బిజినెస్

జనం చేతిలో మరింత నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: నిజాయితీగా పన్ను చెల్లించేవారికి మరింత వెసులుబాటును కల్పించామని వారి చేతిలో మరింత నగదు ఉండేలా కొత్త బడ్జెట్‌ను రూపొందించానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అలాగే తొలిసారి పన్ను చెల్లించేవారికి మరింతగా ప్రోత్సహకాలు అందించినట్టు స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరినీ కూడా పన్నుల పరిధిలోకి తెచ్చేలా అనుకూలమైన రీతిలోనే ఈ ప్రతిపాదనలను రూపొందించినట్టు ఆయన తెలిపారు. ఇప్పటి వరకూ పన్ను ఎగవేతదారుల భారాన్ని కూడా నిజాయితీగా పన్నుకడుతున్నవారే భరిస్తూ వచ్చారని పేర్కొన్న జైట్లీ.. డిజిటల్ విధానం వల్ల ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఆదాయాలను వెల్లడించేందుకు ముందుకు వస్తున్నారని వ్యక్తిగత ఆదాయ పన్నులో కూడా గణనీయమైన మెరుగుదల కనిపించిందని అన్నారు. భారత సమాజం ఎక్కువగా పన్నులు కట్టని సమాజమేనని పేర్కొన్న ఆయన రెండున్నర లక్షల నుంచి 5 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారిపై వేసిన పన్నును 10 నుంచి 5 శాతం తగ్గించడం ద్వారా ప్రతిఒక్కరూ నిజాయితీగా పన్ను కట్టేలా చర్యలు తీసుకున్నట్లైందన్నారు. దేశంలో పన్ను చెల్లించేవారు ఎక్కువగా రెండున్నర లక్షల నుంచి 5 లక్షల స్లాబ్‌లోకి వచ్చేవారేనని స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి.. తాజాగా పన్నును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల పన్నులు కట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. పన్నుకట్టే ప్రతి ఒక్కరికీ ఈ బడ్జెట్ ద్వారా ఎంతో కొంత ఉపశమనాన్ని కల్పించినట్టు చెప్పారు. 5 లక్షల పైన ఆదాయం కలిగిన వారు కూడా తన ప్రతిపాదన వల్ల ఏటా 12 వేల రూపాయల మేర ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
కాగా, ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల అమ్మకం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18)లో 72,500 కోట్ల రూపాయల మేర నిధులను ఖజానాకు తరలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకులకు 10,000 కోట్ల రూపాయల నిధులను మూలధన సాయంగా అందిస్తామని చెప్పింది. ద్రవ్యలోటును జిడిపిలో 3.2 శాతానికి అదుపు చేస్తామన్న జైట్లీ.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకి మరింతగా వచ్చేలా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి)ను రద్దు చేశారు. 50 కోట్ల రూపాయల టర్నోవర్‌కు దిగువన ఉన్న చిన్న సంస్థలకు ఆదాయ పన్నును 25 శాతం వరకు తగ్గించారు. మందగమనంలో నడుస్తున్న నిర్మాణ రంగానికి వెన్నుదన్నుగా చౌక గృహాలకు వౌలికరంగ హోదాను ఇచ్చారు. బ్యాంకింగ్ రంగాన్ని.. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థ కం చేస్తున్న మొండి బకాయల సమస్య నివారణకు ప్రత్యేక చట్టం తేవాలని కూడా యోచిస్తోంది సర్కారు. కాగా, మసాలా బాండ్లకు మరిన్ని పన్ను మినహాయం పులను కల్పించిన జైట్లీ.. స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో అవకతవకల అదుపుపైనా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో బ్యాంకింగ్, వ్యాపార, పారిశ్రామిక రంగాల నుంచి బడ్జెట్‌కు మద్దతు లభిస్తోంది. వృద్ధిరేటును తిరిగి గాడిలో పెట్టగల బడ్జెట్‌ను జైట్లీ ప్రవేశపెట్టారని కొనియాడుతున్నారు. చందా కొచ్చర్, శిఖా శర్మ, రాణా కపూర్, ఆనంద్ మహీంద్ర, హిందుజా సోదరులు తదిత రులు తాజా కేంద్ర బడ్జెట్ బాగుందంటూ కితాబిచ్చారు.

ఎవరేమన్నారు

‘దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి ఈ బడ్జెట్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఆర్థికపరమైన లక్ష్యాల సాధన దిశగా బడ్జెట్ తీరు ఉంది. దేశంలోని సుపరిపాలనకు ఇది అద్దం పడుతోంది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కృషి చేశారు. అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కూర్పు సాగింది.’
- ఫిక్కీ అధ్యక్షుడు పంకజ్ పటేల్
‘50 కోట్ల రూపాయల టర్నోవర్‌కు దిగువన ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సంస్థలకు కార్పొరేట్ పన్నును తగ్గించడం ఆహ్వానించదగినది. భారీ సంస్థలకూ ఇదే తరహా ప్రోత్సాహకాలను పారిశ్రామిక రంగం ఆశిస్తోంది.’
- అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా
‘బడ్జెట్ ఎంతో సమతూకంగా ఉంది. క్షేత్రస్థాయి నుంచి ఆర్థిక మూలాలను బలోపేతం చేసేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం హర్షణీయం. చిన్న మదుపరులకు పన్ను ప్రోత్సాహకాలివ్వడాన్ని స్వాగతిస్తున్నాం. చౌక గృహ నిర్మాణ రంగానికి ఊతమిచ్చారు.’
- పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గోపాల్ జివారజ్కా
‘బడ్జెట్ స్థూలంగా అందరి మన్ననలను పొందింది. వృద్ధిరేటు బలోపేతానికి ప్రభుత్వ విధానాలు కట్టుబడి ఉన్నాయి. దేశ, విదేశీ మదుపరుల పెట్టుబడులను బడ్జెట్ ప్రోత్సహిస్తోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ నిర్ణయాలు మున్ముందు మరిన్ని సంస్కరణలుం టాయన్న విశ్వాసాన్ని కలగజేస్తోంది.’
- సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ
‘ఇది మంచి బడ్జెట్, ప్రగతిశీల బడ్జెట్. మధ్య, చిన్న తరహా పరిశ్రమలపై కార్పోరేట్ ఆదాయం పన్నును తగ్గించి పారిశ్రామిక రంగం అభివృద్ధికి బాటలు వేశారు. గ్రామీణ వ్యవసాయ, ఆర్థిక రంగానికి వరాలు ప్రకటించారు. వౌలిక సదుపాయాల రంగం కొత్త పుంతలు తొక్కనుంది. విద్య, నైపుణ్యం, ఆరోగ్య రంగాలకి నిధుల కేటాయింపు పెంచారు.’
- సిఐఐ తెలంగాణ చైర్మన్ నృపేందర్‌రావు
‘బడ్జెట్‌ను స్వాగతిస్తున్నాం. సానుకూలంగా, సంస్కరణల వేగం పెంచేలా ఉంది. దేశీయ, విదేశీ మదుపరుల సెంటిమెంట్లను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోంది. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, క్లీన్ ఇండియాకు ఈ బడ్జెట్‌లో ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. వౌలిక సదుపాయాలకు నిధులను ఇబ్బడిముబ్బడిగా పెంచారు.’
- సిఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ వి రాజన్న
‘ఇది మంచి బడ్జెట్. అని గ్రామీణ, పట్టణ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందేందుకు భారీగా నిధులు కేటాయించి, ప్రోత్సాహకాలు ప్రకటించారు. పరిశ్రమలను బాగా ఆదుకున్నారు. వౌలిక సదుపాయాలకు నిధులు పెద్ద ఎత్తున కేటాయించారు.’
- ఎఫ్‌టాప్సీ అధ్యక్షుడు రవీంద్ర మోదీ
‘ఈ బడ్జెట్ అన్ని రంగాలు వేగంగా అభివృద్ధి దిశగా పయనించేందుకు ఊతాన్ని ఇస్తోంది. గ్రామీణ వౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, యువసాధికారతకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం మీద బడ్జెట్ సంతృప్తికరంగా ఉంది.’
- ఎఫ్‌టాప్సీ సీనియర్ ఉపాధ్యక్షుడు గౌర శ్రీనివాస్
‘అందరికీ ఇల్లు అనే ఆశయ సాధన దిశగా జైట్లీ బడ్జెట్ ఉంది. గృహ రంగంలో నిధులు వరదలా ప్రవహించనున్నాయి. రియల్టీ రంగం ఊపందుకునే విధంగా రాయితీలు ఇచ్చారు. మధ్య తరగతి వర్గానికి కొత్త పరపతి అనుసంధాన స్కీంను ప్రకటించడం గొప్ప నిర్ణయం. హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణానికి పరిమితిని 5 సంవత్సరాలకు పెంచారు.’
- క్రెడాయ్ జాతీయాధ్యక్షుడు జి ఆనంద్
‘ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉంది. ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలకు చేయూత నిస్తుంది. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో మెజారిటీ విభాగాలకు ఊరటనిచ్చే నిర్ణయాలను ప్రకటించారు. ఇది వృద్ధికారక బడ్జెట్’
- డిక్కీ ఏపి చాప్టర్ అధ్యక్షుడు మనె్నం మధుసూదనరావు
‘పిజి స్థాయిలో వైద్య విద్య సీట్లు పెంచారు. ఔషధ, కాస్మోటిక్స్ రూల్స్ చట్టానికి సవరణలు ప్రతిపాదించడం మంచి పరిణామం.’
- సిఐఐ ఉమ్మడి ఏపి పూర్వ చైర్‌పర్సన్ సుచిత్రా ఎల్లా
‘గ్రామీణ, వ్యవసాయ రంగాలకు భారీగా నిధులను కేటాయించారు. మోడల్ కాంట్రాక్ వ్యవసాయ చట్టం రైతుల ఆదాయాన్ని పెంచుతుంది. కృషి విజ్ఞాన కేంద్రాల పేరిట కొత్త ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం హర్షణీయం.’
- సిఐఐ సదరన్ రీజియన్ పూర్వ చైర్మన్ అనిల్ ఎపూర్
‘ఎఫ్‌ఐపిబి రద్దు నిర్ణయం సరైనదే. దీనివల్ల ఎఫ్‌డిఐ రాక పెరుగుతుంది. అయితే మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చే ఎగుమతులు, శాస్త్ర, సాంకేతిక, తయారీ రంగాలకు ప్రోత్సాహకాలు లేకపోవడం బాధాకరం. అయనప్పటికీ చిన్న సంస్థలకు ఆదాయ పన్నులో 25 శాతం మినహాయంపునివ్వడాన్ని స్వాగతిస్తున్నాం.’
- బయోకాన్ సిఎండి కిరణ్ మజుందార్ షా
‘ఇది సంస్కరణల బడ్జెట్. రాజకీయ పార్టీలకు విరాళల విషయంలో తీసుకున్న నిర్ణయం హర్షణీయం. అలాగే రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో కలిపేయడం కూడా ఆహ్వానించదగినదే. ఎఫ్‌ఐపిబి రద్దు, ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్‌ల తొలగింపు అన్ని కూడా గొప్ప నిర్ణయాలు.’
- మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర
‘ఆరోగ్య రంగంలో వౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. మాతా శిశు సంక్షేమానికి 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయనున్నారు. దేశంలోని 1.5 లక్షల ఆరోగ్య కేంద్రాలను ఆరోగ్య వెల్‌నెస్ సెంటర్లుగా మార్చే ప్రతిపాదన, వైద్య, ఆరోగ్య విద్యలో సంస్కరణలు పెంచేలా ఉంది. జార్ఖండ్, గుజరాత్‌లో ఎయిమ్స్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.’
- అపోలో హాస్పిటల్స్ జెఎండి సంగీతారెడ్డి
‘ఇది ఒక గొప్ప బడ్జెట్. డిజిటల్ ఎకానమీ బడ్జెట్. ప్రతి రంగాన్ని డిజిటల్ ఎకానమీతో సమ్మిళితం చేశారు. డిజిటల్ చెల్లింపులకు పన్ను చెల్లింపులు, ప్రోత్సాహకాలు ఇచ్చారు. గృహ, వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు.’
- పేటిఎమ్ సిఇఒ విజయ్ శేఖర్ శర్మ