ్య వుండవలసింది ఆప్యాయత, అనురాగం మాత్రమే. ఇంకేమైనా వున్నాయా నువ్వు చెప్పడానికి?’ అంటూ ఆమె చుబుకం పట్టుకుని కళ్లలోకి చూస్తూ అడిగాడు. వెంటనే ఆమె లతలా అతడ్ని పెనవేసుకుపోయింది. ఇద్దరి మధ్యా గాలి దూరనంత బిగి. వీరి ఏకాంతానికి భంగం రాకూడదని కిటికీలోంచి తొంగి చూస్తున్న చందమామ మబ్బుల్లోకి దూరిపోయాడు.
* * * *****

రచయిత్రి ఫోన్ నెం: 08966- 266384

-శివాని