బిజినెస్

హాట్ హాట్.. నెట్ న్యూట్రాలిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: నెట్ న్యూట్రాలిటీపై భారీ ఎత్తున టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్‌కి కామెంట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెట్ న్యూట్రాలిటీ అంశంపై అభిప్రాయ సేకరణ గడువును బుధవారం మరోమారు పెంచింది ట్రాయ్. నిజానికి బుధవారంతోనే ఈ గడువు ముగియాల్సి ఉన్నప్పటికీ, టెలికాం రంగ సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ గడువును జనవరి 7 వరకు పొడిగించింది. అయితే తాజాగా దీన్ని జనవరి 14 వరకు పొడిగించినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ తెలిపారు. పలు అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వచ్చే నెల జనవరి 14 వరకు నెట్ న్యూట్రాలిటీపై కామెంట్లను, కౌంటర్లను పంపించవచ్చని వీటిని పరిగణనలోకి తీసుకుంటామని, అయితే ఆ తర్వాత వచ్చే వాటిని స్వీకరించబోమని ఓ ప్రకటనలో ట్రాయ్ స్పష్టం చేసింది.
కాగా, నెట్ న్యూట్రాలిటీపై ఇప్పటిదాకా 16.5 లక్షల కామెంట్లను ట్రాయ్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ఏ అంశంపైనా ఈ స్థాయిలో కామెంట్లు రాలేదని సంబంధిత వర్గాల ద్వారా సమాచారం. ఈ కామెంట్లలో 8 లక్షలు పేస్‌బుక్ లేదా ఫ్రీ బేసిక్స్ వేదిక నుంచే వచ్చాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంతే మొత్తంలో ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్, ఇతర జీరో-రేటింగ్ ప్రోగ్రామ్‌లకు వ్యతిరేకంగానూ కామెంట్లను ట్రాయ్ అందుకుంది. అంతర్జాల పరిరక్షణ మండలి ప్రకారం నెట్ న్యూట్రాలిటీ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎవరైతే ఉన్నారో వారు తమ నెట్‌వర్క్‌లలోని ఏ అప్లికేషన్లను లేదా ఏ కంటెంట్‌ను అడ్డుకోవడంగానీ, వాటిపట్ల పక్షపాతంతో వ్యవహరించడంగానీ చేయరాదు.
ఇదిలావుంటే ఫేస్‌బుక్.. తమ ఫ్రీ బేసిక్స్ పథకానికి మద్దతు పలకాలని ప్రచారం చేస్తోంది. ఈ ఫ్రీ బేసిక్స్‌తో ఇంటర్నెట్ చార్జీలు లేకుండానే కొన్ని వెబ్‌సైట్ల సేవలను నెటిజన్లు ఉచితంగా పొందవచ్చు. ఈ క్రమంలో ట్రాయ్ నెట్ న్యూట్రాలిటీపై అభిప్రాయ సేకరణ జరుపుతుండటంతో తమ ఫ్రీ బేసిక్స్‌కు మద్దతుగా నిలవాలని ఫేస్‌బుక్ ఇప్పుడు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తోంది. దేశీయ ప్రైవేట్‌రంగ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్.. ఇంటర్నెట్ ఆధారిత కాల్స్‌కు ప్రత్యేకంగా చార్జీలను వేయాలని నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా తొలిసారి నెట్ న్యూట్రాలిటీ అంశం తెరపైకి వచ్చినది తెలిసిందే. ఆ తర్వాత చెలరేగిన వ్యతిరేకతల మధ్య ఎయిర్‌టెల్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ ఈ అంశంపై చర్చ మాత్రం ఆగలేదు. ఫేస్‌బుక్ ఇంటర్నెట్ డాట్ ఒఆర్‌జితో కలిసి ఎయిర్‌టెల్ ప్రారంభించిన ‘ఎయిర్‌టెల్ జీరో’పైనా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విముఖత వ్యక్తమైనది విదితమే. అయితే ఫేస్‌బుక్ తాజాగా తెచ్చిన ఫ్రీ బేసిక్స్.. గతంలో ఆ సంస్థ నుంచి వచ్చిన ఇంటర్నెట్ డాట్ ఒఆర్‌జి తరహాలోనిదేనని నెట్ న్యూట్రాలిటీ వాదులు అంటున్నారు. ఫ్రీ బేసిక్స్‌లో అన్ని ఇంటర్నెట్ వెబ్‌సైట్లను ఉచితంగా వినియోగించుకునే సౌకర్యం ఉంటే ఫరవాలేదని, కాని కొన్ని వెబ్‌సైట్లనే ఉచితంగా ఇస్తామనడం ఇంటర్నెట్ సమానత్వాన్ని దెబ్బతీసేదేనని అంతర్జాల పరిరక్షణ మండలి చెబుతోంది. ఫేస్‌బుక్ వంటి కొన్ని సంస్థలు ఆయా వెబ్‌సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకుని వాటిని ఉచితంగా అందిస్తున్నాయని, టెలికాం ఆపరేటర్లతో ఒప్పందాలు చేసుకుని నెటిజన్లకు తాము అందిస్తున్న ఉచిత వెబ్‌సైట్లనే అంటగడుతున్నాయని మండలి మండిపడుతోంది. ఒప్పందాలకు దూరంగా ఉన్న వెబ్‌సైట్లను పొందాల నుకుంటే వినియోగదారులకు కష్టతరమవు తుందని, ధరలు అధికంగా చెల్లించడమేగాక, ఆ వెబ్‌సైట్ల వేగం కూడా తగ్గిపోతుందంటోం ది. దీనివల్ల క్రమంగా నెటిజన్లను వశపరుచుకోవాలనే కుట్రపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయంటోంది.
మరోవైపు ఫ్రీ బేసిక్స్ తరహా వాటిని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఎమ్‌ఎఐ) వ్యతిరేకించింది. వివిధ వెబ్‌సైట్ల సేవలను పొందడానికి రకరకాల ధరల విధానాలు అమల్లో ఉండరాదని, ఇందుకు తాము వ్యతిరేకమని ట్రాయ్ చేపట్టిన నెట్ న్యూట్రాలిటీపై అభిప్రాయ సేకరణలో ఐఎఎమ్‌ఎఐ స్పష్టం చేసింది. ఇదిలావుంటే ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ సర్వీస్‌కు ఓ టెలికాం ఎన్‌జిఒ మద్దతు పలికింది. వినియోగదారులకు ఉచితంగా అందే ఏ సేవలను ట్రాయ్ అడ్డుకోరాదని నెట్ న్యూట్రాలిటీపై ట్రాయ్ చేపట్టిన అభిప్రాయ సేకరణలో ఎన్‌జిఒ పేర్కొంది. మొత్తానికి ట్రాయ్ గడువు పెంచిన నేపథ్యంలో నెట్ న్యూట్రాలిటి మళ్లీ హాట్ టాపికైందిప్పుడు.