బిజినెస్

రాజధాని నిర్మాణంలో ప్రజాభీష్టానికే పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 7: రాజధాని అమరావతిలో నివసిస్తున్న ప్రజల అభిమతానికి అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు వెళుతుందని గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ పేర్కొన్నారు. గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ ఆంధ్రభూమి ప్రతినిధికి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజధానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మాస్టర్ ప్లాన్‌పై 29 గ్రామాల ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. భూములిచ్చిన రైతులను మోసం చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు. రాజధాని నిర్మాణాలు చేపట్టిన తరువాత భూముల విలువ పెరుగుతుందని, గ్రామాల్లో రహదారులు లేకపోతే స్థలాల విలువలు యథాతథంగా ఉంటాయన్నారు. తద్వారా గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. రహదారులు నిర్మిస్తే కలిగే లాభం రైతులు అనుభవించాలనే సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందన్న విషయం వారికి తెలియజేయటం జరిగిందన్నారు. భూములిచ్చేందుకు ముందుకు రాకపోతే మార్పు చేసి రహదారులు నిర్మిస్తారని, అయితే రైతులు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అన్నివిధాలా లాభం చేకూరుతుందన్నారు. స్థలాలు కొల్పోయిన, ఇళ్లు తొలగించిన వారందరికీ నష్టపరిహారం అందజేయటం జరుగుతుందన్నారు. రాజధానిగా అమరావతిని ప్రకటించిన క్షణం నుంచి సింగపూర్, జపాన్, చైనా దేశాల్లో విస్తృతంగా పర్యటించానన్నారు. అంతేకాకుండా ఆయా దేశాల ప్రతినిధులతో స్వయంగా కలిసి పలుమార్లు చర్చించటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి ఉన్నత సౌకర్యాలు పొందాలనే ఆకాంక్షతో పని చేస్తున్నారన్నారు.
రాజధానిలో అత్యున్నతమైన సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలనే సంకల్పంలో ప్రభుత్వం ఉందన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కూడా ఉన్నత ప్రమాణమైన వౌలికవసతులు అందించాలనే ఉద్దేశ్యంతోనే పని చేస్తున్నామన్నారు. పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భవిష్యత్ అజెండాపై ముఖ్యమంత్రి చంద్రబాబు సభ్యులను ప్రశ్నించిన సమయంలో రాజధాని అమరావతిపై చర్చ జరిగిందన్నారు. గుంటూరు, విజయవాడ, అమరావతిలను కలుపుతూ పోయే కృష్ణానది మధ్య గల ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరగాలన్నదే తన అభిప్రాయమన్నారు. నదీతీరం ఉన్నందున దేశంలోనే ప్రముఖమైన రాజధానిగా అమరావతి వెలుగొందుతుందన్నారు. రాజధానిని ప్రతి ఒక్కరూ సంతోషంగా నివసించేందుకు అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నందున అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో రెండు గ్రామాలను తమ కుటుంబసభ్యులు దత్తత తీసుకోవటం జరిగిందన్నారు. వాటిని పూర్తిగా అభివృద్ధి చేసిన తరువాత మరో రెండు గ్రామాలు దత్తత తీసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా దత్తత గ్రామానికి అన్నీ హంగులు కల్పించిన పక్షంలో తనకు పారిశ్రామికవేత్తలతో ఉన్న పరిచయాలను ఉపయోగించి మరి కొందరు ముందుకు వచ్చే విధంగా కృషి చేస్తానని గుంటూరు ఎంపి గల్లా జయదేవ్ చెప్పారు.