బిజినెస్

సందిగ్ధంలో బిల్ట్ భవితవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగపేట, డిసెంబర్ 30: వరంగల్ జిల్లా మంగపేట మండలంలో బిల్ట్ కర్మాగారం మూతపడకుండా ఉండడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా 30 కోట్ల రూపాయల చొప్పున ఏడేళ్ల పాటు ఇవ్వడానికి ముందుకు రావడంతో కర్మాగారం మళ్లీ యధావిధిగా నడుస్తుందనుకున్న నేపథ్యంలో కంపెనీ నడిపించాలంటే యాజమాన్యం కొన్ని షరతులు పెట్టిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో తమ ఆశలు ఆవిరయ్యాయని కార్మికులలో ఆందోళన మొదలైంది. కర్మాగార పున:ప్రారంభ విషయంపై గత రెండు రోజులుగా కార్మిక నాయకులతో యాజమాన్యం హైదరాబాద్‌లోని బిల్ట్ హెడ్ ఆఫీస్‌లో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. తమ షరతులకు అంగీకరిస్తేనే కర్మాగారం నడిపేదీ, లేనిది చెబుతామని ఆ చర్చలలో యాజమాన్య ప్రతినిధులుగా పాల్గొన్న నీహార్ అగర్వాల్, హరిహరన్ తదితరులు కార్మిక నాయకులకు తేల్చిచెప్పినట్లు కార్మికులలో ప్రచారం జరుగుతోంది.
ఆ చర్చలలో గతంలో కమలాపురం యూనిట్‌లో డిజిఎం స్థాయిలో పనిచేసిన కె ఎస్ రావు కూడా పాల్గొన్నట్లు విశ్వసనీయ సమాచారం. కర్మాగారం నడిపించాలంటే కార్మికులు ప్రస్తుతం పొందుతున్న కొన్ని అలవెన్స్‌లను వదులుకోవాలని, సుమారు ఐదు సంవత్సరాల వరకు కార్మికులు అగ్రిమెంట్ గురించి కానీ మరే విషయం గురించి కానీ యాజమాన్యంపై ఒత్తిడి తేవద్దని, కార్మికుల వేతనాలు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లిస్తామని, ఇలా పలు షరతులు విధించినట్లు తెలుస్తోంది. తాము త్వరలో ప్రభుత్వంతో జరిపే చర్చలలోపు షరతులకు తాము అంగీకరిస్తున్నట్లు రాతపూర్వకంగా ఇస్తేనే మిల్లు నడిపించేది, లేనిది చెబుతామని యాజమాన్య ప్రతినిధులు కార్మిక నాయకులకు డెడ్‌లైన్ విధించినట్లు తెలిసింది. కాగా, యాజమాన్యం విధించిన షరతుల విషయం కార్మికులకు వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకుని అప్పుడు తమ నిర్ణయాన్ని యాజమాన్యానికి తెలపాలని కార్మిక నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.
పెదవి విరుస్తున్న కార్మికులు
సంస్థను నడిపించాలంటే తాము విధించిన షరతులు అంగీకరించాలని కార్మిక నాయకులకు యాజమాన్యం తెలిపిందనే విషయం బయటకు పొక్కడంతో ఆ నిర్ణయంపై కార్మికలు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వం నుండి రాయితీలు పొందుతున్న యాజమాన్యం తమ వేతనాలు, అలవెన్స్‌లలో కోత విధిస్తామని షరతు పెట్టిందని తెలియడంతో యాజమాన్య తీరుపై కార్మికులు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన యూనిట్ హెడ్‌లు, జియంలు, కొంతమంది మేనేజర్లు అనేక స్కాంలకు పాల్పడ్డారని, అటువంటి వారిని ఏమీ చేయని యాజమాన్యం.. తమ వేతనాలు, అలవెన్స్‌లను మాత్రం తగ్గించాలని చూడడం ఎంతవరకు సమంజసమని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కొంతమంది మేనేజర్లు కాలనీలోనూ, సంస్థలోనూ రోడ్లు పోయకుండానే పోసినట్లు కోట్లు దండుకున్న సంఘటనలు ఉన్నాయని, కానీ గత మూడు దశాబ్దాల నుండి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఉత్పత్తి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల వేతనాలను తగ్గించాలని యాజమాన్యం చూడడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉత్పత్తికి సంబంధంలేని అనేక విషయాలపై కోట్లు ఖర్చు పెడుతున్న మేనేజ్‌మెంట్ కార్మికులకు అన్యాయం చేయాలని చూడడం దారుణమని కార్మికులు ఒకింత ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. ఉన్నత స్థాయి యాజమాన్యం, కార్మిక నాయకులు ఈ విషయంపై పునరాలోచించి ఉత్పత్తికి సంబంధంలేని ఖర్చులు తగ్గించుకుని సంస్థలో తిరిగి ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని, కష్టించి పని చేయడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.