బిజినెస్

ఈ‘సారీ’ వడ్డీరేట్లు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 8: మరోసారి కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ద్రవ్యసమీక్షను ముగించేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ). బుధవారం నిర్వహించిన ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి ద్వైమాసిక ద్రవ్యసమీక్షలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచింది ఆర్‌బిఐ. నిరుడు డిసెంబర్‌లో జరిగిన గత ద్రవ్యసమీక్షలో కూడా రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉన్నాయి. దీంతో ఈసారి వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే అందుకు భిన్నంగా ఆర్‌బిఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎమ్‌పిసి) వడ్డీరేట్లలో ఎలాంటి కోతలు విధించలేదు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన నగదు కొరత కారణంగా మందగించిన వ్యాపార, పారిశ్రామిక లావాదేవీలు, క్షీణించిన బ్యాంకింగ్ కార్యకలాపాలతో పడిపోయిన వృద్ధిరేటును పరుగులు పెట్టించడానికి రెపో రేటును తగ్గించాలని ఎమ్‌పిసి సిఫార్సు చేస్తుందని అంతా భావించారు. కానీ అదేమీ జరగలేదు. ఆరుగురు సభ్యులున్న కమిటీ 6-0 ఓటింగ్‌తో వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచాలని తీర్మానించింది. ఈ విషయాన్ని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలియజేశారు. కాగా, 2015 జనవరి నుంచి వడ్డీరేట్లను ఆర్‌బిఐ 150-175 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా అంతకుముందు పెంచుతూ పోయిన ఆర్‌బిఐ.. పారిశ్రామిక ప్రగతి, వృద్ధిరేటు బలోపేతానికి ఆ తర్వాత తగ్గిస్తూ వచ్చింది. ఇదిలావుంటే బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాలని ఉర్జిత్ పటేల్ కోరారు. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) దేశ జిడిపి వృద్ధిరేటు అంచనాను 7.1 శాతం నుంచి 6.9 శాతానికి దించిన ఆయన వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) మాత్రం 7.4 శాతానికి ఎగబాకవచ్చన్న ఆశాభావాన్ని కనబరిచారు. అధిక చమురు ధరలు, నిలకడలేని ఎక్స్‌చేంజ్ రేట్లతో ద్రవ్యోల్బణం ఇబ్బందులు రావచ్చని అన్నారు. 2017-18 ప్రథమార్ధంలో ద్రవ్యోల్బణం 4-4.5 శాతంగా, ద్వితీయార్ధంలో 4.5-5 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. మరోవైపు వడ్డీరేట్లను తగ్గించకపోవడంపట్ల నిర్మాణ రంగం తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చింది. పారిశ్రామిక సంఘాలు ఫిక్కీ, అసోచామ్ కూడా పెదవి విరిచాయి. అయితే బ్యాంకులు మాత్రం ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనలతోనే వడ్డీరేట్లను ఆర్‌బిఐ యథాతథంగా ఉంచిందని అంటున్నాయి.

చిత్రం... డిప్యూటి గవర్నర్లతో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ (మధ్యలో)