బిజినెస్

అమరావతి నిర్మాణానికి రూ. 58 వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రస్తుత అంచనాల ప్రకారం 58 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని భావిస్తున్నారు. ఇందులో 2017, 18, 19 సంవత్సరాలలో వౌలిక సదుపాయాల కల్పనకే 32 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని సీఆర్డీయే అంచనాలు రూపొందించింది. ఈ నిధులను హడ్కో, ప్రపంచ బ్యాంక్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోపాటు ఇతర మార్గాల ద్వారా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిలో ఆవాస సముదాయాల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఇప్పటికే హడ్కో ముందుకొచ్చింది. పభుత్వ ఉద్యోగులు, ఇతరులకు గృహ సముదాయాల నిర్మాణ నిమిత్తం రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ కొంత స్థలాన్ని కేటాయించనుంది. అమరావతి నిర్మాణానికి ప్రధానంగా ఐదు మార్గాలలో నిధుల సమీకరణ జరిపేందుకు సీఆర్డియే కసరత్తు జరుపుతోంది. ప్రపంచ నగరంగా రూపుదాల్చనున్న కొత్త రాజధానికి నిర్మాణ దశలో ఎలాంటి నిధుల కొరత రానివ్వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనల మేరకు సీఆర్డీయే కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. బుధవారం సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతిపాదనలలో మొదటిది పిపిపి పద్ధతిలో చేపట్టే ప్రాజెక్టుల ఆమోదం, పర్యవేక్షణకు ఓ సాధికార కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ పద్ధతిలో 5,500 కోట్ల రూపాయల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు సమకూరుతాయని భావిస్తున్నారు. రెండో ప్రతిపాదన ప్రకారం లీజు-రెంటల్ డిస్కౌంటింగ్ విధానంలో ప్రభుత్వ భవనాలు, నివాసాలు, సీడ్ కేపిటల్ ప్రాంత అభివృద్ధి చేపడతారు. ఈ విధానంలో సీఆర్డీయేకు ప్రభుత్వ శాఖల నుంచి అద్దెలు, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఇంటి అద్దె భృతి ద్వారా నిధులు సమకూరతాయి. లీజు-రెంటల్ డిస్కౌంటింగ్ విధానం ద్వారా మొత్తం 2,850 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇక మూడో ప్రతిపాదన ప్రకారం జి టు జి ఈక్విటీ ఫండ్ ఏర్పాటు చేస్తారు. రాజధాని నిర్మాణంలో పాలు పంచుకోవటానికి ఆసక్తి చూపుతున్న వివిధ దేశాలను భాగస్వాముల్నిచేసి మిశ్రమ ప్రాయోజక అభివృద్ధి (మిక్స్‌డ్ యూజ్ డెవలప్‌మెంట్), సాంఘిక వౌలిక సదుపాయాలను కల్పిస్తారు. ఈ పద్ధతి ద్వారా మరో 1,400 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుంది. నాలుగో ప్రతిపాదన సమష్టి పెట్టుబడుల పథకం (కలెక్టివిటీ ఇనె్వస్ట్‌మెంట్ స్కీం). మూడేళ్ల నుంచి పదేళ్ల వ్యవధి గల ల్యాండ్ మానిటైజేషన్ పథకంగా దీన్ని అమలు చేస్తారు. స్పెషల్ వెహికల్ పర్పస్ (ఎస్‌పివి) కింద సీఆర్డీయే రాజధానిలో కొంత భూమిని రిజర్వు చేస్తుంది. వీటిని యూనిట్లుగా వర్గీకరించారు. ఆసక్తి కలిగిన పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుంది. పెట్టుబడులకు గ్యారంటీ రాబడిని కూడా అంచనా వేశారు. భూముల విలువ పెరిగిన సమయంలో ఈ యూనిట్లను విక్రయించడం ద్వారా ఆ లాభాలను పెట్టుబడిదారులకు అందిస్తుంది. ఈ రకంగా 2,500 కోట్ల రూపాయలు గడించవచ్చనేది సీఆర్డీయే అధికారుల భావన. బాండ్స్ జారీ చేయడం ద్వారా నిధులను సమీకరించే పద్ధతి ఆఖరి ప్రతిపాదన. బాండ్లు తీసుకునే వారికి పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పిస్తారు. బాండ్ల జారీకి అవసరమైన సెబీ రెగ్యులేటరీ నిబంధనలకు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన ప్రకారం 2,000 కోట్ల రూపాయల నిధులు వస్తాయని ఆశిస్తున్నారు. జి టు జి ఈక్విటీ ఫండ్ ఏర్పాటుకు సంబంధించి ఇనె్వస్టుమెంట్ అడ్వయిజర్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. న్యాయ సంబంధిత ప్రక్రియను ఏర్పాటు చేసుకోవాలి. పన్నుల విధానాన్ని రూపొందించాలి. కలెక్టివ్ ఇనె్వస్టుమెంట్ స్కీం కోసం ఇనె్వస్టుమెంట్ బ్యాంకర్‌ను నియమిస్తారు. బాండ్స్ జారీకి ఆర్థిక శాఖ అనుమతులు, మంత్రి మండలిలో చర్చ తదితర ప్రక్రియను పూర్తి చేస్తారు. మరోవైపు రాజధానిలో కట్టడాల నిర్మాణానికి ఉపయోగించే ఇసుక, సిమెంట్, మెటల్ తదితర సామాగ్రి ఎంత అవసరమో గుర్తించి అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం ఉన్న 8 సలహా, సంప్రదింపుల సంస్థలతోపాటు ఇతర ప్రతినిధులను సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత సీఆర్డీయేదేనన్నారు. రాజధాని నిర్మాణానికి సహకారం అందించే సంస్థలతో శుక్రవారం అమరావతి ఫైనాన్సింగ్ రౌండ్‌టేబుల్ పేరుతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.

నోట్ల రద్దుతో దేశానికి మేలు: ఆదిత్యా పురి
ముంబయి, నవంబర్ 23: నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలంలో మంచే చేయగలదని ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్యా పురి అన్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు ఈ నెల 8వ తేదీ రాత్రి 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయం తీసుకున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఈ నిర్ణయం ప్రశంసనీయమని, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు ప్రయోజనాలుంటాయని బ్యాంక్ ఖాతాదారులకు ఇచ్చిన ఓ నోట్‌లో పురి అభిప్రాయపడ్డారు.

సన్ ఫార్మా చేతికి బయోసింటెజ్
న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశీయ ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా.. రష్యాకు చెందిన బయోసింటెజ్‌లో మెజారిటీ వాటాను అందుకుంటోంది. దీనికి సంబంధించి క్రియాశీలక ఒప్పందాలపై సంతకాలు జరిగినట్లు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సన్ ఫార్మా తెలిపింది. రష్యాకు చెందిన జెఎస్‌సి బయోసింటెజ్‌లో 24 మిలియన్ డాలర్లకు 85.1 శాతం వాటాను పొందుతున్నట్లు వివరించింది. కాగా, ఈ లావాదేవీలో భాగంగా దాదాపు 36 మిలియన్ డాలర్ల బయోసింటెజ్ రుణానికీ సన్ ఫార్మా హామీ పడనుంది. బయోసింటెజ్ వాటా కొనుగోలు లాభిస్తుందన్న ఆశాభావాన్ని సన్ ఫార్మా వ్యక్తం చేసింది.