బిజినెస్

హీరో మోటోకార్ప్ వాహన విక్రయాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ ఆటో రంగంలో ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 1,004.22 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌తో పోల్చితే ఇది 27.74 శాతం అధికం. నిరుడు 786.12 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. ఈ మేరకు బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలియజేసింది. ఆదాయం ఈసారి 8,448.74 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 7,346.47 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇక ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 18,23, 498 యూనిట్ల వాహనాలను అమ్మిన హీరో మోటోకార్ప్.. నిరుడు ఇదే వ్యవధిలో 15,74,861 యూనిట్ల విక్రయాలకే పరిమితమైంది. ఫలితంగా అమ్మకాలపరంగా చూస్తే ఈసారి 15.78 శాతం వృద్ధి నమోదు చేసుకున్నట్లైంది. పన్నుల అనంతరం వెయ్యి కోట్ల రూపాయల లాభాన్ని ఒక త్రైమాసికంలో అందుకోవడం ఇదేనని సంస్థ చైర్మన్, ఎండి, సిఇఒ పవన్ ముంజల్ చెప్పారు.

శ్రీసిటీలో థాయ్‌లాండ్ వాణిజ్య ప్రతినిధి

తడ/సత్యవేడు, అక్టోబర్ 26: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో ఉన్న శ్రీసిటీ సెజ్‌ను బుధవారం థాయ్‌లాండ్ వాణిజ్య ప్రతినిధి క్రాంగ్ కనీత్ రచ్చరోయన్ సందర్శించారు. శ్రీసిటీ ఫౌండేషన్ అధ్యక్షుడు రమేష్ సుబ్రమణ్యం ఆమెను సాదరంగా స్వాగతం పలికి ఇక్కడ వౌలిక వసతుల ప్రగతి గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీసిటీ ప్రాముఖ్యతను, అక్కడి వ్యాపార అవకాశాలను ఎంతో తెలుసుకోగలిగానన్నారు. థాయ్‌లాండ్ పరిశ్రమలకు శ్రీసిటి అనుకూలతను వివరిస్తామని వెల్లడించారు. తమ దేశ పరిశ్రమ అయిన రాక్‌వర్త్ కంపెనికి శ్రీసిటి అందించే సహాయ సహకారాలకు ఎంతో సంతోషమన్నారు. కాగా, ఈ రకమైన పరస్పర చర్యలు రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఎంతో దోహదపడతాయని శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. ఇక్కడ వసతులను పరిశీలించడంతోపాటు థాయ్‌లాండ్‌కు చెందిన పరిశ్రమలను ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ జిట్టిమా నకమ, ట్రేడ్ అధికారి లారెన్స్ హెడ్‌వార్డ్ పాల్గొన్నారు.

శ్రీసిటీని సందర్శించిన థాయ్‌లాండ్ వాణిజ్య ప్రతినిధి, పలువురు అధికారులు

హెచ్‌యుఎల్‌కు
కలిసొచ్చిన ఆదాయం
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) జూలై-సెప్టెంబర్ కాలానికి 1,095.6 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 982.17 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి 11.54 శాతం లాభాలు పెరిగినట్లైంది. ఆదాయం ఈసారి 8,480.26 కోట్ల రూపాయలుగా, పోయినసారి 8,348.6 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలియజేసింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు సవాల్‌గా ఉన్నాయని, అయినప్పటికీ సంస్థ లాభాలను సాధించిందని హెచ్‌యుఎల్ చైర్మన్ హరీశ్ మన్వాని అన్నారు. ఇకముందూ ఇలాంటి ఫలితాలనే నమోదు చేయడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కాగా, సంస్థ ఇతరత్రా ఆదాయం ఈసారి 252.83 కోట్ల రూపాయలకు పెరిగింది. పోయినసారి 107.59 కోట్ల రూపాయల లాభమే సాధ్యమైంది.