మెయిన్ ఫీచర్

అనురాగాల ఒడి ఆత్మీయతల గుడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా.. ఈ ఫ్యామిలీ ఫొటో చూడు.. ఇందులో ఎంతమంది ఉన్నారనుకున్నావు? నలభై మంది పైనే ఉన్నారు. మా ఫ్రెండ్ శార్వాణి వాళ్ల ఫ్యామిలీ ఫొటో ఇది. ఆమెకి ఐదుగురు బాబాయిలు, ముగ్గురు అత్తయ్యలు, నాన్నమ్మ, తాతయ్య, ఇంకా ఎంతోమంది కుటుంబ సభ్యులు. అంతా ఒక్క దగ్గరే ఉంటారు. వాళ్ల ఇల్లు మేడపైన, కింద కలిసి ఆరు పోర్షన్లు. వాళ్లింట్లో ఎపుడూ సందడే. ఇంతమంది ఒక్క దగ్గర ఏ గొడవా లేకుండా ఎలా వున్నారా? అనిపిస్తుంది. రాఖీ పండగొస్తే శార్వాణికి ఎన్ని డ్రస్సులో..! వాళ్లింటికి వెళ్లినపుడు ఎవరి పిల్లలు ఎవరో తెలుసుకోవడం కష్టం. అంతగా కలిసిమెలిసి ఉంటున్న ఆ కుటుంబాన్ని చూస్తుంటే భలే ముచ్చటగా ఉంటుంది’.. అంటూ ఫ్యామిలీ ఫొటో చూపిస్తూ చెప్పుకుపోతోంది పరిమళ వాళ్లమ్మతో.
ఆ ఫొటోవంకే తదేకంగా చూస్తూ- ‘ఇంతమంది ఒకే కుటుంబంలోనా? ఒక్క దగ్గరే ఎలా ఉంటున్నారే బాబూ..?’ అంటూ ఆశ్చర్యంగా కూతురు వైపు చూస్తూ అంది శ్రీదేవి.
***
మానవ జీవన ప్రయాణం కుటుంబం నుంచి ఆరంభమవుతుంది. మంచి కుటుంబ నేపథ్యం ఎవరికైనా దేవుడిచ్చిన వరం. కుటుంబం అంటే అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి మాత్రమే కాదు, రక్తసంబంధీకులంతా ఒక ఆత్మీయ సమూహం. భారతీయ సనాతన ధర్మంలో ఋషుల మాటగా చెప్పాలంటే- ఈ విశ్వమంతా వసుధైక కుటుంబం. మానవులంతా ఒకే కుటుంబమనే విశాల దృక్పథం కలిగి ఉండాలని ఏనాడో ఉపదేశించారు మహర్షులు. భగవంతుని అపురూప సృష్టి అమ్మ. దేవుడు ప్రతి చోటకూ రాలేకనే అమ్మను సృష్టించాడంటారు పెద్దలు. పసి ప్రాయంలో శిశువులకు ప్రేమతో పాలిస్తుంది, లాలిస్తుంది మాతృమూర్తి. పిల్లల నడకకు, మాటకు, ఆటకు ఆమే శ్రీకారం చుడుతుంది. అమ్మ అలవర్చిన బుడిబుడి అడుగుల నడకనుంచే ఎవరైనా ఎదగాలి. ఆమె వేయించిన మొదటి అడుగే జీవన గమనానికి నాంది. మొదటి ముద్ద తినిపించేది అమ్మే. ఎవరికైనా జన్మ అనేది అమ్మతోనే కదా మొదలు. అందుకే అమ్మే కుటుంబంలో అసలైన యజమాని. ఇక నాన్న- జీవితాన్ని నిర్మిస్తాడు, బాధ్యత నేర్పుతాడు, పిల్లలు బాగా చదవాలంటాడు, ప్రతి విషయంలో క్రమశిక్షణ కావాలంటాడు. తన ఇష్టాలేంటో చెబుతాడు, పిల్లల భవిష్యత్తుపై తన కలల్ని, ఆలోచనల్ని ఏకరువు పెడతాడు, వాటిని నిజం చేయమంటాడు. తాను అండగా ఉంటానని భరోసా ఇస్తాడు. కుటుంబంలో అత్యంత కీలక పాత్ర తండ్రిదే. రక్షకుడు, శిక్షకుడు, పోషకుడు ఆయనే. భయభక్తులు,క్రమశిక్షణ నేర్పుతూ పిల్లల భవిష్యత్తుకు బాసటగా నిలుస్తాడు. పిల్లల అభివృద్ధి నాన్నవల్లనే సాధ్యం. కష్టంలో కన్నీరు తుడుస్తాడు. సంతోషంలో నవ్వుల్ని పంచుకుంటాడు. అతడు కుటుంబానికి యజమానే కాదు, సేవకుడు, స్నేహితుడు కూడా. తన కష్టాన్ని ఎప్పుడూ మొఖంలో కనబడనీయడు. సంతోషాన్ని లోలోపలే దాచుకుంటాడు. ఇక కుటుంబంలో అన్నయ్య- నాన్న తర్వాత హీరో.‘నాన్న తర్వాత అధికారం నాదే!’ అంటాడు. తమ్ముళ్ళకు సరదాలు పంచుతాడు, చెల్లెళ్లను ఆట పట్టిస్తాడు. అక్కయ్యలకు ఆప్యాయతను పంచుతాడు. తనకన్నా చిన్నవాళ్ళు హోమ్‌వర్క్ రాయలేకపోతే సాయం చేస్తాడు. సైకిళ్లమీద తమ్ముళ్ళను, చెల్లెళ్ళను స్కూళ్ళకు తీసుకెళతాడు. కోపం వస్తే ఒక దెబ్బేస్తాడు, అరుస్తాడు. జడిపిస్తాడు, మమతలన్నింటినీ మనస్సులోపల ఉంచి కఠినంగా కనిపిస్తాడు. కానీ, తరచిచూస్తే ఏ అన్న హృదయమైనా వెనే్న. అన్నయ్య రక్షకుడు, తండ్రి తర్వాత శిక్షకుడు. కుటుంబానికి అండగా వుండే పెద్దన్నను కాదనేవారు, వద్దనుకునేవారు ఉండరు. అమ్మా నాన్నలకు పెద్దకొడుకు అపురూపం. నాన్నకు భరోసా- ‘నా తర్వాత వీడే కదా కుటుంబాన్ని చూడాలి’ అని. అమ్మకు సాయం చేస్తాడు. నాన్న చెప్పిందల్లా చేస్తాడు.
అక్కచెలెళ్ళు ఇంటికే అలంకారం. అమ్మకు వంట చేయడంలో, ఇంటి పనుల్లో పెద్ద సాయం. అన్నదమ్ముళ్ళకు ఇళ్ళల్లో అన్ని అవసరాలకు అక్కచెల్లెళ్లు కావాలి.‘అక్కా! నా చొక్కా గుండీ కుట్టవా?’ అని తమ్ముడు, ‘చెల్లీ! అన్నం పెట్టవా?’ అని ప్రతి ఇంటా అన్నదమ్ములు పనులు చెప్తూంటారు. ఇళ్ళంటే అంతే మరి. పరస్పరం సాయం చేసుకోవడం, బాధ్యతల్ని పంచుకోవడం, ఆత్మీయతల్ని కలబోసుకోవడం, కష్టాల్లో ఓదార్చుకోవడం, సంతోషాన్ని సమష్టిగా సొంతం చేసుకోవడం. కుటుంబమంటే సరదా, సందడి, ప్రేమ, బాధ, ఓదార్పు, బాధ్యత, సహకారం.. ఒకటేమిటి..? కుటుంబంలో లేనిదేమిటి? కుటుంబం ఒక ప్రత్యేక ప్రపంచం. ప్రతి మనిషికి తప్పనిసరి అవసరం. కుటుంబం లేని మనిషి అసంపూర్ణుడు. రాత్రి పడుకునేటప్పుడు నాయనమ్మ కథలు విననిదే నిద్రపోని పిల్లలు ఇప్పటికీ కొన్ని ఇళ్లలో వుండరు. తాతయ్య చెయ్యి పట్టుకొని షికార్లు తిరగడం పిల్లలకి ఓ పెద్ద ముచ్చట.
కుటుంబాన్ని మనిషి ఏర్పాటు చేస్తే- ఆ కుటుంబమే మనిషిని తీర్చిదిద్దుతుంది. అమ్మా నాన్నలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు.. కోడల్లు, అల్లుళ్లు.. వాళ్ళ తరఫు బంధువులు.. ఇలా అనుకుంటూ పోతే మరెందరో కుటుంబమంటే. పెళ్ళయినా, ఏ వేడుకైనా ఎక్కడెక్కడో వున్న బంధువులంతా ఒక చోట చేరి సందడి చేస్తే ఆ ఆనందమే వేరు. అందరూ కలిసి అనుబంధాన్ని పెంచుకుంటూ, ఆనందాన్ని పంచుకోవడం ఎవరికైనా తీపి జ్ఞాపకం. అందర్నీ కలుపుతూ అనుబంధాల్ని పెంచే వేడుకలు తప్పక ఉండాల్సిందే. అందుకోసమే ఈ వేడుకలు పుట్టాయేమో? కుటుంబమంటే వృద్ధి, అభివృద్ధి. ఒక్కరికోసం అందరూ కలిసే, అందరికోసం ఒక్కరు నిలిచే మంచి కుటుంబాలు మన సమాజ వ్యవస్థకే నిండుదనాన్ని తెస్తాయి. సాంప్రదాయాలకు చెరగని గుర్తులుగా నిలుస్తాయి.

-రాజ్‌కుమార్