బిజినెస్

వడ్డీ వద్దులెండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాత పెద్ద నోట్ల రద్దుతో వడ్డీ వ్యాపారుల్లో దడ
భారీగా మిగిలిపోయన 500, 1,000 రూపాయల కరెన్సీ
మార్చుకునేందుకు నానా తంటాలు
వడ్డీ లేకుండానే ఇస్తామంటూ సామాన్యులకు ఎర
5 లక్షలైనా తీసుకోండి.. ఏడాది తరువాత అసలిస్తే చాలని ఆఫర్

విశాఖపట్నం, నవంబర్ 14: ‘మా అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు కాస్త ఆర్థిక సాయం చేయండి. కొద్ది రోజుల్లోనే సర్దుబాటు చేస్తాను. వడ్డీ ఎంతైన ఫరవాలేదు. సమయానికివ్వండి చాలు.’ కొద్ది రోజుల కిందటి వరకు సగటు మనిషి తన అవసరాలను తీర్చుకునేందుకు ఇంతకన్నా ఎక్కువే పాట్లు పడ్డాడు. అయితే కాలం మారింది. ఇప్పుడు సామాన్యునికి సమయం వచ్చింది మరి. ‘ఇంట్లో కాస్త పెద్ద మొత్తంలో డబ్బుంది. మీకేమైన అవసరం అయితే తీసుకోండి. వడ్డీ అవసరం లేదు. మీ దగ్గర డబ్బులున్నప్పుడే ఇవ్వండి.’ ఇది అప్పిచ్చేవాడి తాజా పరిస్థితి. అవును.. నల్లధనం, నకిలీ కరెన్సీలను అరికట్టే క్రమంలో 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వడ్డీ వ్యాపారులకు నిద్ర లేకుండా చేస్తోంది. వీరి వద్ద ఉండేది ఎక్కడా లెక్కల్లో చూపని నల్లధనమే కావడంతో ఇప్పుడు వడ్డీ వ్యాపారులంతా తమ వద్దనున్న డబ్బును ఏం చేసుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దు పుణ్యమాని ఇప్పుడు వడ్డీ వ్యాపారులకు కోలుకోలేని దెబ్బే తగిలింది. ఒకప్పుడు నూటికి 2 నుంచి 9 రూపాయల వడ్డీకి అప్పులిచ్చిన కుబేరులు కాస్తా ఇప్పుడు బికారులై డబ్బిస్తాం వడ్డీ వద్దంటూ జనాల కాళ్లావేళ్లా పడుతున్నారు. విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి సహా కొన్ని ప్రాంతాలు వడ్డీ వ్యాపారానికి పెట్టింది పేరు. లెక్కల్లో చూపని కోట్లాది రూపాయలు ఇక్కడ వడ్డీ వ్యాపారం రూపంలో చలామణి అయ్యేది. బెల్లం మార్కెట్ కేంద్రంగా ఇక్కడ కోట్లాది రూపాయల లావాదేవీలు కొనసాగుతుంటాయి. వడ్డీ వ్యాపారులంతా తమ వద్దనున్న సొమ్మును పెద్ద నోట్లుగానే చలామణి చేసుకునేవారు. ఒక్కసారిగా కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే వీరికి వెన్నులో వణుకొచ్చింది. అవకాశం ఉన్నంత మేరకు కొంత మొత్తాన్ని వివిధ రూపాల్లోకి మార్చుకున్నప్పటికీ భారీ మొత్తాలు అలాగే ఉండిపోయాయి. అర్ధరాత్రి నిర్ణయం కారణంగా స్థిరాస్తులుగా మార్చుకునే అవకాశం కూడా లేకపోవడంతో నగదు రూపంలోనే ఈ మొత్తాలు మిగిలి పోయాయి. బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకుంటే భవిష్యత్‌లో వచ్చే చిక్కులను దృష్టిలో ఉంచుకుని వీరంతా ఇప్పుడు నోట్లను మార్చుకునేందుకున్న మిగతా దారులను వెతుకుతున్నారు. గతంలో తమ వద్ద రుణాలు తీసుకున్న వ్యక్తులతోపాటు వారి పరిచయస్తులను సైతం వీరు సంప్రదిస్తున్నారు. ముఖ పరిచయం ఉండి, ఆర్థిక స్థితిగతులు తెలిస్తే చాలు.. అప్పు కావాలంటే తీసుకోండంటూ వెంట పడుతున్నారు. 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకూ అప్పులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. తీసుకునే రుణానికి ఒక్క రూపాయి వడ్డీ అవసరం లేదని, ఏడాది తరువాత అసలు తిరిగిస్తే చాలని ప్రాధేయపడుతున్నారు. దీనికోసం అప్పు తీసుకునేవారు తమ స్థిర, చరాస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఒక ప్రామిసరీ నోటు, రెండు సంతకాలు చేసిన బ్లాంక్ చెక్కులు ఇస్తే చాలు. ఏడాది కాలం పాటు మిమ్మల్ని తిరిగి అడిగి ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా లేదంటూ బ్రతిమాలుతున్నారు.
నిజానికి అప్పులు ఇచ్చి వడ్డీలు, చక్రవడ్డీలతో వసూలు చేసుకునే వ్యాపారులు కొద్ది రోజుల కిందట కాల్‌మనీ వ్యవహారం వెలుగు చూడటంతో ఒక్కసారిగా కనుమరుగైపోయారు. అప్పులు తీసుకున్న వారంతా పోలీస్ స్టేషన్లను ఆశ్రయించి అప్పిచ్చిన వాడిని ముప్పు తిప్పలు పెట్టిన సందర్భాలూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా నోట్ల రద్దుతో ఇక వడ్డీ వ్యాపారం ఊసెత్తే అవకాశమే లేకుండా పోయందంటూ బడా బాబులు, అక్రమార్కులు గుండెలు బాదుకుంటున్నారు. ఒక్క విశాఖనే గాదు ఆంధ్రా, తెలంగాణ, యావద్భా రతావనిలోగల లెక్కలు లేని సొమ్మున్నవారి పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది మరి. మొత్తానికి మోదీ దెబ్బ గట్టిగానే తగిలింది కదూ..