బిజినెస్

వందకోట్ల పన్ను ఎగవేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఆదాయం పన్ను శాఖ అధికారులు వందకోట్ల రూపాయలకు పైగా పన్ను ఎగవేతలకు సంబంధించి గురువారం దేశవ్యాప్తంగా పలు నగరాల్లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. నోట్ల రద్దు అనంతరం అక్రమంగా నగదు దాచుకున్న వారు స్వచ్ఛందంగా తమ ఆదాయాలను వెల్లడించడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన గడువు మార్చి 31తో ముగిసిన తర్వాత ఐటి అధికారులు జరిపిన తొలి భారీ దాడి ఇదే కావడం గమనార్హం. ఆదాయం పన్ను అధికారులు రాజ్‌కోట్, ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, అహ్మదాబాద్ తదితర నగరాల్లోని 30 ప్రాంతాలను సందర్శించి పలు కంపెనీల కార్యాలయాలు, వ్యక్తుల నివాసాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ సంస్థపై దాడులు జరుగుతున్నట్లు వారు చెప్పారు. ఈ కంపెనీ ముంబయి, కోల్‌కతాలలోని డొల్ల కంపెనీలు, ఆపరేటర్ల ద్వారా వందకోట్ల రూపాయలకు పైగా బోగస్ ఎంట్రీ డిపాజిట్లను స్వీకరించినట్లు ఐటి అధికారులకు విశ్వసనీయ సమాచారం అందినట్లు ఆ అధికారులు చెప్పారు. అలాగే పుణెకు చెందిన వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఓ కంపెనీకి సంబంధించి నగరం, చుట్టుపక్కల 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. అయితే సోదాలు ఇంకా కొనసాగుతున్నందున పూర్తి వివరాలను వారు వెల్లడించారు.

తగ్గిన పొగాకు ఘాటు

ఎగుమతులలో మాంద్యం.. కొనుగోళ్లలో జాప్యం

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఏప్రిల్ 6: అంతర్జాతీయ విపణిలో పొగాకు ఘాటు తగ్గింది. చైనా వంటి దేశాల్లో సైతం విస్తీర్ణం తగ్గినప్పటికీ, ఎగుమతులలో మాంద్యం ఏర్పడింది.. ఈ ప్రభావం భారతీయ పొగాకు రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. యునెస్కో ఆదేశాల ప్రకారం 2020 పొగాకు రహిత సమాజ స్థాపనలో భాగంగా ఆయా దేశాల్లో ఉత్పత్తి తగ్గిందని భావిస్తున్నా పొగాకు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేనందునే ఎగుమతులు మందగించాయని చెప్తున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో 130 క్వింటాళ్లు, కర్నాటకలో 90 క్వింటాళ్ల పొగాకు సాగును భారత పొగాకు బోర్డు నిర్ణయించింది. అయితే ఏపిలో 100 మిలియన్ క్వింటాళ్ల లోపే ఉత్పాదన జరిగింది. రాష్ట్రం మొత్తంగా సరాసరి ధర పెరిగినా కొనుగోళ్లలో కూడా మితిమీరిన జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జనవరితో కర్నాటక సీజన్ ముగిసి, గతనెల 20వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. ఇప్పటి వరకు 4.07 మిలియన్ కిలోలు మాత్రమే కొనుగోళ్లు జరిగాయి.. ఎన్‌బిఎస్ పరిధిలో 4 మిలియన్ క్వింటాళ్ల ఉత్పత్తికి గాను 3.17, ఎస్‌బిఎస్‌లో 42.59కు గాను 30.5, ఎస్‌ఎల్‌ఎస్‌లో 42 క్వింటాళ్లకు గాను 45.79మిలియన్ క్వింటాళ్ల ఉత్పత్తి జరిగింది. ఒక్క ఉత్తరప్రాంత భూముల్లో(ఎన్‌ఎల్‌ఎస్) కిలోకు రూ. 149.5 మినహా మిగిలిన ప్రాంతాల్లో 156 రూపాయల ధర పలుకుతోంది. గత ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలో సరాసరిన కిలోకు రూ. 139.34 ధర చెల్లించారు. ప్రస్తుతం గిట్టుబాటు ధర ఉన్నప్పటికీ కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావటంలేదు. కొనుగోళ్లు ప్రారంభమైన సమయంలో కిలోకు ఎస్‌ఎల్‌ఎస్, ఎన్‌ఎల్‌ఎస్‌లో 162 రూపాయల ధర పలికింది. ప్రకాశం జిల్లా జిల్లా పరిధిలో (ఎన్‌బిఎస్) వెల్లంపల్లి, ఒంగోలు, టంగుటూరు, కొండెపి, తూర్పుగోదావరి జిల్లా (ఎస్‌బిఎస్) పరిధిలోని తొర్రేడు, ప్రకాశం జిల్లా ఎస్‌బిఎస్ పరిధిలోని పొదిలి, కందుకూరు, కనిగిరి, కలిగిరి, డిసి పల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవికాక ఎస్‌ఎల్‌ఎస్ పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లాలో దేవరపల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం ప్రాంతాల్లోని కేంద్రాల్లో ఇప్పటి వరకు 27వేల 584 బేళ్లను కొనుగోలు చేశారు. కాగా ఎగుమతులను పరిశీలిస్తే 2015-16 సంవత్సరానికి పశ్చిమ యూరప్, తూర్పు యూరప్ దేశాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ ఈశాన్య రాష్ట్రాలు, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాకు 16వేల 881 మెట్రిక్ టన్నులు ఎగుమతి కాగా 3305.54 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. కాగా ఈ సంవత్సరం 3వేల 294 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఎగుమతులలో వ్యత్యాసం ఏర్పడటంతో కొనుగోళ్లు ముందుకు సాగటంలేదు.

ఎంఎస్‌ఎంఇలకు

విశాఖ స్టీల్ ప్రోత్సాహం

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఏప్రిల్ 6: రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్‌లకు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు విశాఖ స్టీల్ ప్లాంట్ ఎల్లప్పుడూ ప్రోత్సాహాన్ని అందిస్తుందని స్టీల్ ప్లాంట్ సిఎండి మధుసూదన్ తెలియచేశారు. ఉక్కు వ్యాపారాభివృద్ధి కోసం వెండర్స్‌తో ఎల్లవేళలా సత్ సంబంధాలు కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఉభయ రాష్ట్రాల్లోని వెండర్స్ సమావేశాన్ని గురువారం ఉక్కునగరంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిఎండి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ అభివృద్ధిలో వెండర్ల పాత్ర కీలకమైనదని అన్నారు. స్టీల్ మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన వృద్ధి సాధించిందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ విస్తరణ పనులు ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తవుతాయని, వీటి ద్వారా మరింత ఉత్పత్తి సాధించగలుగుతామని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్‌కు నాణ్యమైన ముడిసరుకు అందించడంతోపాటు కంపెనీ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (మెటీరియల్ మేనేజ్‌మెంట్) ఎస్‌ఎన్ రావు మాట్లాడుతూ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (మెయింటెనెన్స్) ఓఆర్ రమణి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ సమగ్రాభివృద్ధికి మొదటి నుంచి వెండర్స్ సహకారం ఉందని అన్నారు. భవిష్యత్‌లో కూడా ఇదే సహకారాన్ని కొనసాగించాలని కోరారు. ఆ తరువాత వెండర్స్ ప్లాంట్ సీనియర్ అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

పొగాకు వేలం ఆరంభం

కనిష్ట ధర రూ.143 గరిష్ఠ ధర రూ.161

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఏప్రిల్ 6: తూర్పు గోదావరి జిల్లాలో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని తొర్రేడు పొగాకు వేలం కేంద్రంలో గురువారం ఆశాజనక ధరతో వేలం మొదలైంది. మొదటి రోజు సరాసరిన కిలోకు రూ.154.47 ధర లభించింది. కిలోకు కనిష్ఠంగా రూ.143, గరిష్ఠంగా రూ.161 ధర లభించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి పొగాకు ధర కాస్తంత అశాజనగంగానే ఆరంభమైంది. గత ఏడాది కిలో పొగాకు ధర రూ.99.28 పలకగా ఈసారి రూ.161తో ఆరంభమైంది. ఆశ నిరాశల మధ్య గిట్టుబాటు ధరలు లభించాలని కోరుతూ రైతులు పొగాకు సాగుచేస్తున్నారు. వేలం ప్రక్రియ మొదలైన తొలి రోజు గరిష్ఠంగా రూ.161 ధర పలికడం శుభసూచకంగా మారింది. గత ఏడాది ధర లాభసాటిగా లేకపోవడంతో 247 మంది రైతులు పొగాకు సాగుచేయలేదు. రైతులు కిలోకు రూ.170 ఆశిస్తున్నారు. దీంతో పొగాకు కంపెనీలు ఈసారి వేలంలో రూ.143 ధర నుంచి రూ.161 వరకు చెల్లించి కొనుగోళ్లు చేపట్టాయి. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో అనుమతించిన మేరకు పొగాకు సాగుచేసిన రైతులు తమ దిగుబడులను బేళ్ళను పట్టుకుని గురువారం ఉదయానే్న తొర్రేడు వేలం కేంద్రానికి చేరుకున్నారు. ఆన్‌లైన్ విధానంలో కొనుగోళ్లు సాగాయి. సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన రైతులు 18 బేళ్ల పొగాకును తీసుకొచ్చారు. ఇందులో 16 బేళ్లను వివిధ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఐటిసి, బిపిఐ, జిటిఆర్, టిఎస్‌ఎస్, వీనస్ వంటి కంపెనీలు వేలంలో పాల్గొన్నాయి. గత ఏడాది కిలోకు కేవలం రూ.99.28 సరాసరి ధర లభించడంతో రైతులు నష్టాలను చవిచూశారు.గత ఏడాది పెట్టుబడులు సుమారు రూ.లక్ష వరకు అయింది. ప్రస్తుత సీజన్‌లో కాస్తంత మంచి ధరలతో ఆరంభం కావడంతో వచ్చే ఏడాది సాగు పెరిగేందుకు అవకాశం వుంటుందని అంచనా వేస్తున్నారు.
తొర్రేడు పొగాకు వేలం కేంద్రం పరిధిలో ఈ ఏడాది 4,491 ఎకరాల్లో పొగాకు సాగయింది. మొత్తం 1397 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ 247 మంది సాగు చేయలేదు. 1150 మంది రైతులు 3705 ఎకరాల్లో పొగాకు సాగుచేశారు. ఈ ఏడాది 40 లక్షల కిలోల దిగుబడి లక్ష్యం కాగా ప్రస్తుతం ఎకరానికి 867 కేజీల చొప్పున 32 లక్షల 12వేల 235 కేజీల దిగుబడి సాధించారు. తొలి రోజు కావడంతో చాలామంది రైతులు పొగాకును వేలంకు తీసుకురాకుండా ధరలను పరిశీలించారు. ధర బాగానే ఉండటంతో శుక్రవారం నుంచి కేంద్రానికి పొగాకు రాక ఊపందుకోవచ్చని అంచనావేస్తున్నారు.