మెయిన్ ఫీచర్

అవసరానికీ, అనుబంధానికీ.. ఇరుగు పొరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, ఆలుమగలిద్దరూ ఉద్యోగస్థులవడంతో ఇరుగు పొరుగులతో మైత్రి, ఐక్యత, అనుబంధాలు పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఉద్యోగరీత్యా బదిలీలవల్ల ఎన్నో ఊళ్ళు మారాల్సి రావచ్చు. అందువల్ల అద్దె ఇంట్లోకి చేరబోయే ముందు ఇరుగు పొరుగు ఎలాంటి వారన్నదీ తెలుసుకోవాలి. ఇరుగుపొరుగున వున్నవారు స్వంత ఇంటివారయినా, అద్దెవారైనా వారిపట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి. ఇరుగుపొరుగులతో మాటలు కలుపుకునేదీ, త్వరగా స్నేహం చేసేదీ ఆడవారే, ముఖ్యంగా గృహిణులు. ఒక ఊరు మారి వేరే ఊరికి వెళ్ళి, ఇంట్లో చేరగానే వారికి కొన్ని సమస్యలు ఏర్పడుతాయి. గ్యాస్ మార్చుకోవడం, కూరగాయలు, పాలు, పచారీ సామానులు, పిల్లలను స్కూల్లో చేర్పించడం లాంటి విషయాల్లో ఇరుగు పొరుగు వారిని వాకబు చేసి, వారి సలహాలను పొందాలి. ఇరుగుపొరుగున ఉన్నవారు కూడా, కొత్తగా ఆ ఇంట్లోకి వచ్చిన వారికి తమ వంతు సహకారాన్ని, సహాయాన్నీ అందించాలి. ఇరుగు పొరుగు వారు తమ పట్ల కనబరుస్తున్న అభిమానానికీ, మంచితనానికీ, వారి సహకారానికి ఆ ఇంట్లోకి వచ్చినవారు తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాలి. నిజానికి, వారితో స్నేహాన్ని పెంపొందించుకోవడం ఒక కళ అని చెప్పవచ్చు.
సాధారణంగా ఇరుగు పొరుగున ఉన్న స్ర్తిలు తోటివారితో మాటలు కలిపి, పరిచయాన్ని పెంచుకుంటారు. ఉద్యోగినులకు తోటి స్ర్తిలతో కలిసి మాట్లాడాలన్నా, వారితో కొంత సమయం కాలక్షేపం చేయాలన్నా వారికి సమయం, తీరిక ఉండవు. ఇరుగు పొరుగు స్ర్తిలతో పరిచయాన్ని చిరునవ్వుతో పరిమితం చేసుకోకుండా, ఏదో ఒక సమయం వీలు చూసుకుని నాలుగు మాటలన్నా మాట్లాడాలి. నిజానికి, ఇరుగు పొరుగు స్ర్తిలతో గృహిణులకన్నా ఉద్యోగినులకే ఎక్కువ అవసరం వుంటుంది. వారి సహాయాన్ని అందుకోవలసి వుంటుంది. సెలవు రోజుల్లో వారితో కొంత సమయం గడిపితే, వారితో అనుబంధం ఏర్పడుతుంది.
ఉద్యోగినులకు అవసరమైన సహాయాన్ని ఇరుగుపొరుగు అందిస్తారు. గ్యాస్ సిలిండర్ తీసుకోవడం, ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు లాంటివి తీసుకోవడం, కొరియర్, రిజిస్టర్‌పోస్ట్ లాంటివి వస్తే వాటిని తీసుకుని, సాయంత్రం ఆఫీసునుంచి రాగానే వాటిని వారికి అప్పజెప్పడం లాంటి విషయాలన్నింటిలోనో ఉద్యోగం చేసే ఆలుమగలకు తమ సహాయాన్ని, సహకారాన్ని అందిస్తారు. ఇరుగుపొరుగు స్ర్తిలతో స్నేహం పెరిగినప్పటికీ, తోటివారి స్వవిషయాలను తెలుసుకోవాలనుకోవడం, వారికి ఉచిత సలహాలివ్వడం మంచి పద్ధతి కాదు. చాలా అవసరమయితే తప్ప అప్పుల కోసం తోటివారిని అడుగకూడదు. తీసుకున్న అప్పును వెంటనే తీర్చెయ్యాలి. అప్పుడే విలువ గౌరవం ఏర్పడుతాయి.
పిల్లలు తోటి పిల్లలతో ఇట్టే స్నేహం కలిపేసుకుని, వారితో ఆడుతూంటారు. ఇరుగుపొరుగు పిల్లలతో స్నేహం చేస్తూ వారితో కలిసి మెలిసి ఉండటం మంచిదే. లేకపోతే ఇంట్లోనే ఉంటే, పేచీలు పెట్టడం, భరించలేని అల్లరి చేయడం పెద్దలకు సమస్య అవుతుంది. ఇటువంటి స్నేహాలవల్ల అల్లరి బాధ ఉండదు. కొంత సమయం కబుర్లు చెప్పుకుంటారు, కొంత సమయం ఆడుకుంటారు. గిల్లికజ్జాలు పెట్టుకుంటారు, విడిపోయి మూతి ముడుచుకుంటారు. కానీ మరికొంతసేపటికే తమ జగడాన్ని మరచిపోయి కలిసిపోతారు. టీవీ, రేడియో, టేప్ రికార్డర్, మ్యూజిక్ సిస్టమ్ లాంటివి పెద్ద సౌండ్ పెట్టి ఇరుగు పొరుగున ఉన్నవారికి ఇబ్బందిని కలిగించకూడదు. ఎదుటివారింట్లోని వస్తువులను కావాలని అడుగకూడదు. ముఖ్యంగా ఖరీదైన వస్తువులను వాడుకుని ఇస్తామని ఎదుటివారిని ఇబ్బందికి, మొహమాటానికి గురిచేయకూడదు. తోటివారింట్లోని మ్యాగజైనులు చదువుతామని అడిగి తీసుకుని వాటిలోని వంటలు, ఇతర కాగితాలను చింపేసి తీసుకుని, ఆ పుస్తకాన్ని కొన్నవారు అడిగేటంతవరకూ ఇవ్వకపోవడం మర్యాద కాదు. పుస్తకాల్లోని పేజీలు చింపేసుకున్నారని, వారు తెలుసుకున్నప్పుడు అవతలవారి ప్రవర్తనకు, వారిపట్ల సదభిప్రాయం సడలిపోయి, వారితో స్నేహాన్ని తగ్గించేస్తారు. ఆ తర్వాత, వారికి మరెన్నడు పుస్తకాలు ఇవ్వరు.
పుస్తకం విలువ తెలిసినవారు, పుస్తకాన్ని ప్రాణప్రదంగా చూసుకుంటారు. పుస్తకాలను భద్రపరచుకునేవారు, అలా పేజీలు చింపేసి ఇచ్చిన పుస్తకాన్ని చూసి ఎంతో బాధపడతారు. ఇరుగుపొరుగు వారింటికి కాలక్షేపానికి వెళ్లినపుడు, వారు ఆ సమయంలో పనిలో ఉన్నారా లేక బయటకు వెళ్లాలనుకుంటున్నారా అని అడిగి తెలుసుకోవాలి. తమ కబుర్లకోసం తోటివారి పనులకు అడ్డుతగలకూడదు. వారి సమయాన్ని వృధాపరచకూడదు. అప్పుడే ఇరుగుపొరుగువారితో వారి మైత్రి, అనుబంధం బలపడుతుది. ఇరుగుపొరుగువారు ఎలా ఉండాలని మనం కోరుకుంటామో, మనమూ అదేవిధంగా నడుచుకుంటే మనకు ఇరుగుపొరుగువారు ఆత్మ బంధువులవుతారు. అవసరానికి ఆదుకుంటారు. ఆ ఇంట్లో ఉన్నంతకాలం సుఖంగా, ప్రశాంతంగా కాలం గడపవచ్చు.

-కె.నిర్మల