బిజినెస్

బ్యాంకులు.. ఇక కొందరివేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 8: బ్యాంకులు.. ఇక కొందరివేనా?, అందరికీ బ్యాంకింగ్ సేవలు అందవా?, సామాన్యుడి ప్రయోజనాలను బ్యాంకర్లు పట్టించుకోవడం లేదా? ఈ ప్రశ్నలన్నింటికి ఇప్పుడు అవుననే సమాధానమే చెప్పాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకుల తాజా నిర్ణయాలు ఇలాగే ఉన్నాయమరి. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థ పేరుతో బ్యాంకులు ఆన్‌లైన్ పోకడ పోతుండగా, సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ కనమరుగవుతోంది.
దీంతో పేద, మధ్యతరగతివారికి బ్యాంకింగ్ సేవలు అందని ద్రాక్షగానే మారుతుండగా, అందరికీ బ్యాంకింగ్ అన్న ప్రభుత్వ కల.. కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) విషయానికేవస్తే.. వచ్చే నెల 1 నుంచి సేవింగ్స్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ తోపాటు ఎటిఎం సేవలపై మళ్లీ చార్జీలను తీసుకొస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే. ఖాతాదారుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగా 2012లో మినిమం బ్యాలెన్స్ పరిమితిని, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎటిఎం సేవలపై చార్జీలను ఎస్‌బిఐ ఎత్తివేసింది. అయతే పెరుగుతున్న పనిభారం, మూలధనం కొరతతో దాదాపు ఐదేళ్ల తర్వాత ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను కొనసాగించని పక్షంలో పెనాల్టీని తిరిగి విధించాలని నిర్ణయించింది. ఎటిఎం చార్జీలనూ ప్రవేశపెడుతోంది. దేశంలోని అత్యధికులకు బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నది ఎస్‌బిఐనే.
ఐదు అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్‌బిఐ కస్టమర్లు మరింత పెరగనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోని దాదాపు సగం జనాభాకు బ్యాంకింగ్ సేవలు లభించేది ఇకపై ఎస్‌బిఐ ద్వారానే. కానీ పొదుపు ఖాతాల్లో 5,000 రూపాయల కనీస నగదును ఉంచాలని, లేకుంటే జరిమానా తప్పదంటోంది. ఆరు మెట్రో నగరాల్లోని ఖాతాదారులకు ఇది వర్తించనుండగా, నిర్ణీత నగదులో 75 శాతం లేకుంటే సేవా పన్నుతోపాటు 100 రూపాయల జరిమానా, 50 శాతం లేనిపక్షంలో సేవా పన్ను, 50 రూపాయల జరిమానా పడుతుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాలో ఉండాల్సిన కనీస నగదు వెయ్య రూపాయలైతే, అది లేకుంటే 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు జరిమానా తప్పదు.
అర్బన్ శాఖల్లోని సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీసం 3,000 రూపాయలను, సెమీ అర్బన్ శాఖల్లోని సేవింగ్స్ ఖాతాదారులైతే 2,000 రూపాయలు తగ్గకుండా నగదును ఉంచుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే దేశవ్యాప్తంగా సేవింగ్స్ ఖాతాదారులు చెక్కు బుక్కు సౌకర్యం లేకుంటే ఖాతాల్లో కనీసం 500 రూపాయలుంచాలని, చెక్కు బుక్కుంటే 1,000 రూపాయలుంచాలని ఎస్‌బిఐ తేల్చి చెప్పింది. దీంతో 31 కోట్లకుపైగా సేవింగ్స్ ఖాతాదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ముఖ్యంగా వీరిలో పెన్షనీర్లు, విద్యార్థులుండటం తో ఈ నిర్ణయంపై మరొక్కసారి ఆలోచించు కోవాలని ప్రభుత్వం కోరుతోంది. దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వ్రతా కనిపిస్తుండగా, నిరుపేదలకు బ్యాంకింగ్ సేవలను కల్పించాలనే సదుద్దేశంతో కేంద్రంలోని మోదీ సర్కారు తెచ్చిన జన్‌ధన్ ఖాతాలకు మాత్రం మినహాయం పునిస్తున్నామని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించడం కొంతలోకొంత ఊరటనిస్తోంది. కాగా, ఖాతాదారులు ఇతర బ్యాంకులకు చెందిన ఎటిఎంలలో నెలకు మూడుసార్లు మాత్రమే ఉచితంగా నగదును ఉపసంహరించుకోవచ్చని (విత్‌డ్రా), అది దాటితే ఒక్కో లావాదేవీకి 20 రూపాయల చొప్పున చార్జ్ చేస్తామని ఎస్‌బిఐ ప్రకటించింది. సొంత బ్యాంక్ ఎటిఎంలలో నెలకు ఐదుసార్లు ఉచితంగా నగదును తీసుకొవచ్చని, అది దాటితే ఒక్కో లావాదేవీకి 10 రూపాయల చొప్పున చార్జ్ చేస్తామని ఎస్‌బిఐ స్పష్టం చేసింది.
దీంతో ఈ విషయంలోనూ పునరాలోచించు కోవాలని ప్రభుత్వం కోరుతోంది. కానీ ఎటిఎం లావాదేవీలపై ఆంక్షలు లేకపోవడంతో పనిభారం పెరుగుతోందని బ్యాంకులు అంటున్నాయ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సైతం దీన్ని సమర్థిస్తుండగా, పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ఎటిఎం లావాదేవీలపై చార్జీలకు అనుమతిని కూడా ఇచ్చింది. దీంతో బ్యాంకర్లు ఈ విషయంలో వెనక్కితగ్గే అవకాశాలు కనిపించడం లేదు. కాగా, ఏప్రిల్ 1న ఎస్‌బిఐలో దాని అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ విలీనం కానున్నాయ. దీంతో ఎస్‌బిఐ అసెట్ బేస్ 37 లక్షల కోట్ల రూపాయలకు, శాఖలు 22,500లకు, ఎటిఎంలు 58,000లకు, కస్టమర్ల సంఖ్య 50 కోట్లకుపైగా చేరనుంది.
ఈ క్రమంలో ఎస్‌బిఐ తాజా నిర్ణయం దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవలను అందిస్తామన్న ప్రభుత్వ లక్ష్యాన్ని దెబ్బతీస్తుందన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయ. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజానీకం పొదుపు ఖాతాలు చిక్కుల్లో పడతాయన్న ఆందోళన కనిపిస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దుతో ఇంకా నగదు కొరత కనిపిస్తుండటం కూడా ప్రజల్లో దీనిపట్ల వ్యతిరేకత వస్తోంది. మరోవైపు నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే లక్ష్యంతో ఖాతాదారుల నగదు లావాదేవీలపై ప్రైవేట్‌రంగ బ్యాంకులు పెను భారం మోపడం కూడా కలవరపెడుతోంది.
నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు నెలలో నాలుగుసార్లు మించితే ఒక్కో లావాదేవికి ఏకంగా 150 రూపాయలను వసూలు చేస్తామని ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు ప్రకటించాయి. హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్‌లు కనీసం 150 రూపాయల చార్జీని వసూలు చేస్తామని ప్రకటించాయి. సేవింగ్స్ ఖాతాలతోపాటు వేతన ఖాతాదారులకు (సాలరీ అకౌంట్స్) ఈ చార్జీలు వర్తిస్తాయని, ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని సర్క్యులర్‌లు జారీ చేశాయ. రోజుకు థర్డ్ పార్టీ నగదు లావాదేవీలు 25,000 రూపాయలు మించరాదని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షరతు విధించింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరత, డిజిటల్ లావాదేవీలకు ఊతమివ్వాలన్న కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐ ప్రకటనలతోనే బ్యాంకులు ఈ స్థాయిలో చార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. నిజానికి పాత పెద్ద నోట్ల రద్దుకు ముందు కేవలం ఎటిఎమ్ లావాదేవీలపైనే పరిమితులు, చార్జీలు ఉండేవి. అప్పుడు అదనంగా జరిగిన ఒక్కో లావాదేవీకి 20 రూపాయల వరకు చార్జ్ చేసేవి బ్యాంకులు. కానీ ఇప్పుడు ఆ చార్జీని దాదాపు ఎనిమిది రెట్లు పెంచిన బ్యాంకులు.. నగదు డిపాజిట్లపైనా కొరడా ఝుళిపించాయి.
కాగా, సొంత బ్యాంక్ శాఖల్లో నెలకు నాలుగుసార్లు ఉచితంగానే నగదు లావాదేవీలు జరుపుకోవచ్చని, అవి దాటితే ప్రతి వెయ్యి రూపాయలకు 5 రూపాయల చొప్పున కనీసం 150 రూపాయల వరకు చార్జ్ తీసుకుంటామని ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. ఇతర బ్యాంకుల వారికి తొలి నగదు ఉపసంహరణ ఉచితమని చెప్పిన ఐసిఐసిఐ.. ఆ తర్వాత చార్జీలు వర్తిస్తాయంది. నగదు డిపాజిట్లకు మాత్రం చార్జీలు తప్పవంది. అయితే క్యాష్ డిపాజిట్ మెషీన్ ద్వారానైతే తొలిసారి ఉచితమని, ఆ తర్వాత చార్జీలు యథాతథమంది. కాగా, థర్డ్ పార్టీ నగదు లావాదేవీ పరిమితిని 50,000 రూపాయలుగా నిర్ణయించింది. మరోవైపు సొంత బ్యాంక్ ఎటిఎమ్‌లు కాకుండా కనిపించిన ఇతర బ్యాంక్ ఎటిఎమ్‌లలో లావాదేవీలు చేస్తే కూడా గతంలో మాదిరిగా ఇకపై చార్జీలు వర్తిస్తాయి. ఇదిలావుంటే యాక్సిస్ బ్యాంక్ నెలకు తొలి ఐదు లావాదేవీలు లేదా 10 లక్షల రూపాయల వరకు నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు ఉచితమని ప్రకటించింది.
ఆ తర్వాత వెయ్యికి 5 రూపాయల చొప్పున కనీసం 150 రూపాయల వరకు చార్జ్ చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం తమకు ఈ తరహా చార్జీలకు సంబంధించి ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదంటుండగా, ప్రైవేట్‌రంగ బ్యాంకర్ల తీరుపై నిరసనలు పెల్లుబుకుతున్నాయ. 70 శాతం ఖాతాదారులు వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బ్యాంకింగ్ సేవలు ఇక సంపన్న వర్గాలకే పరిమితమవు తాయనడంలో సందేహం లేదన్న అభిప్రాయాలు అధికంగా వినిపిస్తున్నాయ. ఇప్పటికే పేపర్‌లెస్ బ్యాంకింగ్ సేవలను అమలు చేస్తున్న బ్యాంకర్లు.. క్యాష్‌లెస్ బ్యాంకింగ్ సేవలకూ ఖాతాదారులను బలవంతంగా అలవాటుపడేలా చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బ్యాంకర్ల నిర్ణయాలుంటే బాగుండేదన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. నగరాలు, పట్టణాల్లోనే ఇంకా పూర్తిస్థాయలో డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగం లేదని, చాలాచోట్ల నగదు లావాదేవీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తుచేస్తున్నారు.
మొత్తానికి చార్జీలపట్ల పునరాలోచించుకోవాలని ప్రైవేట్‌రంగ బ్యాంకర్లను ప్రభుత్వం కూడా కోరుతోంది. ఏదిఏమైనా నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి వెలువడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన దేశ బ్యాంకింగ్ రంగ ముఖచిత్రాన్ని మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. లక్ష్మీదేవి నిలయాలుగా దశాబ్దాల కాలం నుంచి పేరున్న బ్యాంకుల్లో మున్ముందు మచ్చుకైనా కరెన్సీ కనపడదేమో.!

‘జన్ ధన్’ కోసమే
చార్జీల మోత!
ముంబయి: ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ నిబంధనను తీసుకురావడానికి, ఖాతాదారులపై చార్జీలు మోపడానికి కారణం జన్ ధన్ ఖాతాల నిర్వహణ భారమవుతుండటమేనని ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఇతర అన్ని బ్యాంకులతో పోల్చితే ఎస్‌బిఐ మినిమం బ్యాలెనే్స తక్కువన్న ఆమె బ్యాంక్‌పై ఖాతాల నిర్వహణకు సంబంధించి పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసమే ఈ నిర్ణయమని స్పష్టం చేశారు. 11 కోట్ల కనీస సేవింగ్స్, జన్ ధన్ ఖాతాలు ఎస్‌బిఐకి ఉన్నాయని బుధవారం ఓ కార్యకమ్రంలో చెప్పారు. వీటి నిర్వహణ ఆర్థికంగా ఇబ్బందికరమవుతోందని తెలిపారు. అందుకే చార్జీలు వేస్తున్నామని చెప్పారు.

98 పాయింట్లు పడిపోయిన సెనె్సక్స్
ముంబయి, మార్చి 8: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 97.62 పాయింట్లు పడిపోయి 28,901.94 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 22.60 పాయింట్లు దిగజారి 8,924.30 వద్ద నిలిచింది. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యసమీక్ష, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఇక అంతర్జాతీయంగా గమనిస్తే.. ఆసియా మార్కెట్లలో జపాన్ సూచీ నష్టపోగా, హాంకాంగ్ సూచీ లాభపడింది. ఐరోపా మార్కెట్లలో మాత్రం మిశ్రమ స్పందన కనిపించింది.

వృద్ధిపథంలో ఎఫ్‌ఎమ్‌సిజి పరిశ్రమ
ముంబయి, మార్చి 8: ఎఫ్‌ఎమ్‌సిజి పరిశ్రమ రాబోయే రెండు, మూడేళ్లలో 15 శాతం వృద్ధిని సాధిస్తుందని సిఐఐ-బెయిన్ అండ్ కంపెనీ తెలిపింది. గత మూడేళ్లుగా మందగమనంలో ఉన్న ఈ పరిశ్రమ.. మున్ముందు వృద్ధిపథంలో నడుస్తుందన్న అంచనాను బుధవారం వ్యక్తం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాల మాదిరిగానే దేశీయ ఎఫ్‌ఎమ్‌సిజి రంగంపైనా కనిపించినది తెలిసిందే. అయతే ఆ ప్రభావం నుంచి కోలుకుని ఇక పరుగులు పెట్టనుందని, తమ అధ్యయనంలో ఈ మేరకు సంకేతాలు కనిపించాయని సిఐఐ-బెయిన్ అండ్ కంపెనీ తెలియజేసింది.