బిజినెస్

3 నెలలకోసారి నష్టపరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 26: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో రాష్ట్రాలు కోల్పోయే ఆదాయానికిగాను కేంద్రం మూడు నెలలకోసారి నష్టపరిహారం ఇవ్వనుంది. జిఎస్‌టి అమలైన తొలి ఐదేళ్లలో లగ్జరీ ఉత్పత్తులు, పొగాకు తదితర ఉత్పత్తులపై ‘జిఎస్‌టి నష్టపరిహార సెస్సు’ పేరిట లెవీని రాష్ట్రాలకు ప్రతి త్రైమాసికానికి కేంద్రం ఇస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘జిఎస్‌టి నష్టపరిహార నిధి’ నుంచి ఈ చెల్లింపులను కేంద్రం చేస్తుంది.
కాగా, ఏదైనా రాష్ట్రానికి ఇవ్వాల్సిందానికన్నా ఎక్కువ నష్టపరిహారం అందినట్లయితే అది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించే వార్షిక లెక్కల్లో తేలుతుందని, ఆ ఎక్కువ మొత్తం వచ్చే ఏడాదికిగాను సదరు రాష్ట్రానికి చెల్లించే నష్టపరిహారంలో మినహాయించుకుంటామని ‘జిఎస్‌టి నష్టపరిహార చట్టం’ ముసాయిదాలో శనివారం కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ‘జిఎస్‌టి నష్టపరిహార నిధి’లో ఏదైనా సొమ్ము మిగిలితే అది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి.
మిగిలినదానిలో 50 శాతం భారత సంఘటిత నిధికి చేరుతుంది. మిగతా 50 శాతం ఎస్‌జిఎస్‌టి నుంచి తమ మొత్తం ఆదాయం నిష్పత్తి ప్రకారం రాష్ట్రాలకు అందుతుంది. ఇదిలావుంటే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నాయకత్వంలోని జిఎస్‌టి మండలి ఈ ముసాయిదా చట్టాన్ని పరిశీలించనుంది. వచ్చే నెల 2-3 తేదీల్లో జరిగే సమావేశంలో ముసాయిదాను పరిశీలిస్తుంది. గతంలో జరిగిన మండలి సమావేశాల్లో నాలుగు అంచెల జిఎస్‌టి పన్ను నిర్మాణ శైలిని నిర్ణయించినది తెలిసిందే. 5, 12, 18, 28 శాతంతో పన్నులు వేయాలని తీర్మానించారు. లగ్జరీ ఉత్పత్తులు, డీమెరిట్ గూడ్స్‌పై అత్యధికంగా 28 శాతం పన్నును విధిస్తారు.
అంతేగాక ‘జిఎస్‌టి నష్టపరిహార నిధి’ కోసం 50,000 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి సెస్సునూ వేస్తారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిఎస్‌టిని అమల్లోకి తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నించినది తెలిసిందే. ఈ క్రమంలోనే మెజారిటీ లేని రాజ్యసభలో ప్రతిపక్షాలు సూచించిన మార్పులకూ తలొగ్గింది. తద్వారా పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన జిఎస్‌టి బిల్లు.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఎట్టకేలకు అమల్లోకి వస్తోంది. ఇందుకు తగిన ఏర్పాట్లను మోదీ సర్కారు చకచకా చేసేస్తోంది.