బిజినెస్

భారతీయ సంస్థలకు ఐపిఒల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 12: భారతీయ ఐపిఒ మార్కెట్‌కు 2016 సంవత్సరం రికార్డులు సృష్టించే సంవత్సరం కానుంది. ఇప్పటికే దాదాపు 50 కంపెనీలు 293 కోట్ల డాలర్ల నిధులను సమీకరించడం కోసం స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించగా, రాబోయే రెండు నెలల కాలంలో మరిన్ని సంస్థలు ఐపిఒలతో రానున్నాయి. మరో 22 కంపెనీలు 2016 సంవత్సరంలో ఐపిఒలతో రానుండడంతో ఈ ఏడాది చివరి నాటికి మొత్తం ఐపిఒల విలువ 580 కోట్ల డాలర్లకు చేరుకోనుంది. గత ఏడాది మొత్తం ఐపిఒల విలువ కేవలం 218 కోట్ల డాలర్లవగా, ఈ ఏడాది ఆ మొత్తం దానికన్నా రెట్టింపునకు మించి ఉండడం గమనార్హం. బేకర్ అండ్ మెకంజీ సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం భారతీయ ఐపిఒల మార్కెట్ ఆరేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోనుంది. ఈ ఏడాది ఇప్పటివరకు 293 కోట్ల డాలర్ల విలువ కలిగిన ఐపిఒలు పూర్తవగా, మరో 290 కోట్ల డాలర్ల విలువ కలిగిన ఐపిఒలు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవిగాక 2017లో మరో 16 సంస్థలు 586 కోట్ల డాలర్ల మేరకు నిధులను సేకరించడం కోసం దేశీయ మార్కెట్లోకి రానున్నాయి. రాబోయే రోజుల్లో రానున్న ఐపిఒలలో అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వొడాఫోన్ సంస్థకి చెందిన సుమారు 300 కోట్ల డాలర్ల విలువ కలిగిన తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపిఒ)కూడా ఉంది. ఒకవేళ ఈ ఐపిఒ గనుక మార్కెట్లోకి వస్తే ఇప్పటివరకు అతిపెద్ద ఐపిఒగా ఉండిన ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్ ఇండియా ఐపిఒను మించిపోవడమే కాకుండా దేశంలో అతిపెద్ద ఐపిఒగా రికార్డు సృష్టిస్తుంది.
వ్యాపార నిర్వహణను సులభతరం చేయడాన్ని మరింత మెరుగుపర్చడానికి ప్రధాని నరేంద్ర మోదీ అనేక చర్యలు తీసుకోవడంతో దేశంలో ఐపిఒల మార్కెట్ ఊపు కొనసాగుతోందని ఆ నివేదిక పేర్కొంది. పన్నుల విధానాన్ని హేతుబద్ధం చేయడం ఈ చర్యల్లో ఒకటి. ‘జిఎస్‌టి బిల్లు వల్ల దేశంలో పన్నుల బేస్ మరింత విస్తృతం చెంది పరోక్ష పన్నుల రాబడి ఉత్పాదకత మరింత మెరుగుపడ్డమనే తక్షణ ప్రయోజనం ఒనగూరడంతో పాటు ఆర్థిక సంస్కరణలకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని దేశ ప్రజలకు, అలాగే ప్రపంచ దేశాలకు అందిస్తుందని, ఫలితంగా పెట్టుబడులు పెట్టడానికి భారత్ మరింత ఆకర్షణీయమైన ప్రాంతంగా మారడానికి దోహదపడుతుందని బేకర్ అండ్ మెకంజీ సంస్థ భారత విభాగం అధిపతి అశోక్ లాల్వానీ అభిప్రాయపడ్డారు. భారతీయ ఐపిఒల మార్కెట్‌లో దేశీయ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో లిస్టింగ్ అయ్యేవే అధిక శాతం ఉండడం గమనార్హం. 2016లో ఇప్పటివరకు అటు బిఎస్‌ఇ, ఇటు ఎన్‌ఎస్‌ఇ రెండింటిలోను లిస్టింగ్ అయిన ఐపిఒలే అత్యధికంగా ఉన్నాయి. మొత్తం ఐపిఒల విలువలో 98.8 శాతం ఈ రెండు స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో లిస్టింగ్ అయినవే. మొత్తం 19 ఐపిఒల ద్వారా 290 కోట్ల డాలర్లను సేకరించడం జరిగింది. వీటిలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్‌కు చెందిన 90.9 కోట్ల డాలర్ల విలువైన ఐపిఒ కూడా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన ఐపిఒలలో ఇదే అతి పెద్దది. వ్యాపార విశ్వసనీయత మెరుగపడ్డంతో భారతీయ కంపెనీలు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని స్టాక్ ఎక్స్‌చేంజ్‌లలో లిస్టింగ్ అయ్యే ఐపిఒల ద్వారా తమ వ్యాపార అవకాశాలను మరింత విస్తృతపరచుకోవడానికి ప్రయత్నిస్తుండడం విశేషం. భారత దేశంలో అందుబాటులో లేని వెంచర్ క్యాపిటల్‌కు ఇది అవకాశం ఇవ్వడమేగాక తమ వ్యాపారాన్ని మరింత మెరుగ్గా అర్థం చేసుకునే మదుపరులతో సంబంధాలు పెంచుకోవడానికి కంపెనీకి అవకాశం లభిస్తుంది. 2016లో రానున్న 22 ఐపిఒలలో ఒకటైన స్ట్రాండ్‌లైఫ్ సెనె్సస్ నాస్‌డాక్‌లో కూడా లిస్టింగ్ కావాలనుకుంటోంది. ఒకవేళ అదే గనుక జరిగితే వీడియోకాన్ డి2హెచ్ తర్వాత ఇతర దేశాల్లో లిస్టింగ్ అయిన తొలి భారతీయ సంస్థ అదే అవుతుంది. కాగా, 2016లో మిగిలి ఉన్న ఈ రెండున్నర నెలలే కాకుండా 2017లో కూడా ఐపిఒల కార్యకలాపాల జోరు ఇలాగే కొనసాగే అవకాశముందని లాల్వానీ అభిప్రాయ పడ్డారు.