బిజినెస్

ఇదిగో.. కొత్త పన్నుల విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 19: సుదీర్ఘ చర్చలు, సలహాలు, సూచనలు, మార్పుల అనంతరం ఎట్టకేలకు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేట్లను ఖరారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది జూలై 1 నుంచి అమల్లోకి వస్తున్న జిఎస్‌టి పన్నుల విధానంలో నాలుగు రకాల రేట్లను నిర్ణయించింది మోదీ సర్కారు. ఈ క్రమంలో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎమ్‌సిజి) రంగానికి మిక్కిలి ప్రోత్సాహం లభించింది. శుక్రవారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌లో ఈ రంగానికి చెందిన సంస్థల షేర్ల విలువ కూడా 3.6 శాతం మేర పెరిగింది. అయితే ఆటోమొబైల్స్ ఉత్పత్తులపై మాత్రం భారం పడింది. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం చొప్పున వివిధ రంగాల ఉత్పత్తులపై జిఎస్‌టి రేట్లు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా 350 సిసికిపైగా ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లపై 31 శాతం పన్ను పడనుంది. కార్లు, ఎస్‌యువిలపైనే ఇదే రేటు పడుతుంది. హైబ్రిడ్, లగ్జరీ కార్లపై విధించే పన్ను పూర్తి అసంతృప్తికరంగా ఉందని టొయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్, మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్‌సి భార్గవ అభిప్రాయపడ్డారు. టెలికామ్, బీమా, బ్యాంకింగ్ సేవలతోపాటు, బిజినెస్ క్లాస్ విమాన ప్రయాణం ప్రియం కానుం ది. ఎకానమీ క్లాస్ ప్రయాణం మాత్రం చౌకవనుంది. ఒకే దేశం.. ఒకే పన్ను.. పేరుతో తెస్తున్న ఈ చారిత్రాత్మక పరోక్ష పన్నుల విధానం రేట్లను గమనిస్తే..
ఏయే ఉత్పత్తులపై ఎంతెంత?
5 శాతం పన్ను పరిధిలోనివి
వంట నూనెలు, నిల్వ ఉంచిన కూరగాయలు, బ్రాండెడ్ పన్నీర్, కాఫీ, టీ, స్పైసెస్, పిజ్జా బ్రెడ్, రస్క్, ఫిష్ పిల్లెట్, కోల్, మెడిసిన్స్, సగ్గుబియ్యం, స్టెంట్, లైఫ్ బోట్స్, క్రీమ్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, కిరోసిన్, కోల్, మెటల్ తదితరాలు వస్తాయి. జెఎస్‌డబ్ల్యు స్టీల్, వేదాంత, టాటా స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ వంటి పలు సంస్థల లాభదాయకం.
12 శాతం పన్ను పరిధిలోనివి
నిల్వ ఉంచిన మాంసం ఉత్పత్తులు, వెన్న, జున్ను, ప్యాకేజ్డ్ డ్రైఫ్రూట్స్, నెయ్యి, పండ్ల రసాలు, సాస్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, టూత్ పౌడర్, అగరుబత్తి, రంగుల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, కుట్టు మిషన్లు, మొబైల్ ఫోన్లు తదితరాలు ఉన్నాయి.
18 శాతం పన్ను పరిధిలోనివి
దాదాపు 90 శాతం వస్తువులపై జిఎస్‌టి రేట్లను నిర్ణయించగా, అందులో అత్యధికం ఈ విభాగంలో (శ్లాబు)కే వస్తున్నాయి. వాటిలో చక్కెర, పాస్తా, కార్న్ ఫ్ల్లేక్స్, రొట్టెలు, కేకులు, జామ్, సూప్, ఐస్‌క్రీమ్, మినరల్ వాటర్, ఇన్‌స్టంట్ ఫుడ్ మిక్స్‌డ్ ఉత్పత్తులు, నోట్‌బుక్స్, ఉక్కు ఉత్పత్తులు, కెమెరా, స్పీకర్లు, మానిటర్లు ఉన్నాయి.
28 శాతం పన్ను పరిధిలోనివి
ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, మొలాసిస్, చూయింగ్ గమ్, కోకా లేని చాక్లెట్లు, వాఫెల్స్, పాన్ మసాలా, పెయింట్, షేవింగ్ క్రీమ్స్, హెయిర్ షాంపు, డై, వాల్ పేపర్, పింగాణి పాత్రలు, వాటర్ హీటర్, డిష్ వాషర్, వెయింగ్ మెషీన్లు, వాషింగ్ మెషీన్లు, వెండింగ్ మెషీన్లు, ఆటోమొబైల్స్, మోటార్ సైకిళ్లు, వ్యక్తిగత విమానాలున్నాయి. అయినప్పటికీ మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్ర అండ్ మహీంద్ర వంటి దేశీయ ఆటోరంగ సంస్థలు, తక్కువ సామర్థ్యం, ధరలతో వాహనాలను మార్కెట్‌లోకి తెచ్చే సంస్థలకు జిఎస్‌టి లాభదాయకంగా నిలుస్తోంది.
కాగా, తాజా మాంసం, చికెన్, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, పెరుగు, తేనె, ఉప్పు, జ్యుడీషియల్ పత్రాలు, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు, పప్పులు, తృణ ధాన్యాలు తదితర ఉత్పత్తులకు జిఎస్‌టి నుంచి మినహాయింపు లభించింది. సామాన్యుడిపై భారం తగ్గించేలా నిత్యవసరాల జోలికి వెళ్లని కేంద్రం.. వాహనాలపై బాదింది.
ఎవరేమన్నారు?
‘పరిశ్రమ ఊహించినట్లుగానే జిఎస్‌టి రేట్లున్నాయి. పర్యావరణహిత వాహనాలను అత్యధిక పన్నుల విభాగంలో పెట్టడం.. గ్రీన్ మొబిలిటీ లక్ష్యాన్ని భంగపరుస్తోంది. లగ్జరీ కార్లు, మోటార్ సైకిళ్లు ప్రియం కావడం పరిశ్రమకు ప్రతికూలమే.’
- సియామ్ అధ్యక్షుడు వినోద్ దాసరి
‘కొన్నిరకాల హోమ్‌కేర్ ఉత్పత్తులు, షాంపూలు మినహాయిస్తే ఎఫ్‌ఎమ్‌సిజి ఉత్పత్తులకు కొత్త పన్నుల విధానం ఎంతో ప్రోత్సాహాన్నిస్తోంది.’
- మారికో లిమిటెడ్ ఎండి, సిఇఒ సౌగత గుప్తా
‘మొబైల్ ఫోన్లపై జిఎస్‌టి రేటు టెలికామ్ వినియోగదారులపై భారం పెరిగేలా ఉంది. టెలికామ్ రంగ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా పునరాలోచించాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.’
- సెల్యులార్ అపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
‘శీతల పానియాలపై అత్యధిక పన్ను రేటును విధించడం బాధాకరం. ఇది బేవరేజెస్ పరిశ్రమ వృద్ధిని భంగపరుస్తుంది.’
- ఇండియన్ బేవరేజెస్ అసోసియేషన్
‘బొగ్గుపై పన్ను రేటును 5 శాతానికి దించడం వల్ల, విద్యుత్ చార్జీలు దిగివచ్చే వీలుంది. అయితే పునరుత్పాదక ఇంధనంపై జిఎస్‌టి ఎలాంటి ప్రభావం చూపబోదు. ఇప్పటికే చార్జీలు తక్కువగా ఉన్నందున, దీనికి తక్కువ పన్ను రేటు జిఎస్‌టిలో అవసరం లేదన్నది నా అభిప్రాయం.’
- కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్
‘ద్రవ్యోల్బణం పెరగడానికి జిఎస్‌టి రేట్లు కారణం కాకపోవచ్చు. ఒకవేళ అలాంటిదేమైనా ఉన్నా వచ్చే వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే అంతా సర్దుకుంటుంది.’
- రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్‌ఎ