బిజినెస్

పర్యాటకం పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 19: పర్యాటక రంగం ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా నిర్వీర్యం అయిపోతోంది. ఆశించిన స్థాయిలో పర్యాటక ప్రాజెక్టులు ఏలాగూ రావడంలేదు. కనీసం నిధుల కేటాయింపులోనూ పర్యాటక శాఖకు న్యాయం జరగడంలేదు. కేవలం కార్పొరేట్ సంస్థల చేతిలో పెట్టే యోచన కనిపిస్తోందంటూ ఈ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకేనేమో ఈసారి బడ్జెట్‌కు ప్రతిపాదనలు వెళ్ళలేదు. వచ్చేనెల తొలివారంలో జరగనున్న ఏపీ బడ్జెట్ సమావేశాలకు ఇంతవరకు ఏపీ పర్యాటక శాఖ నుంచి ప్రతిపాదనలే వెళ్ళలేదంటే దీనిపట్ల సర్కారు చూపుతున్న వివక్ష స్పష్టమవుతూనే ఉంది. ఈ శాఖను నిధుల కొరత వేధిస్తుండగా, మరోపక్క ఒక్క పర్యాటక ప్రాజెక్టు కొత్తగా రాకపోవడం పర్యాటకులతోపాటు ఈ శాఖ వర్గాలను నిరాశకు గురిచేస్తోంది. నవ్యాంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన మూడేళ్ళకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా ఒక్క పర్యాటక ప్రాజెక్టు రాలేదు. పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించడంలేదు. కాగా, దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే హెలీ టూరిజం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన పర్యాటకశాఖ ఈ క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలను వీక్షించడం ద్వారా పర్యాటకులు ఆహ్లాదాన్ని పొందే విధంగా హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని గత ఐదేళ్ళ నుంచి చేస్తోన్న ఆలోచన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. రాజమండ్రి పుష్కరాలకే పరిమితమైన ఈ ప్రయోగం ఆ తరువాత రాష్ట్రంలో జరిగే అనేక ఉత్సవాల్లో ఎక్కడా అమల్లోకి రాలేదు. కృష్ణ పుష్కరాల్లో అయితే దీని గురించే మరిచిపోయారు. అలాగే విశాఖ-అరకు ప్రాంతాల మధ్య ఏసి అద్దాల రైలు ప్రవేశపెట్టాల్సి ఉన్నా.. దీని గురించి గత కొనే్నళ్ళుగా పర్యాటకులు కలలుకంటున్నా ఇంకా ఫలించలేదు. అలాగే విశాఖలో రెండు కొండ ప్రాంతాల మధ్య ‘హిల్ పార్కు’ను నిర్మించాలని గత ఎనిమిదేళ్ళ కిందటనే పర్యాటక శాఖ ప్రతిపాదించింది. ఇది కూడా ఒక్క అడుగు ముందుకు సాగలేదు. దీనికి ప్రాథమికంగా 50 కోట్ల రూపాయల అంచనా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇపుడు దీని గురించీ మరిచిపోయింది ప్రభుత్వం. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద రిసార్ట్స్, బడ్జెట్ హోటళ్ళను అనుసంధానిస్తూ భక్తులకు ప్రత్యేక దర్శనం కోసం ప్రత్యేక బస్సులు నిర్వహించాలని, దీనివల్ల ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చని భావించిన పర్యాటక శాఖ.. కనీసం దీనిపైన దృష్టిపెట్టని కారణంగా శ్రీకాకుళం, విశాఖ జిల్లాల పరిధిలో ఇటువంటి ప్రాజెక్టులు అర్ధాంతరంగానే నిలిచిపోయాయి. అలాగే రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు తరలివెళ్ళే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను నిర్వహించి ఆర్థిక లక్ష్యాలు సాధించాలని నిర్ణయించింది. విశాఖ జిల్లాలో ఉన్న బౌద్ధారామాలను, చారిత్రాత్మక కట్టడాలను పునరుద్ధరించేందుకు నిధులు కేటాయించాల్సి ఉంది. పర్యాటకంగా అరకు ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధిపరిచి పర్యాటకులను విశేషంగా ఆకర్షించే పథకాల అమలు కోసం అవసరమైన నిధుల కేటాయింపులే జరగడంలేదు. భక్తులు, పర్యాటకుల కోసం ప్రత్యేక బస్సులు నిర్వహించేందుకు వీలుగా ఈ శాఖ ఒక్క కొత్త బస్సును నిర్వహించలేకపోతోంది. ఇటువంటి సమస్యలతో సతమతమవుతున్న పర్యాటక శాఖకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో పర్యాటక అభివృద్ధి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. కాగా, ఇటీవల విజయవాడలో నిర్వహించిన నేవీ ఉత్సవం పేరిట 40 కోట్ల రూపాయలకు పైగానే నిధులు వృథా చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఆ రోజుకే ప్రయోజనం తప్పితే శాశ్వత ప్రాజెక్టులకు అవకాశం లేకుండా పోయిందని ఈ శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో కనీసం పది కోట్ల రూపాయలు ఖర్చుచేసినా కొంతవరకు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేవి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక శాఖలో ఏళ్ళతరబడి ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న కార్మికులు, నాల్గవ తరగతి సిబ్బంది పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి.
మొత్తంగా పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం కలుగకపోగా, కొత్తవి రావడంలేదు. ఉద్యోగుల భవిష్యత్తూ గందర గోళంగానే ఉంది. దీంతో కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే పర్యాటక శాఖను నిర్వీర్యం చేస్తున్నారనే విమర్శలు పెద్దగా వినిపిస్తున్నాయి.