బిజినెస్

ఫోర్బ్స్ జాబితాలో తెలుగు రైతు బిడ్డ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొల్లంట్ ఇండస్ట్రీస్ సిఇఒ శ్రీకాంత్ బొల్లకు చోటు
అంధత్వాన్ని జయించిన దివ్యాంగుడు

న్యూయార్క్/దుబాయ్, ఏప్రిల్ 17: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫోర్బ్స్ జాబితాలో తెలుగు రైతు బిడ్డకు చోటు దక్కింది. బొల్లంట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక సిఇఒ, 25 ఏళ్ల శ్రీకాంత్ బొల్ల ఫోర్బ్స్ అండర్ 30-ఆసియా 2017 జాబితాలో స్థానం పొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించిన శ్రీకాంత్ బొల్లకు కంటిచూపు లేదు. అయినప్పటికీ అంధత్వాన్ని జయించి విద్యలో రాణించారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్‌లో సైన్స్ గ్రూప్ చదివిన శ్రీకాంత్.. 98 శాతం ఉత్తీర్ణతను సాధించారు. అంధత్వం కారణంగా తనకు ఎదురైన ఇబ్బందులను అధిగమించిమరీ న్యాయపోరాటంతో విజయ తీరాలను అందుకున్నారు. అలా ఇంటర్ పూర్తయిన అనంతరం కూడా ఇలాంటి సమస్యలే ఎదురవగా, తన అంధత్వం కారణంగా ఐఐటిలో అడ్మీషన్‌ను అందుకోలేకపోయారు. అయితే మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎమ్‌ఐటి)లో చేరగా, ఎమ్‌ఐటిలో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా ఖాతికెక్కారు. ఇక్కడ ఈయన బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివారు. ఈ క్రమంలోనే భారత్‌కు తిరిగి వచ్చిన శ్రీకాంత్.. హైదరాబాద్‌లో చిన్నారి దివ్యాంగుల కోసం సమన్వయి సెంటర్‌లో బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్‌ను ఆరంభించారు. అంధ విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇది చేయూతనందిస్తుంది. ఈ నేపథ్యంలో 2012లో బొల్లంట్ ఇండస్ట్రీస్‌ను హైదరాబాద్‌లో శ్రీకాంత్ బొల్ల ఏర్పాటుచేశారు. ఇది పోకచెక్క ఆధారిత ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమ. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా నుంచి అందుతున్న నిధులతో నడుస్తున్న ఈ పరిశ్రమ.. వందలాది మంది అంధ కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. కాగా, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ విభాగంలో శ్రీకాంత్ బొల్లకు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది. తాజా జాబితాలో 53 మంది భారతీయులుండగా, చైనా (76) తర్వాత అత్యధికులు చెందిన దేశంగా భారత్ నిలిచింది. ఎంటర్‌టైన్‌మెంట్, ఫైనాన్స్, వెంచర్ క్యాపిటల్, రిటైల్, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ ఇలా మొత్తం 10 రంగాల్లో 30 మంది చొప్పున 300 మందిని ఫోర్బ్స్ జాబితా పేర్కొంది.
మరోవైపు ఈ జాబితాలో చోటు సాధించిన అతి పిన్న వయస్కులుగా సంజయ్ (15), శ్రవణ్ కుమరన్ (17) సోదరులు నిలిచారు. ఐదేళ్ల క్రితం వీరిరువురు గోడైమెన్షన్స్ అనే మొబైల్ యాప్‌ను రూపొందించారు. అనంతరం మొత్తం యాప్ స్టోర్ కోసం ఏడు, గూగుల్ ప్లే కోసం మూడు యాప్‌లను అభివృద్ధిపరిచారు. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాల్లో 70 వేల మందికిపైగా వీరి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. భారతీయ యువ మొబైల్ అప్లికేషన్ ప్రోగ్రామర్స్‌గా యాపిల్ వీరిని పేర్కొన్నట్లు ఈ సందర్భంగా ఫోర్బ్స్ తెలిపింది. ఇక హైక్ మెసేంజర్ వ్యవస్థాపకుడు, 29 ఏళ్ల కెవిన్ భారతీ మిట్టల్‌తోపాటు ఇకోవా ఆర్ట్ వ్యవస్థాపకురాలు, 29 ఏళ్ల వైష్ణవి మురళి కూడా పోర్బ్స్ జాబితాలో స్థానం సాధించారు.
ఇదిలావుంటే సౌదీ అరేబియా యువరాజు అల్వలీడ్ బిన్ తలాల్.. ప్రపంచ అరబ్ కుబేరుల జాబితాలో మొదటి స్థానాన్ని నిలుపుకున్నారు. 18.7 బిలియన్ డాలర్లతో ఈ ఏడాది కూడా ప్రథమంగా నిలిచారు. ఈసారి ఈయన సంపద 1.4 బిలియన్ డాలర్లు పెరిగిందని మిడిల్ ఈస్ట్‌కు సంబంధించి తమ తాజా ఏప్రిల్ ఇష్యూలో ప్రచురించిన వార్షిక ర్యాంకింగ్స్‌లో ఫోర్బ్స్ మ్యాగజైన్ స్పష్టం చేసింది. కాగా, రెండో స్థానంలో మజీద్ అల్ ఫుట్టయిమ్ (10.6 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో మహమ్మద్ అల్ అవౌది (8.1 బిలియన్ డాలర్లు) ఉన్నారు. భారత సంతతికి చెందిన ఒమన్ వ్యాపారవేత్త పిఎన్‌సి మీనన్‌కు కూడా ఈ జాబితాలో చోటు లభించింది. అరబ్ సంపన్నుల జాబితాలో అత్యధికంగా సౌదీ అరేబియాకు చెందినవారు 10 మంది ఉండగా, లెబనాన్, ఈజిప్టుకు చెందినవారు ఏడుగురు చొప్పున ఉన్నారు.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి, ఏప్రిల్ 17: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 47.79 పాయింట్లు కోల్పోయి 29,413.66 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 11.50 పాయింట్లు దిగజారి 9,139.30 వద్ద నిలిచింది. టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచలేదు.
టిసిఎస్ రూ. 16 వేల కోట్ల
షేర్ బైబ్యాక్‌కు భాగస్వాముల ఆమోదం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) భాగస్వాములు.. సోమవారం 16,000 కోట్ల రూపాయల షేర్ బైబ్యాక్ ప్లాన్‌కు ఆమోదం తెలిపారు. భారతీయ క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలోనే ఇది అతిపెద్ద షేర్ బైబ్యాక్ కావడం గమనార్హం. ప్రత్యేక తీర్మానం ద్వారా ఈ షేర్ బైబ్యాక్‌కు భాగస్వాముల నుంచి 99.81 శాతం ఆమోదం లభించింది.
బిఎస్-4పై సియామ్
పిటిషన్‌ను కొట్టివేసిన ఎన్‌జిటి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: బిఎస్-4 నిబంధనల అమలును వాయిదా వేయాలన్న భారతీయ ఆటో రంగ సమాజం సియామ్ అభ్యర్థనను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) కొట్టివేసింది. ఈ నెల 1 నుంచి బిఎస్-4 నిబంధనలు అమల్లోకి వచ్చినది తెలిసిందే. బిఎస్-3 వాహన అమ్మకాలు, రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశించినదీ విదితమే. అయితే ఈ నిర్ణయంతో ఆటో రంగ సంస్థలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఇంకా అమ్ముడుకాని బిఎస్-3 వాహనాలు సంస్థల వద్దే పెద్ద ఎత్తున ఉండిపోయాయంటూ ట్రిబ్యునల్‌ను సియామ్ ఆశ్రయించింది. అయితే ఈ విషయంలో తాము చేయగలిగినది ఏమీ లేదంటూ ఎన్‌జిటి చైర్‌పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ తెలిపారు.
సుప్రీం కోర్టు గత నెల మార్చి 29న బిఎస్-3 వాహనాలకు వ్యతిరేకంగా తీర్పు వెల్లడించగా, 30, 31 తేదీల్లో భారీ డిస్కౌంట్ ఆఫర్లపై ఆటో సంస్థలు మిగిలిన వాహనాలను పెద్ద ఎత్తున అమ్మేశాయి. అయినప్పటికీ ఇంకా మిగిలిపోవడంతో సియామ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సహారా ఆస్తుల వేలానికి
సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: సెబీ-సహారా కేసులో సుప్రీం కోర్టు.. సోమవారం ఆంబీ వ్యాలీలోగల 34,000 కోట్ల రూపాయల విలువైన సహారా గ్రూప్ ఆస్తులను అమ్మేయాలని ఆదేశించింది. ఈ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం నగదును సహారా డిపాజిట్ చేయలేకపోతున్న నేపథ్యంలో పైవిధంగా అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. అలాగే వచ్చే వారం సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్న రాయ్‌ని తిరిగి జైలుకు పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘సూచించిన మొత్తంలో రాయ్ డిపాజిట్ చేయలేకపోయినందున, మహారాష్టల్రోని లోనవాలా సమీపంలోగల ఆంబీ వ్యాలీ సిటీ వద్దనున్న ఆస్తులను వేలం వేయాలని మేము ఆదేశిస్తున్నాం.’ అని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 27న కోర్టుకు రావాలని రాయ్‌కి ఆదేశాలు జారీ చేసింది.

ఎన్‌సిఎల్‌టిలో మిస్ర్తికి చుక్కెదురు
తీర్పును స్వాగతించిన టాటా సన్స్
ముంబయి, ఏప్రిల్ 17: టాటా-మిస్ర్తి వివాదంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ఇచ్చిన తీర్పును టాటా సన్స్ స్వాగతించింది. 100కుపైగా సంస్థలున్న 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్ సారథిగా సైరస్ మిస్ర్తిని నిరుడు టాటాలు తొలగించినది తెలిసిందే. గ్రూప్ ప్రయోజనాలు, వ్యాపార విస్తరణ లక్ష్యాలకు విరుద్ధంగా మిస్ర్తి నడుచుకుంటున్నారని టాటా సన్స్ పేర్కొంది. అయితే దీనితో విబేధించిన మిస్ర్తి తనను అన్యాయంగా తొలగించారంటూ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలోనే మిస్ర్తి తరఫున షాపూర్జీ పల్లోంజి గ్రూప్ సంస్థలు టాటా సన్స్ తీరును వ్యతిరేకిస్తూ ఎన్‌సిఎల్‌టిని ఆశ్రయించాయి.
దీంతో సోమవారం పల్లోంజి గ్రూప్ పిటిషన్‌ను ఎన్‌సిఎల్‌టి తోసిపుచ్చింది. దీనిపై టాటా సన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎఫ్‌ఎన్ సుబేదార్ స్పందిస్తూ ఇకనైనా ఈ వివాదానికి తెరపడుతుందని ఆశిస్తున్నామని, టాటా సన్స్, రతన్ టాటాలపై దుష్ప్రచారం ఆగుతుందని అనుకుంటున్నామని అన్నారు. అలాగే కొత్త చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నాయకత్వంలో టాటా సన్స్ అభివృద్ధిపథంలో నడవగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.