బిజినెస్

అతలాకుతలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: కేంద్ర ప్రభుత్వం 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. బుధవారం ఒక్కరోజే హైదరాబాద్‌తోసహా రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. దక్షిణ భారతంలో హైదరాబాద్‌కు మంచి వ్యాపార కేంద్రంగా పేరుంది. హైదరాబాద్‌తోపాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి, మిర్యాలగూడ, సూర్యాపేట, నిర్మల్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, సిద్ధిపేట, కామారెడ్డి తదితర పట్టణాల్లో వ్యాపారం భారీ ఎత్తున జరుగుతుంది. తెలంగాణకు చెందిన అన్ని జిల్లాల్లో ఎంత వ్యాపారం జరుగుతుందో అందుకు సమానమైన వ్యాపారం హైదరాబాద్‌లో జరుగుతోంది. హైదరాబాద్‌లో బంగారు, వెండి, వస్త్రాలు, ఆటోమొబైల్స్, టైల్స్, ఇత్తడి, రాగి, ప్లాస్టిక్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఆహార పదార్థాలు తదితరాల అమ్మకాలు వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. మరోవైపు కేంద్ర నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంపై పిడుగు పడ్డట్టయిందని వ్యాపారస్తులు తెలిపారు. ఇక రాష్ట్రంలో రోజూ బంగారం వ్యాపారమే దాదాపు 500 కోట్ల రూపాయలకుపైగా జరుగుతోంది. మలబార్, మంగత్‌రాయ్, జిఆర్‌టి, పిసి, కల్యాణ్, మానేపల్లి, చతుర్భుజ, శ్రీవైభవ్, సూరజ్‌బాన్, రాజశ్రీ, జగదాంబ, శ్రీసాయికృష్ణ తదితర పెద్దపెద్ద వ్యాపార సంస్థలు బంగారు, వజ్రాలతో కూడిన విలువైన ఆభరణాలను అమ్ముతున్నాయి. సికింద్రాబాద్‌లోని లక్ష్మీ జూవెలర్స్ యజమాని ముఖేష్ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, తమ దుకాణంలో రోజూ 10 నుండి 20 లక్షల రూపాయల వ్యాపారం జరుగుతుండగా, బుధవారం ఇది పది శాతానికి పడిపోయిందన్నారు. వ్యాపారం బాగా పడిపోయిన రంగాల్లో వస్త్రాల వ్యాపారం మరొకటి. హైదరాబాద్‌లోని చార్మినార్-మదీన ప్రాంతం, అబిడ్స్, సికింద్రాబాద్ జనరల్ బజార్‌తో సహా ఇతర ప్రాంతాల్లో వందలాది వస్త్రాల వ్యాపార కేంద్రాలున్నాయి. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ తదితర పట్టణాల్లో కూడా వస్త్ర వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లు హోల్‌సేల్ వ్యాపారానికి పెట్టింది పేరు. వస్తవ్య్రాపారం రోజూ దాదాపు 500 కోట్ల రూపాయల వరకు జరుగుతోంది. మహంకాళి ఆలయం వెనుకనున్న ప్రముఖ వ్యాపార దుకాణానికి చెందిన రాంమోహన్ ఆంధ్రభూమితో మాట్లాడుతూ, తమ దుకాణంలో రోజూ పది లక్షల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుండగా, బుధవారం లక్ష రూపాయల వ్యాపారం కూడా చేయలేకపోయామన్నారు. అలాగే వృత్తి అనే మరొక హోల్‌సేల్ యజమాని కూడా తమ దుకాణంలో వ్యాపారం పెద్దగా జరగలేదన్నారు. రోజూ 5 నుండి 9 లక్షల రూపాయల వ్యాపారం చేస్తామని, బుధవారం ఇది 50 వేలకు కూడా మించలేదని వివరించారు. హైదరాబాద్‌లోని తార్నాక-ఎల్‌బినగర్-డిఆర్‌డిఓ అపోలో ఆసుపత్రి వరకు ఉన్న 10 కిలోమీటర్ల పరిధిలో మార్బుల్స్, టైల్స్ వ్యాపారం అత్యధికంగా జరుగుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా టైల్స్, మార్బూల్స్ హోల్‌సేల్ కం రిటైల్ ఔట్‌లెట్స్ దాదాపు 500 వరకు ఉన్నాయి. రాజాటైల్స్ అనే దుకాణం యజమాని బసవేశ్వరగుప్త బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, తాము రోజూ దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు వ్యాపారం చేస్తామని, ఈరోజు ఎవరూ కొనుగోలు చేసేందుకు రాలేదని వివరించారు. వ్యాపారం పడిపోయిన రంగాల్లో ఆటోమొబైల్స్ రంగం మరొకటి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో హ్యుందాయ్, మారుతి, టయోటా తదితర కంపెనీల కార్లతోపాటు, బుల్లెట్, హోండా, హీరో, టివిఎస్ తదితర ద్విచక్ర వాహనాలు, బజాజ్ తదితర కంపెనీలకు చెందిన త్రిచక్ర వాహనాల వ్యాపారం బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ రంగంలో కూడా రోజు దాదాపు 400 కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుండగా, బుధవారం ఇది పది కోట్లకు కూడా దాటలేదని ఈ వ్యాపార వర్గాలు వెల్లడించాయి. బాలాపూర్ క్రాస్‌రోడ్డులోని టివిఎస్ షోరూంలో రోజూ ఐదు నుండి పది వాహనాలను అమ్ముతుంటామని, ఈరోజు ఒక్క వాహనం కూడా అమ్మలేకపోయామని ఈ షోరూంకు చెందిన రాంరెడ్డి ఆంధ్రభూమితో చెప్పారు. ఇలా ఉండగా హెరిటేజ్, మోర్, రత్నదీప్, బిగ్‌బజార్ తదితర సూపర్ మార్కెట్లలో కూడా వ్యాపారం గణనీయంగా పడిపోయింది. సూపర్ మార్కెట్లలో రోజూ దాదాపు 200 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుండగా, ఈరోజు 20 కోట్లకు కూడా చేరలేదు. కామినేని ఆసుపత్రి క్రాస్‌రోడ్డులో ఉన్న బిగ్‌బజార్‌లో రోజూ పది లక్షల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుండగా, ఈరోజు ఇది లక్ష రూపాయలు కూడా మించలేదని సంబంధిత ఉద్యోగి ఒకరు ఆంధ్రభూమితో చెప్పారు.
బోసిపోయిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు
వివిధ రంగాల నుండి ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా బుధవారం గణనీయంగా పడిపోయింది. రాష్ట్రంలో ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, యూజర్ చార్జీల ద్వారా రావలసిన ఆదాయానికి భారీ గండి పడింది. రోజూ 10 నుండి 15 కోట్ల వరకు ఆదాయం లభిస్తోంది. బుధవారం రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఎవరూ రాలేదు. నిన్న, మొన్న కట్టిన చలాన్లు తీసుకుని కొంత మంది రిజిస్ట్రేషన్ల కోసం ఈ కార్యాలయాలకు వచ్చారు. రంగారెడ్డి జిల్లాలలోని సాగర్ రింగ్‌రోడ్డులో ఉన్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజూ సరాసరిన 100 వరకు భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. రిజిస్ట్రేషన్, స్టాంప్‌డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ చార్జీల ద్వారా 20 లక్షల నుండి 30 లక్షల వరకు ఆదాయం లభిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో రోజూ కిటకిటలాడే ఈ కార్యాలయం ఈరోజు బోసిపోయింది. ఈ కార్యాలయంపై ఆధారపడి జిరాక్స్ దుకాణం పెట్టుకున్న యాదగిరి అనే అతను ఆంధ్రభూమితో మాట్లాడుతూ, రోజూ తనకు 500 రూపాయల వరకు వచ్చేవని, ఈరోజు వంద రూపాయలు కూడా రాలేదని వాపోయాడు.
రియల్‌ఎస్టేట్ వ్యాపారి రాజశేఖర్ మాట్లాడుతూ, తమ వ్యాపారానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. మొత్తంమీద కేంద్రం తీసుకున్న నిర్ణయం వర్తక, వాణిజ్య రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఆర్‌టిఎ కార్యాలయాల్లో కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ల కోసం పెద్దగా ఎవరూ రాలేదు.
ఖాళీగా దర్శనమిస్తున్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం