బిజినెస్

ఏపిఐఐసికి చెక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 24: పరిశ్రమలు రాకుండా మోకాలడ్డుతున్న అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసాంధ్రులు సహా అనేక సంస్థలు ముందుకురావాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాళ్లకుబలపాలు కట్టుకుని చేస్తున్న విదేశీ పర్యటనలకు స్పందన లభిస్తోంది. ఆ మేరకు ఎన్‌ఆర్‌ఐలు, ఇతర రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తున్నా వారికి కనీస స్థాయిలో అధికారుల నుంచి సహకారం కరవవడం విమర్శలకు దారితీసింది. ఏపిఐఐసి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలిస్తూ వచ్చిన పారిశ్రామికవేత్తల్లో నిరుత్సాహం నింపుతున్నారు. సీఎంఓలోని ఒక ఐఏఎస్, పరిశ్రమల శాఖలో సీనియర్ అధికారులున్నా వారిని పక్కకుపెట్టి కర్రపెత్తనం చేస్తున్న ఒక యువ ఐఏఎస్ తీరుతో వచ్చిన పారిశ్రామికవేత్తలు వెనక్కివెళ్లిపోతున్న వైనం, పెట్టుబడిదారుల ఫిర్యాదుతో బాబు దృష్టికి వెళ్లింది. పరిశ్రమల శాఖకు ముఖ్య కార్యదర్శి ఉన్నప్పటికీ ఆ యువ ఐఏఎస్ అధికారే అధిపత్యం చలాయిస్తున్నారని, మంత్రులు పంపిన సిఫార్సు లేఖలను కూడా పట్టించుకోరన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి.
ఒక యువనేతకు మిత్రుడన్న భయంతో సీనియర్ ఐఏఎస్‌లు కూడా కిమ్మనకుండా ఉంటున్నారు. సీనియర్లు ఎంతోమంది ఉన్నా, వారిని కాదని జూనియర్ అయిన ఆయనకు ఆ పదవి ఇవ్వడం ఐఏఎస్‌లకు రుచించడం లేదు. చివరకు ఆ శాఖలో పనిచేసే కిందిస్థాయి అధికారులు వేరొక శాఖకు డిప్యుటేషన్‌కు ప్రయత్నాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
దీనితో వాస్తవ పరిస్థితి గ్రహించిన సీఎం చంద్రబాబు, పరిశ్రమల స్థాపనకు వచ్చేవారికి అనుమతులు త్వరితగతిన పూర్తి చేసేందుకు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రయోషన్ బోర్డు (యుఐపిబి)ని ఏర్పాటు చేసి ఏపిఐఐసి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులకు షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా, తన వేగానికి అనుగుణంగా అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న అసంతృప్తి బాబులో చాలాకాలం నుంచీ ఉంది.
వివిధ కారణాలతో అనుమతుల మంజూరులో జాప్యం అవుతుండటం పెట్టుబడులపై ప్రభావం చూపుతోందన్న సమచారం కూడా బాబుకు లేకపోలేదు. అప్పటికీ అనేక అవకాశాలిచ్చినా వారి తీరు మారకపోతుండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఆర్థిక నగరాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగా మెగా ప్రాజెక్టులు వచ్చేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఫలితంగా ఎక్కువ మంది రాష్ట్రంలో ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అనుమతుల మంజూరులో జాప్యం పెట్టుబడిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నది. దీనిని దృష్టిలో ఉంచుకుని, పాలనా పరమైన సంస్కరణల్లో భాగంగా యుఐపిబిని ఏర్పాటు చేశారు. పాలనలో రెండోతరం సంస్కరణల్లో భాగంగా సిఎం దీనిని ఏర్పాటు చేశారని భావిస్తున్నారు. ఆర్థిక నగరాల అభివృద్ధిలో యుఐపిబి నిర్ణయం కీలకం కానుంది. ఇప్పటికే సచివాలయంలో సింగిల్ ఫైల్ విధానం అమలులో ఉంది. మరింత మెరుగైన సేవలు పెట్టుబడిదారులకు లభించేలా ఈ బోర్డు చూస్తుంది. ఎపిఐఐసి, పరిశ్రమల శాఖ, జిఎడి, ప్రొటోకాల్ విభాగాల పనితీరును నిశితంగా పరిశీలించాకే ఈ బోర్డును ఏర్పాటు చేశారని తెలిసింది. ఈ కమిటీలో మంత్రులే సభ్యులుగా ఉంటారు. మంత్రులు కమిటీలో సభ్యులుగా ఉండటంలో వారికి పార్టీపట్ల ఆసక్తి, తిరిగి అధికారంలోకి రావాలన్న పట్టుదల ఉంటుందని, అదే అధికారుల్లో ఉండదని పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. దీనికోసమే ఈ బోర్డు ఏర్పాటుచేశారంటున్నారు. వివిధ మెగా ప్రాజెక్టులను అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రమోషన్ కమిటీ పరిశీలించి, సిఫారుసు చేశాక తదుపరి నిర్ణయం యుఐపిబి తీసుకుంటుంది. ప్రాజెక్టును అనుమతించడం లేదా తిరస్కరించే అధికారం ఈ బోర్డుకు ఉంటుంది. ఎపిఐఐసి, పరిశ్రమల శాఖ పనితీరును ఈ బోర్డు నిశితంగా పరిశీలించనుంది.