బిజినెస్

పొగాకు రైతుకు గిట్టుబాటు ధరేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 22: వర్జీనియా పొగాకు రైతులు ఈసారైనా గిట్టుబాటు ధర దక్కేనా? అని ఎదురుచూస్తున్నారు. గిట్టుబాటు ధర లేక ఏటేటా ఉత్తర నల్లరేగడి నేలల్లో వర్జీనియా పొగాకు సాగు తగ్గిపోతున్నట్టు తెలుస్తోంది. పొగాకు బోర్డు అనుమతించిన దానికంటే తక్కువ విస్తీర్ణంలో పండుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల పొగాకు సాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తూర్పు గోదావరి జిల్లా తొర్రేడు వేలం కేంద్రం పరిధిలో ఈ ఏడాది 246 మంది రైతులు పొగాకు పండించడానికి అనుమతి తీసుకున్నప్పటికీ ఆ స్థాయలో పంట లేదు. గిట్టుబాటు ధర లభిస్తుందో? లేదో? అనే మీమాంసలో అనుమతి తీసుకున్న రైతులంతా కూడా పొగాకు సాగు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. 40 లక్షల కిలోల దిగుబడి సాధించే విస్తీర్ణానికి అనుమతి తీసుకున్నప్పటికీ కేవలం 3 లక్షల 89 వేల కిలోల విస్తీర్ణానికే రిజిస్టర్ అయింది. దీంతో గణాంక వివరాలను బట్టి చూస్తే ఈ ఏడాది పొగాకు బోర్డు ఇచ్చిన కోటా కంటే దిగుబడి తగ్గినట్టు స్పష్టమవుతోంది. ఇదిలావుండగా ఈ ఏడాది తూర్పు గోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు వేలానికి రంగం సిద్ధమైంది. నల్ల రేగడి నేలల్లో పండించిన వర్జీనియా పొగాకు వేలం ప్రక్రియ తొర్రేడు ప్లాట్‌ఫారంలో వచ్చే నెల 6వ తేదీ నుంచి మొదలు కానుందని వేలం కేంద్రం సూపర్‌వైజర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. పొగాకు పండించే రైతులు ప్రతి ఏడాది పొగాకు బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వర్జీనియా పొగాకును మెట్ట ప్రాంతంలోనే పండించాలి. మాగాణి భూముల్లో సాగుకు అనుమతి లభించదు. ఈ ఏడాది మొత్తం 1,397 మంది రైతులు 1,497 బ్యారన్లను 4,491 ఎకరాల్లో పండించడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీంతో పొగాకు బోర్డు 4 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇచ్చింది. అయితే 1,151 మంది రైతులు 3,705 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఇందులో 246 మంది రైతులు పొగాకు పండించలేదు. తొర్రేడు పొగాకు వేలం ప్లాట్ ఫారం పరిధిలో రంగంపేట, పెద్దాపురం, కోరుకొండ, సీతానగరం, దేవీపట్నం, రాజమహేంద్రవరం రూరల్, దేవరపల్లి, కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మండలాల్లో పొగాకు పండిస్తున్నారు. పొగాకు బోర్డు ఆదేశాల మేరకు ఒక బ్యారన్‌కి 2,600 కేజీలకు మించకుండా దిగుబడి సాధించడానికి అనుగుణంగా సాగు చేసుకోవాల్సి ఉంది. కాగా, ఈ ఏడాది 40 లక్షల కిలోలకు అనుమతి లభించినప్పటికీ కేవలం 28 లక్షల కిలోల దిగుబడి మాత్రమే వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు రైతులు సరాసరిగా కిలోకు 160 రూపాయల ధర ఇవ్వాలని కోరుతున్నారు. కనీసం గిట్టుబాటు ధర కల్పిస్తే లాభం మాటెలా ఉన్నప్పటికీ పెట్టిన పెట్టుబడి ఖర్చులకు సరిపోతుందని తొర్రేడు గ్రామానికి చెందిన వాకలపూడి సత్యనారాయణ అనే రైతు అంటున్నారు.