బిజినెస్

మెరిసిన తెల్ల బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 21: పత్తి పంటపై ఆశలు పెట్టుకుని సాగుచేసిన రైతులకు ఈసారి మార్కెట్‌లో సిరుల పంట కురుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం క్వింటాలు మద్దతు ధర 4,060 రూపాయలుగా ప్రకటించగా, అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ ఉండదని పత్తి సాగు విస్తీర్ణం తగ్గించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు వ్యవసాయ శాఖ చేసిన ప్రచారం పటాపంచలైంది. ఊహించని రీతిలో మార్కెట్‌లో పత్తి ధర పైపైకి ఎగబాకుతుండడంతో పత్తి పంటను పండించిన రైతులతోపాటు మార్కెట్‌లో వ్యాపారస్తులకు సైతం పత్తి సీజన్ కాసుల వర్షం కురిపిస్తోంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్‌గా గుర్తింపు ఉన్న ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం పత్తి క్వింటాలు ధర రికార్డు స్థాయిలో 5,500 రూపాయలు పలుకగా, మహారాష్టల్రోని కిన్వట్, పాండర్‌కావడ, యావత్‌మాల్ కేంద్రాల్లో క్వింటాలుకు 5,600 రూపాయలు చెల్లించడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకంటే ఊహించని విధంగా క్వింటాలుకు అదనంగా 1,500 రూపాయలకుపైగా గిట్టుబాటు ధర లభించడం రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయ. నిరుడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 52 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగితే, ఈ ఏడాది జనవరి మూడో వారం వరకు ఆదిలాబాద్, భైంసా, ఆసిఫాబాద్, నిర్మల్ మార్కెట్ యార్డుల్లో 35 లక్షల క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. మరో 20 రోజుల పాటు మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు జరిగే అవకాశం ఉండగా, ఇప్పటికే 85 శాతం మంది రైతులు తమ వద్ద నిల్వ ఉంచుకున్న పత్తిని మార్కెట్‌లో విక్రయించుకున్నారు. కొనుగోళ్ల చివరి దశలో ఆమాంతం పత్త్ధిర పెరగడం రైతుల కంటే వ్యాపారులకే లాభాలు తెచ్చిపెడుతుండటం విశేషం. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన రైతులకంటే రెండు నెలల వ్యాపారం చేసే జిన్నింగ్ మిల్, ప్రెస్సింగ్ మిల్, స్పిన్నింగ్ మిల్ వ్యాపారులకే పత్తి వ్యాపారం లాభసాటిగా మారిందని చెప్పవచ్చు. అంతర్జాతీయంగా పత్తి సాగు విస్తీర్ణంతోపాటు ఉత్పత్తులు తగ్గుముఖం పట్టడం, డిసెంబర్ నెలలో పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల పత్తిని మార్కెట్‌కు తీసుకురాలేకపోవడం వల్ల జనవరి మొదటి వారం నుండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అంతేగాక పత్తి బేల్ (170 కిలోలు) ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 36 వేల రూపాయల నుండి 39 వేల రూపాయలకు చేరడం, పత్తి నుండి వేరుచేసిన గింజల ధర అంతర్జాతీయ మార్కెట్‌లో క్వింటాలుకు 1,800 రూపాయలు పలకడంతో ఈ రెండు ధరల పెరుగుదల ప్రభావంగా పత్తిపంటకు మార్కెట్‌లో రికార్డు స్థాయిలో గిట్టుబాటు ధర లభించి, రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది. ఆదిలాబాద్ మార్కెట్‌లో ప్రతి రోజు సగటున 15 వేల నుండి 18 వేల క్వింటాళ్ల కొనుగోళ్లు జరుగుతుండగా, తలమడుగు, జైనథ్, బేల, బోథ్, కుబీర్, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, తానూర్ మండలాలకు చెందిన రైతులు సరిహద్దు మహారాష్టల్రోని పత్తి మార్కెట్‌కు తమ సరకును తరలిస్తూ మరింత లాభాలు ఆర్జిస్తున్నారు. మహారాష్టల్రో క్వింటాలు ధర 5,600 రూపాయలు చెల్లిస్తుండగా, ఇచ్చోడ, భైంసా, ఆదిలాబాద్‌లో 5,450 రూపాయల నుండి 5,500 రూపాయల వరకు ధర పలకడం రైతుల్లో ఆనందం కలిగిస్తోంది. మరో నెల రోజుల పాటు ధరలు క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈసారి ప్రభుత్వరంగ సంస్థ (సిసిఐ) కొనుగోళ్ళకు రాకపోయినా ప్రైవేట్ కొనుగోళ్లతోనే పత్తికి డిమాండ్ పెరిగిందని రైతులు పేర్కొంటున్నారు. కాగా, ప్రభుత్వ ప్రకటనతో ఈ ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాల్లో పత్తిసాగు విస్తీర్ణం తగ్గించుకొని నష్టపోవాల్సి వచ్చిందన్న అభిప్రాయం రైతుల నుండి వ్యక్తమవుతోంది. వచ్చే ఫిబ్రవరి వరకు పత్తి ధర 5,800 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తానికి రైతుల వద్ద నిల్వలు తగ్గిపోయి వ్యాపారులకు మాత్రం పెరిగిన ధర లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదు.